కొండను అద్దంలో -2
మరో రెండు –ఇంకో నాలుగు
మరోరెండులో -1-శ్రీ సరికొండ నరసింహ రాజు రాసిన ‘’నెత్తుటి పాదాలు ‘’కవితా సంపుటి –ఇందులో 77స్వీయకవితలున్నాయి .మనిషి ఎప్పుడూ అజేయుడే ,మనిషితనం దీపం చుట్టూ మాడే శలభాలుగా గోచరించాయి .కరోనాలేని లోకాన్ని ఆహ్వాని౦చాడు కవి .త్యాగాల పొద్దులో ఉదయించే మనిషి ఎప్పటికీ ఓఅఖండ సేవాగీతం,అరచేతులు అడ్డ౦ పెట్టి ,ఆకుపచ్చ దీపాలమై రైతన్న బతుకు భరోసాఇద్దామన్నాడు .కన్నీటి పాదాలే తనకవితాపాదాలు. మనిషి ఎప్పటికీ కాలశిఖరం పై గెలుపు జండా ఎగరేస్తాడని ధీమా గా అన్నాడు .ప్రతిమనిషి అనురాగపు నేలలో ఆకుపచ్చని చెట్టై విస్తరించాలని హితవు చెప్పాడు .గానగంధర్వ బాలు అంటే ‘’పాటల చనుబాలు ‘’అంటాడు .ఆకలి మాట్లాడితే రహదారులపై నెత్తురు పులిమే వలసకూలీల పాదముద్రల్లా ఉందట. ఇంటితాళ౦ చెవి పారేసుకొని ‘’కాలమా కనిపిస్తే తెచ్చివ్వు ‘’అన్న అమాయకుడు .పీలికలై ఎగిరే జ౦డాలుకాదు.-ఎక్కుపెట్టినజండా కర్రలకే వందనం చేస్తాడుకవి .త్యాగాలపొద్దులో సరిహద్దు సైనికునిలా ఉంటాడు.’’అతడు మన ఎదుట లేకున్నా ,అతడు తీసిన ఛాయా చిత్రాలలో సజీవుడే అని ఫోటోగ్రాఫర్ ను ,మన టేబుల్ పై పేపర్ వెయిట్ లా ఉండాల్సిన పేపర్ బాయ్ –కరోనా గ్రస్తుడై ,పాతపేపరై ఎక్కడో అనాధగా పడి ఉన్నాడని బాధపడ్డ మనసున్నకవి సరికొండ నాగరాజు .
నాగార్జున సాగర్ నీటి పారుదలశాఖలో సీనియర్ అసిస్టెంట్ అయిన ఈకవి ఒక విధ్వంసక ముఖచిత్రం ,వచన కవితా సంపుటి ,ఒకే ఒక సిరా చుక్క నానీల సంపుటి ,మిత్రశతకం పద్యకావ్యం వేకువ చెలమ గేయసంపుటి వంటివి రాసి లబ్ధ ప్రతిష్టితుడయ్యాడు .ఎక్స్ రే అవార్డ్ లు రంజని-కు౦దుర్తిఅవార్డ్ ,ఆంధ్ర సారస్వతసమితి అవార్డ్ ,అద్దేపల్లి పురస్కారం వంటివి ఎన్నో పొందాడు .ప్రతి అక్షరం లో కవిత్వాన్నిఒలక బోసిన కవి అనిపించాడు .
2-డాక్టర్ నూనె అ౦కమ్మారావు –రాసిన ‘’యోచన –లోచన ‘’వ్యాస సంపుటి .ఒంగోలు నాగార్జునడిగ్రీ కాలేజి ఆంధ్రోపన్యాసకుడు .మంతెన సూర్య నారాయణ రాజు కథలపై పరిశోధన చేశారు .తెలుగు సిరి ,వ్యాస సంపుటి ,తెలుగు జిలుగులు పద్య గద్య సంపుటి ,పదునెక్కినకవనం ,సాహితీ మూర్తులు వగైరా రచనలతో ప్రసిద్ధులైనారు .
ఈ పుస్తకం లోతెలుగు సాహిత్యం లో పద్య మధురిమలు తో ప్రారంభించి బడుగు జీవుల బతుకుల్లోకరోనాకస్టాలు అనే 21వ్యాసం తో పూర్తి చేశాడు .తెలుగు సాహిత్యం లో సామాజిక దృక్పధం, హేతువాద ప్రశంస, గురజాడ దేశ భక్తీ జాషువా రచనా వైశిష్ట్యం ,చెంచులు –ఎరుకల జీవన విధానం ఇతర వ్యాసాలూ అన్నీ చాలా పకడ్బందీగా పూర్తి వివరాలతో ఉన్నాయి .ఆసక్తిగా చదివించే గుణం ఉన్న వ్యాసాలు .కాళ్లకూరివారి అద్భుత సృష్టి చి౦తామణినాటకం అని మెచ్చారు .ప్రాదుర్భావ కవితా మాండలీకాలను విపులంగా చర్చించారు .రచన హాయిగా మనసును తాకేట్లుంది .చదివి ఆనందించాల్సిన వ్యాసాలు. .
