క్లాస్ ప్రేక్షకుల క్లాసిక్ కమనీయ రమణీయ అమర ప్రేమత్యాగమయ రామచక్కని దృశ్య కావ్యం –సీతారామం
మా అబ్బాయి శర్మ రెండు రోజుల్నించి సేతారామం చూశారా,చూసి సమీక్ష రాయమని చెవిలో రొదపెడుతుంటే ,నిన్న మధ్యాహ్నం మూడు వంతులు ,రాత్రి పూర్తిగా ప్రైం వీడియో లో చూశాం .చూశాక నా పరిస్థితి కాళిదాస శాకుంతలం నాటకం చదివి ,ఎగిరి గంతులేసి నాట్యం చేసిన జర్మన్ పండితకవి ,విమర్శకుడు గోధే పరిస్థితే నాది అయింది .ఆసినిమాను వర్ణించటానికి మాటలు చాలవు అనిపించింది .అదొక ‘’సాగా’’ .కృష్ణశాస్త్రి, తిలక్ కవిత్వాలు చదివాక పొందే ఆనందం ,విశ్వనాథ్ సినిమాలు చూశాక పొందే ఆనుభూతి ,నాకు నచ్చిన క్లాసిక్ ‘’చివరకు మిగిలేది ‘’సినిమా కు కొనసాగి౦పుఅనిపించింది .ఏం రాద్దామన్నా సూపర్లేటివ్ లు తప్ప మామూలు మాటలు దొర్లటం లేదు .క్రికెట్ చరిత్రను తిరగరాసిన గవాస్కర్ సచిన్, ధోనీ ,కోహ్లీ లు ఎలా ఆరాధనీయులయ్యారో ఈ సినిమా దర్శకుడు హను అలా అయ్యాడు .పవిత్ర సీతా రామ ప్రేమ మయ జీవితానికి హనుమ సాయం చేసినట్లుఈ రావిపూడి’’ హను’’ సహాయం చేశాడని పించింది .అత్యద్భుత సినిమాలకు ఒరవడి పెట్టి పెద్ద బాలశిక్ష రాశాడని పించింది .వెయ్యిబాహుబలులు ,,వంద ఆర్ ఆర్ ఆర్ లు దీనిముంది బలాదూరేమో అనిపిస్తుంది .ఒక సినిమా చూసినట్లు ఉండదు .పాత్రలతో కలిసి ప్రయాణం సాగిస్తున్నట్లు ఉంటుంది .సినిమా పాటలంటే హీరో పక్క ఒక పాతిక హీరోయిన్ పక్క మరోపాటికి కృత్రిమ వేషాలతో చిందు లేయటంకాదు. వారి మనసులోని భావాలు సలలిత రాగ సుధగా సాగిపోవటం అని చూపిన వైనం మెచ్చతగింది. ట్రెండ్ సెట్టర్ అనిపించింది .నటీ నటవర్గం తమ ప్రతిభ మేరకు నటించలేదు జీవించి సినిమాకు జీవం పోశారు .కిషోర్ హాస్యం వెన్నెల కురిపించక ,సునీల్ పాత్ర పండక దిష్టిపిడతలు గా నిలిచిపోయారు .మంచి పంట పండిన పొలానికి అవీ అవసరమేగా ?
ప్రతి సన్ని వేశం పండింది .క౦టికి ఇంపుగా మెరిసింది .మొదట్లో పదినిమిషాలు చీకట్లో దారి తెలీని స్థితి ఏర్పడినా ఆతర్వాత మనల్నిమనమే మర్చిపోతాం .వెన్నెల విహారమే చేస్తాం .భారీ డైలాగులు ఉండవు .హావభావాల వికృత చేష్టలు లేవు .అంతా ఒరిజినల్ ఒరిజినల్ .మానసిక విశ్లేషణ .పాత్రల ఉదాత్తత . యుద్ధభూమి’’ ఉత్తర’’ కాండ లో విరిసిన శతపత్ర సుందరి ఈ చిత్రం .ముడులు గట్టిగా బిగించి క్రమంగా విప్పుతూ కథాగమనాన్ని ఉత్కంఠ భరితంగా తీర్చి దిద్దిన విధానం భేష్ .ఇరవై ఏళ్ళకాలం లో విరిసిన ప్రేమ పారిజాతమే ఇది .త్యాగాలకు పరాకాష్ట . స్వార్ధ రహిత ప్రేమమూర్తుల దర్శనం ముగ్ధుల్ని చేస్తుంది .ఎక్కడో మంచు ప్రాంతాలలో దేశం కోసం అహరహం పాటు పడుతున్న ఒంటరి వాడికి జీవితం లోఎవరూ లేరనే బాధను తప్పించటానికి దేశం యావత్తూ అతనికిఅన్న దమ్ముల్లా, అక్క చెల్లెళ్ళు గా ఉత్తరాలు రాసి అండగా నిలబడితే,ఒకామె ఆతని ప్రేయసిగా భార్యగా ఉత్తరాలు రాసి దగ్గరవటం అపూర్వం .వీరి ప్రేమకు ఆటంకాలు ఎదురైనా అదిగమించి కలయికలు చిరు అలకలు ,విడదీయరాని బంధాలు .కాలం దూరం వేరుచేసినా అలనాటి సీతారాముల్లా వారిద్దరి మనస్సులు అనుక్షణం సన్నిహిటాలే .
