తారా శంకర్ బంద్యోపాధ్యాయ
ఆంగ్లం లో మహా శ్వేతాదేవి రాసిన దానికి తెలుగులో ఎస్ ఎస్ ప్రభాకర్ అనువాదం చేసిన ‘’ తారా శంకర్ బంద్యోపాధ్యాయ’’పుస్తకాన్ని కేంద్ర సాహిత్యఅకాడమి 1978లో ప్రచురించింది వెల-2-50రూపాయలు .
జననం విద్యా భ్యాసం
తారాశంకర్ బంద్యో పాధ్యాయ పశ్చిమ బెంగాల్ బీర్భం జిల్లా లాభపూర్ గ్రామం లో 25-7-1898న జన్మించాడు .తండ్రి హరిదాస బంద్యోపాధ్యాయ తల్లి ప్రభావతీదేవి .మొదటి సంతానం .ఇద్దరు తమ్ముళ్ళు ,ఒకచెల్లెలు .అతడు పుట్టిన గ్రామం పురాణాలలో అట్టహాస అని పిలువ బడేది .సతీ దేవి శరీర భాగం పడిన పవిత్ర ప్రదేశం .ఇక్కడ శక్తి ఆరాధకులు ,వైష్ణవులు ఎక్కువ .జానపద సంగీతానికి ప్రసిద్ధి .చిన్న తనం లో శంకర్ బోలు వైష్ణవ శక్తి దాసరుల భక్తీ గీతాలు విని నిద్ర లేచేవాడు .గ్రామం మతసామరస్యానికి ప్రసిద్ధి .పాట్వాలు అనే సంచార జాతి వారు చేతితో రాసిన చిత్ర పటాలను పట్టుకొని తిరిగే వారు .అందులో కృష్ణలీలలు గౌరాంగ అనే చైతన్యప్రభు చిత్రాలు ఉండేవి .ఇక్కడి పాములవాళ్ళు మహమ్మదీయులు .వీరిలో పురుషులు బాగా అందంగా ఉంటారు .స్త్రీలుఎవరినీలెక్క చేసేవారుకాదు. గొప్ప నర్తకీ మణులు .సర్కస్ వాళ్ళు కూడా వచ్చి ప్రదర్శనలిచ్చేవారు .యువతకు బాగా ఆకర్షణ .సంచారజాతి స్త్రీలు ఆకుపసర్లు ,ప్రేమ లేపనాలు అమ్మేవారు .వారిలో మగాళ్ళు కుందేళ్ళను,అడవిపందుల్ని, అడవి బల్లులను వేటాడేవారు .
ఆగ్రామ చిన్నా పెద్ద జమీందార్లు ఉన్నత వంశీయులు .కొందరు బొగ్గుగనుల వ్యాపారంలో బాగా సంపాదించారు .పేదలు నిత్య దరిద్రులే .’’ రూపాయలతో ఎవరైనా మహా రాజుగా బతకవచ్చు .నెలకు సరిపడా ఆకుకూరలు 75పైసలే .వారానికి రెండు సార్లు జరిగే సంతలో అయితే మరీ కారు చౌక 37పైసలే .ఇంటి నౌకరు నెలజీతం రూపాయిన్నర .ఆడ వంటమనిషికి నెలకు రెండు రూపాయలు .మగ వంటగాడికి మూడు రూపాయలు .సంప్రదాయ ధనిక కుటుంబాలకు బొగ్గుగనులతో ‘’డబ్బు చేసిన ‘’వ్యాపారస్తులకు మధ్య స్పర్ధలు ఉండేవి .వ్యాపారుల్లో చాలామంది వైష్ణవులు .జమీందార్లు శాక్తేయులు.ఆలయ మరమ్మత్తులు చెరువుల బాగుకోసం బాధ్యత ఎవరిదీ అనే విషయం పై తగాదాపడేవారు .హైస్కూల్స్ కు చేసే ఆర్ధిక సహాయం లో కూడా భేదాలు కనబడేవి .పండుగలు మత ఉత్సవాలు చేసేటప్పుడు ఇవి బాగా బయటపదేవి .లాభపూర్ లో పటిష్టమైన నాటక సంప్రదాయం అనాదిగా ఉంది .అన్ని హంగులతో ర౦గస్థలం ఉండేది .’’యాత్రా ‘’నాటక సంస్థలు ఇక్కడికి వచ్చి ప్రదర్శనలిచ్చేవారు .ఇవీ ఆ నాటిసా౦ఘిక పరిస్తి తులు అని బంద్యో పాధ్యాయ చెప్పాడు . ఎర్రని భీర్భం అంటే వీర భూమిలో ,కోపాయ్ నది పరవళ్ళు తొక్కేది .మతదురాచారాలు వరదలు వర్షభీభత్సం తారాశంకర్ బాల్యం లోనే చవిచూశాడు .ఇవన్నీ ఆయన నవలలో ప్రత్యక్షంగా చూపాడు .తొలిరచన చైత్ర జంఝ నుంచి చనిపోయాక వచ్చిన ‘’శాతాబ్దిర్ మృత్యు అంటే ఒక శకం వెళ్లి పోయింది నవలదాకా ఆయన రచనలలో తనకు పరిచయమైన నేలను మనుష్యుల్ని పరిసరాలను ,ప్రకృతిని నిశితంగాపరిశీలించిరాశాడు .
