• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -13
• 37-సైరంధ్రి కావ్యం,జ్ఞాన ప్రసూనా౦బికా శతకం రాసిన , స్వర్ణకంకణ గ్రహీత ,సరస కవయిత్రి –శ్రీమతి గంటి కృష్ణ వేణమ్మ
• ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గంటి కృష్ణవేణమ్మ[1] గొప్ప కవయిత్రి. ఈమెది వాధూలస గోత్రము. ఈమె తండ్రి కఱ్ఱా రామశర్మ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. తల్లి సుబ్బలక్ష్మమ్మ కవయిత్రి. చంద్రకళా విలాసము అనే ప్రబంధాన్ని రచించింది. ఈ గ్రంథం విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. గంటి కృష్ణవేణమ్మ భర్త గంటి వెంకటసుబ్బయ్య కూడా గొప్ప పండితుడు. కవులుట్ల చెన్నకేశవ శతకము ను వ్రాశాడు. ఈమె పెద్దగా చదువుకోక పోయినా తాతగారైన నాగపూడి కుప్పుసామయ్య వద్ద తెలుగు సాహిత్యం చదువుకుంది. ఒంటిమిట్టలో వావిలికొలను సుబ్బారావు నిర్వహించిన పరీక్షలను చిన్న తనంలోనే ముగించింది. హిందీ విద్యాపీఠం వార్థా నిర్వహించే భాషాకోవిద వరకు చదివింది. ఇంగ్లీషు, కన్నడ భాషలలో కూడా కొంత ప్రవేశముంది. ఈమె గృహలక్ష్మి , భారతి, త్రిలిఙ్గ పత్రికలలో పద్యఖండికలను ప్రచురించింది. గృహలక్ష్మి పత్రికాధిపతులు ఈమెకు స్వర్ణకంకణమును బహూకరించి సరసకవయిత్రి అనే బిరుదుతో సత్కరించారు. తన 86వ యేట ప్రొద్దుటూరులో మరణించింది.
రచనలు
1. సైరంధ్రి (పద్యకావ్యము)
2. గిరిజాకళ్యాణము
3. పవనద్యూతము
4. రాజరాజేశ్వరీ శతకము
5. కామాక్షీ శతకము
6. శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము
7. తలపోత[2]
రచనల నుండి ఉదాహరణ
నాడటు పాండవాత్మజులు నన్నును, తమ్మును రాజ్యమెల్ల దా
నోడి మహార్తి నున్నతరి మద్యతులై ధృతరాష్ట్ర నందనున్
పాడి దొఱంగి వల్వలొలువన్‌గని సూతసుతుండు కొల్వులో
నాడిన మాట లకటా! తలపోయ మనంబు వ్రయ్యదే!
కురుపతి, భీష్ముడున్, గృపుడు, కుంభజ ముఖ్యులు గల్గుకొల్వులో
నరసి వచింపరైరకట! యాడుది వేడిన ధర్మసంశయం
బెరుఁగరె? ధర్మ శాస్త్రముల నేటికి గాల్పనె! పెద్దవారలం
దురుగద, యేటి పెద్దలిక నేటికి వారల గౌరవింపగన్?
(సైరంధ్రి పద్యకావ్యం నుండి)
38-ఆయుర్వేద ,జ్యోతిష పండితుడు,మహా౦ద్రో దయకావ్యకర్త కవి –శ్రీ గొల్లాపిన్ని రామకృష్ణ శాస్త్రి
గొల్లాపిన్ని రామకృష్ణశాస్త్రి (1922 – 2001) ప్రముఖ ఆయుర్వేద, జ్యోతిష పండితుడు.[1]
. ఇతను గొల్లాపిన్ని సీతారామశాస్త్రి, సుబ్బమ్మ దంపతుల సంతానం. ఇతనిది పండిత వంశము కనుక కవిత్వము ఉగ్గుపాలతోనే అబ్బింది. ఆయుర్వేదంలో కూడా అనుభవం సంపాదించుకున్నాడు. అబ్కారీ డిపార్ట్‌మెంటులో కడపలో పనిచేశాడు.
రచనలనుండి ఉదాహరణలు
సీ. కాకతి క్ష్మాపతి కాంచుచున్నాడు హ
ర్షాశ్రు ముక్తామాల సంతరించి
హరిహర బుక్కరాయలు కాంచుచున్నారు
తెలినవ్వు చలువ వెన్నెలల బరసి
ఘనుడు విద్యారణ్యముని పలుకుచున్నాడు
సిరిలొల్క వైదికాశీస్సు గురుసి
శ్రీకృష్ణరాయలు వాకొనుచున్నాడు
శక్రుతో నాంధ్ర ప్రశస్తియేమొ
గీ. గురుని కెఱిగించు చుండె తిమ్మరుసుమంత్రి
ఆంధ్రమంత్రుల సాహసౌదార్యములను
గతచరిత్రకు నీకు దార్కాణవారె!
