మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -5
13-మున్సిపల్ వైస్ చైర్మన్ సెనేట్ సభ్యుడు ,,కవి సార్వ భౌమ ,కావ్యకళానిధి,అవధాన పంచానన ,రాణాప్రతాప చరిత్ర కావ్యకర్త –శ్రీ దుర్భాక రాజ శేఖర శతావధాని
దుర్భాక రాజశేఖర శతావధాని (నవంబర్ 18, 1888 – ఏప్రిల్ 30, 1957) [1] వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించాడు. గడియారం వేంకట శేషశాస్త్రితో కలిసి “వేంకట – రాజశేఖర కవులు” అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు.
విద్యాభ్యాసము
• 1904-1907ల మధ్య కందాళ దాసాచార్యులు, జనమంచి శేషాద్రిశర్మ ల వద్ద సంస్కృతాంధ్రాలు, నాటకాలంకార శాస్త్రాలు చదివాడు.
• 1907లో కడప ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడైనాడు.
• మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఎ.చదువుతూ మధ్యలో ఆపివేశాడు.
ఉద్యోగాలు
• 1908 నుండి ప్రొద్దుటూరు లోని జిల్లా మునసబు కోర్టులో గుమాస్తాగా పనిచేసి గాంధీ ఉద్యమ ప్రభావంతో 1921లో ఉద్యోగం మానివేశాడు.
• ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. 1928లో వైస్ ఛైర్మన్‌గా ఉన్నాడు.
• 1927- 1932ల మధ్య ప్రొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.
• మద్రాసు సెనేట్ సభ్యుడిగా, వేదపాఠశాల కార్యదర్శిగా సేవలను అందించాడు.
రచనలు
• రాణాప్రతాపసింహచరిత్ర[2]
• అమరసింహచరిత్ర
• వీరమతీ చరిత్రము
• చండనృపాల చరిత్రము
• పుష్పావతి
• సీతాకల్యాణము (నాటకము)
• సీతాపహరణము (నాటకము)
• వృద్ధిమూల సంవాదము (నాటకము)
• పద్మావతీ పరిణయము (నాటకము)
• విలయమాధుర్యము
• స్వయంవరము
• అనఘుడు
• గోదానము
• శరన్నవరాత్రులు
• అవధానసారము
• రాణీసంయుక్త (హరికథ)
• తారాబాయి (నవల)
• టాడ్ చరిత్రము
• రాజసింహ
• ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లంలో)
• కామేశ్వరీ స్తోత్రమాలా (సంస్కృతంలో)
బిరుదులు
కవిసార్వభౌమ, కావ్యకళానిధి, కళాసింహ, అవధానిపంచానన, వరచారిత్ర కవిత్వభారతి, కవిబ్రహ్మర్షి మూర్ధన్య అన్నవి వీరి బిరుదులు
14- రామావతార తత్త్వం ,బ్రహ్మావతార కర్త ,నిత్యకర్మానుష్టానజీవి ,,శతావధాని,ఆంద్ర వ్యాస ,కళాప్రపూర్ణ –శ్రీ జనమంచి శేషాద్రి శర్మ
జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) ( జూలై 4, 1882 – జూలై, 1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు.
జీవిత సంగ్రహం
వీరు 1882 సంవత్సరంలో జూలై 4వ తేదీన వైదిక బ్రాహ్మణ కుటుంబంలో సుబ్రహ్మణ్యావధాని, కామాక్షమ్మ దంపతులకు జన్మించారు. వీరి ప్రపితామహులు సూర్యనారాయణ సోమయాజి, పితామహులు వేంకటావధాని. వీరి పెద్దల నివాసస్థానం వైఎస్ఆర్ జిల్లా బద్వేలు తాలూకా వెంకటరాయపురం అగ్రహారం.శర్మగారికి బాల్యంలోనే మాతృ వియోగం కలిగింది.తండ్రి సుబ్రహ్మణ్య శర్మగారు మనోవైక్లయముతో కాశీ నగరమునకు వెళ్ళిపోయారు.బావగారైన గౌరిపెద్ది రామయ్యగారు శేషాద్రి శర్మ గారిని చేరదీసి చదువు చెప్పించారు.రెండేళ్ళ తరువాత శర్మగారి తండ్రి కాశినుండి తిరిగివచ్చి తమ కుమారిని తిరిగి చేరదీసిరి.అప్పటికే అవధాన విద్యానిధులై ప్రశస్తినార్జించి యుండిరి.కాని కందుకూరి వీరేశలింగం పంతులుగారి సూచన మేరకు అవధాన వుద్యమమునుండి తొలగి కావ్య రచనకు ఉపక్రమించినారు. కడపలో కొంతకాలం ఉద్యోగం చేసి తరువాతి కాలంలో కాశీ కాలినడకన వెళ్ళి అక్కడ నాలుగు సంవత్సరాలు విద్యా వ్యాసంగం చేశారు. తరువాత విజయనగరంలోను, కసింకోట మొదలైన ప్రాంతాలలో విద్యా తపస్విగా నివసించారు. వీరు చాలా శాస్త్రాలను పఠించారు. వీరు మొదట సి.ఎస్.బి. హైస్కూలులో తెలుగు పండితునిగా పనిచేసి, అక్కడ నుండి కర్నూలు కోల్స్ మెమోరియల్ హైస్కూలులో పనిచేసి, చివరిగా మునిసిపల్ ఉన్నత పాఠశాల, కడపలో 1901 నుండి దీర్ఘకాలం ప్రధానాంధ్ర పండితునిగా పనిచేసి 1937లో గజోత్సవంతో పదవీ విరమణ చేశారు.
