’కొండను అద్దం’’ లో -3
శ్రీ డొక్కా రాం గారి’’నవ ‘’కృతులు
అమెరికాలో ఆస్టిన్ నగరం లో ఉంటున్న శ్రీ డొక్కా రాం గారు నిరతాన్నదాత అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి ఇనిమనవడు –అంటే మునిమనవడిగారబ్బాయి .సాఫ్ట్ వేర్ ,సాహిత్యం అనే జోడు గుర్రాల స్వారీ చేయగల దిట్ట .కవిత్వం, విమర్శ చేయగల సవ్యసాచి .ఈ మధ్య ఇండియా వచ్చి నాకు పంపిన 9పుస్తకాలపై స్పంది౦చ మనికోరగా రాస్తున్ననాలుగు మాటలివి .ఈ తొమ్మిదీ 2022మార్చి నుంచి జులై లోపు వచ్చిన తాజా నవరత్నాలు .అంటే ఎంత వేగంగా పుస్తకరచన జరిపి ,ప్రచురించారో మనకు అర్ధమౌతుంది .ప్రతి పుస్తకం మంచి గెటప్ తో ఆకర్షణీయంగా ఉండటం మరీ ప్రత్యేకత నాణ్యతకు పట్టాభి షేకం జరిగిందన్నమాట .
1-పద్య సఫారీ ,పలుకు కచేరీ –సోదరులిద్దరూ ఆఫ్రికా పర్యటన చేసి పొందిన అనుభూతి .రాం గారు సఫారీ,ఫణి గారు కచేరీ చేశారు .కలర్ ఫోటోలతో వన్య మృగ దర్శనమూ చేయించారు .మొదటి దానిలో ‘’సఫారీ ‘’అనే అన్య దేశ్య పదాన్ని మకుటం చేసి రాయటం కొత్త .ఇందులో తూర్పు ఆఫ్రికా దేశాల పర్యటన అనుభవ సారం చూసిన ప్రదేశాలు జంతువులూ వాటిపేర్లనుపద్యంలో ఇరికించటం ఒక పెద్ద సఫారీ .చక్కగానిర్వహించారు రాం .జంతుప్రపంచం చేరగా పిలిచిందట పరుగు లంఘిచు ప్లావి అంటే జింక ,చోరులబాధలేదు .తరుణము రానంతవరకూ వేటాదబోదు భారి అంటే సింహం .వినుటకు చేటల చెవులు ,కనుటకు లఘు నేత్రయుగలి తినుటకు గరికలే చాలు –మనిషికి ఆదర్శం ‘’కరియోగి ‘’ఖద్గంరుగాల ఖడ్గ మృగాల కొమ్ములు దోచే దొంగలు ‘’దొమ్ము వడ’’అంటే వాటి బలం క్షీణి ౦ చేదాకా కా తరిమి చంపి దొంగరవాణా చేస్తారు .ప్రకృతి సమతుల్యత నిలబెట్టే జంతుజన్మ ను చూసి మనిషి గుణపాఠం నేర్చుకోవాలి .’’నడి రాతిరి వినవచ్చెను –చిడిముడి తడబడు నటులుగసింహపు గర్జల్ ‘’వినిపించాయి .పోతన స్టైల్ కనిపించింది .కిలిమంజారోపర్వతాలు మెరుపులమధ్య వెలిగే మేరు నగంలా ఉందట తూర్పు టాంజనీయాకు తురగ౦ అంటే హృదయం జాంజిబార్ ‘’.వావలె ననుకొను నావలు –జీవనమిదే ఆటుపోటు చిట్టా అంటే ఆశ్చర్యం చిత్రం .ఇలా కందాల్లో సఫారీని బంధించారు రాం.
మాటలకచేరీలో ఫణీంద్ర యాత్రా విశేషాలు రాశారు. ఆఫ్రికా అంటే నలుపు అన్నారు .అనిశ్చిత మనిషిని నడుపుతుందని జీవితం పై ఆసక్తి రేకెత్తిస్తుందన్నారు .
2-పాట వెలది –పలుకు నర్తనకుపద్య పరివర్తన –తెలుగు సినీ పాటలకు రాం గారి పద్య కూర్పు .ఆత్రేయ గీతం –తేట తేట తెలుగులా –తెల్ల వారి వెలుగులా –తేరులా సెలయేరులా కలకలాగలగలా –కదిలి వచ్చింది కన్నె అప్సరా –వచ్చి నిలిచింది కనులము౦దరా ‘’దీనికి పద్యాలు –తేట తేట తెలుగు తెల్లవారి వెలుగు –తేరు వలెను సాగి ఏరువలెను –కదిలి వచ్చి నిలిచే కన్నె అప్సర తానె –అందమంతా కనుల విందు చేసి ‘’అద్భుతపద్య పరివర్తనం .చివరి 21వ పాట దిలయన్ కింగ్ ఇంగ్లీష్ సినిమాలో –హుకూమా మటాటా –వాట్ ఎ వండర్ఫుల్ ఫ్రేజ్ –హుకుమా మటాటా –Aint nopassing craze ‘’కు అను వార్తన పద్యం –‘’అందరకు హాయి అంత మేలుజరుగు –దృష్టి శుభము గనిన సృష్టిశివమే –తల్లడిల్ల నేల తలపులందున చిక్కి –చింతలేల ?చిన్ని జీవితమున ?’’