తండ్రికి హైస్కూల్ విద్యకూడా లేదు అయినాస్వయంగా ఎన్నో గ్రంథాలు చదివి జీర్ణం చేసుకొన్నాడు .అన్నిరకాల పత్రికలూ వార్తా పత్రికలూ తెప్పించుకోనేవాడు మంచి లైబ్రరీ ఉండేదిఇంట్లో .తారా కు ఎనిమిదేళ్ళప్పుడే తండ్రినడి వయసులోనే చనిపోయాడు .తల్లి పాట్నాలోని విద్యాధిక కుటుంబానికి చెందినది .అప్పటి సనాతనాలు స్త్రీ విద్యను ప్రోత్సహించేవారుకాదుకానీ ఆమె తలిదండ్రులు ఆమెను బాగా చదివించారు .శంకర్ పై తల్లిప్రభావం జాస్తి. ఆమె అనేక మైన ఒడిదుడుకులు తట్టుకొని సంసారాన్ని నిలబెట్టింది .తల్లి అంటే అపారగౌరవం శంకర్ కు .అతని అత్త భర్తను కొడుకునుపోగోట్టుకొని వీరింటి లోనే ఉండేది .ఆమెకు మేనల్లునిపై అపార వాత్సల్యం,ప్రేమ .ఈ ఇద్దరు మహిళలు తారా శంకర్ జీవితానికి గొప్ప వెలుగులయ్యారు .అతనిలో ఉన్నత నైతిక విలువలను ప్రోది చేశారు .
తల్లి కథలను రసరమ్యంగా చెప్పేది .అతని రచనలలో ఈ కథకురాళ్ళు దర్శనమిస్తారు .ముఖ్యంగా గణ దేవత ,పంచగ్రామ నవలలో న్యాయరత్న పాత్ర తల్లియే .అతని మేనమామలు జాతీయోద్యమం లో పాల్గొన్నారు .1905లో కర్జన్ బెంగాల్ విభజన చేసినప్పుడు అతని మామయ్య చెల్లి చేతికి రక్షా బంధన్ కట్టాడు .తల్లికూడా ఈ కొడుకు చేతికి కట్టింది .అప్పటికి ఇతని వయసు చాలా తక్కువే.తండ్రి మరణం తల్లి ఆత్మ స్థైర్యం ,అత్త అపారప్రేమ ధాత్రీదేవత నవలలో అత్యద్భుతంగా చిత్రించాడు తారాశంకర్ .నాటి జమీందార్లు ధనవ్యయం బాగా చేస్తూ ,తాగుడుకు బానిసలైనావ్యక్తిగత,సాంఘిక ప్రవర్తన ఉన్నతంగా ఉండటంతో తారాశంకర్ కు వారిపై అభిమానం,సానుభూతి ఉండేవి. కాని రచనలలో వారి దురాచారాలను వ్యసనాలను ఖండించేవాడు .జమీందార్లు మతాచారాలను అత్యంత నియమ నిష్టలతో జరిపేవారు .ఇవి ఇతని కుటుంబానికీ ఎక్కువే .తరుణ వయస్సు వచ్చేసరికి శంకర్ కు ఆవిశ్వాసాలు ఆలోచనలపై స్థిర బుద్ధిఎర్పడింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-22-ఉయ్యూరు