శతక భారతం
కృష్ణా జిల్లా నూజి వీడుకు చెందినశ్రీ పిసిపాటి సోమయ్య కవిమహా భారత కథను ‘’భారత శతకం ‘’గా రచించి 1935లో ,అక్కడే ఉన్న శ్రీ గౌరీ ముద్రాక్షర శాలలో ప్రచురించారు .వెల 5 అణాలు .దీనికి ముందుమాటను నూజివీడు ఆర్.ఆర్ .అంటే రాజారంగయ్యప్పారావు హైస్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, జిల్లా ఎడ్యుకేషనల్ కౌన్సిల్ మాజీ ప్రెసిడెంట్ శ్రీ మద్దిరాల రామారావు ఆంగ్లం లో రాశారు అందులోని విశేషాలు –‘’భక్త వత్సల కృష్ణ ‘’మకుటంతో కవిగారు మహా భారత ఇతి వృత్తాన్ని శతకంగా చెప్పటం నమ్మలేక పోతున్నాను .ఈనాటి యువతకు ప్రోత్సాహకరంగా ఉంది .భారత దేశ క్లాసిక్ కావ్యాలలో భారతం ఒకటి .భారతం లోలేని విషయాలు ఎక్కడా ఉండవు .ఎక్కడున్న విషయమైనా భారతం లో ఉంటుంది .యువత ఈశతకం చదివి భగవద్ భక్తిని, మన సంస్కృతిపై ఆరాధనా భావాన్ని పెంపొందించుకోవాలి. ‘’
బందరు హిందూ కాలేజి ఎక్స్ ప్రిన్సిపాల్ శ్రీ వారణాసి శ్రీనివాసరావు కంద పద్యాలలో పండితాభిప్రాయం చెబుతూ ‘’ఒక చులుకమ్మున గు౦భజు –డకలంక ప్రతిభ గ్రోలె న౦బు ధులి౦కన్ –సుకరమ్ముగాని భారత –మొక శతకంబయ్యె నీదు యుక్తి స్ఫురణచే ‘’,అంటూ కవిది ‘’అతులిత మనీష ‘’అని శ్లాఘించారు .కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ‘’శయ్య మనోహరం ప్రధానాంశాలు వదిలిపెట్టకుండా భారతాన్ని శతక కమండలం లో ఇమిడ్చారు ‘’అన్నారు .కలువపాములనుంచి శతావధాని శ్రీ హరి రామలింగ శాస్త్రి ‘’రసమున్నించి ,యలంకృతులన్ జొనిపి ,మహాకథా విశేషమున్ గుంచించి ముఖ్యా౦శపు గోసలైనన్ విడబోక ,యాగమహితోక్తుల్ వెల్లిగా ‘’రాసినందుకు పద్యాలలో మెచ్చుకొన్నారు .నూజివీడు డిప్యూటీ తాసిల్దార్ ఆఫీస్ హెడ్ క్లార్క్ –శతావధాని శ్రీ పాగొలు సత్యనారాయణ ‘’భారత సారము శతకము –గా రచియించితివి ముద్దుగా బాలురకున్ –దీరైన శబ్ద సంపుటి –నౌరా యని యబ్బుర౦బు నంద మనీషుల్ ‘’అని ఆశీర్వదించారు .కలువపాములవాసి శ్రీ హరి రాదా కృష్ణ మూర్తి ‘’లలి లక్షాధికమైన భారతము నెల్లన్ నూరు పద్యంబుల౦- బలుకంగా వలెనందుగందముల గావ్య ప్రక్రియన్ ‘’భక్త వత్సల కృష్ణా యను సత్కిరీటమున –ఓహో నీకృతి దివ్యం ‘’అని వెన్ను తట్టారు .నూజివీడు కో ఆపరేటివ్ సూపర్వైజర్ శ్రీ జోశ్యుల సూర్యనారాయణ శాస్త్రి ‘’నన్నయ తిక్కన యెర్రన-పన్నిన యా ఫక్కి నెందు బస చెడకుండన్ –సన్నుత గతి శతకంబున –వన్నె లొలుక బలికి తీవు భారత గాథన్’’అన్నారు .కనుక ఈశతకం కంద శతకం .మకుటం –‘’భక్త వత్సల కృష్ణా ‘’.ప్రతిపద్యానికి సూక్ష్మగా తాత్పర్యమూ రాశారు కవి .