శర్మగారి జీవిత విధానమత్యంత క్రమబద్ధమైనది.బ్రాహ్మీముహూర్తమున లేచి స్నాన సంధ్యాది అనుష్టానములను పూర్తి చేసుకొని, కావ్యరచన, తర్వాత అధ్యాపకత్వము, కొంతకాలము సాంసారిక కృత్యములు, మరల పురాణ పరిశోధనము సాయంకాలమున సద్గోష్ఠి ఇవి వారి నిత్య కృత్యములు.ప్రతి లేఖకు స్వయముగా వెంటనే బదులు ఇచ్చేవారు. ఎనిమిది గంటలపాటు పాఠశాలలో ఉద్యోగము, నాలుగు గంటల పాటు విశ్రాంతి తప్ప తక్కిన కాలమంతటిని కావ్యరచనకై వినియోగించిన మేధావులు శర్మగారు.
వీరి పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి అవధానాలు చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్థిగా కృషిచేశారు. గురుకులావాసంతో, స్వయంకృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం, స్కంధత్రయ జ్యోతిషం, యోగ, మంత్ర శాస్త్రం, ధర్మ శాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఆయుర్వేదంలో చక్కని నాడీజ్ఞానం పొందారు. వీరికి సాహిత్య గురువు రఘుపతి శాస్త్రి, వ్యాకరణ గురువు దాసాచార్యులు, జోతిశ్శాస్త్ర గురువు తోపల్లి చయనులు. వీరు విద్యా తపోనిధిగా ఎంతో మంది శిష్యులకు అక్షరదానం చేసిన విద్యాదాత వీరు.
శర్మగారి గ్రంధములన్నింటిని వావిళ్ళవారు ప్రచురించి మహోపకారమొనరించిరి.శర్మగారి షష్ఠిపూర్తి సందర్భముగా సన్మానోత్సవ ప్రత్యేక సంచికను వెలువరించి గౌరవించారు కూడా. వీరికి ‘బాలసరస్వతి’, ‘అభనవ ఆంధ్ర వాల్మీకి’,’అభినవ నన్నయభట్టు’, ‘ఆంధ్ర వ్యాస’, ‘కావ్యస్మృతితీర్థ’, ‘కళాప్రపూర్ణ’, ‘మహాకవి’, ‘సంస్కృతసూరి’, ‘కైజర్ హింద్’ మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరు చాలా సన్మానాలు పొందారు.[1][2] [3]
పోతనామాత్యులవలె సహజ పండితులైన శర్మగారు భాగవత దశమస్కందమును మాత్రమే 610 పుటలు 5200 పద్యములలో రచించిరి.మహాపండితులైన నాగపూడి కుప్పుస్వామయ్య, వేదం వేంకటరాయ శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి మున్నగు వారలు శర్మగారినెంతగానో కొనియాడేవారు.కట్టమంచి రామలింగారెడ్డి గారు శర్మగారిని గురుంచి ప్రసంగిస్తూ వీరికవిత్వమునకు వీరి వినయాతిశయము శోభన కలిగించుచున్నది కవిత్వ పాండిత్యములకును, సౌజన్యమునకును నిత్యసంధి లేదనుట మనము ఎరింగిన విషయమే. వీరెవ్వరిని అధిక్షేపించినట్లు, ఎవ్వరితో గాని వాదమునకు పూనినట్లు కానరాదు. సౌజన్యము వీరి అలంకారము.ప్రఖ్యాతికై ప్రాకులాడువారు కారు. పండిత ప్రకాండులై, నిత్యసాహిత్యపరులై, పరోపకార పరాయణ చిత్తులై, పరదేవీ పదారవింద ధ్యానా సక్తులై మహాకావ్యములనెన్నింటినో రచించిన శ్రీ శేషాద్రిశర్మగారు 1950 జులైలో దివంగతులైనారు.
రచనలు
అనువాదాలు
శేషాద్రి శర్మ ఈ క్రింది సంస్కృత కావ్యాలను తెలుగు లోకి అనువదించారు.[4]
• హలాస్య మహాత్మ్యం
• బ్రహ్మాండ పురాణం
• బ్రహ్మ పురాణం
• వాల్మీకి రామాయణం (ఆంధ్ర శ్రీమద్రామాయణం) [5]
• శ్రీమద్భాగవతంలోని 10 వ అధ్యాయం (తాండవకృష్ణ భాగవతం)
• స్కంద పురాణం నుండి కౌమారికా ఖండం, అరుణాచల ఖండం.
