మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -15

• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -15
• 46-శ్రీశైల ప్రభ సంపాదకుడు ,తెలుగు గైడ్స్ తోపాటు ,నీతినవనీతం ,శ్రీశైల చరిత్రాది కర్త –రాయలసీమకవి బిరుదాంకితుడు –శ్రీ నూతలపాటి పేరరాజు
• నూతలపాటి పేరరాజు ప్రఖ్యాత రచయిత. సాహిత్యసరస్వతి, విద్యార్ణవ మొదలైన బిరుదులు ఇతనికి ఉన్నాయి. ప్రకాశం జిల్లా (అప్పటి గుంటూరు జిల్లా), నూతలపాడు గ్రామంలో 1896లో సీతమ్మ, ఆదిరాజు దంపతులకు జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం నూతలపాడులో నడిచింది. ఇతడు పెక్కు సంవత్సరాలు ఆంధ్రభాషోపాధ్యాయుడిగా అనంతపురం జిల్లా ఉరవకొండలో పనిచేసి అక్కడే స్థిరపడిపోయాడు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాయలసీమ ప్రాంతంలో జీవించడం వల్ల ఇతడు రాయలసీమ కవిగా వాసికెక్కాడు. ఇతడు అనేక గ్రంథాలు రచించాడు. ఆనాటి స్కూల్ ఫైనల్ విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాలను అరటిపండు వొలిచి చేతికిచ్చినట్లుగా సులభ పద్ధతిలో నోట్సులు తయారుచేసి ముద్రించాడు. ఇతడు శ్రీశైలప్రభ, శిశువిద్య, ఆరాధన పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు 1968, నవంబర్ 15న తనువు చాలించాడు[1].
రచనలు
1. భక్త అక్క మహాదేవి
2. భక్తమల్లమ్మ
3. హంపీ[2]
4. శ్రీశైలచరిత్ర
5. విజయనగర చరిత్రము[3]
6. తులసీ రామాయణం
7. ఆనంద రామాయణం
8. రామకథామృతము
9. వైదర్భీ విలాసము
10. శ్రీ సాయిబాబా చరిత్ర
11. శాంతి విజయము
12. తుళసీదళము
13. శ్రీ కృష్ణనిర్యాణము (అముద్రితం)
14. నీతినవనీతము
47-తెలుగు సంస్థానాలు హరికధా సర్వస్వం ,ఆకాశ వాని భాశషితాలు ,భారత శబ్ద రత్నాకరం కర్త తెలుగు విశ్వవిద్యాలయం తొలికులపతి,డిలిట్ –ఆచార్య తూమాటి దోణప్ప
ఆచార్య తూమాటి దోణప్ప (జూలై 1, 1926 – సెప్టెంబర్ 6, 1996) ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి (పూర్వ). కళా సాహిత్య, సంస్కృతీ విద్యా రంగాలలో గొప్ప కృషీ వలుడు.
బాల్యం, విద్యాభ్యాసం
దోణప్ప అనంతపురం జిల్లా రాకెట్లలో సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు ఎనిమిదవ సంతానంగా 1926, జూలై 1వ తేదీ జన్మించాడు. ఇతడి మొదటి పేరు దోణతిమ్మారాయ చౌదరి. తాతగారైన తూమాటి భీమప్ప వద్ద చిన్ననాటనే మాఘం తప్ప మిగిలిన సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలు చదివాడు. నంజయ్య వద్ద గురుబాల ప్రబోధిక చదివాడు. భాగవత ప్రవచనం చేశాడు. వజ్రకరూరులోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో 1939-42సం||ల కాలంలో ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివాడు.1942-46 సం. ల మధ్య కాలంలో ఉరవకొండలోని కరిబసవ స్వామి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో చదివాడు. ఈ సమయంలో నూతలపాటి పేరరాజు అనే తెలుగుపండితుడు ఇతనికి గురువుగా ఉండేవాడు. అతడి నుండి ఆశుకవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. 1948లో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాడు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు, కారెంపూడి రాజమన్నారు, మిక్కిలినేని వేంకటేశ్వరరావు, చిలుకూరి నారాయణరావు మొదలైనవారు ఇతని గురువులు.1949-52సం.ల మధ్య ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బి.ఎ. ఆనర్స్ చదివాడు. అక్కడ గంటి జోగి సోమయాజి, దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, కాకర్ల వెంకటరామ నరసింహం, భద్రిరాజు కృష్ణమూర్తి, ఓరుగంటి రామచంద్రయ్య, మధుసూదన షడంగి, వజ్ఝల చినసీతారామస్వామి మొదలైన హేమాహేమీలు ఇతని గురువులుగా ఉండేవారు. 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.ఆనర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని సాధించాడు. ఆ సమయంలో ఇతనికి అనకాపల్లి కళాశాల వారు మొట్టమొదటే ఆంధ్రశాఖ అధ్యక్షపదవి ఇస్తామని ఆహ్వానించారు. గుడివాడ కళాశాల వారు కూడా ఆహ్వానించారు. కాని ఇతడు ఈ రెండు అవకాశాలను కాదని గంటి జోగి సోమయాజివద్ద పరిశోధక విద్యార్థిగా చేరి “తెలుగులో వైకృతపదాలు” అనే అంశంపై పరిశోధించి 1966లో పి.హెచ్.డి సంపాదించాడు.
