• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -14
• 41-ధర్మజ్యోతి ,విశ్వేశ్వర నక్షత్రమాల కర్త –శ్రీ పాణ్యంలక్ష్మీ నరసయ్య
• పాణ్యం లక్ష్మీనరసింహయ్య 1920వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ గ్రామంలో సుబ్బలక్ష్మమ్మ, లక్ష్మీనరసయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు తన తండ్రివద్దను, పినతండ్రి వాసుదేవశాస్త్రి వద్దను, వెల్దుర్తి లోని అన్నదానం సుబ్బాశాస్త్రి వద్దను, గౌరిపెద్ది శేషశాస్త్రుల వద్దను సంస్కృతాంధ్రములు నేర్చాడు. ఇతనికి చిన్నతనంలోనే కవిత్వం అబ్బింది. ఇతడికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఇతని పెద్దకుమారుడు పాణ్యం నరసరామయ్య కూడా చక్కని కవితలు అల్లిన కవి. లోకోపకారార్థము ధార్మిక రచనలు చేసిన పాణ్యం లక్ష్మీనరసింహయ్య 1978-79 ప్రాంతంలో తనువుచాలించాడు[1].
• రచనలు
• ధర్మజ్యోతి[2]
• ఈశ్వరశతకము
• శ్రీ కోదండరామశతకము
• శ్రీ విశ్వేశ్వర నక్షత్రమాల
• శ్రీ రామతత్త్వ రహస్యము
• 42- స్కూళ్ళ ఇన్స్పెక్టర్ ,రోజా కధకు గిడుగు వారి ప్రశంసలుపొంది ,జానపద వాజ్మయం ,నాటకాలు,ఫ్యూచర్ లైఫ్ ఆఫ్ ది సోల్ రాసిన –శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు
టేకుమళ్ల కామేశ్వరరావు కవి, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు. వ్యవహారిక భాషకు కూడా కొన్ని నియమాలు అవసరమనే అభిప్రాయమున్న వ్యవహారిక భాషవాది.
జీవిత విశేషాలు
తండ్రి టేకుమళ్ల అచ్యుతరావు వాజ్మయ విమర్శకుడు, బహుగ్రంథకర్త. ఇతడికి చిన్నప్పటి నుండే కవిత్వం వ్రాయడం అభ్యాసమైనది. బళ్లారిలో చదివాడు. 1927లో వివాహం జరిగింది. 1933లో ఉపాధ్యాయుడుగా ఉద్యోగం ప్రారంభించి స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా రాయలసీమ,ఉత్తర సర్కారు జిల్లాలలో పనిచేశాడు.1935లో భార్యావియోగం కలుగగా అదే సంవత్సరం రెండవ వివాహమైనది.
ఈయన రాసిన రోజా కథ చదివిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు దేశ భాషలో ఎంతో కృషి చేసాను ఎందుకు? ఇటువంటి కథ ఒక్కటి రాసివుంటే ఎంత బాగుండేది అని మెచ్చుకున్నారు.
రచనలు
• రోజా (కథా సంపుటము)
• జానకి ప్రేమ (కథా సంపుటము)
• వెలుగు
• పాలపిట్ట
• మిణుగురు పురుగు (గేయాలు)
• కోపదారి మొగుడు (నాటకం)
• సాహిత్య చిత్రములు(కథల సంపుటి) [1]
• పాత పాటలు
• సాంప్రదాయ విజ్ఞానం
• నా వాజ్మయ మిత్రులు
• Further life of the Soul
• కలువలు (ఖండకావ్యము)
• వాడుక భాషారచన – కొన్ని నియమములు
• పూర్వాంధ్రకవులు
• తెలంగాణా రాజుల చరిత్ర
• ప్రకాశవిమర్శీయము (నాటకం)
• జానపదగేయ వాజ్మయ చరిత్ర
• 43-శతాధిక గ్రంధకర్త ,మహా పరిశోధక విమర్శకుడు,కళారత్న – ఆచార్య ఎస్.గంగప్ప
• సాహితీపరిశోధకుడు, బహుగ్రంథకర్త అయిన ఎస్.గంగప్ప అనంతపురం జిల్లాకు చెందినవాడు.
