ఎప్పటి రమేష్ చంద్ర ?ఏమా వినయం ?
ఇవాళ ఉదయం లైవ్ పూర్తి అయి పేపర్ చదువుతుంటే ఒకతను ఫోన్ చేసి దుర్గా ప్రసాద్ మాస్టారేనా అని అడిగితె అవును అంటే ,నేను మీదగ్గర ఉయ్యూరు హై స్కూల్ లో చదివాను సార్ అని తనపేరు రమేష్ చంద్ర బాబు అనగా నాకు ఇంకా బల్బ్ వెలగలేదు .అప్పుడు అతడే మీ ఆంజనేయ స్వామి దేవాలయానికి మా నాన్న గారు 10 వేల రూపాయలు విరాళం ఇచ్చారు అన్నా, కొద్దిగా డిం గానే వెలిగితే ,ఉయ్యూరులో ఎక్కడ ఉండేవారు అని అడిగితె తాండవ లక్ష్మి ధియేటర్ దగ్గర అన్నా ,ఇంకా కరెక్ట్ గా కనెక్ట్ కాకపొతే అతడే మాకు అక్కడ మెకానికల్ వర్క్ షాప్ ఉండేది మా నాన్న గారు పిచ్చేశ్వర రావు అంటే ఒక్కసారిగా బల్బ్ థౌజండ్ కాండిల్ పవర్ తో వెలిగి, ఒక్క సారి 35ఏళ్ళు వెనక్కి మెమరీని తిప్పాను .
అవి మేము 1987లో శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయ నిర్మాణం పూర్తీ చేసి ,స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి ,పై మెరుగులు దిద్దుతున్న సమయం .కాంపౌండ్ వాల్ లోపల ప్రదక్షిణానికి నాపరాళ్ళు పరవాలనిచూస్తున్నాం .చేతిలో తడి అప్పటికే అయి పోయింది .నాకు అప్పుడు సహాయకులు స్వర్గీయ మండాశ్రీ వీరభద్ర రావు ,శ్రీ లంకా సంజీవ రావు గార్లు .అందులో సంజీవరావు గారు ‘’సార్.తాండవ లక్ష్మి ఏసీ ధియేటర్ నిర్మాణం పూర్తయి మిగిలిన నాపరాళ్ళు అన్నీ ప్రక్కన పెట్టారు .అడిగితె ఇస్తారేమో అన్నారు .నాకు పరిచయం లేదు. సరే అని ముగ్గురం వెళ్లాం. పిచ్చేశ్వరరావు గారు మర్యాదగా ఆహ్వానిచంచి ఇంట్లోంచి కాఫీ తెప్పించి ఇప్పించారు .వచ్చిన విషయం చెప్పగానే సందేహించకుండా మీకు ఎంతకావాలంటే అంత రాయి తీసుకు వెళ్ళండి అభ్య౦తరం లేదన్నారు .వెంటనే కావాల్సిన రాయి తెప్పించి పరిపించేశాం .ఆయన్ను ఆలయం చూడటానికి రమ్మని కోరాం.ఒక హనుమజ్జయంతికి కుటుంబం తో సహా వచ్చిన జ్ఞాపకం .అప్పుడు రమేష్ కూడా వచ్చి పరిచయం చేసుకున్నాడు .అతనును బాగా బ్రైట్ విద్యార్ధిగా గుర్తు .