ఉద్యోగం
1957లో “తెలుగు వ్యుత్పత్తి పదకోశం” నిర్మాణ ప్రాజెక్టులో ముఖ్యసహాయకుడిగా చేరి 1961 వరకు పనిచేశాడు.1958లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడిగా చేరాడు.1970లో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు.1976లో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు. 1970-76లో “తెలుగు వ్యుత్పత్తి పదకోశం” ప్రాజెక్టు ముఖ్యసంపాదకుడిగా ఉన్నాడు.1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిష్ట్రారుగా, 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాలాధ్యక్షుడిగా వ్యవహరించాడు.1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా, అంతర్జాతీయ తెలుగు సంస్థ డైరెక్టరుగా నియుక్తుడయ్యాడు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించబడ్డాడు. ఇతడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో అకడమిక్ బోర్డు సభ్యుడిగా, సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు.
నాటకాలు
తూమాటి దోణప్ప విద్యార్థిదశలో నాటకాలలో నటించి రాణించాడు. చింతామణి నాటకంలో ‘చిత్ర’ పాత్రధారిగా, ‘సుభద్రా పరిణయం’లో సుభద్ర పాత్రను, ‘మోహినీరుక్మాంగద’లో రుక్మాంగద పాత్రను ధరించి అనేక పతకాలను పొందాడు. పుట్టపర్తి సత్యసాయిబాబా పూర్వాశ్రమంలో రత్నాకరం సత్యనారాయణరాజు స్త్రీ పాత్రలు ధరించగా అతనితో కలిసి ఇతడు భర్తగా, మామగా అనేక నాటకాలలో పాత్రధారణ చేశాడు.సాయిలీల అనే నాటకంలో దోణప్ప ఒకసారి సాయిబాబాగా, ఒకసారి శిష్యుడిగా, మరోసారి మహావిష్ణువుగా నటించాడు.
రచనలు
ఇతని సాహిత్య రచనా వ్యాసంగం హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో చదివేరోజుల్లోనే ఆరంభమయింది. ఎనిమిదో తరగతి చదివేటప్పుడు చిత్రగుప్తలో ఇతని చంద్రుడు-కలువ అనే మొట్టమొదటి కథ అచ్చయింది. హైస్కూలులో చదివే సమయంలోనే ఇతడు వినోదిని, రూపవాణి, ఆనందవాణి, ఢంకా, సూర్యప్రభ, ప్రజాబంధు మొదలైన పత్రికలలో పద్యాలు, గేయాలు, వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా ప్రకటించాడు. దత్తమండల కళాశాలలో చదివేరోజులలో ఇతడు పద్యరచనలో, వ్యాసరచనలో ఎన్నో ప్రథమబహుమానాలు పొందాడు. “బైబిలు-ఖురాను-భగవద్గీత” అనే అంశంపై వ్యాసరచనచేసి మీనాక్షీసుందరాంబా స్మారక బహుమానాన్ని పొందాడు. 1949 మే, జూన్ మాసాల్లో ఆంధ్రప్రభ దినపత్రికలో మాండలిక పదవ్యాసాలను ప్రకటించాడు.వాల్తేరులో చదివేరోజుల్లో గేయ పద్య ఏకాంకికా రచనలు ఎన్నో చేశాడు. ఏకాంకికరచనల పోటీలో ఇతని ‘ఆదర్శశిఖరాలు’ మొదటి బహుమతి పొందింది. ఈ ఏకాంకిక జయశ్రీ పత్రికలో అచ్చయింది. శ్రీశ్రీ దేశచరిత్రలకు పేరడీగా హాస్టలుచరిత్ర వ్రాస్తే దానిని ఆనాటి విశ్వవిద్యాలయ కులపతి అనేక సార్లు చదివించుకుని ఆనందించాడు.