ఇంకోనాలుగు –లో శ్రీఅప్పాల శ్యామ ప్రణీత శర్మ అవధాని గారి 1-వ్యాస ప్రణీతం 2-సర్వ దేవతా ప్రవరమంజరి 3-జాతక కళా నిధి 4-జీర్ణోద్ధారణ విధి ఉన్నాయి .రచయిత వేదపండితులు .వీరు తెలంగాణాలో మంచిర్యాల్ జిల్లా తాండూర్ మండలం అచలాపూర్ నివాసి .ఆయనకు నేను ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాననీ నా రచనలు మెయిల్స్ లో కూడా చదువుతున్నానని నాలుగైదేళ్ళ క్రితం ఫోన్ చేస్తే సరసభారతి పుస్తకాలు పంపాను సహృదయత మూర్తీభవించిన వారు పంపిన పుస్తకాలు నిన్ననే వ నాకు అందాయి .వెంటనే ఫోన్ చేసిచెప్పగా అభిప్రాయం రాయమన్నారు .చదివి రాస్తున్నాను .
1-వ్యాస ప్రణీతం –సనాతన ధర్మలో చెప్పబడిన అనేకా౦శాలను ప్రమాణ పూర్వకంగా ఈ తరానికి సామాన్య భాషలో రాసిన ఇరవై వ్యాసాల సంపుటి. 92వ పేజీలో QRకోడ్ ను స్కాన్ చేస్తే రుద్రాధ్యాయ విశిష్ట త అనే వ్యాసం టెక్స్ట్ రూపం లో వచ్చేట్లు ముద్రణలో సరికొత్త ప్రయోగం చేశారు .ఉమాశ౦కర సంవాదంగా గురుగీత ,అద్వైత దర్శన దీప్తి,దేశ సమైక్యతా స్పూర్తి గా ఆది శంకరాచార్య,యజ్ఞం పర్యావరణ హితం చేస్తుందనీ ,,సంస్కృతతగ్రామం మత్తూర్ సనాతన భారతీయ వైభవమని ,రాముని విలువల ప్రయాణమే రామాయణమని ,దేవతల వాహనాలు వైవిధ్యానికి ఆనవాళ్ళు అనీ ,కరపత్రస్వామి ధర్మ సామ్రాట్ అనీ ,విద్యాసిద్ధి సరస్వతి అనీ ,చెప్పి రుద్రాధ్యాయ ,శిమ మహిమ్నస్తోత్ర వైభవాలు వివరించి ,శివ నిర్మూల్యాన్ని సాలగ్రామ స్పర్శతో స్వీకరించవచ్చుననీ చెప్పారు .విష్ణుతత్వం విశ్వమంతా వ్యాపించి ఉందని ,,చివరగా సకల శ్రేయస్సులు మూర్తి ఆరాధన వలన కలుగుతాయని హామీ ఇచ్చారు .అన్నీ అన్నే .అమృత భాండం .ఆధ్యాత్మిక చి౦తన కలవారికి .
2-సర్వ దేవతా ప్రవర మంజరి-దేవ, దేవీలకళ్యాణ సమయాలలో పఠించే ప్రవలను సేకరించి దీన్ని అందించారు .ఇందులో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర ,వల్లీ ,దేవసేనా ,సూర్యనారాయణ ,గో వృషభ ,కృష్ణ సత్యభామ రుక్మిణి రాధ ,వీరభద్ర ,శివ జ్ఞాన ప్రసూనాంబ ,సువర్చలా హనుమ ,మొదలైనవేకాక యాజ్ఞ్యవల్క్య మైత్రేయీ ప్రవరలుకూడా ఉన్నాయి. గొప్ప సేకరణ .అర్చకుల ,ఆలయ యజమానుల వద్ద ఉండాల్సిన పుస్తకం .
3-జాతక కళానిధి – ప్రాచీన జ్యోతిష గ్రంథాన్ని పరిష్కరించి రాసిన సిమ్ప్లి ఫైడ్ ఫలితాల పుస్తకం .నవగ్రహాలు జాతక చక్రంలో 1నుంచి 12 వ స్థానాలలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలను చక్కగా టూకీగా వివరించారు
4-జీర్ణోద్ధారణ విధి –దీన్ని ఆగమ ,పురాణ ప్రమాణాలతో సాధికారికంగా రాశారు శర్మగారు .ఇందులో జీర్ణమూర్తి పూజ ,అఘోర మంత్రజపం ,అగ్ని ప్రతిష్టాపనం ,కళాపకర్షణ ,పాదస్థానం ,నుంచి మూర్ధ స్థానం వరకు ,కళాపకర్షణ ఉన్నది .తర్వాత పాశుపతమంత్రహోమం ,బేర జీర్ణోద్ధారణం అంటే ప్రతిమ లేక విగ్రహ జీర్ణోద్ధారణ విధానం ,సమంత్రకంగా సవివరంగా రచించారు .కావాల్సిన పదార్ధాల జాబితా కూడా చేర్చారు .ఆలయ అర్చకులకు ఈ గ్రంథం చేతిలో చింతామణి .అసక్తిఉన్నవారికి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి .
ఇంతటి ఆధ్యాత్మిక సంపదను చక్కని ముఖ చిత్రాలతో ,చిత్రాలతో బోల్డ్ టైప్ లో సరసమైనధరలో అందించిన ప్రణీతశర్మగారికి, వారి విద్వత్తుకు ప్రణామాలు .
శర్మ గారి సెల్ నంబర్ -9440951366
ఇమెయిల్-aspsharma 84@gmail.com
Vaidikagrandhanidhi .blogspot .com
అనుకోకుండా ఇవాళ పొద్దున్న 4,ఇప్పుడు 6పుస్తకాలను అంటే మొత్తం 10పుస్తకాలను సంక్షిప్తంగా పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-22-ఉయ్యూరు