అమృతోత్సవ సమయం లో స్మరింప తగిన ఇద్దరు మహిళా మాణిక్యాలు (వ్యాసం)- గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్
1.శ్రీమతి పెద్దాడ కామేశ్వరమ్మ :
శ్రీ మతి పెద్దాడ కామేశ్వరమ్మ 15-5-1907 న రాజమండ్రిలో పెద్దాడ సుందర శివరావు ,వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు .భర్త ప్రొఫెసర్ బి .కుప్పుస్వామి.ఉపాధ్యాయురాలుగా పని చేస్తూ ,ఉప్పు సత్యాగ్రహం లోపాల్గొని ,పోలీసుల లాఠీ దెబ్బలకు ఒళ్ళంతా హూనమై ,అరెస్ట్ అయి 31-3-1931 నుంచి ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించారు .
తర్వాత మైసూర్ మునిసిపల్ కౌన్సిల్ లో తొలిమహిళా కార్పో రేటర్ గా పని చేశారు .పాకీ పని వారి సంఘాన్ని స్థాపించి వారికి అండగా నిలబడ్డారు .ఆతర్వాత తూర్పు గోదావరి జిల్లాకాంగ్రెస్ కు ఎన్నికైన మొట్టమొదటి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా .అఖిలభారత కాంగ్రెస్ లో తొలి సభ్యురాలు గా రికార్డ్ సృష్టించారు .
. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగు వారి సాహసము, త్యాగము, ఆత్మార్పణం ఎంతో పేరు పొందాయి. గాంధీ మహాత్ముడు కూడా తెలుగు వారిని ఈ విషయంలో ఎంతో మెచ్చుకున్నారు. తెలుగు మహిళలు కూడా ఆయన పిలుపును అందుకుని ఎంతో కృషిచేశారు. అటువంటి ధన్యులలో ఒకరు పెద్దాడ కామేశ్వరమ్మ గారు. ఇంగ్లీషు కోర్టులు, విద్యాలయాలు, ఉద్యోగాలు వదిలి స్వతంత్ర పోరాటంలో పాల్గొనండి – అని గాంధీ గారు పిలవగానే ఎంతో మంది రంగములోకి దిగారు. అటువంటి వారిలో కామేశ్వరమ్మ ఒకరు. ఆమె సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకున్నారు .. డిగ్రీ చదివింది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు . జైలు శిక్షను అనుభవించించారు . నాయకులంతా జైళ్ళలో ఉన్నప్పుడు పెద్దాపురంలో వన సంతర్పణం చేసి అక్క డ సత్యాగ్రహ ప్రచారము చేసింది. పోలీసులచేత లాఠీ దెబ్బలు తిన్నారు . తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కార్యనిర్వాహక సంఘములో చాలా కాలం సభ్యురాలుగా ఉన్నారు . స్వతంత్రము కోసం పోరాడిన మహిళలలో మచ్చు తునకగా చెప్పుకోదగ్గ వ్యక్తి కామేశ్వరమ్మ గారు. ఆమె 1979 జూలై 29న మహోన్నత ఆడర్శమహిళా మూర్తి పెద్దాడ కామేశ్వరమ్మ గారు 72 ఏళ్ళ వయసులో అసువులు బాశారు .
కలకత్తా కాంగ్రెస్ మహా సభలో స్త్రీల మహా సభ కూడాజరిగింది .విడాకుల చట్టం బహు భార్యా నిషేధ చట్టం స్త్రీలకూ పురుషులతో పాటు అన్ని సమాన హక్కులు ,ఆస్తి హక్కు ,వారసత్వ హక్కు ఇచ్చే చట్టాలు తేవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు .అప్పుడు బి.ఎ.పాసైన పెద్దాడ కామేశ్వరమ్మగారు సికందరాబాద్ లో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు .కలకత్తా సభలో ఆమె ప్రధాన పాత్ర వహించారు .శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి ప్రభావంతో విషయాలు పూర్తిగా అవగాహన చేసుకొని వాదించి అందర్నీ మెప్పించి ఒప్పించారు .భర్త భార్యను వదిలేసి నప్పుడు ,ఆ వివాహం రద్దు చేసుకొని మరో వివాహం చేసుకోవటానికి ,హక్కు ఉండాలనీ విషయ నిర్ణయ సభలో మహా సభలో వాదించారు.అత్యధిక సంఖ్యాకులతో ఆమోదింప జేసిన నైపుణ్యం కామేశ్వరమ్మ గారిది .
