మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -17

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -17

· 51-‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ ‘’గేయకర్త ,ఆత్మాభిమాని ,తేటగీతి కవి ,బలిదానకావ్యకర్త ,గాంధీ బిల్హణీయం,దీనబంధు సినీ గేయకర్త –శ్రీ శంకరంబాడి సుందరాచారి

· శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 – ఏప్రిల్ 8, 1977) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత.

జీవిత విశేషాలు
సుందరాచారి, 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించాడు. అతని మాతృభాష తమిళం[1]. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపునకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.

భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్ర పత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.

అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు “నీకు తెలుగు వచ్చా” అని అడిగాడు. దానికి సమాధానంగా “మీకు తెలుగు రాదా” అని అడిగాడు. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పనిచేసాడు. నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని బంట్రోతుగాను, బంట్రోతును సుందరాచారిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు.[2] సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.

2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి జ్ఞాపకార్ధం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది[3]. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పట్ల కృతజ్ఞతాసూచకంగా విగ్రహం దగ్గర ధ్వనివర్ధకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికీ పాట నిరంతరంగా ధ్వనించే ఏర్పాటు చేసింది.[4]

సాహితీ వ్యాసంగం
శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు. “నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతిలో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టం” అనేవాడు ఆయన. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.

మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, బలిదానం అనే కావ్యం వ్రాసాడు. ఆ పద్యాలను పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించాడట. ఆ పద్యాలలోని కరుణ రసానికి పిల్లలు రోదించారని ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి చెప్పాడు[5].

సుందర రామాయణం అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం కూడా వ్రాసాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసాడు.

రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించాడు. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. జానపద గీతాలు వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు. ఇవే కాక అపవాదు, పేదకవి, నాస్వామి, నేటికవిత్వము, బలిదానము, కార్వేటి నగరరాజ నీరాజనము మొదలైనవి వీరి ఇతర రచనలు.

సినిమాలకు కూడా పాటలు రాసాడు. మహాత్మాగాంధీ, బిల్హణీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు వ్రాసాడు. దీనబంధు సినిమాలో నటించాడు కూడా. సుందరాచారి “మా తెలుగు తల్లికి” గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడడానికి నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.

ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ నెహ్రూను కలిసాడు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు వినిపించాడు. నెహ్రూ ముగ్ధుడై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించాడు.

ఇతర కవుల అభిప్రాయాలు
స్వర్గీయ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారన్నారు- మృదువైన పదములు, మధురమైన శైలి, మంచి కల్పన కలిగి వీరి కవిత్వము అనందము నాపాదించకలిగి ఉంది.

కీ.శే.కవిసాంరాట్ విశ్వనధ సత్యనారాయణ అన్నారు- తెలుగు పలుకుబై, కవితాశక్తి, సౌకుమార్యము, ఈమూడు గుణములు మూటకట్టి వీరు పొత్తములను రచించుచున్నట్లున్నది.ఈ యుగములో వీరిదొక ప్రత్యేక వాజ్మయముగా ఏర్పాటు కాబోవుచున్నట్లున్నది. వీరిశైలి సంస్కృత సమాసములనుండియు, మారుమూల పదములనుండియు విడివడి సరళమైనది.

శ్రీగడియారం వేంకటశేషశాస్త్రి అంటారు: ఈతని శైలి మిక్కిలి సరళమైనది. భాష సుగమనమైనది. ధార సహజమైనది. పోకడలు, ఎత్తుగడలు, అలంకారములు చమత్కారములు, మున్నగు ప్రసాధనము లన్నియు సుమచిత సన్నివేశములే భావ శ్రుతిలో మేళవించినవి.

శ్రీరాయప్రోలు సుబ్బారావుగారు మాటలలో-సుందరాచారి గారి సూక్తి ఎంత తేటగా సూటిగా వినబడుతుందో అంత స్ఫురితంగా సుదూరంగా ధ్వనిస్తుంది. ఇది ఈ కవి రచనలలోని అనన్య విశిష్టత.

శ్రీమాన్ రాళ్ళపళ్ళి అనంతకృష్ణ శర్మ గారు:తేటగీతుల తెలుగు తీదీపిరుచుల యూట….కొంకుల కొసరుల కాటుపడక సారతరమిది సుందరాచారి కవిత.

రచనల నుండి ఉదాహరణలు
సుందరరామాయణం వ్రాస్తున్నప్పుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మకు ఒక సందేహం కలిగి ఇతడిని “అయ్యా! సుందరాచారీ! తాటకి భయంకరస్వరూపిణి. నీ తేటగీతులలో ఇముడుతుందా?” అని ప్రశ్నించాడు. ఆయన దానిని ఒక సవాలుగా తీసుకుని తన సుందరరామాయణంలో తాటకిని ఇలా ప్రవేశపెట్టాడు.

తిరుపతిలో శంకరంబాడి సుందరాచార్య. విగ్రహం పలకం

నల్లకొండల నుగ్గుగా నలగగొట్టి
చిమ్మచీకటిలోగల చేవబిండి
కాళసర్పాల విసమెల్ల గలిపినూరి
కాచిపోసిన రూపుగా గానుపించె

పచ్చి రక్కసి, నడగొండవలెను, వదన
గహ్వరము విచ్చి మంటలుగ్రక్కి,నాల్క
సాచి, కనులెఱ్ఱవార, చేయూచికొనుచు
నురము ముందుకునెట్టి, శిరమునెత్తి

కాలభైరవియై వల్లకాటికెల్ల
దానె గాపరి యనమించి తలల మాల
మెడను వ్రేలాడ, ద్రాచులు పడగలెత్తి
భూషలయి మేన బుసకొట్టి, ఘోషలిడుచు

హరులు,తరులును,గిరులును,దరువులొకట
వెంట బడిమూగ,నడుగులు,పిడుగులగుచు
నిడిన చోట్లెల్ల గోతులు వడుచునుండ
నచటి కరుదెంచె వికటాట్టహాసముగను

తేటతెనుగు తనము పుణికిపుచ్చుకుని ఎదుటపడిన సుందరాచారి తాటకిని చూసి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ముక్కున వేలు వేసుకున్నాడు.

బిరుదులు
శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు.

మా తెలుగు తల్లి గేయానికి రాష్ట్రం లో, దేశ విదేశాలలో గొప్ప గుర్తింపు తెచ్చినవారు మహాగాయని శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి .ఆమెను మనం మర్చిపోకూడదు . శ్రీ సుందరాచారి శత జయంతి సందర్భంగా బందరుకు చెందిన శ్రీ యుటిఎఫ్ వెంకటేశ్వరరావు ,శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మగార్లు ఒక బృందంగా ఏర్పడి ఆయన జీవిత చరిత్రను అనేక చోట్ల రూపకంగా ప్రదర్శించారు .సరసభారతి తరఫున ఉయ్యూరులో కూడా ఫ్లోరా హైస్కూల్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయించాం .వారు చక్కగా నిర్వహించి విద్యార్ధులకు గొప్ప స్పూర్తి కలిగించారు .ఆమహాకవిపై మేమూ ఒక కార్యక్రమం నిర్వహించామన్న సంతృప్తి ,గౌరవం సరసభారతి కి దక్కింది .

సశేషం

విజయ దశమి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-10-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.