ప్రకటించిన గ్రంథాలు
1. ఆంధ్ర సంస్థానములు – సాహిత్య పోషణము
2. భాషాచారిత్రక వ్యాసావళి
3. తెలుగులో కొత్తవెలుగులు
4. జానపద కళాసంపద
5. తెలుగు హరికథాసర్వస్వము
6. తెలుగులో చేరిన ఇండో-ఆర్యన్ పదాలు
7. దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట
8. మన కళాప్రపూర్ణుల కవితారేఖలు
9. ఆకాశవాణి భాషితాలు
10. తెలుగు వ్యాకరణ వ్యాసాలు
11. ఆంధ్రుల అసలు కథ
12. బాలల శబ్ద రత్నాకరం
13. తెలుగు మాండలిక శబ్దకోశం
పురస్కారాలు
• 1965,1966లో వరుసగా ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి రఘుపతి వేంకటరత్నం నాయుడు స్వర్ణపతకాలు.
• తెలుగు హరికథాసర్వస్వము అనే గ్రంథానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి డి.లిట్.
• 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
• ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమానాలు మూడుసార్లు
48-ఆదర్శ రచయిత,కంకాళరాత్రి కర్త సాంస్కృతిక శాఖ ప్రత్యేకాధికారి –శ్రీ అంతటి నరసింహం
అంతటి నరసింహం సంఘ సంస్కరణాభిలాష కలిగిన రచయిత[1].
జీవిత విశేషాలు
ఇతడు 1925లో కడప జిల్లా, చిట్వేలు మండలం, వెంకట్రాజులపల్లెలో సుబ్బమ్మ, చెంచలయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు 1939-40లలో మిడిల్ స్కూలు ముగించుకుని 1943లో యస్.యస్.ఎల్.సి. ఉత్తీర్ణుడయ్యాడు. అనంతపురం దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్ ముగించి, 1949లో వాల్తేరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. ఆనర్సు పాస్ అయ్యాడు. 1974లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి “ప్రబంధాలలో ప్రకృతి వర్ణన” అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. 1946 నుండి 1976ల మధ్య అనేక ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. వాటిలో తను చదివిన దత్తమండల కళాశాల కూడా ఉంది. 1976 నుండి కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేకాధికారిగా పనిచేశాడు. 2010లో మరణించారు.
రచనలు
ఇతడు గేయకావ్యాలు, సాంఘిక నవలలు, చారిత్రక నవలలు, పిల్లల నవలలు, నాటకాలు ఎన్నో వ్రాశాడు. వాటిలో అముద్రిత రచనలు ఎక్కువగా ఉన్నాయి.
కావ్యాలు
1. కంకాళ రాత్రి (పద్యకావ్యం)
2. ఇప్పుడే[2] (వచన కవితా సంపుటం)
సాంఘిక నవలలు
1. ఆదర్శం[3]
2. భావం
3. లేడీ లెక్చరర్ స్వగతం
4. ప్రేమభిక్ష
5. శోభాదేవి
6. శంపాలత
7. చీకట్లో కాంతిరేఖలు
నాటికలు, నాటకాలు
1. సహజీవనం
2. సామరస్యం[4]
3. మానవత్వం
4. పరిష్కారం
చారిత్రాత్మిక నవలలు
1. రామరాయలు
2. భువనవిజయం
బాలల నవలలు
1. కోటవీరన్న సాహసం
2. ఉదయగిరి పోలన్న ధైర్యం
3. మంత్రాల రామన్న మొండితనం
4. కవిగారి బాల్యం మొదలైనవి.
ఆదర్శ రచయిత
ఇతడు కేవలము తను నమ్మిన ఆదర్శాలను రచనలకే పరిమితం చేయక వాటిని స్వయంగా చిత్తశుద్ధితో ఆచరించాడు. కులవ్యవస్థను రూపుమాపుతూ, స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ, వరకట్నం నిషేధిస్తూ ఇతడు కులాంతర వివాహంగా ఒక చదువుకున్న అమ్మాయిని కట్నం లేకుండా వివాహమాడాడు. జీవితాంతం కాఫీ, టీ, సిగరెట్ ముట్టక ఆదర్శవంతంగా జీవించాడు. ” నా నవలలు చదివి పాఠకులు మెచ్చుకుంటే నాకంత ఉత్సాహం ఉండదు. దానిలో చెప్పినట్లు ఆచరిస్తే నాకానందం కలుగుతుంది. దీనివల్ల వారికి, దేశానికి, అసలు మానవజాతికి అభ్యుదయం కలుగుతుంది” అని తన మనసులోని మాటను ఒక సందర్భంలో వెల్లడించాడు.
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.