• పాండవాజ్ఞాతవాసం
స్వతంత్ర రచనలు
• శ్రీమదాంధ్ర లలితోపాఖ్యానము
• హనుమద్విజయము
• సర్వమంగళా పరిణయం
• ధర్మసార రామాయణం[6]
• కలివిలాసం
• సత్ప్రవర్తనము
• శ్రీ రామావతార తత్త్వము
• శ్రీ కృష్ణావతార తత్త్వము
• శ్రీకృష్ణ రాయబార చరిత్రము
• శ్రీ శంకరాచార్య చరిత్రము
• తండ్లత
• వనజాక్షి
• హృదయానందం
• దుష్ ప్రభుత్వము
• నవరత్ర హారము
• నీటుకత్తె
• గిరీశవిజయము
• విచిత్ర పాదుకాపట్టాభిషేకం
• నీతిసింధువు
• నీతిరత్నాకరము
• మనుచరిత్ర పరిశోధనము
• భగవద్గీత (వచనము)
• ఉత్తమమార్గము
• విచిత్రరామాయణము
• ఉదయగిరిముట్టడి
• కడపమండలచరిత్ర
• శ్రీరామవనవాసము
• విహంగవిజయము
• స్వప్నయాత్ర
• నీతికథావళి
15- ఆంద్ర పాండవ గీతాలు ,భామినీ విలాస కర్త ,విద్వత్కవి విభూషణ –శ్రీ వేదము వెంకటకృష్ణశర్మ
తెలుగు కవి, పండితుడు, అనువాదకుడు.
జీవిత విశేషాలు
వేదము వేంకటకృష్ణశర్మ చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో శ్రీరామయ్య, సుబ్బనరసమ్మ దంపతులకు జన్మించాడు. స్మార్త బ్రాహ్మణుడు. కౌశిక గోత్రజుడు. ఇతని పూర్వీకులు కార్వేటి నగర సంస్థానంలో పేరుగడించి రాజాదరణ పొందిన పండితప్రకాండులు. ఇతడు తన 15 ఏటనే కార్వేటి నగరంలో ‘ఆమ్నాయ నిలయం’ అనే గ్రంథాలయాన్ని నెలకొల్పాడు. పొట్టకూటి కోసం ఇతడు కడప జిల్లా కోడూరులోని క్రైస్తవ మిషనరీలో క్రైస్తవ గ్రంథాలను తెలుగులోనికి అనువదించే ఉద్యోగంలో చేరాడు. తరువాత మద్రాసు చేరుకుని అక్కడి కన్యకాపరమేశ్వరీ దేవస్థానం వారి హైస్కూలులో ఆంధ్ర ఉపాధ్యాయుడిగా పనిచేసి 1950లో రిటైర్ అయ్యాడు.
సాహిత్యసేవ
ఇతనిది ప్రౌఢ గంభీర శైలి. భావసంపద కలిగి పదలాలిత్యముతో కవిత్వం అల్లగలడు. ఇతని గ్రంథాలు కొన్ని విశ్వవిద్యాలయ పాఠ్యాంశాలుగా ఉన్నాయి.
రచనలు
1. సద్ధర్మ ప్రబోధిని
2. కలి నిగర్హణము
3. ఆంధ్ర పాండవ గీతలు
4. శిష్య నీతిబోధినీ శతకము
5. తోడేటి దొరతనము
6. భక్తకల్ప శతకము
7. ధర్మవిమర్శనము
8. కుందమాల
9. భామినీ విలాసము
10. ఊరు భంగము
11. తేనెసోనలు (నాలుగు సంపుటాలు)
12. భక్తవత్సల శతకము
13. శ్రీరామ(లక్ష్మీ)స్వభావము
14. శ్రీసోమశేఖరీయము (సభారంజన శతకము)
15. శ్రీకృష్ణశాస్త్రీయము (కలివిడంబన శతకము)
16. నెహ్రూ కావ్యము
17. అభినవాంధ్ర కాదంబరి
18. శతక వాజ్మయ సర్వస్వము (రెండు సంపుటాలు)
19. శ్రీ ఆంజనేయ కవీయము (చారుచర్య)
20. అమెరికా మహాపురష చరితము
21. పద్మ ప్రాభృతకము
22. బాలభారతము
23. మహాపురుష శతకము
24. ఝాన్సీ మహారాణి
25. భక్తియోగము
26. ఆరణ్యకజాతులు
27. మహేశమాల (సంస్కృత శ్లోకాలు)
28. విష్ణుమహామాయావిలాసము
29. బౌద్ధ ధర్మదీక్ష
30. సుభాషిత రత్నమాల
బిరుదులు/సన్మానాలు
• పండితోపాధ్యాయ పరిషత్ వారు ఇతనికి విద్వత్కవిభూషణ అనే బిరుదు ఇచ్చారు.
• 1961లో కడప జిల్లా రాజంపేట లో మాడభూషి అనంతశయనం అయ్యంగార్ ఆధ్వర్యంలో పౌరసన్మానం జరిగింది.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-9-22-ఉయ్యూరు