2.శ్రీమతి దిగుమర్తి జానకీ బాయి:
శ్రీ మతి దిగుమర్తి జానకీ బాయి 30-11-1902 న విశాఖ పట్నం లో జన్మించారు .పన్నెండవ ఏట నే ఆమె వివాహం దిగుమర్తి రామస్వామి గారితో జరిగింది .భారత అనుమతి తో విశాఖ క్వీన్ మేరీస్ హై స్కూల్ లో చేరి స్కూల్ ఫైనల్ ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు .మద్రాస్ లో క్వీన్ మేరీస్ కాలేజిలో ఇంటర్ లో చేరారు .కంటి జబ్బు రావటంతో చదువు మానేశారు .ప్రభుత్వం ఎడ్యుకేషన్ కమీషన్ లో చేరమని ఆహ్వానించినా ,తిరస్కరించి, కొండా వెంకటప్పయ్య గారు స్థాపించిన శారదా నికేతనం లో చేరి లెక్కలు ,ఇంగ్లీష్ బోధించారు . 1919లో రౌలట్ చట్టాన్ని గాంధీజీ నిరసిస్తే భర్త రామస్వామి ఉద్యోగం వదిలేసి ,భార్య జానకీ బాయి గారితో కలిసి నెల్లూరు చేరి అక్కడి పినాకినీ ఆశ్రమం లో అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు .కాకినాడ కాంగ్రెస్ ,ఢిల్లీ కాంగ్రెస్ మహా సభలలో జానకీ బాయి పాల్గొని మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కావాలని వాదించారు .ఉప్పు సత్యాగ్రహం లో భర్త తో కలిసి విజయనగరం నుంచి విశాఖ కు పాద యాత్ర చేశారు .పోలీసులు దౌర్జన్యంగా రామస్వామి గారి బొటన వ్రేలును బలవంతంగా విరిగేట్లు వంచి ఉప్పు లాక్కున్నారు .జానకి గారి నుంచి కూడా ఉప్పు లాక్కోవాలని ప్రయత్నిస్తే ‘’నన్ను అరెస్ట్ చేసి ఉప్పు స్వాధీనం చేసుకో .తాకితే మర్యాదగా ఉండదు ‘’అని పోలీసును హెచ్చరించి పిడికిలి బిగించిన న ధీశాలి జానకీబాయిగారు .వాడు బలవంతంగా నొక్కుతున్నా బాధ భరిస్తూ చిరు నవ్వు చిందించారు .
1922జనవరిలో గాంధీ అరెస్ట్ కు నిరసనగా మహిళలను సమీకరించి బహిరంగ సభ జరిపారు జానకి .ఆమె అత్తగారు బంగారమ్మకూడా పాల్గొన్నారు .పోలీసులు జానకీబాయి కాళ్ళూ చేతులు పట్టుకొని విసిరేశారు .పరిస్థితి ఉద్రిక్తం కావటం తో సత్యాగ్రహం లో స్త్రీలు పాల్గొనరాదని రాష్ట్ర నాయకులు ఆదేశించారు ..అయినా ఆమె కొనసాగించారు .
భర్త తో సహా నాయకులంతా అరెస్ట్ అవగా ,జానకీబాయి ఒక్కరే వాలంటీర్ శిబిరాన్ని నిర్వహించారు .వాలంటీర్లతో కలిసి విశాఖలో ఉప్పు వండారు ఆమె .పోలీసులు శిబిరం పై దాడి చేసి భీభత్సం సృష్టించి 16-2-1932న ఆమెను అరెస్ట్ చేసి ఒక ఏడాది జైలుశిక్ష ,అయిదు వందల రూపాయలు జరిమానా విధించారు .జరిమానా ఎదుర్కొన్న ప్రధమ ఆంద్ర మహిళా రత్నం జానకీబాయి గారు .అప్పటికే ఆమె గర్భవతి .క్షమాపణ రాసిస్తే వదిలేస్తామని పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా వినకుండా జైలులోనే ప్రసవించారు .ఇది ఆమె రెండో సారి జైలుకు వెళ్ళటం .
భర్త రామస్వామి గారు విడుదలై బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేశారు .తర్వాత జానకీబాయిగారు కూడా విడుదలై బందరు చేరారు .ప్రచారాలలో ,ఉద్యమాలలో పాల్గొన్నారు .విశాఖ పట్నం మున్సిపాలిటీకి రెండు సార్లు సభ్యురాలుగా పోటీ లేకుండా ఎన్నికయ్యారు .మహిళా విద్య, వయోజన విద్య, సాంఘిక సంక్షేమం మొదలైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు .భారత స్వాతంత్ర్య రజతోత్సవం నాడు ఆంధ్ర మహిళా సభ రామస్వామి, జానకీబాయి దంపతులను సత్కరించింది .భారత ప్రభుత్వం ఆమెకు తామ్రపత్రం అందించి గౌరవించింది .సహనం ,సాహసం ఆభరణాలుగా ,చిరునవ్వే ఆయుధంగా సమాజ శ్రేయస్సుకోసంతపించి కృషి చేసిన శ్రీ మతి దిగుమర్తి జానకీబాయిగారు 25-6-1987 న 85వ ఏట స్వర్గస్తురాలయ్యారు .
-గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~