జాతీయ జండా ఎగరేసే హక్కును లండన్ ప్రీవీ కౌన్సిల్ ద్వారా పొందిన శ్రీ దేవత శ్రీరామ మూర్తి .
అది సుమారు 1930వ సంవత్సరం .ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లో ఒకమ్మాయి స్నేహితురాళ్ళతో కలిసి సరదాగా తమ డాబా ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి సెల్యూట్ చేసింది .నిజానికి ఇదేమీ పెద్ద విషయం కాదు .,తప్పూకాదు.కానీ అప్పుడు రాజమండ్రిని తమ తీవ్ర దౌష్ట్యంతో కనికరం లేకుండా వణకిస్తున్న ఇద్దరు దుర్మార్గులైన పోలీసు ఆఫీసర్ ముస్తఫా ఆలీఖాన్ ,డప్పు రాయుడు అనే సబ్ ఇన్స్పెక్టర్ లు ఎక్కడ బ్రిటిష్ వారికి అవమానం జరిగినా వచ్చి మీదపడి లాతీ చార్జి చేసి చేతులూ కాళ్ళూ విరగ్గొట్టే వారు .సబ్ ఇన్స్పెక్టర్ ఈవిషయం తెలుసుకొని పై ఆఫీసర్ ముస్తఫా కు తెలియజేశాడు .ఇంకేముంది అసలే కోతి,నిప్పుతోక్కితే ఎలా ఉంటుందో అలా అయ్యాడు ముస్తఫా .లారీలాతో పోలీసులను ఎక్కించుకొని ఆ ఇంటికి వచ్చాడు . మౌంటెడ్ పోలీసులను కూడా బయట పఎర్పాటు చేయించాడు హడలు పుట్టించటానికి .సరాసర ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి జండా తీసేయ్యమని చెప్పాడు తియ్యను అందామె .తియ్యక పోతెతీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తు౦ది.అరెస్ట్ చేస్తాం అని హెచ్చరించాడు .
ఇంతలో ఆమె తండ్రి బయటికి హడావిడి చూశాడు .కూతురుని అడిగి విషయం తెలుసు కొన్నాడు .ముస్తఫా ఖాన్ తో ‘’మా అమ్మాయి జండా తియ్యదు జండా ఎగరేసే హక్కు అందరికి ఉంది .నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ‘’అన్నాడు పెద్దాయన .
ఆ పెద్దాయన పేరే దేవత శ్రీ రామమూర్తి .పేరుమోసిన లాయర్ .ఆ అమ్మాయిపేరు శ్రీమతి కోడూరి లీలావతి .చదువు కొంటో౦ది .ఖాన్ తో ‘మా అమ్మాయిని అరెస్ట్ చేయటానికి పర్మిషన్ ఉందా ?వారంట్ తో వచ్చావా ?’’అని అడిగారు శ్రీరామమూర్తి .ఆ రోజుల్లో ఖాన్ పేరు చెపితేనే ‘కార్చుకొనే వారే ‘’కాని ఎదిరించిమాట్లాడే వారు లేరు అంత హడల్ పుట్టించేవాడు .జనం విపరీతంగా పోగయ్యారు .ఇంతకీ ఖాన్ మన శ్రీరామ మూర్తి గారికి కాలేజిలో క్లాస్ మేట్ .అయినా ఎవరి తీరు వారిదే .అప్పుడు అరెస్ట్ చేయాలంటే కాకినాడలో ఉన్న కలెక్టర్ దగ్గర్నుంచి పర్మిషన్ పొందాలి .ఇక చేసేదిలేక ఖాన్ బృందం తోకముడిచి వెళ్లి పోయింది .అప్పటినుంచి శ్రీరామ మూర్తిగారిని ‘’జండా ప్లీడర్ ‘’అని పిలిచేవారు .
