శ్రీ కాశీ విశ్వ నాద శతకం –తంగెడంచ
శతావధానులు రామ కృష్ణ సీతారామ సోదరకవులు రచించిన శ్రీ కాశీ విశ్వ నాథ శతకం- తంగె డంచ – కర్నూలు జైహింద్ ముద్రాక్షర శాలలో 1950లో ముద్రితమైంది వెల నాలుగణాలు .ఈశతకం కర్నూలు జిల్లా న౦ది కొట్కూరు తాలూకా తంగెడంచ గ్రామం లో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వరునికి అంకితం .ఈ గ్రామం కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళేదారిలో ఉంది .ఇక్కడ కర్నూలు వాసి వెండి ,బంగారం వ్యాపారి శ్రీ చాగాపుర౦ చిన్న యల్లచిప్ప గౌడుగారు ఇద్దరు భార్యల సహకారంతో శివాలయం కట్టించి ,25-2-1948సర్వజిత్ మాఘ బహుళ విదియ బుధవారం ప్రతిష్టా సంకల్పం చేసి ,26-2-1948జలదివాసాలు నిర్వహించి 27-2-1948 సర్వజిత్ మాఘ బహుళ తదియనాడు శ్రీ సుబ్రహ్మణ్యాది పరివారంతో శ్రీ అన్నపూర్ణా విశాలాక్షీ సమేత కాశీ విశ్వనాథ లింగ ప్రతిష్ట చేశారు .
తర్వాత సోదరకవులు ఆలయనిర్మాత వంశ చరిత్ర పద్యాలలో రాశారు ..’’తంగెడంచపుర కాశీ విశ్వనాథ ప్రభూ’’ అనే మకుటం తో 110మత్తేభ ,శార్దూల పద్యాలతో శతకం అల్లారు .మొదటిశార్దూల పద్యం –‘’శ్రీ వాణీశ గిరీశపద్మహిత లక్ష్మీ శా౦బికా ,భద్ర కా-ళీ వీరేశ కుమారభక్తజన పాళిన్,దేశిక శ్రేణినా
నా విద్వత్కవుల న్నుతించి ,పరమానంద౦బుతో నీకు వా-క్సేవం జేతుము తంగెడంచ పుర కాశీ విశ్వనాథ ప్రభూ ‘’అని శివ పంచాయతనం వాణీ లక్ష్మీ మొదలైన వారిని గురువులను స్మరించారు .దురహంకారంతో బుద్ధినాలుగు విధాలపోతుంది వానరంలాగా .నీ భక్తి సూత్రంతో దాన్ని బంధించు అని శివానందలహరిలో భగవత్పాదులు అన్నట్లే అన్నారు .సారంగాసురహారి ,సారంగ ప్రతిభా విహారి అని శివుని కీర్తించారు .శివ పంచాక్షరి శ్రీశైల శవ దర్శనం కాశీవాసం బిల్వపూజ నీ కిష్టం .
తర్వాత ఈ ప్రదేశం గొప్పతనాన్ని వర్ణించారు .ఇది అపరాకాశి.ఇక్కడి గోస్తనీ నది గంగానదితో సమానం .ఇక్కడ శివ తీర్ధం అనే కొత్తబావి ఉంది .ఇంద్రద్యుమ్న మహారాజుఇక్కడ తటాకం ,శివాలయం కట్టించి ,లింగ ప్రతిష్ట చేసి ,ఒకబావి తవ్వించాడు .బావినీరు కొబ్బరి నీటి రుచి .స్వామి దర్శనం మోక్షదాయకం .శివరాత్రికి శ్రీశైలం వెళ్ళే భక్తులు ఇక్కడికివచ్చి పానకంగా రుచిగా ఉన్న యీజలం తాగి ఎండనుంచి ఉపశమనం పొందుతారు .ఇక్కడి పుష్పవనం సకల పుష్పజాతులు తమ పుష్పాలను హరకై౦కర్యంగా ఉపయోగపడతాయి .ఇక్కడి స్వామికి జరిగే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చూసి భక్తులు పులకి౦చి పోతారు. కైలాసం లో ఉన్న అనుభూతికి లోనౌతారు .
శ్రీ కృష్ణుడు సాయం పూజ చేస్తే మోకాలు చూపిస్తే దాన్ని పూజించి మొకాలే నువ్వు అని భీముడికి అర్జునుడు తెల్పాడు .పతివి గౌడ సతిని రతికి ఒప్పించి ,ఆమె భర్తరాగా భయంతో సురాభాండం లో దాగి ,ఆదంపతులు భక్తితో ప్రార్ధిస్తే మోక్షం ఇచ్చావు ,అని చాలా శివలీలలను వర్ణించారు .హరి నీభక్తుడు నిత్యం వెయ్యి పద్మాలతో పూజిస్తాడు ఒకరోజుఒక పువ్వు తగ్గితే కన్ను పీకి పుష్పంగాసంర్పించిన పరమ శివభక్తుడు శ్రీహరి .కిరాతార్జునీయం ,దక్ష గర్వభ౦గ౦ వగైరా వర్ణించారు .వ్యాసుడిని కాశినుంచి గెంటేయటం,రావణుడు నిత్యం కోటి శివాలయాలలో పూజ చేయటం ,శిరస్సు కోసి అర్పించిమెప్పించటం ,బాణాసురుడు భక్తితో మెప్పించిశివపార్వతులను తన ద్వారానికి కాపలా వారినిగాచేయటం చెప్పారు .
