మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -6
16-అచ్చ తెనుగు కవి,మనువు పుట్టువు ,మెచ్చుల పచ్చ ముచ్చెలి కర్త , కవితా కళానిధి- శ్రీ నారు నాగనార్య
నారు నాగనార్య (జులై 3, 1903 – జనవరి 18, 1973) సాహితీవేత్త.
జీవిత విశేషాలు
నారు నాగనార్య 1903 జూలై 3లో సుబ్బమ్మ నరసింహం దంపతులకు జన్మించాడు. తెలిక కులస్థుడు. స్వగ్రామం వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు సమీపంలో ఉన్న రాఘవరాజుపురం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అష్టావధాని అల్లాడి జగన్నాథశాస్త్రి వద్ద చంధస్సు, అలంకార శాస్త్రాలు నేర్చుకున్నాడు. జనమంచి శేషాద్రిశర్మ వద్ద శ్రీవిద్య ఉపాసనము చేశాడు. ఇతడు స్వాతంత్ర్యప్రియుడు. 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. పర్లపాడు సత్యాగ్రహాశ్రమములో నివసించి ఖద్దరు సేవ చేశాడు. 1923,1947లలో సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. 1949నుండి సాహిత్యంవైపు దృష్టి మరలించాడు. ఇతనికి వైద్యవిద్యలో ప్రవేశం ఉంది. రమణ మహర్షి పట్ల ఆకర్షితుడైనాడు. 1973 జనవరి 18న మరణించాడు.
సాహిత్యసేవ
ఇతనికి సంస్కృతాంధ్ర భాషలంటే అభిమానము. సుమారు 70 గ్రంథాలు రచించాడు. ఏకథాటిగా వందలకొద్దీ పద్యాలను అల్లగలిగే శక్తి ఉంది. అచ్చతెలుగు పై ఎక్కువ మమకారము ఉన్నవాడు. పెద్దన మనుచరిత్రను మనువుపుట్టువు అనే పేరుతోను, ముక్కు తిమ్మన పారిజాతాపహరణమును మెచ్చులపచ్చమ్రుచ్చిలి అనే పేరుతోను అచ్చతెలుగులో అనువదించాడు. ఇతని రచనలు గడియారం వేంకట శేషశాస్త్రి, జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ మొదలైన పండితుల మెప్పును పొందాయి.
రచనలు
· వీరపూజ
· శ్రీ పృథ్వీరాజవిజయము
· తిలోత్తమాసాహసికము
· మనువు పుట్టువు
· మెచ్చులపచ్చ మ్రుచ్చిలి
· శకుంతల
· ఊర్వశి
· వెన్నెల పెళ్ళి
· రామకత
· ఉషారాజ్ఞి
· ధ్యానమాలిని
· ప్రణయిని
· శ్రీ రమణాభ్యుదయము
· ఆర్యవాణి
· తెలుగుతల్లి శతకము
· సౌందర్యలహరి
· శ్రీ మలయాళ సద్గురు దండకం
· శ్రీ రమణానుగ్రహ స్తుతి
· కేనోపనిషత్తు
· యతిగీతం
· శ్రీ హృదయాభ్యుదయము
· శ్రీరామహృదయం
· లక్ష్మణహృదయం
· దేవయాని
· కష్టజీవి
· పరాధీన భారతం
· సత్యాన్వేషి
· ఉద్బోధ
· వెన్నెలపెండ్లి
· వసంతోదయం …మొదలైనవి
రచనలనుండి ఉదాహరణలు
పనిపాటు విడియూరు నాడుఁ దిరుగన్ బాల్వడ్డ బైరాగి పో
రనుతిండిన్ బ్రదుకంగలాడచటికాహా! వచ్చెనా! వచ్చి యే
మనిచెప్పెన్ మనయందగాఁడు బదులేమందించెఁగన్గీటి రు
క్మిణి యేమాడెను డాఁప కంతయును గూర్మింబల్కరాదే!చెలీ!