హీరో పాత్రను ధీరోదాత్తంగా మలిచారు .పాత్రధారి దుల్కర్ సల్మాన్ నటించలేదు .జీవించి సినిమాకు జీవం పోశాడు అతడి చిరునవ్వు హీరోయిన్ నే కాదు మనల్నీహాంట్ చేస్తూ ఉంటుంది .ఒరిజినల్ నవ్వు. నవ్వినట్లు కనిపించదు ఇంతకంటే గొప్ప తనం ఏమి ఉంటుంది ?నూటికి వెయ్యిమార్కులు కొట్టేస్తాడు .మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తనపరిధిలో జీవించి జీవంపోసింది .రామం లేలేత పాలబుగ్గల బంగారు నాయనగా ఉంటె సీత, ముదురు గా ఉన్నట్లు అనిపించింది .రామాయణం లో సీత రాముడికంటే పెద్దదే అనే మాట కూడా ఉందనుకోండి సుమంత్ కి ఈమధ్య పండిన సినిమాలు తక్కువే .ఇందులో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర .వాళ్ళ తాత అక్కినేనిలాగా డిప్ప ఎగరేయటం కృత్రిమంగా ఉంది. నటించాడుకానీ జీవి౦చ లేదేమో అనిపిస్తుంది .అతడి సిగరెట్ వెగటు పుట్టిస్తుంది .సంగీతం విశాల్ చంద్ర శేఖర్ చిత్రానికి సీన్లకు తగినట్లు అందించి సంగీతం త్రివేణీ సంగమం లో అంతర్వాహిని సరస్వతిగా ఉండేట్లు చేసి మెప్పించాడు .కెమెరా ద్వయం విజువల్ ఫీస్ట్ ఇచ్చారు .సినిమా పరిపక్వంగా పండటానికి కారణమయ్యారు .ప్రతి అంగుళం రమణీయంగా హృద్య౦ గా తీర్చి దిద్దారు .ఊహకు యదార్ధానికి మధ్య పల్చని తెర ఉన్నట్లు సినిమా శాంతారాం ‘’నవ ర౦గ్ ‘’ పోకడకనిపిస్తుంది .
కృష్ణకాంత్ రాసిన పాటలకు సంగీతం నేపధ్యసంగీతం కూర్చిన విశాల్ చంద్ర శేఖర్ సంగీత దృష్టి అతి విశాలం అనిపిస్తుంది బాలుగారబ్బాయి చరణ్ అద్భుతంగా పాడి మెప్పించి తండ్రి స్థానం సాధించాడు .అతడి ప్రతిభ రామదాసు మొదలైన సినిమాలలో చూసి అనుభవించాం .’’ఇంతందం దారి మళ్ళి౦దా-భూమిపైకే చేరుకున్నదా –లేకుంటే చెక్కి ఉంటారా –అచ్చు నీలా శిల్ప సంపదా ?జగత్తు చూడనీ –మహత్తు నీదేలే –నీనవ్వుతాకి –తరించే తపస్సిలా –నిశీధులన్నీ తలొంచే –తుషా రానివా ?అంటూ సాగి ‘’వీడేవీలులేని –ఏదో మాయలోకి –లాగే పిల్ల తె౦పరీ –చిలకే కోక కట్టి –నిన్నే చుట్టుముట్టి సీతాకోకలా యేలనా’’ అని ఆమె అంటే ‘’విల్లె ఎక్కుపెట్టి –మెళ్ళో తాళికట్టి మరలా రాముడవ్వనా ‘’అంటాడు అతడు .’’దాసోహమంది ఈ ప్రపంచమే అదంతా నీదయే ‘’.
మరోపాటలో ‘ఓ సీతా వదలని తోడౌతా –రోజంతా వెలుగులిడు నీడౌతా ‘’అంటాడు రాం పరమ భావుకతతో ఆమె ‘’ఓ రామా ఒకరికొకరమౌతామా .కాలంతో కలిసి అడుగేస్తామా ?అని సంశయిస్తుంది .’తీరం తెలిపెనే నుదుటి రాత –నుదుట తిలకమై వాలుతా .ఈపాట ఎస్పి చరణ్ రమ్య గానం చేసి మధువులొలికించారు .సిరివెన్నెల రాసిన మూడవపాట ‘’కానున్న కళ్యాణ మేమన్నది ??ను అనురాగ్ కులకర్ణి సింధూరి పాడి కళ్యాణ వైభోగం తెచ్చారు ‘’తరములపాటుగా తరగని పాటగా ప్రతిజత సాక్షిగా –ప్రణయము నేలగా సదా ‘’మూడు పాటలుముత్యాలే రత్న మాణిక్యాలే. సందర్భా శుద్ధికి అద్దాలే .సంగీత జలపాతాలే మాటల తేనే సోనలే .కధలో ఇమిడి పోతూ హృదయాలను ఆవిష్కరించు కొనే భావ గీతికలే .ఎంకిపాటలే .కిన్నెరసాని గీతాలే ,బాపిబావచిల్ప చిత్రాలే .కధనం లో ఇలా పాటలు మమైకం అవటం చాలా గొప్ప విషయం .దర్శకుని ప్రతిభకు నిదర్శనం .
సీతా మహాలక్ష్మికి ఉత్తరం బట్వాడా చేయాల్సిన పాత్రలో రష్మిక పాక్ అనుకూలమైనా ,ఆ ఉత్తరం చేరిస్తేనే తనకు తాత ఆస్తి వస్తుందనే ఆశతో కష్టపడి తెగించి ఇండియావచ్చి అందజేసి క్రుతకృత్యురాలైంది .ఆమెకు తాత ఆస్తి దక్కే ఉంటుందని అనుకోవాలి .ఇది చలసాని అశ్వినీదత్ సినిమా .ఆయన బానర్ లాగే సినిమా కూడా క్లాసిక్ చిత్ర వైజయింతిక అనిపించింది .ధన్యుడు దత్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-9-22-ఉయ్యూరు