’చలపాక ‘జీవనయాత్ర’’ ప్రకాశా’’నుభూతుల అక్షయపాత్ర
ఒక కవి, రచయిత తన జీవితాన్ని అనేక కోణాలలో ఆవిష్కరిస్తాడు .ఎవరి అనుభూతివారిది .అయితే అది ఊహాలోకాల్లోకాక భూమి మీద ఉంటె రాణింపు ఎక్కువ .సరసభారతికి అత్యంత ఆత్మీయుడు శ్రీ చలపాక ప్రకాష్ ఇటీవలే వెలువరించిన ‘’నా జీవన యాత్ర ‘’నిజంగానే ఆయన సాహితీజైత్రయాత్ర అంత సుదీర్ఘమైనది .ప్రతిమాట ,ప్రతి పంక్తి మనసును తాకుతుంది .తెచ్చిపెట్టుకొన్న కవిత్వంకాదు .మనోభావాలు గుండె పొరల్లోనుంచి తమకు తాము వెల్లువలాపైకి ఉబికొచ్చిన కవితాదార .
ప్రకాష్ కు యాత్ర అంటే ఒక కొత్త మార్పుకు చేర్పు ,కొత్తపాత్రలతో కరచాలన౦. అక్షరాలు మొలిపించి ,మురిపించి స్పూర్తిని ప్రసాది౦చేదే .చిన్నప్పుడు డబ్బు ఇబ్బందితో స్కూల్ పిల్లల యాత్రకు పంపకపోతే చిట్టిమనసుల కోరికల్ని,సరదాను చంపుకోవటం ప్రత్యక్షంగా చూపించటమే .కొండపల్లి యాత్రానుభూతి అడ్డుకట్ట వేయలేనంత ప్రవాహ ఉధ్రుతితో ఆనంద సంద్రమయింది .నేరేడుపళ్లనుకొని ఇంకుడు కాయలు తిన్నప్పుడు అసలైన పరిశోధన విజ్ఞానం యాత్ర బోధించింది .పరీక్షలవలన కుటుంబ సభ్యులతో యాత్ర కు వెళ్ళక ఒంటరిగా ఇంట్లో ఉండటంతో కలిసి వెళ్ళే యాత్ర పాత్ర కలగానే మిగిలింది .అయితేనేం ఊహల యాత్రలో నానమ్మ కతలతో తనపాత్ర ఎప్పుడూ విహరిస్తూనే ఉందనే ఊరట పొందాడు .
మనసు ఆల్బం లో భద్రాద్రిగోదారి గుత్తి చేపలు దృశ్యకావ్యంగా భద్రమైంది .వృత్తి బండీ లాగటానికి యాత్ర బండిని రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ లో బందీచేశాడు .పెళ్ళే ఒక తీర్ధయాత్రగా మజా యాత్రయై మధురోహల్ని నింపి ,జీవనయాత్రకు తోడు నిచ్చింది .జీవనసాగరంలో యాత్ర భాగమైపోయింది .సాహితీ తపస్సు కామారెడ్డి లో పండినప్పుడు సాహిత్యయాత్ర జీవన మజిలీలో ప్రధాన పాత్రే పోషించింది .యాత్ర అంటే సరదామాత్రమేకాదు,అన్నిరకాలా నలిగిపోవటం కూడా .
భావుకుడైన ప్రకాష్ కు యాత్ర సమస్త ప్రకృతిని పలకరించి తడిమి తురుముకోవటం .అనేక పాత్రల్ని కలుపుకొంటూ ,కొత్తపాఠాలు నేరుస్తూ ముందుకు సాగటం .అనేక వేదికలపై మెరుస్తూ ,అనేకానేక కవి, రచయితలతో మమేకమౌతూ ,అనేక ఆలోచనలపరవళ్ళతో మహా ప్రవాహంగా సాగిపోతూ సాహిత్య గుబాళింపు లెన్నో అఘ్రాణిస్తూ , తానూ అందజేసి, మహానుభూతి పొందాడు .’’ఉయ్యూరులో రాజాగారి కోట సాక్షిగా జరిగిన కథా సదస్సులో కాలేజి విద్యార్ధులకు బ్రతుకు గాతలను కథలుగా చెప్పి ,ఆలోచనా బీజాలు నాటటం ఆయన మర్చిపోలేదు .
ఎన్నెన్నో జ్ఞాపకాలు మరెన్నో జ్ఞాపికలు ఇంకెన్నో సత్కారాలు ఈ సాహితీ యాత్రా ఫలితాలే అని పరమ సంతోషం వ్యక్తం చేశాడు ప్రకాష్ .జనకవనం వేదికపై కంపించేదేహంతో తొలికవిత చదివి అనూహ్యంగా వచ్చిన స్పందన చప్పట్ల రూపం లో వ్యక్తమైనప్పుడు ,ఫెలోషిప్ ఆర్దికప్రోత్సాహం లభించినప్పుడు ప్రత్యక్ష సాక్షి సాహితీ యాత్రాలే అని గుర్తు చేసుకొన్నాడు .అందుకే చలపాకకు యాత్ర అంటే జీవతం లో ఒక పాత్ర .అనేక అనుభూతుల అక్షయ పాత్ర .రమ్యభారతి పత్రిక,నిర్వహణ ,క్షణం తీరికలేని సాహితీ సభా నిర్వహణ దక్షత ,,రాష్ట్ర సభల నిర్వహణ, వ్యాస ,విశ్లేషణా విశ్వరూపం తో అమెరికా సాహిత్యపు అంచులు తాకినప్పుడు ఆయనపొందిన ఆనందం అవధులు దాటింది .మనిషి బంగారం .మనసు బంగారం .వృత్తి బంగారం,ప్రవృత్తి బంగారం అయిన’’ ప్రకాశ’’ జీవనుడు ‘’చలపాక’’ అన్ని తరాలవారికీ ఆదర్శ మూర్తి . ఆయన యాత్రలో మనల్నీ యాత్రీకుల్ని చేసి మధురానుభూతుల్ని పంచాడు .
అందమైన ఫ్రంట్ ముఖ చిత్రంలో చలపాక జీవనయాత్రలో అలసి పోయిన ముఖంతో కనిపిస్తాడు కాని బాక్ చిత్రంలోనవయవ్వన స్పూర్తి తోయాత్రకు సిద్ధం అన్నట్లు దర్శనమిస్తాడు .
విజయదశమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-22-ఉయ్యూరు