జీవిత విశేషాలు
ఎస్.గంగప్ప 1936, నవంబర్ నెల 8వ తేదీన నల్లగొండ్రాయని పల్లి లో వెంకటప్ప, కృష్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడి ప్రాథమిక విద్య సోమందేపల్లిలోను, మాధ్యమిక విద్య పెనుకొండలోను జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఏ. ఆనర్స్ చదివాడు. వాల్తేరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నుండి 1960లో ఎం.ఏ. పూర్తిచేశాడు. కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా “కోలాచలం శ్రీనివాసరావు – నాటక సాహిత్య సమాలోచనము” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సాధించాడు. 1960లో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి కాకినాడ, విశాఖపట్నం,హైదరాబాదు, కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల లలో ఆంధ్రోపన్యాసకునిగా, తెలుగు శాఖాధిపతిగా 1978 వరకు పనిచేశాడు. 1978నుండి నాగార్జునాయూనివర్శిటీ ఆంధ్రోపన్యాసకుడిగా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1989-91లో తెలుగు ప్రాచ్యభాషాసంఘం అధ్యక్షుడిగా, 1994-96లో ఎం.ఏ పాఠ్యనిర్ణాయక సంఘం అధ్యక్షుడిగా ఉండి 1996లో పదవీవిరమణ చేశాడు.
సాహిత్యసేవ
అనేక పత్రికలలో వివిధ సాహిత్యాంశాలపై వ్యాసాలను ప్రచురించాడు. అనేక సాహిత్య సదస్సులలో, గోష్టులలో పత్రాలు సమర్పించాడు. అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు చేశాడు. సుమారు 100కుపైగా గ్రంథాలను వ్రాసి ప్రచురించాడు. అనేక సాహిత్యాంశాలపై రేడియో ప్రసంగాలు చేశాడు. ఆయనను అనేక సంస్థలు సత్కరించాయి. అనేక పురస్కారాలను గెలుచుకున్నాడు. కేంద్రసాహిత్య అకాడెమీ సీనియర్ ఫెలోషిప్‌ను పొందాడు. పదసాహిత్యంపై పరిశోధన జరిపాడు.
రచనలు
1. క్షేత్రయ్య పదసాహిత్యం
2. సారంగపాణి పదసాహిత్యం
3. అన్నమాచార్యులు – ఇతర ప్రముఖ వాగ్గేయకారులు – తులనాత్మక అధ్యయనం
4. తెలుగులో పదకవిత
5. కోలాచలం శ్రీనివాసరావు[1] (ఆం.ప్ర.సంగీత అకాడెమీ ప్రచురణ)
6. సాహిత్యసమాలోచన[2]
7. తెలుగుదేశపు జానపదగీతాలు
8. జానపద గేయరామాయణము
9. జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం
10. సాహిత్యసుధ[3]
11. సాహిత్యానుశీలన[4]
12. ఉన్నవ లక్ష్మీనారాయణ సాహిత్యజీవితం
13. సాహిత్యోపన్యాసములు
14. భాషావ్యాసాలు
15. తెలుగు నాటకం – ఆరంభం నుంచి అబ్సర్డు నాటకాలదాకా
16. విశ్వనాథవారి వేయిపడగలు – విశ్లేషణాత్మక విమర్శ
17. విశ్వనాథవారి నాటకాలు – విశ్లేషణ
18. సుహాసినీహాసం (నవల)
19. వేమన భావన
20. సిద్ధేంద్రయోగి
21. పురంధరదాసు
22. నాగార్జునుడు
23. ఎఱ్ఱన రసపోషణ
24. తిక్కన భారతం శాంతిపర్వం ద్వితీయాశ్వాసం వ్యాఖ్యానం
25. Literature of Asian Studies
26. అన్నమాచార్య సంకీర్తన సుధ
27. రాజరాజప్రశస్తి (నవల)
28. ఆత్మార్పణం (నవల)
29. పదకవితాపితామహుడు (నాటకం)
30. దివ్యదీపావళి (నాటకం)
31. దేశం బాగుపడాలంటే (నాటకం)
