మనకు తెలియని మహాత్ముని కబుర్లు -3
శ్రీ ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య గారు ‘’నేనెరిగిన గాంధి ‘’లో విషయాలు తెలుసుకొంటున్నాం మనం .1916నాటి ఉదంతాన్ని ఆయన మాటలలోనే ‘’1916లో దక్షిణ భారత హిందీ ప్రచార సమితి రజతోత్సవాల సందర్భంగా గాంధీజీ ఆంధ్రదేశం లో చివరి సారిగా పర్యటించారు .జనవరి 20వ తేదీ ఉదయం 10-30 గం లకు గాంధీ పరివారపు స్పెషల్ ట్రైన్ వాల్తేరు చేరింది .నేను వాల్తేరునుంచి మద్రాస్ వరకు ఆయనతో ప్రయాణం చేశాను .వాల్తేరు స్టేషన్ దగ్గర బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది .అక్కడే గాంధీ మొదటిసారిగా ప్రసంగించారు .అసంఖ్యాకం గా ఉన్న జన సమూహం నుంచి కొద్దిగా గల్లంతు బయల్దేరేసరికి గాంధీజీ కొంచెం తీవ్రంగా ‘’క్రమశిక్షణ అవసరం. లక్షలాది జనం వచ్చినచోట కూడామనం మహాసభలను ప్రశాంతంగా జరుపు కోలేకపోతే ,స్వరాజ్యానికి అర్హులమే కాజాలం .ఒక వేళ స్వరాజ్యం వచ్చినా ,నిలుపుకోలేము ‘’అని హెచ్చరించారు .అంతటితో మంత్రద్రష్టంగా సభఒక్క సారి నిశ్శబ్దమై పోయింది .అందుకు బాపూజీ ప్రజలను అభినందించారు .ఆయనమాట్లడుతూ ‘’స్వతంత్ర్య భారత దేశం లో ప్రతిభారతీయుడూ హిందూ స్తానీ నేర్చుకోవాలి .ఆంధ్రదేశం లో హిందీ బాగా ప్రచారం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది .’’అన్నారు .
వాల్తేరు నుంచి మద్రాస్ చేరేలోపు ప్రతి చోటా వేలకు వేలు జనం గాంధీ దర్శనార్ధం వచ్చారు .రైతులు ,కూలీలు ఎక్కడి పనులు అక్కడ వదిలేసి పరిగెత్తుకొని వచ్చి ఆయన్ను దర్శించి తన్మయం చెందిన దృశ్యాలను నేను మరవలేదు .మహాత్ముని ముఖ దర్శనం కాగానే ఆ అమాయక ప్రజలముఖాలలో అనుభూతి ,దివ్య వికాసం ,ఆనందం ,కళ్ళల్లో కలిగిన తృప్తి ,కారుతున్న ఆనంద బాష్పాలు నాకు అమితాశ్చర్యం కలిగించాయి. చేతులెత్తి మొక్కటం, వేడుకోవటం , సాస్టాంగపడటం చూస్తె ,అది ‘’మూఢ భక్తేమో ‘’అనిపించింది .పుణ్య క్షేత్రాలు దర్శింఛి నప్పుడు, భగవత్ ఉత్సవాలలో ,ఊరేగింపులలో కలిగే తన్మయత్వం మహాత్ముని చూస్తె కలగటం నేను చూసి పరవశం చెందాను .ఆయన దర్శనం ఒక్క క్షణకాలమే అయినా వారు పొందిన తన్మయత్వం ,ఆత్మ పురోగతిమార్గం లో వారిని ఒక మెట్టు పైకి ఎక్కి౦చి౦దని నానమ్మకం . గాంధీజీ సంక్షంలో గడిపే వారు ఎపుడైనా ఆఅయకులు పొందిన అనుభూతి పొందారా అని నా అనుమానం .