మొదటి కందపద్యం –‘’శ్రీ రుక్మిణీ మణీహృ-త్సార సమద భ్రు౦గాపార్ధ సారధి చక్రి
ద్వారవతీశా నీపద –వారిజ ములగోలుతుభక్తవత్సల కృష్ణా ‘’.తర్వాత దశావతారాలు ఎత్తిన నీకు స్తుతి అంటే లోకోపకారమైన జండాను ఎత్తటమే.తర్వాత వ్యాస వాల్మీకాదికవులను తెలుగు కవులను ప్రస్తుతించి ‘’మద్గ్రంథోచిత రచనాధిక వాగ్వై చిత్రి ‘’ప్రసాదించమని కంసారిని మనసారా కోరారు .భూదేవి ధరించిన ఆభారణమా అన్నట్లు హస్తినాపురమున్నది .పుట్టు గుడ్డి ధృత రాష్ట్ర మహారాజు న్యాయంగా పాలిస్తున్నాడు .పాండురాజు అన్నకు సాయపడుతున్నాడు .చాపకళా విదుడుబ్రహ్మచర్యాశ్రమ దీక్షా పరుడు పెదతండ్రి భీష్ముడు అన్నివిధాలా ప్రాపు .’’నయ విద్యా పాండితిలో మేటి విదురుడు రాచకార్య నిర్వాహకుడు .తర్వాత పాండవ కౌరవ జననం ,పెంపకం ,పాండురాజు ‘’కిందమముని ‘’శాపంతో చనిపోవటం ,మాద్రి సహగమనం చేయటం ,కుంతితో పాండవులు హస్తిన చేరటం విద్య విలువిద్యాదులలో పెరుపొందటం ,దుర్యోధనాదులు భీమాదులను అవమాన పరచి దుష్టంగా ప్రవర్తించటం,ద్రోణ గురువు వద్ద ధనుర్విద్యాభ్యాసం చెప్పారు . ‘’నరశర విద్యాకుశలత ,,మరుదాత్మజు బాహు విక్రమం ,యుధిష్ఠిరుని పదవి చూసి సహించలేకపోయాడు దుర్యోధనుడు .సౌబల కర్ణాహ్వాయులు అతడికి దుష్ట సలహాలిస్తూ దుష్ట చతుష్టయంయ్యారు .తండ్రికి మాయమాటలు చెప్పి పా౦ డుకుమారుల్ని వారణావతం పంపి ,లక్కింట కాపురం పెట్టించి, అర్ధరాత్రిదహనం చేయించాడు .’’విదుర దూత సమకూర్చిన భూబిల మార్గం లో అడవి లోకి ప్రవేశించారు తల్లితోసహా .హిడింబ భీమ వివాహం ,ఘటోత్కచ జననం ,విప్రవేషంలో ఏక చక్రపురం చేరి ,భీముడు బకాసుర సంహారం చేసి ప్రజల బాధలు తీర్చటం ,ద్రౌపదీ స్వయం వరంలో పాల్గొనటం .’’వచ్చిన రాసుతు లెల్లరు –జెచ్చెర జని భంగపడుట చే యంత్రం –బచ్చపు ద్విజ వేషుడువి-వ్వచ్చుడు దాని నేసె భక్తవత్సల కృష్ణా ‘’.తల్లికుంతి,వ్యాస మహర్షి అనుమతితో పాండవులు అయిదుగురు ద్రౌపదికి భర్తలయ్యారు .ఈ విషయం తెలిసిన పెద్దరాజు వారందర్నీ గజపురికి ఆహ్వానింఛి అర్ధ రాజ్యమివ్వగా ఇంద్ర ప్రస్తాన్ని రాజధానిగా ధర్మరాజు తమ్ముల సాయంతోపాలించాడు .