హాస్యానందం
34-ఛలోక్తి
ముట్నూరు కృష్ణారావు గారి మనుమరాలు చిట్టెమ్మ యూరప్ అంతా తిరిగొచ్చింది.సరస౦ తెలిసిన చదువుకొన్న ఇల్లాలు .తాతగారిని చూడటానికి వచ్చి ‘’తాతాగారూ ఊరంతా గాడిదలేకనిపిస్తున్నాయి ?’’అనగా పంతులుగారు ‘’అవును చిట్టీ .అవి చాలనట్టు ఆ గాడిదల్ని చూడటానికి అప్పుడప్పుడు పొరుగూరి గాడిదలూ వస్తూంటాయి ‘’అన్నారు చిట్టెమ్మా నవ్వింది ఆయనతోపాటు .’’ఒకాయన డాక్టర్ దగ్గరకు వెడితే చాలామంది ఉండటం వలన డాక్టర్ ఈయన్ను చూడటానికి రావటానికి ఎక్కువ సేపు అయింది .డాక్టర్ ‘’పాపం చాలాసేపు వెయిట్ చేసినట్లున్నారు ‘’అనగా మనాయన ‘’ఎంతసేపైతేనేం డాక్టర్ .రోగం ముదరకముందే చికిత్స చేస్తారనే ఆశతోవచ్చాను ‘’అనగా ఆడాక్టర్ ముఖాన నెత్తురు చుక్కలేదు .
బందరు-గుంటూరు రైలు చాలా నిదానంగా నడిచేది.మంగళగిరి వద్ద ఒక అవ్వ పొలాల్లో అడ్డంగా నడుస్తుంటే జాలిపడ్డ గార్డ్ ‘’అవ్వా నడవలేవుకాని బండీ ఎక్కు గుంటూరులో దిగబెడతాను ‘’అనగా ఆమె ‘’నూరేళ్ళు బతుకు నాయనా .ఇవాళ కోర్టులో వాయిదా ఉంది .బండీ ఎక్కలేను ఎక్కితే ఆపని కి అందుకోలేను ఏమీ అనుకోకు మనవడా ‘’అంది .మరో ఛలోక్తి .గార్డు ఒకముసలమ్మతో ‘’ఈపిల్లాడికి అరటిక్కెట్టే తీశావేమిటి ? నిండు టికెట్ కొనకుండా ‘’అనగా ‘’నిజమేనయ్యా బెజవాడలో ఎక్కినప్పుడు వీడికి నిండు టికెట్టు తీసుకొనే వయసు రాలేదబ్బయ్యా ‘’అని రైలు నత్తనడకపై చాచి కొట్టింది .
ఒకావిడ బ్రష్ తో నగలు కడుగుతుంటే వెనగ్గా వచ్చినావిడ బ్రస్ష్ లాక్కొని’’ వదినా !పందివా?మనిషివనుకొన్నా ‘’అన్నది .’’అవునమ్మా పందివే ‘’అన్నది. ఆవిడ ఆబ్రష్ వెంట్రుకలు మనిషివా పందివా అని చలోక్తిగా అంటే ఈవిడ దాన్ని తిప్పి నువ్వు పందివే ‘’అనే అర్ధంలాగి చలోక్తితో కొట్టింది .
ఒక పిచ్చాసుపత్రి సూపరింటే౦ డెంట్ బదిలీ అవుతుంటే సభ జరిపి ఒకాయనను మాట్లాడమంటే ‘’ఈయన నిగర్వి .మాలో ఒకడుగా మెలిగాడు ‘’అనేసరికి అందరూ భళ్ళున గొల్లు మన్నారు .పార్వతీ పురంలో నడిమింటి మంగళేశ్వర శాస్త్రి గారు ఉద్దండ పండితులు .బొబ్బిలి రాజుగారికి మహా మిత్రుడు.ఒకసారి రాజు ఆయన్ను ‘’మనం ప్రయాణమై పోతున్నప్పుడు నక్క ఎదురైతే మంచిది అంటారు అయితే నాకో డౌటు ఎడమ వేపునుంచి కుడివైపుకు వెడితేనా ,కుడినుంచి ఎడమకు వెడితేనా ?అన్నారు ‘’కరవకుండా ఎటు పోయినా ఇబ్బంది లేదు మారాజా ‘’అన్నారు శాస్త్రిజీ .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-9-22-ఉయ్యూరు