పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-8
రాయ్ కమల్ కథనే తారాశంకర్ ఆతర్వాత నవలగా రాశాడు .ఆనాటి వైష్ణవులతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది వారి దృష్టిలో ప్రేమ వ్యక్తిగతమైనది భౌతికం కాదు .నిజమైన ప్రేమ శ్రీ కృష్ణునిపైన మాత్రమె ఉంటుంది.గీత గోవిందకర్త జయదేవుడు బెంగాల్ బీర్భం లో నివసించిన వాడే .ఈయనకు ముందుకూడా వైష్ణవం ఉంది .చైతన్యప్రభువు విస్తృతం చేశాడు .వైష్ణవాదిక్యమున్న గ్రామం లోని కమలిని కథ ఆనవల .విశిష్ట ప్రేమకథ .ఉదాత్తనవల..సంగీత నాట్యాలలో ప్రవీణులైన వారకాంతల జీవితాలను ఆయన స్వయంగా పరిశీలించి ,వారు మానవ ప్రేమకు అధిక విలువనిస్తారని గ్రహించాడు .
‘’హన్సూలీ బంకర్’’ అనే తారాశంకర్ నవల అత్యుత్తమనవలగా పేరు పొందింది .బీర్భం జిల్లాలో కొపై నది వంపులు తిరిగి స్త్రీలు ధరించే హన్సూలీ అనే కొడవలి ఆకారంలో మెడలో దండలాగా ఉంటుంది .ఈ వంపు మధ్యప్రాంతం వెదురు పొదలనిలయం . వెదురును బంషి అంటార్ బెంగాలీలో .కనుక ఈ ప్రాంతం బంషీ బారి అయింది .జన్గాల్ జమీందార్లకు చెందింది .కహార్ జనం పోలాలను కౌలుకు సేద్యం చేస్తారు .సుచాంద్ అనే ముసలావిడ గడచిన తరానికి ప్రతినిధి .జమీందార్ల దోపిడీ నుంచి తప్పించుకొని విముక్తి కోసం రైల్వే ఫాక్టరీ లో పని వారు గా వెళ్లాలనుకొనే వారిని కహార్లనాయకుడు బనోరి ప్రతిఘటిస్తూ ఉంటాడు .ఇక్కడే ఉండి సనాతన వ్యవస్థను వ్యతిరేకిస్తాడు .చివరికి అతడూ రైల్వే కార్ఖానాలో పని చేస్తాడు .వర్తమానం లో జీవించటానికి భయపడే తోటి వారిని హేళన చేస్తాడు .గ్రామ దేవత ‘’కర్తా ‘’కు అభిమాన పాత్రగా విశ్వసించే నల్లత్రాచును అతడు చంపుతాడు .దీనితోకరాలీకి ఇతనికి సంఘర్షణ ఏర్పడుతుంది .అతని సాహసానికి పోలీస్ ఇన్స్పెక్టర్ బహుమతి ఇస్తాడు .దీనితో గ్రామస్తులచేత అవమానం పొందుతాడు .గ్రామకట్టుబాట్లు లెక్క చేయకుండా కరాలీ ఒక వివాహితస్త్రీతో గ్రామం వదిలి వెళ్ళిపోతాడు .కరాలీ తనకు విరోధిగా మారుతున్నాడని బనోరి భయపడతాడు .తనప్రజలు ఆవాస్తావిక జీవితంలో బతుకుతున్నారని కరాళి బాధపడతాడు .కొడవలి వంపు ప్రాంతం లో పూర్వం నీలి పంట బాగా పండించేవారు .జమీందార్లు కూలీలను రైతుల్ని వెట్టి చాకిరి తో బాధ పెట్టేవారు .ఈ విషయం కరాలీ ఒక్కడే గ్రహిస్తాడు .సుచాంద్ కు మరింతలోతుగా తెలుసు .బనోరి బలవంతం మీద అతడి జాతివారు బానిసలుగానే ఉండిపోతారు .తనవైపు కరాలీని టిప్పు కోవాలంటే గ్రహించి బనోరి తనకు వారసులుకావాలని ఒక వితంతువును పెళ్లాడతాడు మొదటి భార్య చనిపోతుంది .రెండో భార్యను కరాలీ లేవదీసుకుపోతాడు ,బనోరీ కరలీద్వంద్వ యుద్ధం లో బనోరీ ఓడిపోయి మంచం పట్టి ,తను నమ్ముకొన్న పురాతన సాంఘిక వ్యవస్థ రూపుమారిందని గ్రహిస్తాడు .తాను ప్రతిఘటించిన మార్పులన్నీ ప్రపంచ సంగ్రామం తర్వాత తన గ్రామం లో కూడా జరిగాయనితెలుస్తుంది .1942తుఫాను పంటలన్న్నీ నాశనం చేసింది .జమీందార్లు రైతుల్ని ఆదుకోక పోవటంతో రైల్వే కార్ఖానపనులకు వెళ్ళిపోతారు .కరాలీ నాయకత్వంలో కాంట్రాక్టర్లు అక్కడి చెట్లను వెదురు పొదల్నీ నరకటం మొదలు పెట్టగా ,పవిత్ర బీల్ వృక్షంకూడా నరికి వేయబడగా బనోరి చనిపోతాడు .కరాలీకహార్ తెగ కొత్తనాయకుడవుతాడు .సుచాంద్ బిచ్చగత్తె గామారి కొడవలి వంపు గాథ చరమాంకాన్ని పట్నంలో చెబుతూ బతుకుతుంది .తుఫాను భీభత్సం కహార్లకు గుణపాఠం అంటుంది .