ఖాన్ కలెక్టర్ ను మేనేజ్ చేసి రెండు రోజుల తర్వాత ఆ అమ్మాయి అరెస్ట్ కు పర్మిషన్ తెచ్చాడు .మహా తెలివిగల మన లాయర్ గారు ఈ లోపే స్టే ఆర్డర్ తెచ్చేశారు .చేసేదేమీ లేక పోలీసులు కోర్టులో కేసు పెట్టారు .శ్రీరామ మూర్తిగారు కూతురు తరఫున వాదించారు .అప్పటిదాకా రావు గారు కాంగ్రెస్ భక్తుడుకాడు సాను భూతి పరుడు మాత్రమె . గాంధీ అభిమాని .గాంధీకి ఈవిషయం తెలిసి అభినందనలు తెలియజేశాడు జండా ప్లీడర్ కు .రెండుచేతులా బాగా సంపాదిస్తున్న ప్లీడర్ .ఈ సంఘటన తో ఆయనలో మార్పు వచ్చింది .గాంధీ అనుయాయుడుయ్యారు .ఉచితంగా పేదలకు న్యాయ సేవ అందించేవారు .
బ్రిటిష్ ప్రభుత్వం కూడా జండా ఎగరేయటం తప్పు పని కాదనే అన్నది. అయితే ఆసమయం లో ఎలాంటి గొడవలు అల్లర్లు ,సత్యాగ్రహాలు చేయకూడదని చెప్పింది .అప్పటికే సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జండా ఎగరేయటం అందరి హక్కు అని కోర్ట్ లో కేసు వేసి గెలిచాడు .ఈ తీర్పులేవీ పట్టించుకోలేదు ఇక్కడి కోర్టు .కోర్ట్ తీర్పు ప్రభుత్వ పక్షాన వచ్చింది .న్యాయమైన హక్కును కాలరాస్తున్న స్థానిక కోర్టులు ,పోలీసు వ్యవస్థ పై తీవ్ర ఆగ్రహం చెందిన లాయర్ శ్రీరామ మూర్తిగారు ఆనాటి లండన్ లో ఉన్న అత్యున్నత న్యాయస్థానమైన ‘’ప్రీవీ కౌన్సిల్ ‘’లో కేసు దాఖలు చేసి న్యాయం చేయమని కోరారు .వాదోపవాదాలు సుదీర్ఘంగా సాగి, చివరికి తీర్పు శ్రీరామ మూర్తిగారికి అనుకూలంగా వచ్చి జండా ఎగరేసే హక్కు అందరికి ఉన్నది అని తేల్చి చెప్పింది .నాటినుంచి శ్రీరామమూర్తిగారి పేరు దేశ విదేశాలలో మారు మోగింది .ఎందుకుజండాపై ఇంత అభిమానం ?అంటే ‘’ జండా జాతికి జీవగర్ర ,సమతా చిహ్నమ్ము’’అన్నారు కరుణశ్రీ .మరో అడుగు ముందుకు వేసి ‘’నా జాతి జండా కున్న పొగరు, గర్వం నాకున్నాయి ‘’అని ప్రకటించాడు శేషేంద్ర .
గాంధీ పిలుపుతో రాజకీయ ప్రవేశం చేశారు రావుగారు .వ్యక్తి సత్యాగ్రహం సహాయ నిరాకరణ,ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు .రాజమండ్రిలో లోని ఒక వీధి వీధి అంతా దేవత శ్రీరామమూర్తి గారి భవనాలే .నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొని ,సీతానగరం ఆశ్రమానికి విశేష సేవ లందించారు .గాంధీ గారు ఎప్పుడు వచ్చినా శ్రీరామమూర్తి గారింట్లోనే బస, ఆతిధ్యం .ఆయనకాంగ్రెస్ నిధికోసం వస్తే, రావుగారు భారిమొత్తంలో నిధి అందజేయగా ,కుమార్తె తనమెడలో ఉన్న అత్యంత ఖరీదైన వజ్రాల నెక్లెస్ తో సహా, నగలన్నీ నిలువుదోపిడిగా మహాత్మునికి అందజేసిన త్యాగమయి . కూతురు లీలావతి దేవి గారిని శ్రీ కోడూరి గున్నేశ్వరరావు గారు వివాహమాడారు .ఆమె పట్టభద్ర్రురాలు .కాంగ్రెస్ సేవా పరురాలు .సరోజినీ నాయుడికి అత్యంత ఆత్మీయురాలు .ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించినందుకు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ను అరెస్ట్ చేయటానికి ప్రయత్నిస్తే ఆయన రాజమండ్రి వచ్చి శ్రీరామ మూర్తిగారింటికీ వస్తే మన లాయరు గారు నేతాజీ ఎవరి కంటా పడకుండా అజ్ఞాతంలో దాచి ,అరెస్ట్ నుంచి తప్పింఛి పంపించేశారు అంతటి వీరాభిమాని నేతాజీకి .