32. బాలగేయాలు
33. తీరిన భయం (కథలసంపుటి)
34. నవోదయం (కవిత్వం)
35. రెండు గులాబీలు (కవిత్వం)
36. అంతరంగతరంగాలు (కవిత్వం)
37. పగటివేషాలు
38. శ్రీకృష్ణస్తోత్రత్రయము
39. ప్రసంగసాహితి
పురస్కారాలు సత్కారాలు
• 1972 – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
• 1981 – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
• 1983-85 – కేంద్రప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ ఫెలోషిప్
• 1984 – విశ్వనాథ సాహిత్యపీఠం అవార్డు
• 1991 – యు.జి.సి. జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు
• 1992 – ఆం.ప్ర.ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు
• 1992 – తెలుగు విశ్వవిద్యాలయం తిక్కవరపు రామిరెడ్డి స్మారక ధర్మనిధి పురస్కారం
• 1993 – తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ పరిశోధన పురస్కారం
• 2013 – హంస (కళారత్న) పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[5]
44-‘’తెలుగు కాకి ‘’బిరుదాంకితుడు ,ఉత్తమ ఉపాధ్యాయుడు ,బహుప్రక్రియా రచయిత,ప్రజా కవి –శ్రీ కోగిర జయసీతారాం
గిర జయసీతారాం (నవంబర్ 14, 1924 – అక్టోబర్ 9, 2000) [1] అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 8వ తరగతి వరకు చదివాడు. కోనపురం, నడింపల్లె, బొంతలపల్లె, కోగిర, రామగిరి మొదలైన ప్రాంతాలలో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడిగా, ఏకోపాధ్యాయుడిగా 1949 – 85 మధ్యకాలంలో పనిచేశాడు.[2] ఆ పల్లెలలో పేద ప్రజల నడుమ నిత్యము కలిసిమెలిసి తిరుగుతూ ఆ ప్రజాజీవితాన్ని,భాషను, ఆచార వ్యవహారాలను, వారి జీవితానుభవాలను పూర్తిగా తన రక్తంలో జీర్ణించుకుని వారికోసం వారి భాష, పలుకుబడులతో కవిత్వం అల్లి ప్రజాకవిగా నిలిచాడు.
జీవిత విశేషాలు
“తెలుగు సాహిత్యంలో కవికోకిల, కవి వృషభ, కవి సింహ, కవికిశోర మొదలైన బిరుదులు కలవారే ఎక్కువ మంది ఉన్నారు. కవికాకి బిరుదు ఎవరికీ ఉన్నట్లు లేదు. మీకు ఇస్తున్నాం. స్వీకరించగలరా?” అని ఒక నిండు సభలో ఆ సభాధ్యక్షుడు ఇతడిని ప్రశ్నించగా ఈయన నిస్సంకోచంగా ముందుకు వచ్చి “కాకి ప్రజల పక్షి. నిత్యము వాళ్ళను మేల్కొపుతూ వుంటుంది. నేనూ అటువంటి వాడినే. నాకు ఆ బిరుదు తగినదే” అని సభలో పలికి గౌరవాగౌరవాలను సమాన స్థాయిలో స్వీకరించిన సుకవి ఇతడు. అనంతపురం మాండలికాన్ని ఇతడు తన రచనలలో అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. 1983లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇతడిని ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇచ్చి సత్కరించింది. 1984-85 సంవత్సరానికి రెండవ తరగతి తెలుగువాచకాన్ని అందించాడు. ఇతడు చెయ్యి తిరిగిన రచయితే కాకుండా తబలా, హార్మోనియంలు వాయించడంలో దిట్ట. మంచి చిత్రకారుడు కూడా. ఇతడు 2000, అక్టోబరు 9 తేదీన చనిపోయాడు.