వచ్చియున్నారు నీయుత్సవంబుఁజూడ.
(మహాంధ్రోదయము నుండి)
39-అన౦త ఆణిముఖ్యం ,ప్రకాశంగారి శిష్యుడు ,దశకావ్య కర్త –శ్రీ తక్కళ్ళపల్లి పాపా సాహెబ్
అనంతపురం జిల్లా కీర్తి ప్రతిష్ఠలు పెంచిన జాతిరత్నాలలో తక్కళ్లపల్లి పాపాసాహేబు ఒక అనంత ఆణిముత్యం.
జీవిత విశేషాలు
1928లో తక్కళ్లపల్లి పాపాసాహేబు[1],[2] తన మాతామహుల ఇంటిలో కేశవరాయునిపేటలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసము ప్యాపిలి, పత్తికొండ, గుత్తి గ్రామాలలో జరిగింది. కాశీ విద్యాలయంలో చదువబోయి కారణాంతరాల వల్ల ఆ ప్రయత్నాన్ని మానుకొని స్వయంకృషితో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. గాంధీగారి స్ఫూర్తితో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీకి అంకితమై దేశానికి సేవ చేశాడు. చిన్నతనం నుండి కవితాభ్యాసం చేసి పదికి పైగా కావ్యాలను వ్రాశాడు. ఇతని అంబ కావ్యము ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి భాషాప్రవీణ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. ఇతని రచనలపై విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్., పి.హెచ్.డి. స్థాయిలలో పరిశోధనలు జరిగాయి. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతనిని రాష్ట్రకవిగా గుర్తించి సత్కరించింది. రాయప్రోలు సుబ్బారావు ఇతడికి మహాకవి అనే బిరుదును ఇచ్చాడు. పాపాసాహేబు 1981లో మరణించాడు.
రాజకీయరంగం
ఇతడు టంగుటూరి ప్రకాశం పంతులును రాజకీయ గురువుగా భావించి రాజకీయాలలోకి ప్రవేశించాడు. ఇతడు కాసు బ్రహ్మానందరెడ్డి అనుయాయిగా అనంతపురం జిల్లా రాజకీయాలలో కీలకపాత్ర వహించాడు. 1958 నుండి జిల్లా కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభుడిగా ఉన్నాడు. 1962, 1967, 1972 శాసనసభ ఎన్నికలలో గుత్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు. రాజకీయాలలో తలమునకలుగా ఉండికూడా ఇతడు సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించాడు. ఇతడు తన రాజకీయ అనుభవాలను “నా రాజకీయ జీవితానుభవములు” అనే గ్రంథరూపంలో వివరించాడు[3].
రచనలు
1. అంబ
2. అవధి
3. కన్నీటి చుక్కలు
4. నా రాజకీయ జీవితానుభవాలు
5. పాపుసాబు మాట పైడిమూట
6. ప్రేమవిలాపము
7. రస ఖండము
8. రాజ్యశ్రీ
9. రాణీ సంయుక్త
10. శకుంతల
11. సత్యాన్వేషణ
12. విశ్వనాథ నాయకుడు
రచనల నుండి మచ్చుతునకలు
తన్నె వివాహమాడుట కెదన్ త్వరబొందెడు రుక్మిణిన్ మహా
పన్నత కుందు దాని మురభంజను డెత్తుక పోయినట్లు వే
గన్నరుదెమ్ము స్వామి నను గైకొని పోవగ వేచియుందు వే
గన్నుల నీదు రాకకయి కైరవ మిందుని కోస మట్టులన్
పరమ పవిత్రమైన మన భారతభూమి ప్రతిష్ఠ స్వార్థ త
త్పరమతి దుమ్ములో కలుపు తండ్రియెకాదు మరెవ్వరైననున్
స్థిర కరవాల ధారలను నిర్దయ గొంతులు కోతు, గొఱ్ఱెలం
గరణి దదసృగార్ద్ర శితఖడ్గము నిచ్చెద నీకు కాన్కగా