ఆతర్వాత పద్యాలలోసంసార జ౦ఝాటనం మనసు శివునిపైనిల్పలేకపోవటం చెప్పారు . ‘’ఆశా వృక్షము భూమిలో బొడమి,యాశాన్తముల్నిండియా-కాశం బంటెడు వేళ-పద్మభవు కల్పద్రుమం బడ్డమై’’ నాశనం చేస్తుంది .ఇక ఫలవంతం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు .గళం లో మహావిషం సగభాగంలో నిలిపి నేత్రాగ్నిజ్వాలల కొలిమిలో కరగించి ,మోహమద లోలత్వం కలిపి ‘’మాయలరంగు ల్బయి పూతపూసి ,విషకన్యల్సల్పి ,తచ్చిత్తమున్ శిలగా చేశావుకదా సామీ అన్నారు .నేటిపరిస్తులను చెబుతూ ‘’సినిమావచ్చెను పూర్వ నాట్య కళలన్ చేదింప –ఆచార దీక్షను గంగానదిలో కలపటానికి కాఫీ ప్రత్యక్షమైంది అని బాధపడ్డారు .సాలె పురుగు దారం అల్లి ,గూడు నిర్మించి తానె దాన్ని నాశనం చేసినట్లు నువ్వు ‘’నానాలోకముల న్ సృజించు మనుచు న్నాశంబు ‘’చేస్తావుకదా అదే నీలీల .
బౌద్ధులు చెలరేగిపోతుంటే సంకల్పం తో శంకరుడవై జన్మించి ,అనేక భాష్యాలురాసి ‘’సంసరణా౦బోధి తరియింప ఉపనిషత్సార ప్రచారం చేశావు .దాస్యం పొట్టకూటికే మానలేక పోతున్నాం .మాకు మోక్షం ఎన్నడో ?కాలుడు దున్నపోతునుఇవ్వగా ,నీదగ్గరున్న ఎద్దుఉండగా ,పుష్కలంగా గంగాజలం ,కుబేరుడు విత్తనాలు ఇస్తాడు నాగలి బలరాముడిస్తాడు ,నీకుకృషి చేతనౌను .హాయిగా పంటలు పుష్కలంబుగా పండించి మా ఆకలి దప్పులు తీర్చి రేషను బాధనుంచి గట్టేక్కిన్చవయ్యా .అని చమత్కరించారు కవీశ్వరులు .నువ్వు నిత్య భిక్షార్ధివి మాలోకనికి వస్తేపిడికెడు భిక్షంకూడా నీకు వెయ్యరయ్యోయ్ .నీకు రేషన్ కార్డు కూడా ఇవ్వరు జాగ్రత్తసామీ .
మా భారత సోదరీమణులకు 30ఏళ్ళు దాటినా పెళ్ళిళ్ళు కావటం లేదు .వాళ్ళ వివాహం సంతానం సంగతి చూడవయ్యమహానుభావా .’’దానంబిచ్చిన రాజు లేగిరి ,శిలా తామ్రాది తచ్చాసనా లేనాడో చనె ,విప్రవంశ భవులా ఇంగ్లీషు వారైరి ‘’ఇంకా అగ్రహారాలలెక్కడ అమ్ముకుపోయారు .బ్రాహ్మణుల తపోమహిమ చచ్చింది. బ్యాటరీ గొట్టాలోచ్చాయి .కరంట్ లేదు జపతపాలు లేవు అని వాపోయారు .
‘’ఈవీశు౦డవు నే కవీశ్వరుడ ,స్వర్ణ రౌప్యాగామముల్ -దావుల్నీకు శతావధాన మునుపాధ్యాయ త్వము నాకు ‘’అయ్యో దరిద్రం తీరటం లేదు .చివరి 113వ మత్తేభ పద్యం –‘’శత లేఖిన్యవధాన ముల్సలుపు ,సంచారంబు నన్సేలువల్ –పతకంబుల్గొని ,నాటకంబులును ,కావ్యశ్రేణినిట్లేన్నియో
శతకంబుల్విరచించి డస్సితిని ,నా సామర్ధ్యముం బూర్వపు న్-స్థితికి దేగదే తంగెడంచ పుర కాశీ విశ్వనాధ ప్రభూ’’
‘’ఇది- శ్రీ మద్ గౌరా వఝల-సీతమా౦బాసుబ్బరామా ర్య తనూభవ రామ కృష్ణ సీతారామ సోదరకవి ప్రణీతంబగు శ్రీ కాశీ విశ్వనాథ శతకం సంపూర్ణం .
ఈసోదరకవులు శతావధానులుకనుక పద్యాలు నల్లేరుపై బండినడక .చక్కని ఊహ నిర్వహణ తగినట్లు భక్తీ అందుకు తగ్గ పాండిత్యం తో శతకం రసవత్తరంగా రచించారు .అయితే మన వాళ్ళ దృష్టిలో పడిన దాఖలా నాకు కనిపించలేదు .వీరిని వీరి శతకాన్నీ పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-9-22-ఉయ్యూరు—