రచనలు[మార్చు]
1. నిట్టూర్పులు (పద్యకావ్యం)
2. విజయప్రభ (బుఱ్ఱకథ)
3. సుగుణా శతకము (400 పద్యాలు)
4. మదాంధబరాతము (వ్యంగ్య రచన)
5. అరణ్యరోదనము (సీసపద్యాలు)
6. కావ్ కావ్ శతకము
7. కాకిగోల (గేయాలు)
8. పండువెన్నెల (పిల్లల పాటలు)
9. జయభారతి (బుడబుక్కల కథ)
10. కృష్ణార్జున యుద్ధము (నాటకము)
11. రామాంజనేయ యుద్ధము (నాటకము)
12. సీతారామ కళ్యాణము (నాటకము)
13. మేం పిల్లలం (150 బాలగేయాల సంకలనం)
14. అక్షరసైన్యం
15. జైసీతారాం సీసాలు
రచనల నుండి మచ్చుతునకలు
ఆడ బెయ్యెదెవ్‌రు? ఆదిగా – “యాలవా”
“అగ్గిపెట్టె వుంద అనుముగా; నితావ?”
“వూను వుందితాలు నేనంటిత్త”
—- —- —-
“కప్కొనేకి యేడ్డి కప్పడమూ లేదు
దుప్టి గొందమంటె దుడ్లు లేవు
తొలుపుల్యాక వాకిలికి తడకడ్డం బెట్కోని
యేటి బతుకో యేమొ యల్ల కాల్ము”
“-యంగటమ్మా! లేత్వ, యింగా లేదా”
“ఏం, లేశ్ననత్తా! యెసురెంత బెట్టల్ల”
“రొండు జెమ్లు బెట్టు; పిండి వుందొ”
“యాడిదిప్‌డు రాగులిసురల్ల; యెసర్లోకి”
“సందకాడ వురికె సత్తారంద్రు….”
(సలిమంటలు అనే కవిత నుండి)
అక్కా! పెట్టు
చుక్కా బొట్టు!
అవ్వా! నాకు
బువ్వా పెట్టు!
అమ్మా! నాకు
బొమ్మా ఇవ్వు!
నాన్నా! నాకు
పెన్నూ ఇవ్వు!
(మేం పిల్లలం పిల్లల గేయసంపుటి నుండి)
45-విద్వాంసులకు విద్వాంసుడు ,ఆంధ్రప్రభ సంపాదకుడు ,కదా సరిత్సాగర అనువాదకుడు ,పెన్నేటిపాట ఫేం –శ్రీ విద్వాన్ విశ్వం
విద్వాన్ విశ్వం, (1915 అక్టోబర్ 21 – అక్టోబర్ 19 1987 గా చిరపరచితుడైన మీసరగండ విశ్వరూపాచారి విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక “ఆంధ్రప్రభ” నడిపించిన సంపాదకుడు విశ్వం .
జీవిత చరిత్ర
బాల్యం, విద్యాభ్యాసం
1915, అక్టోబరు 21న అనంతపురం జిల్లాలో తరిమెల గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి మీసరగండ మునిరామాచార్యులు. విశ్వం చిన్నతనంలో స్వగ్రామంలోని రామాయణం శంకరశాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. సంప్రదాయ పద్ధతిలో కర్నూలు,ప్రొద్దుటూరు లలో సంస్కృత కావ్య నాటకాలంకారాలను, తర్కశాస్త్రాన్ని ఆభ్యసించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలోనూ, ఆంధ్రంలోనూ విద్వాన్ పట్టాపుచ్చుకున్నాడు. అనంతపురంలో చిలుకూరు నారాయణరావు వద్ద శిష్యరికం చేశాడు. కాశీ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తూ అనారోగ్యం వలన పూర్తి చేయలేకపోయాడు.