గాంధీజీ పరివారం భోజన విశ్రా౦తులకు సింహాద్రిపురంలో రైలు సుమారు 3గంటలు ఆగింది .అప్పుడే అక్కడికి ఒక మిలిటరీ స్పెషల్ వచ్చింది .అందులోని సైనికులంతా పరుగుపరుగునవచ్చి మహాత్ముని దర్శనం చేసుకొన్నారు .కనిపించిన ప్రతి మనిషిని హరిజన నిధికి డబ్బు ఇవ్వమని గాంధీ తన అక్షయ హస్తం చాచారు .సైనికులనూ అలాగే అడిగితె వాళ్ళు చేతిలో ఏమీ రాల్చకుండా కోయ్యబోమ్మల్లా నుంచుంటే ‘’మీరేనా దేశాన్ని,ప్రజల్నీ రక్షించేది ?బీదవారికి ఒక్కపైసా కూడా ఇవ్వటానికి సాహసించని మీరు దేశాన్ని ఏం రక్షిస్తారు?హరిజన సేవకు విరాళాలివ్వమని గవర్నర్లనూ వైశ్రాయిల్నీకూడా అర్ధిస్తాను .ఇది రాజ ద్రోహం కాదు ‘’అనేసరికి సైనికులు బారులు తీరి కానుకల వర్షం కురిపించారు .బాపు వాక్కు అమృత వాక్కు కదా !
సహచరులఎడ గాన్దీకున్న గౌరవ ప్రతిపత్తులు తెలియ జేస్తా..ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచార సభాధ్యక్షులు శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు అనారోగ్యం వల్ల గాంధీ దర్శనానికి రాలేక పోయారు .ఆ విషయం బాపూజీతో నేను చెప్పాను .వెంటనే మహాత్ముడు ‘’ఎంత మాట ?వారు నా దగ్గరకు రావాలా ?నేనే వారి వద్దకు వెళ్లి దర్శనం చేసుకోవాలి .కానీ అవకాశం లేకపోతోంది ‘’అని ఎంతో చింతించారు బాపు .కానీ తర్వాత బెజవాడ స్టేషన్ లో దేశభక్తుడు గాంధీని దర్శించగా ,అప్పటికే మౌనవ్రతం మొదలు పెట్టిన ఆయన ఒక కాగితం పై ‘’మనం చాలాకాలం కలిసి పని చేశాం .ఇప్పుడు మీరు బాగా వృద్దులైపోయారు .ఇంతశ్రమ పడి ఎందుకు వచ్చారు?’’అని రాసి వెంకటప్పయ్యగారికిచ్చారు .రైలులోనే వారిద్దరూ నిష్కామ కర్మ ,భగవద్భక్తి పురుష ప్రయత్నం మొదలైనగహన విషయాలపై కాగితాలమీదే రాత పూర్వకంగాచర్చలు జరిపారు .ఆ కాగితం ముక్కలు కొండా వారి దగ్గర ఉన్నాయేమో?
శ్రీ దిగుమర్తి రామస్వామిగారు గొప్ప దేశ భక్తులు ,నిష్కలంకులు వారు గాంధీ దర్శనానికి వస్తే బాపూ వేసిన ప్రశ్నలు –‘’మీ తల్లిగారు క్షేమంగా ఉన్నారా ?ఆమె వృద్ధాప్యంవలన లేవలేని స్థితిలో ఉన్నారని తెలుసుకొన్నాను .అలా జీవించటం దుర్భరం ‘’అంటూ చింతించారు బాపు .’’మీరు 125ఏళ్ళు జీవిస్తారని తెలుసుకొని మా తల్లిగారు చాలాసంతోషించారు ‘’అని రామస్వామిగారు అనగా గాంధీజీ ‘’నేను 125సంవత్సరాలు జీవిస్తానని జోస్యం చెప్పలేదు .ఈ దాసుని సేవ అవసరం అని భగవంతుడు భావిస్తే,మానవ సేవ చేసేందుకు అన్నేళ్ళు బతుకుతాను అన్నాను .అంతే కాని జరాభారంతో క్రుంగి కృశించిపోయి లేవలేని స్థితిలో అన్నేళ్ళు బతకాలనికాదు నా ఉద్దేశ్యం ‘’అన్నారు బాపు .అలాగే వెళ్ళిపోయాడు బాపు ఆఖరిక్షణం వరకు మానవ సేవాకర్యంలోనే నిమగ్నుడై .జగత్పితను ఆరాధించటానికి వేదిక నెక్కబోతుండగా తన భౌతిక శరీరం వదిలేశారు మహాత్ముడు .ఆయన సంకల్ప సిద్ధుడు, స్థిత ప్రజ్ఞుడు ‘’.
గాంధీ జయంతి సందర్భంగా బాపూకొక చిరుకానుకగా
సశేషం
గాంధీ జయంతి శుభా కాంక్షలతో
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-22-ఉయ్యూరు