తర్వాత ఒకసారి పిచ్చారావు గారు ఫోన్ చేసి మమ్మల్ని రమ్మంటే మా త్రయం వెళ్లాం .మీ గుడి బాగా ఉంది .స్వామి సేవకు 10వేల రూపాయలు అందజేస్తాను .మీ ఇష్టం ఎలా ఉంటె అలా ఖర్చు చేయండి .అని ఇచ్చేశారు .ఆ డబ్బుతో ఆలయం వెనక భాగాలన పిల్లర్లతో స్లాబ్ వేసి ఆయనను ఆహ్వానించగా చాలా సంతోష పడ్డారు ఆడబ్బు సార్ధకం చేసినందుకు .ఆతర్వాత ప్రతి మంగళవారం సంజీవరావు గారు అప్పాలు ప్రసాదం తీసుకొని వెళ్లి ఇచ్చేవారు .తర్వాత వంగవీటి రాధ హత్య .అప్పుడు వారి ధియేటర్ ను విధ్వంసం చేశారు దుండగులు . ఆతర్వాత దాన్ని బాగు చేయించారు .ఉయ్యూరులో మొదటి ఏసీ దియేటర్ అది .కొంతకాలం ఇక్కడే ఉండి తర్వాత ఆయన వ్యాపార వాణిజ్యాలు చేస్తున్న విశాఖకు వెళ్ళిపోయారు ధియేయేటర్ లీజుకు ఇచ్చి .
రమేష్ తల్లిగారు మేముఎప్పుడు పిచ్చారావు గార్ని కలవటానికి వెళ్ళినా మమ్మల్ని గౌరవంగా చూసి కాఫీ ఇచ్చేవారు .ఆమె పసుపుకొమ్ముల నోము నోచుకొన్నట్లు ,తానూ వెళ్లి వాయనం తీసుకున్నట్లు మా శ్రీమతి గుర్తు చేసింది .ఉయ్యూరునుంచి వెళ్ళాక వాళ్ళు ఎవరూ మళ్ళీ ఉయ్యూరు వచ్చినట్లు లేదు పిల్లలు వచ్చి వెళ్లేవారేమో తెలీదు .
ఇవాళ రమేష్ చంద్ర మాటలలో ఆనాటి వినయం గౌరవం స్పష్టంగా కనిపించాయి .ఎదిగినకొద్దీ ఒదిగి ఉండటం అనే గొప్ప లక్షణానికి ఉదాహరణ అని పించాడు .ఉయ్యూరు హైస్కూల్ లో తను ఆరాధించే ముగ్గురు మేస్టార్లలో నేనూ ,లెక్కల మేష్టారు ఆంజనేయ శాస్త్రిగారు , సోషల్ టీచర్ శ్రీ మతి నాగమల్లికాంబ గార్లు అని మహదానందంగా చెప్పాడు .వాళ్ళిద్దరి ఫోన్ నంబర్లు అడిగితె మల్లికామ్బగారు శ్రీమతి కస్తూరి గారి స్నేహితురాలని తెలిసి ఆమెకు ఫోన్ చేసి నంబర్ తీసుకొని శాస్త్రీ గారి నంబర్ తో కలిపి అతనికి పంపాను .త్వరలో ఉయ్యూరు వచ్చి మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం తీసుకొంటాను .మీ లాంటి గురువులవలననే మేము ఇంతటి స్థితికి వచ్చాము ,గురువులను మరవలేదు అన్నాడు .తప్పక రమ్మన్నాను. సరస భారతి సంగతి చెప్పి అతనికి పుస్తకాలు పంపిస్తాను అ అడ్రస్ మెసేజ్ చేయమంటే ,తాను డబ్బు పంపిస్తాను అంటే వద్దు అని చెప్పి అతని విశాఖ అడ్రస్ కు రెండు రిజిస్టర్డ్ పార్సిల్స్ లో పుస్తకాలు పంపి ,పంపానని వాట్సాప్ మెసేజ్ రాస్తూ పుస్తకాలకు డబ్బు పంపవద్దని మళ్ళీ చెప్పి ,ఆంజనేయస్వామి ప్రసాదంగా తీసుకోమని అందగానే తెలియజేయమని చెప్పాను. అతడు ఆన్జనేయస్స్వామి బొమ్మ పెట్టి శుభం అన్నాడు .ఇలాంటి వినయం వివేకం ఉన్న వారు తప్పక అభి వృద్ధి చెందుతారని మనకు అనుభవమైన విషయమే . అతనికి అతని కుటుంబానికి శ్రీ సువర్చలాంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ అలభించాలని కోర్తున్నాను .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-22-ఉయ్యూరు