రాజకీయరంగం
బెనారస్ నుండి అనంతపురం తిరిగిరాగానే తరిమెల నాగిరెడ్డితో కలిసి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు.ప్రజలను చైతన్యపరచటానికి గ్రంథ ప్రచురణ అవసరమని భావించి నవ్యసాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ఏర్పాటు చేసి నవ్యసాహితి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఫాసిజం మొదలైన అంశాలపై పుస్తకాలను ప్రచురించాడు. దానితో బ్రిటీషు ప్రభుత్వం రాజద్రోహం క్రింద తరిమెల నాగిరెడ్డిని, విద్వాన్ విశాన్ని అరెస్టు చేసి మొదట బళ్ళారిలోని అల్లీపూర్ జైల్లోనూ ఆ తర్వాత తిరుచిరాపల్లి జైలు లోనూ నిర్భందించింది. తిరుచిరాపల్లి జైలులో విశ్వం బెజవాడ గోపాలరెడ్డి వద్ద బెంగాలీ నేర్చుకున్నాడు. ఈ జైలులో రాజాజీ, టంగుటూరి ప్రకాశం వంటి నాయకుల సాహచర్యం లభించింది.ఇతను అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, రాయలసీమ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా, అనంతపురం జిల్లా జాతీయసభకు, జిల్లా లోకజనసంఘానికి, మండల క్షామనివారణ సభకు, జిల్లా ఆంధ్రమహాసభకు ప్రధాన కార్యదర్శిగా, జిల్లా రైతు మహాసభకు ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు.
పత్రికారంగం
ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాకుండా మరింత లోతుగా రాజకీయాలు శాస్త్రపద్ధతిలో వివరించడానికి పత్రికారంగం వైపు దృష్టి సారించాడు. అడవి బాపిరాజు ఆహ్వానించడంతో మీజాన్ పత్రికలో 1945లో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరి కొంతకాలం పనిచేశాడు. తరువాత విజయవాడలో ప్రజాశక్తి దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా సుమారు మూడు సంవత్సరాలు పనిచేశాడు. “మీజాన్” పత్రికలో రచనావ్యాసంగం, “ప్రజాశక్తి”లో సంపాదకత్వం పాండితీభాషలోనే సులభశైలిని సాధించగలిగినా, పరిపాలనాయంత్రాంగపు నిర్బంధాలకు గురయ్యాడు. తర్వాత మద్రాసుకు తరలివెళ్ళి అక్కడ బాలభారత్ విద్యాలయంలో సంపాదకుడిగా కొన్నాళ్ళు పనిచేశాడు. 1952 ఆగష్టు 15న ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక ప్రారంభమైనపుడు దానిలో ఎడిటర్ ఇన్‌చార్జ్‌గా చేరి 1959 వరకు పనిచేశాడు. 1959లో ఆంధ్రపత్రిక దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేసి 1960లో విజయవాడకు వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశాడు. మళ్ళీ 1963లో ఆంధ్రప్రభ దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్ చేరాడు. 1967లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకుడిగా మారాడు. ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో పదవీవిరమణ చేసిన తరువాత 1981నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. ఈ సమయంలో విశ్వం కథాసరిత్సాగరాన్ని 12 సంపుటాలుగా తెనుగించాడు. “చందమామ”లో ద్విపద కావ్యం రూపంలో వ్రాసిన పంచతంత్ర కథలను బాపు బొమ్మలతో తి.తి.దే.ప్రచురణగా వెలువరించాడు. బ్రహ్మసూత్రాలు శంకరభాష్యం నాలుగు సంపుటాలను, అధర్వణ వేదాన్ని అనువాదం చేసి ప్రచురించాడు. 1987 అక్టోబర్ 19వతేదీ తనువు చాలించాడు.
రచనలు
• విరికన్నె (కావ్యం)
• ఆత్మసాక్షి (కవిత్వం)
• ప్రేమించేను (నవల)
• పెన్నేటిపాట (కావ్యం)
• ఒకనాడు (కావ్యం)
• నాహృదయం (కావ్యం)
• పాపం
• రాతలూ గీతలూ
• సమీక్ష
• లెనిన్
• స్టాలిన్
• స్వతంత్రం
• మహాశిల్పి
• మహాసంకల్పం
• అదీ రష్యా
• స్వతంత్రం ఏం చేయటం
• ఫాసిజం దాని ధ్వంసం
• రష్యా యుద్ధకవులు
• రానున్న సంక్షోభం
• సత్యభామ
• ప్రథమ ప్రేమ
• ధర్మదుర్గం
• పొద్దుతిరిగింది
• స్వస్తిశ్రీ
• కచదేవయాని
• ద్వేషం
• దురాక్రమణ
• ఇరాన్
• ఇండియా
• ఇండోనేషియా
• వియత్నాం
• నీడలు – జాడలు
• విక్రమోర్వశీయము (రేడియో నాటకము)
• నాగానందము (రేడియో నాటకము)
• యుద్ధం మాకొద్దు (రేడియో నాటకము)
• ఏమి చెయ్యడం?