వంగ సాహిత్యం లో ఇలాంటి స్త్రీ పాత్ర సృష్టింప బడలేదు .విప్లవవాదికరాలి భవిష్యత్ కు ప్రతీక .తానుపుట్టిన నేలపై అభిమానమున్నవాడు ,కహార్ల జీవితవిధానాన్ని అన్నికోణాలనుంచి బంద్యోపాధ్యాయ చిత్రించాడు .నిమ్న జాతిప్రజలు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని తమ సంస్కృతిని నిల బెట్టుకొనే ప్రయత్నం చేస్తారు. వారి ముఖ్యపండుగలన్నీ వ్యవసాయానికి సంబంధించినవే .వారి నైతిక విలువలు మిగలిన వారికి భిన్నంగా ఉంటాయి .ఆంక్షలు లేని స్వేచ్చాప్రేమ కోరుకొంటారు ,గౌరవిస్తారు .స్త్రీ పురుషులు మద్యపానం చేస్తారు .తిండి దొరక్కపోతే మగవాళ్ళు దొంగతనాలు ,హత్యలు చేస్తారు.కళాకాంతీ లేని పేద రైతులమధ్యబతుకుతూ వారి ప్రత్యెక సంస్కృతి కాపాడుకొంటారు .దీనికోసం పాతవిదానాలనే అవలంబించాల్సి వస్తుంది .కొత్త విధానాలు అవలంబిస్తే తమ ప్రత్యెక వ్యక్తిత్వం సంస్కృతి నశిస్తాయని భావిస్తారు .ఈ విషమ పరిస్థితిని తారాశంకర్ మహా ప్రతిభా వంతంగా చిత్రించాడు .ప్రశ్నలు సంధించకుండా ఒకముఖ్య సమస్యను ఎత్తి చూపాడు .మనదేశంలో నిరుపేదలై దోపిడీ విధానానికి గురైన గిరిజనులున్నారు వారికి మంచి సంస్క్రుతీ సంపద ఉంది .పాత విధాన తెగలు అంతరిస్తున్నాయి .అలాకాకుండా ఉండాలంటే కొత్త సాంఘిక వ్యవస్థ లో వారులీనం కావాలి .ఇలాజరిగితే వారి సంస్కృతి శిదధిలమౌతుంది .కొత్తవిధానాలు అనుసరిస్తే ,తమ విశిష్టత చాటుకోలేరు .దీనికి పరిష్కారం ఎవరివద్దా లేదు .వెదురు పొదలమాటున మిలమిలలాడే కొడవలి వంపు ఒక చారిత్రిక పరిణామానికి ప్రతీక .ఈ ప్రకృతి విశిష్టత వలన ఆకహార్లు ఆధునికతకు దూరంగా ఉంటూ తమ స్వీయ వ్యక్తిత్వాన్ని కాపాడుకో గలుగు తారు .అందుకని సనాతన వ్యవస్థకు బందీలు కాక తప్పదు .వెదురు పొదల నరికి వేత వలన కహార్లు పాతకాలపు సరిహద్దులు దాటి ,ఇరవైయవ శతాబ్ది చేదు ,నిజాల ఆవరణలోకి ప్రవేశించారు .కహార్ల మా౦డలీకాన్నే తారాశంకర్ ఉపయోగించటం అద్భుతం .బీర్భూ లోని మిగిలిన మా౦డలీకాలకు ఇది భిన్నంగా ఉంటుంది .దీనితో తారాశంకర్ బంద్యోపాధ్యాయ వంగ సాహిత్యంలో ఒక జీవ భాషను ప్రవేశ పెట్టిన గౌరవం పొందాడు .అంతేకాక ఆ భాషా విషయ సమస్య కు పరిష్కారం కూడా చూపించాడు .వంగ సాహిత్యం లో అంతవరకూ కృషి చేసిన వారంతా మధ్య ,పైతరగతులకు చెందినవారు .పల్లెప్రజల్ని రైతుల్నిచిత్రించే టప్పుడు పరోక్షంగా వారి భాష తెలుసుకొని ,లేక నిఘంటువు ఆధారంగా భాషను వాడేవారు .’’పద్మ నాదిర్ మాఘి ‘’-పద్మానదిలో పడవవాడు రచిస్తున్నప్పుడు మాణిక్ బంద్యోపాధ్యాయ ,అనేక భాషలు ఉపయోగించినా ,పడవ వారు మాట్లాడే భాష రాయలేక పోయాడు .కనుక బెంగాలీ సాహిత్యం లో మొదటినుంచి జీవభాషా సంప్రదాయం లేదు .మాండలికం రాస్తే చాలదు వివిధ వృత్తుల వారు వాడె ప్రత్యెక భాషనూ పొందు పరచాలి .బెంగాలీ సాహిత్య భాష అర్ధ రహితంగా తయారైంది 19వ శతాబ్దిలో కాళీప్రసన్న సిన్హా ,ఇరవై వ శతాబ్దిలో దినేన్ద్రకుమార్ రాయ్ ,ఇటీవల అద్వైతమల్ల బర్మన్ వంటి వారు జీవ భాష వాడి కృత కృత్యులయ్యారు .కానీ వీరు పరిణతి చెందిన రచయితలు కాదు కనుక వారి కృషి గుర్తింపు పొందలేదు .తారాశంకర్ జీవభాష వాడటం లో ఏ ప్రయొజనమూ ఆశించలేదు .ఒక ప్రత్యెక వర్గం వారి గురించి రాసే టప్పుడు వారి భాష నే వాడటం న్యాయం అనుకోని రాశాడు .ఆయన ఉత్తమనవలలలో ఈ నవల చివరిది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-6-10-22-ఉయ్యూరు