ఇవాళ ఉదయం శ్రీ దేవత శ్రీరామ మూర్తి గారి దౌహిత్రుడు అంటే కూతురు లీలావతిగారి కుమారులు శ్రీ కోడూరి శ్రీరామ మూర్తిగారి ఫోన్ నంబర్ మా అబ్బాయి శర్మ సేకరించి నాకు పంపితే వెంటనే రాజమండ్రి లో విశ్రాంతి తీసుకొంటున్న ఆ 93 ఏళ్ళ ఆ సాహితీ మూర్తి గారికి ఫోన్ చేసి తాతగారి వివరాలు అడిగితె చాలా ఓపికగా జవాబులు చెప్పారు .ఆ సారాంశమే పైన రాసిన విషయాలు .వారికి కృతజ్ఞతలు .
అహింసనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు గాంధీజీ. ప్రపంచవ్యాప్తంగా పరిమళించిన ఆయన కీర్తి ఎందరికో స్ఫూర్తి. అలాంటి వ్యక్తి ఈ భూమిపై సంచరించారంటే తర్వాతి తరం నమ్మకపోవచ్చంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్నారంటే జాతిపిత కీర్తి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వచ్చే గాంధీజీ జయంతి సందర్భంగా గోదావరి తీరంతో ఆయనకున్న అనుబంధాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం.
స్వాతంత్రోద్యమకాలంలో అహింసే ఆయుధంగా, సత్యమే మార్గంగా, తెల్లదొరలను తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం సాధించిపెట్టిన మహాత్మా గాంధీ ఎప్పటికీ మార్గదర్శే! ఉద్యమకాలంలో ఆ జాతిపిత పాదస్పర్శతో గౌతమీ తీరం పునీతమైంది. 1921–46 మధ్య కాలంలో గాంధీజీ 5 సార్లు రాజమహేంద్రవరానికి వచ్చారని చరిత్ర చెప్తోంది. కోటిపల్లి బస్టాండ్, రైల్వేస్టేషన్, మెయిన్‌రోడ్డు, వంకాయలవారి వీధి ప్రాంతాల్లో బాపూజీ నడయాడారు. 1946 జనవరిలో చివరిసారి వచ్చిన గాంధీజీ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రసంగించారు.
గాంధీజీ రాజమహేంద్రవరానికి వచ్చినప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో పదిలంగా ఉన్నాయి. స్వరాజ్య నిధి కోసం 1930లో బాపూజీ రాజమహేంద్రవరం వచ్చినప్పుడు స్వాతంత్ర్య సమరయోధుడు దేవత శ్రీరామమూర్తి తన ఇంటికి ఆహ్వానించి డబ్బు, నగలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాలను దేవత శ్రీరామమూర్తి మనుమడు కోడూరు శ్రీరామమూర్తి ఈటీవీ భారతి తో పంచుకున్నారు. మహాత్ముడి జీవిత చరిత్రపై అనేక రచనలు చేశారీయన.దాదాపు 100పుస్తకాలు రాశారు
రాజమహేంద్రవరంలోనే మరో కుటుంబానికి మధురానుభుతుల్ని మిగిల్చారు మహాత్ముడు. గాంధీజీ ఇచ్చిన విదేశీ వస్తు వినియోగ బహిష్కరణ స్పూర్తితో కేవీ రత్నం 1932లో పెన్నుల తయారీసంస్థ ప్రారంభించారు . 1933లో ఆలిండియా విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కార్యదర్శి జేసీ కుమారప్ప, రత్నం రూపొందించిన రెండు పెన్నులను తీసుకెళ్లి ఒకటి మహాత్ముడికి ఇచ్చారు. దేశంలోనే తొలిసారి పెన్నుల తయారీ సంస్థను స్థాపించిన కెవి.రత్నాన్ని అభినందిస్తూ మహాత్ముడు స్వయంగా ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం నేటికీ ఈ కుటుంబం వద్ద పదిలంగా ఉంది.