దాసానిరంగు చీరన్
బాసి, వెలఁది మడుఁగుఁగట్టి – పంచల సొమ్ముల్
వేసి, కయిదమ్మిఁదునుకలు
సేసి,చెలిన్ గొదుకు బ్రదుకుఁ – జిడిముడి పడుచున్
నీరున్నకాఱు మబ్బున
జేరిన రిక్కవలె ‘సత్య’- చెలువంబఱిపం
చారించి యలుకగీమున
దూరెను సకులలుగఁ జేయుదురుగద! యిట్టుల్
-మెచ్చులపచ్చ మ్రుచ్చిలి (అచ్చతెలుగు పారిజాతాపహరణము)నుండి
వాగర్ధంబులవోలె నిర్వురొకటై వైరి ప్రకాండంబును
ద్వేగాకంపిత దేహవల్లరులరీతిన్ స్వప్రతాపక్రియా
వేగోదీర్ణబల ప్రభంజనతఁ గల్పింపన్ సముద్దిష్ట దీ
క్షాగర్వంబున లేళ్లపై నుఱుకువ్యాఘ్రంబుల్ వలెన్ దూఁకినన్
బలవన్నాగవరంబేన్
జవిచీమల చేతఁజిక్కిచచ్చినయటులీ
బలియుఁడు మాచే సిలుఁగుల
గలఁగఁడె యిపుడొంటి పాటు గదిసినకతనన్
అనియుప్పొంగుతలంపులన్ బెనఁగు మిథ్యాపౌరుషోద్రేక సం
జనిత క్రోధ విఘూర్ణనోత్థచటులోచ్ఛాయ క్రియన్ బ్రాఙ్మనో
జనితాఖండజయేప్సితార్థ ఫలమిచ్చాస్ఫూర్తి నర్థించి, మిం
చిన వేగంబున వీరుపైఁగవిసి నిస్త్రింశోగ్ర ధారాహతిన్
-వీరపూజనుండి
గుత్తపు పట్టుఱైకబిగి కుట్టు పటుక్కునఁ బిక్కటిల్లి స్వా
యత్తముఁ దప్పిపోఁబ్రిదిలి యబ్బుర పుబ్బగు గబ్బిగుబ్బలు
వెత్తున నొత్తరించి వలపింపఁగవుంగిటనించి పల్లు కెం
పొత్తిలి మోవితేనెఁజవులూరఁగొనెన్ ‘విధు’డా ‘తిలోత్తమన్’
-తిలోత్తమాసాహసికమునుండి
ఈ కాలం లో మన కవితా సరస్వతి ,అవధాన విద్వాన్ బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ అచ్చతెనుగు లో కావ్యాలు రాయటమేకాక అవధానాలు కూడా చేసి దేశ విదేశాలలో కీర్తి పొందుతున్నారు .
17-శివభారత కావ్యకర్త ,శతావధాని ,స్వర్ణకంకణ,కనకాభిషేకం;సువర్ణ గండ పెండేర గ్రహీత, గౌరవ డాక్టరేట్ ,శాసన మండలి సభ్యులు ,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి ఉపాధ్యక్షులు ,కవి సింహ ,అవధాన పంచానన –శ్రీ గడియారం వేంకట శేష శాస్త్రి
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే ‘శ్రీశివభారతం’. భరతమాత పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. మాతృభాష విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి.ఆధునికాంధ్ర కవుల్లో ప్రముకులు,శతావధాని డా||గడియారం వేంకటశేషశాస్త్రి.ఈయన దుర్భాక శతావధానితో కలిసి కొన్నికావ్వనాటకాలు రాశాడు.
జీవిత విశేషాలు
పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు 1894 ఏప్రిల్ 7వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. గడియారం వేంకట శేషశాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. 1932లో అనిబిసెంట్ మున్సిపల్ పురపాలిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద యజుర్వేదం, ఉపనిషత్తులు, దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, ఉత్తర రామాయణ గ్రంథాలు, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, వాల్మీకి హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారు. నన్నయ్య భారతం, పోతన భాగవతం లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిని తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.
సత్కారాలు
· ప్రొద్దుటూరు రాయల సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేశారు గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంలో శ్రీపాద తల్లావర్ఘుల వారిఎదుట గజారోహణ సత్కారం అందుకున్నారు.
· 1945లో అనంతపురంలోని హిందూపురం లలిత కళాపరిషత్తు సభ్యులు స్వర్ణ గండపెండేరం, సువర్ణ కంకణ బహుకరించారు.
· 1948లో మద్రాసు ప్రభుత్వం దశాబ్ద కాలపు ఉత్తమ సాహితీ గ్రంథంగా శివభారతాన్ని గౌరవించి ప్రథమ బహుమతితో సత్కరించారు.
· 1967లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డు అందజేసింది.
· 1968లో ప్రొద్దుటూరులో కనకాభిషేకం,
· 1974లో మరాఠా మందిర్ వారు శివాజి త్రిశత జయంతి ఉత్సవాల్లో భాగంగా బంగారు పతకాన్ని బహుకరించారు.
· 1976లో వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందించారు.
· 1959 నుంచి 1968 వరకు శాసనమండలి సభ్యునిగానూ,
· 1969 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు
బిరుదులు
· కవితావతంస
·