తర్వాత ‘’మేనరిక మని త్వదీయసహోదరి సుభద్ర దేవేరిగనీ –వాయర్జునునకు ‘’కూర్చాడుకృష్ణుడు .సుభద్రార్జునులకు మహా పౌరుషవంతుడు అభిమన్యకుమారుడు జన్మించాడు .ద్రౌపదికి ధర్మజ భీమార్జున నకుల సహదేవుల వలన ప్రతి వింధ్య ,శ్రుతసోమ ,శ్రుతకీర్తి శతానీక ,శత్రుసేన అనే ఉపపాండవులు జన్మించారు
అర్జునుడు ఖాండవ దహనం చేసి అగ్నిని మెప్పించి ,ఇంద్రాదులను జయించి వీతి హోత్రుని తృప్తి పొందించాడు .మయుడు అఆగ్నిజ్వాలలో చిక్కుకొని కిరీటిని శరణు వెడితే , అతడు రక్షించగా ,కృతజ్ఞతగా అతడు ‘’శ్రీమన్మణి సభ –నాకస్వామియు నరుదొంద’’ధర్మపుత్రునికి నిర్మించి ఇచ్చాడు .మయసభా ప్రవేశం చేసి యుధిష్ఠిరుడు ధర్మ బద్ధంగా రాజ్యపాలన చేస్తూ ,నారద మహర్షి రాజసూయ యాగం చేయమని హితవు చెప్పగా బావ కృష్ణుని ఆహ్వానించి ‘’నీ నియోగంతో రాజలోకాన్ని జయించాలి ‘’అని కోరగా ,జరాసంధుని హతమార్చటానికి కృష్ణ భీమార్జునులు వెళ్లగా ,భీముడితో మల్ల యుద్ధం లో వాడు చనిపోయాడు .తమ్ముల సాయంతో పూర్వోత్తర పశ్చిమ దక్షిణ దిగ్విజం పొంది ధర్మరాజు రాజసూయాధ్వరం చేశాడు .అగ్రతాంబూలం శ్రీ కృష్ణుడికి ధర్మరాజు ఇస్తే ,శిశుపాలుడు అతడిని,కృష్ణుని దూషిస్తే ,’’నిన్నుదిట్టు శిశు పాలున్ –గూలిచి చక్రముచే –క్రతుపాలన ‘’చేశాడు .
పాండవ వైభవాన్ని కనులారా చూస్తున్న దుర్యోధనుడికి అ సూయ పరాకాష్టకు పెరిగి ,మాయాద్యూతం ఆడించి వనవాస అజ్ఞాత వాసాలకు పంపాడు పాండవుల్ని ‘కౌంతేయులు సతితో కాననమున బలు పాట్లు పడ్డారు .’’బకుని తమ్ముడు కిమ్మీరుడు అడ్డు వస్తే భీముడు చంపేశాడు .’’ఈశునికై తపము –పారాశర్యు ననుజ్ఞ సల్పి –ప్రత్యక్షముగా జేసికొని-నరుడు వొందెను – పాశుపతాస్త్రము ‘’.శతమఖ నందనుడు అర్జునుడు అమరావతికి వెళ్లి ఊర్వశికామించగా ,నిరాకరిస్తే ‘’పేడిగ బ్రతుకు మని ‘’శపించింది .ఇంద్రుని ఆజ్ఞతో పార్ధుడు పాతాళం లో ఉన్న నివాత కవచులు అనే 3కోట్ల రాక్షసులను ,హిరణ్య పురవాసులైన పౌలోమ కాలకేయాది 60వేల రాక్షసులని చంపి దేవతా ప్రీతి చేశాడు .