స్వాతంత్ర సమర ఉద్యమ సమయంలో ఈ ప్రాంత నుంచి అనేక మంది మహాత్ముడి ప్రసంగాలకు ఉత్తేజితులై పోరాటంలో పాల్గొన్నారు. ఆ జ్ఞాపకాలు గోదావరి తీరంలో ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి.
.స్వాతంత్ర్యోద్యమకాలంలో ( Freedom Struggle movement ) హింసే ఆయుధంగా సత్యమే మార్గంగా బ్రిటీషు తెల్లదొరల్నించి దేశానికి స్వాతంత్ర్యాన్ని( Independence ) తెచ్చిపెట్టిన గాంధీ ( Gandhiji ) ఎప్పటికీ మార్గదర్శకుడే. అందుకే జాతిపిత అయ్యారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి ( October 2 Gandhi jayanti ) సందర్బంగా జాతిపిత మహాత్మాగాంధీకు గోదావరి తీరంతో ముఖ్యంగా రాజమహేంద్రవరం ( Rajamahendravaram ) తో ఉన్న అనుబంధాన్ని ఓ సారి గుర్తు తెచ్చుకుందాం. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఐదుసార్లు మహాత్ముడు రాజమహేంద్రవరానికి వచ్చారు.
1921–46 మధ్య కాలంలో ఐదుసార్లు రాజమహేంద్రవరం ( Gandhiji Visited Rajahmundy ) గడ్డపై అడుగెట్టారు. తొలిసారిగా 1921 మార్చి 30న రాజమహేంద్రవరాన్ని సందర్శించారు. అనంతరం అదే ఏడాది ఏప్రిల్ 4న, తిరిగి 1929 మే 6న, తరువాత 1933 డిసెంబర్ 25న, చివరిగా 1946 జనవరి 20వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగిన పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. 1929, 1933 పర్యటనల్లో సీతానగరంలో ఉన్న గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమంలో బస చేశారు. కస్తూరిబా ఆశ్రమంగా ( Kasthuriba Ashramam ) పిల్చుకునే ఆ ఆశ్రమంలో ఇప్పటికీ నాడు గాంధీజీ ఉపయోగించిన రాట్నాన్ని భద్రపరిచారు.1929 మే 6వ తేదీన కందుకూరి వీరేశలింగ పురమందిరంలో స్త్రీ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.1929 పర్యటనల్లో పాల్ చౌక్ వద్ద జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ఈ పాల్ చౌక్ నే ఇప్పుడు ఇన్నిస్ పేటగా పిలుస్తున్నారు.
మరోసారి 1946 జనవరి 20 వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ప్రాంతంలోని గూడ్స్ యార్డ్ ప్రాంతంలో జరిగిన మహాత్మా గాంధీ ప్రసంగాన్ని ఇప్పటికీ చాలామంది గుర్తుంచుకుంటారు. నాటి ప్రసంగంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా జాతినుద్దేశించి గాంధీజీ చేసిన ప్రసంగం అణువణువునా జాతీయోద్యమ భావాన్ని ఉత్తేజితం చేసింది. మహాత్మా గాంధీ చేసిన హిందీ ప్రసంగాన్ని స్వాతంత్ర్య సమరయోధుడైన కళా వెంకట్రావు తెలుగులోకి అనువదించారు. గోదావరి ప్రాంతంలో అదే గాంధీజీ చివరి పర్యటన.
ఇవీ మహాత్మునికి రాజమహేంద్ర వరంతో ఉన్న అమూల్య అనుబంధం .
గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-22-ఉయ్యూరు