హాస్యానందం
38- వక్రోక్తి
అంటే స్వభావ విరుద్ధమైన లోకోత్తర విచిత్రం అని నిర్వచించారు మునిమాణిక్యం .వక్రత లేని, హాస్యం లేని కావ్యం రాణించదు. శబ్దగత వక్రతవలన శబ్దాశ్రయ హాస్యం పుడుతుంది .భావంలో ఉంటె భావగత హాస్యమౌతుంది .వక్రత అంటే వంకరతనం అది శ్లేషలో ఉంటె శ్లేష వక్రోక్తి ,కాకువు లో ఉంటె కాకు వక్రోక్తి అంటారు మాస్టారు .హాస్యగత వక్రోక్తి మూడురకాలు .1వైచిత్ర్యం 2హాస్య జనకంగా ఉండటం 3చమత్కారం ధ్వని గర్భంగా ఉండటం అన్నారు సార్.ఉదాహరణ –భార్య భర్త శీలాన్ని శంకించి నిష్టూరాలు ఆడుతూ ‘’అందమైన పిల్లకనిపిస్తే చాలు మీకు నాకు పెళ్లి అయి పెళ్ళాం కూడాఉంది అన్నదే మర్చిపోతారు ‘’అన్నది .భర్త వెంటనే ‘కాదు కాదు .చక్కని స్త్రీ కనిపిస్తే నాకు పెళ్లి అయిందనే సంగతి సూది పెట్టి గుచ్చినట్లు బాధతో జ్ఞాపకం వస్తుంది ‘’అన్నాడు .ఇందులో భార్య అంద గత్తె కాదనే బాధధ్వనిగా ఉంది .ఇదిచక్కని వక్రోక్తి అని కితాబిచ్చారు మునిమాణిక్యం జీ .
మరోఉదాహరణ –ఒక అభిప్రాయంతో మాట్లాడినట్లు పైకి కనిపించినా వేరొక అభిప్రాయంకూడాస్ఫురించేది కూడా ఉంది .భార్య కొత్తగా కాపురానికి వచ్చింది వంట కమ్మగా చేయటం రాదు .ఆమాట ఆమెకు చెప్పలేడు.తనవంట బాగాలేదని ఆమెకు తెలీదు .పాపం ఒకరోజు ‘’నేను రోజూ ఇలాగే వంట చేస్తే నాకేమిస్తారు ‘’అంది అమాయకంగా .వెంటనేభర్త ‘’నా జీవిత భీమా మొత్తం నీకే వస్తుంది ‘’అన్నాడు .తెలివిగలభార్యకు తేలిగ్గానే అర్ధమవుతుంది .ఇక్కడ రసం వ్యంగ్య రూపం లో ఉందని డిఫైన్ చేశారు గురూజీ .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
దుర్గాష్టమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-22-ఉయ్యూరు