బహుశా ఇలాంటి పద్య పరివర్తన ఎవరూ చేసి ఉండరు. రాం గారి ఆలోచన పరిపక్వంగా నెరవేరి మార్గదర్శనం చేసింది .
3-అమెరికావాసి –తన ప్రవాస జీవిత గాథను శతకపద్యాలలో పడమటి సంధ్యారాగం గా వినిపించారు రాం.’’ప్రాచ్యం అప్రాచ్యం అనే ఏహ్యభావాన్ని మనసులోనుంచి తుడిచిపారేసి విశ్వ మానవతను ప్రతిబింబింప జేశారు .’’అమెరిక వాసి’’ అనేదిమకుటం.మచ్చుకు కొన్ని పద్యాలు –‘’ఎన్నారై మొనగాడని –ఎన్నో చానళ్ళు బొగడ నేమి ఫలంబో ?-నిన్నే నమ్మిన తమ్ముల –కన్నా చేయూతనిడక యమరిక వాసీ ‘’.పోలీసులే’’ కాపు’’లనగ –కాలొక్కటి చేసినంత కదనాశ్వములై –వాలుదురే క్షణమందున –నాలస్యము చేయకుండ’’అక్కడ పోలీస్ లను కాప్ అంటే అది రక్షణ అర్ధంగా కాపు ను వాడి వాళ్ళ డ్యూటీమైన్దేడ్ నెస్ ను బాగా చెప్పారు .ప్రతిశీర్షిక బాగుంది .ఉపసంహారం లోచివరగా –‘’వందల వేల ప్రవాసుల –కందువ జీవన గతులను కథగా జెప్పన్ – డెంద౦బులు మురిసినవా ?అందరికివే వందనంబు లమెరిక వాసీ ‘’అని ఫీడ్ బాక్ గా అడిగారు .ఇందులోనే శంకరాచార్య మాతృపంచకం దుఃఖ నివృత్తి ,గుర్వస్టకం మొదలైన శ్లోకాలకు తేట తెనుగు పద్యానువాదం చేసి జగద్గురువులను మనకు అతి సన్నిహితం చేశారు .
4-ప్రవాసి –ఆధునిక ప్రవాస జీవన పద్యకావ్యం –ఇది నవావరణ కావ్యం .మొదటిది వందనం లో సీతమ్మ మాయమ్మ అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ ,గురు వందనం అందే వేదమాతరం శివపంచ రత్నాలు అనే 17శీర్షికలు .రెండవది జ్ఞాపకం లో ప్రవాస భారతి విశ్వభారతి అజ్ఞాతవాసం గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ –మొదలైన 12శీర్షికలు మూడవది –ప్రవాసీ జీవనం –లో వీకేండోపాఖ్యానం ,ఆటవెలది ఎంకి ,సంసార వేదాంతం ,పేకాట వైరాగ్యం శారద నీరద కేళి వంటి 24శీర్షికలు నాల్గవది బంధనం లో లాక్ డౌన్ మాయాబజార్ ,కరోనా ,వర్క్ ఫ్రం హో౦,కు౦జరయూధం లాంటి 8,అయిదవది –పద్య నైవేద్యం లో పడగెత్తిన పద్యం ,పద్యం ఎలాఉండాలి?పద్యపాన ప్రియుడు ,సాహిత్య పెత్తందార్లు సన్మాన రహస్యం ,ఒహోహోం ఒహోహోం వంటి 14శీర్షికలు ,ఆరవ ది-అక్షర సేద్యం లో బంగారుతల్లీ ,భాష –బెత్తం,tellgoతెలుగు ,త్రీ చీర్స్ టుపద్యం తెలుగు బడి వంటి 18శీర్షికలు ,ఏడవది –సంబరం లో –ఉగాది అమెరికందాలు ,దీపావళి దసరా,సూపర్ బౌల్ ,సభాయైనమః వంటి 12శీర్షికలు ,ఎనిమిది-భోజనం లో-ఆరురుచులు ఆట వెలదులు ,కాఫీకాఫీ ,పచ్చడి పలుకులు ఆవకాయ డాట్ కాం ,హాచ్చి కందములు ,కవితా కన్జేక్టివై టిస్ వంటి 20 శీర్షికలు ,నవమావరణం –నీరాజనం లో ఓమేధావికి పాఠం ,శ్రీశ్రీ ,మనాత్రేయ ,పివి శతజయంతి ,బాలగంధర్వుని కి పద్య నీరాజనం ,గరికి పాటికి పద్య పట్టాభిషేకం వంటి 8శీర్షికలు ఆల్ మొత్తం 133శీర్షిలతో కావ్యం పూర్తి చేశారు . మచ్చుకు కొన్ని పద్యాలు ఆస్వాదిద్దాం .