• మాణిక్యవీణ
అనువాదాలు
• కథాసరిత్సాగరం కథాలహరిని 12 సంపుటాల్లో ఆంధ్రీకరణం చేశారు.
• కాదంబరి (బాణుడు)
• కిరాతార్జునీయం (భారవి)
• దశకుమారచరిత్ర (దండి)
• మేఘసందేశం (కాళిదాసు)
• రఘువంశము (కాళిదాసు)
• కుమార సంభవము (కాళిదాసు)
• శిశుపాలవధ (మాఘుడు)
• రాజతరంగిణి (కల్హణుడు)
• మానవుడు (రోమారోలా నవల)
• నేటి భారతదేశం (రజనీ పామీదత్)
• ఫాసిజం
• భూమి (ఓప్లే హార్డీ నవల)
• వీడ్కోలు
• కర్ణకుంతి
• సతి
• ముక్తకములు
• చేకోవ్ కథలు
• గోర్కీ కథలు
• శిశు హృదయము
• శిశు రహస్యము
• యుద్ధానంతర ఆర్థిక పరిణామాలు
• బిల్హణీయము
• తెలుగు అధర్వ వేదసంహిత[1]
• పూలచెట్లు[2]
• రష్యా యుద్ధకథలు
• పేదరాలు (కథాసంకలనం)
• విలాసిని (కథల సంపుటి)
• ప్రజావిరోధి (నాటకము)
నిర్వహించిన శీర్షికలు
• విశ్వభావన – శ్రీసాధన పత్రిక 1938-1939
• తెలుపు-నలుపు – ఆంధ్రప్రభ వారపత్రిక 1952-1959
• అవీ-ఇవీ – ఆంధ్రపత్రిక దినపత్రిక 1958-1959
• ఇవ్వాళ – ఆంధ్రజ్యోతి దినపత్రిక 1960-1962
• టీకా-టిప్పణి – ఆంధ్రజ్యోతి దినపత్రిక
• మాణిక్యవీణ – ఆంధ్రప్రభ దినపత్రిక 1962-1966, ఆంధ్రప్రభ వారపత్రిక 1967-1987
మచ్చుతునక
14-9-1948న ఒడ్డు గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే భూస్వామిని చంపారన్న అభియోగం పై 17మందికి నిజాం ప్రభుత్వం 19-07-1950న ఉరిశిక్ష విధించింది. ఈ ఉదంతం పత్రికలలో చదివి ఒక ఐరిష్ కవి స్పందించి వ్రాసిన కవితకు తెలుగు అనువాదం ఇది. జనవాణి దినపత్రిక 1951 ఏప్రిల్ 24 సంచికలో ప్రచురింపబడింది.[3]
ఉరికంబం కదులుతోంది
స్వచ్చ రవికిరణ కాంతితో
స్వయం వ్యక్తిత్వంతో
జ్వలించవలసిన జీవితం
కాలుష్యాచ్ఛన్నమై మసకబారిపోయింది.
………….
పదిహేడుగురు తల్లులు
కదలకుండా కిటికీల వద్ద నిల్చొని
కంటనీరు పెడ్తున్నారు
కాళరాత్రి తెలంగాణాలో
కటిక చీకటిని పూసింది
…………..
నవయుగ నాందీగీతం
నగారా మోగిస్తోంది
నేడో రేపో వినితీరాలి
నేడే వినడం మంచిది
…………..
నరలోకపు గుండెల్లో
చిరచిరలాడుతోంది బాధ
ఉరికంబం కదులుతోంది
ఉచ్చు గాలికెగురుతోంది
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-28-9-22-ఉయ్యూరు