గంధర్వులు దుర్యోధనుడిని బంధిస్తే ,విడిపించి ‘’గంధర్వుల నోరిచిన –సద్బంధులు పాండవులు .కామ్యవనంలో పాండవులు ద్రౌపదిని ఒక్కదాన్నే ఆశ్రమ లో ఉంచి వేటకు వెడితే ‘’ద్రుపద సుత వలచి సైంధవుడు అపహరణము సేయగా –మారుతాత్మజుడు ‘’వాడి గర్వం అడచి ద్రోవదిని తెచ్చాడు .’’సురయక్ష మౌని భూసుర సమూహం వరాలు ఇస్తే ,12ఏళ్ళు సుఖంగా పాండవులు వనవాసం పూర్తి చేశారు .అజ్ఞాతవాసం ఏడాది గడపపటానికి మత్స్యనగరి వెళ్లి ,విరటునికొలువులో మారువేషాలతో ఉన్నారు .’’నరుడు బ్రహన్నల నాగను బరగెను బేడియయి ‘’.ద్రౌపదిని గా౦ క్షీంచియుంట-దుర్జ్నేయ విధిన్ –దేవి సహోదరు గీచకు –బావని వధించాడు ‘’అని కీచకవదను ఒకే ఒక పద్యంలో చెప్పేశారు .తర్వాత దక్షిణ గోగ్రహణం.’’అత్తరి విరటుని పుత్రకు –నుత్తరు గని పసుల వార లోగివెడితే ‘’అర్జునుడు వెళ్లి ఆలను రక్షించి దుర్యోధనాదులకు యుద్ధంలో బుద్ధిచెప్పి ‘’క్రీడి రధియై తా రహి కౌరవ సేనా –వారంబుల గవిసె ‘’అనిలో ఉరు విజయం’’ పొందాడు .పాండవులు తమ నిజస్వరూపాలు విరతునికి తెలియజేయటం అర్జునుని కోరికపై అతడు ఉత్తరను అభిమన్యునికిచ్చి వివాహం చేయటం ,ఉపప్లావ్యం చేరి పాండవులు ‘’తమపాలిమ్మని కురు పతిని ‘’కోరటం ,చివరగా శ్రీ కృష్ణ రాయబారం ‘’తమ పైతృకమగు ఉర్వీ సామ్రాజ్యం పాండవులకిచ్చి ,భువి వాసిగా మనుము ‘’అని హితవు చెప్పటం ,లేదంటే యుద్ధంలో జయించి వాళ్ళే రాజ్యం పొందుతారని హెచ్చరించటం ,యుద్ధంలోనే తేలుద్దాం అని పెద్దరాజుకొడుకు అనటం ,ఆదుష్టులు ‘’నిండు సభ బట్ట నేనొక రుండన ?”’అంటూ విశ్వరూపం చూపటం ,చెప్పారు .
‘’పోరున సారధి వగుమని –కోరుతట నిన్ను సవ్యసాచి గొనకొని నీవా -భారము బై నిడుకొన్నావు ‘’అపార కృపా లీలతో .కురుపాండవ సంగ్రామం .వరుసగా కౌరవులంతా పాండవులచేతిలో హతమవ్వటం ,18అక్షౌహిణుల సైన్యంతో 18రోజులు జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించగా ‘’శ్రీ మెరయ నంతధర్మజు –బ్రేమంబున హస్తిపురికి పృధ్వీ పతిగా –నేమించి ,ఏలితీవు ప్రభామయ సాధువుల భక్త వత్సల కృష్ణా ‘’111వ కందంలో పిసిపాటి సుబ్బయ నరసాంబ కుమారుడు సోమయకవి రాసిన భారత శతకం చదివిన విన్నవారు కృష్ణుని దయతో దీర్ఘాయుస్సు నిర్మలమనసు ,సమస్తసంపదలు సత్సంతానం ఇహపర సౌఖ్యం తప్పక పొండుతారని ఫలశృతి చెప్పారు .
ఇందులో నేను విశ్లేషించి చెప్పాల్సిందేమీ లేదు మున్డుమాతలలోనే మహా మహులు చెప్పే ఉన్నారు .ఈకవి రామాయణం కూడా శతకరామాయణ0గా రాసిన తర్వాత దీన్ని రాసి ఆటర్వార భాగావతాన్నికూడా శతక భాగవతంగా రాశారని నిన్న చెప్పుకొన్నాం .కొండను అడ్డం చూపినట్లు మహా ఉద్గ్రందాలను శతకాలుగా మలచిన ఈ కవిని శతవిధాల కీర్తించాలి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-22-ఉయ్యూరు