(రాణీసంయుక్త కావ్యం నుండి)
ప్రాణము పోవుచున్న దలవంచని పౌరుషసాహసాలు, వా
గ్దానమొసంగి తప్పని యుదార గభీరగుణమ్ము, లొంగుటే
గానని యాత్మగౌరవము, కంపము చెందని గట్టి చేవయున్
మానపరాయణత్వ మసమాన మఖండము నై విరాజిలున్
(సత్యాన్వేషణ నుండి)
యావజ్జీవము, మాతృదేశ భయదోద్యద్దాస్య నిర్మూలనా
భావోల్లాస వికాస చిత్తమున, దౌర్భాగ్యాభి పూత ప్రజా
సేవా దీక్షకు, ధారవోసిన దయాశ్రీసాంద్ర నిస్తంద్ర తే
జో విస్తార! జగత్పితా! కొనుమివే జోహారులర్పించెదన్
(మహాత్మాగాంధీ గురించి)
తురక కేమి తెలుసు పరమ వేదార్థమ
టంచు నెత్తి పొడుతు రవని సురులు
కన కబీరు తురక గాకేమి గరకయా
పాపుసాబు మాట పైడి మూట
(పాపుసాబు మాట పైడి మూట నుండ
40 –డిటెక్టివ్ నవలలతోసహా శతాధిక గ్రంధకర్త ,మహాకవి బిరుదాంకితుడు –శ్రీ గుంటి సుబ్రహ్మణ్యశర్మ
• గుంటి సుబ్రహ్మణ్యశర్మ[1] అనంతపురం జిల్లాకు చెందిన శతాధిక గ్రంథకర్త.
జీవిత విశేషాలు
సంస్కృత, ఆంగ్ల. ఆంధ్ర భాషలలో విద్యావంతుడు. సంస్కృతము గురుముఖంగా కాకుండా కేవలం స్వయంకృషితో నేర్చుకున్నాడు. అనంతపురంజిల్లా లోని అనేక గ్రామాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.కాం పరీక్షలు పాసయ్యాడు. ఇతని కలం నుండి 18 నవలలు, 18 బాలసాహిత్య కథాసంపుటాలు,18 వచనప్రబంధాలు, 20 జాతీయనాయకుల జీవితచరిత్రలు, 8 పద్యకావ్యాలు, ఇంకా ఎన్నో ఇతర గ్రంథాలు వెలువడినవి. ఇతని అపరాధపరిశోధక నవల ‘భూతగృహము’ ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల కాకినాడచే 116/-రూ.ల బహుమతి గెలుచుకుంది.
రచనలు
• భూతగృహము (అపరాధపరిశోధక నవల)
• రహస్యశోధనము (అపరాధపరిశోధక నవల) [2]
• విశ్వజ్యోతి (గౌతమ బుద్ధుని చరిత్ర కావ్యము)
• మాధవాశ్రమము (నవల)
• విశ్వప్రేమ (బసవేశ్వరుని చరతము కావ్యము)
• శ్రీరామకృష్ణ భాగవతము (5000 పద్యాలున్న ఉద్గ్రంథము)
• జయాపజయములు
• కాసులదండ
• కాలభ్రమణం
• కన్నీటికాపురం
• ఆత్మతత్త్వవిచారము
రచనల నుండి ఉదాహరణలు
ఎన్నఁటికైన నన్ను నిను నేర్పడఁజేయును మిత్తి; సంపదల్
మిన్నలు కావు; నేను మిడిమేలపు జీవితమొంది భూమిపై
గ్రన్నన జచ్చుకంటె, బలకాయ సముత్థిత శక్తివెల్, నా
పన్నుల సేవఁజేతు; నిదిపాడియ; మద్భవసార మిద్ధరణన్
ఏమి సేతు నకట! ఎనలేని నీరూప
కాంతి, రెంట దీన కష్టజనుల
యోజ, చేరి మనసు నుఱ్ఱూత లూగించు
సుదతి నిన్ను విడుతు సుకృతమెంచి
తనయుడనై నీయొడిలో
దనరారుచు నుందు నింక తలఁకక,నాపై
మనసుంచక, యేలోటును
గనుపించక సుతునితోడ గడుపుము దినముల్
(విశ్వజ్యోతి నుండి)
మృత్యుముఖమున దరిజేరి మేధినీశు
లొక్కటౌదురు,భువిలోన సుక్కి పిదప
నెవర లేమౌదురో దేవు డెఱుగు? నకట!
మురిసిపోదురు మూన్నాళ్ళ ముచ్చటలకు
(విశ్వప్రేమ నుండి)
బిరుదులు
• అనంతపురము రాయలకళాగోష్ఠి ఇతడికి మహాకవి అనే బిరుదును ప్రదానం చేసింది.
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-22-ఉయ్యూరు