సీతమ్మగారిపై పద్యం –1-అన్నమా అది కాదు ,ఆప్యాయతల ముద్ద-లన్నపూర్ణ గ నోటి కందజేసె –మజ్జిగా అదికాదు మనసు కవ్వము జిల్కే –మానవత్వపు తేట మంచిమాట
పప్పు ధప్పళములు ,పచ్చడి ,వ్రతముగా –పరుల కడుపు నింపె –పరమ సాధ్వి –ఆకలి రక్కసి నంతమొందగా జేసే –నాత్మ చాపపు నారి అమ్మ సీత
వండి వాత్సల్యమే పంచె వంటగరిటె–కాశిగా కొనసీమాయే వాసి కెక్కె
ఖండములు దాటి నీఖ్యాతి గన్నవరపు –లంక మెరసిన భారత రత్నమీవు ‘’
2-లాక్డౌన్ చిత్రం –‘’మంచినీరు పాలు మరచిరి మనవారు-లాకు డౌను మంచి లాభ సాటి
లైనుకట్టే రయ్యోవైను షాపు లెదుట –మందు కొనుట యందె ముందు చూపు ‘’
3-అమ్మను మింగినదా౦గ్లము –క్రమ్మెను సంస్కృతికి మబ్బు ,కాలపు మహిమల్
నమ్మిన వారికి గలవిట-అమ్మకమునకాధరువులు నాప్యాయతలున్ ‘’
4-తెలుగు వాడి నీది తెలుగు వేడియు నీది –తెలుగు మరువ వలదు తెలుగు బిడ్డ ‘’5-‘’మన ఆత్మ గౌరవ౦బును –మనకారము చాటి జెప్పు మన పచ్చళ్ళున్
మన పెరటి కూరలందున –మనసెరిగిన ఆకు కూర మన గో౦గూరే ‘’
6-జబ్బలు చరుచుచు నిలిచెను-పబ్బపు వంటలను రాజు ,పందెము గెలిచెన్
‘’బొబ్బట్టే’’ నెగ్గెను పెడ –బొబ్బలు పెట్టగ నితరులు పోటీ ముగిసెన్’’
7-ఒటేల్ భోజనం –‘’ఉడుకు ఉడుకు అన్న ముడకనియ్యని కూర –ఉప్పుమిరియ౦పు పొడులున్న వచట ‘’.
శుచియే ముఖ్యమాయే రుచులు కానేకాదు –కడుపు నిండలేదు కనులవిందు ‘’
8-అమ్మ వంటి గ్రామ మనురాగ సంపదే –చూసిరండి మీరు సుఖముగాను ‘’
9-దీపావళి –‘’రేపన్న ప్రమిద చిత్తము –జ్ఞాపకమను చమురుపోసి ,జ్ఞానపు వత్తిన్
దీపము వలె వెలిగించు డి-దీపావళి దివ్యకాంతిదిక్కులు నిండన్ ‘’
అక్షరలక్షలు చేసే పద్య రాజమిది .
10-‘’పండితుండు త్రాగు పలుకు సారాయినే –మాటలందు మత్తుమందుకలిపి
పరవశమ్ము జెంద భావ లాహిరులలో –మద్యమేల మనకు పద్య ముండ ‘’
ఇది మరో ఆణిముత్యం .
5-చిత్రపది-శతాధిక చిత్ర –పద్య లహరి –కొన్ని పద్య చిత్రాలు –
1-అమ్మకు సృష్టికి ,మూలపు –టమ్మకు,జగదేకమాతకా మువ్వురి జే –జమ్మకు వందన శతములుజయమెల్లరకున్ ‘’
2-వేల గోపికల కు వెలుగైన స్వామికి –గన్నులేల ?నెమలి కన్ను చాలు
మధురభక్తి నిండె మదిలోన కేశవా –స్థాణువైన నీకు వేణు వేల ?’’
3-కాస్త నిలువుమయ్య కాశీకిపోనేల ?పెళ్లి జేసి నీకు బిల్లనీయ
కన్ను విప్పు గలుగు గానబడు దైవంబు –తత్వమొదవి ,జన్మ ధన్యమగును ‘’
5-చిలికితి పద్యంబొక్కటి-చిలిపిగా స్ఫురియించే నటులే చిత్రము జూడన్
అలిగితివో బట్టతలలు ?-గలహము వలదయ్య నేను ఖర్వాటుడనే ‘’
ఈ పుస్తకంలోనూ ఒక కొత్తదనం ఉంది కనిపించిన బొమ్మపై చక్కని పద్యం అల్లటం .అంటే చిత్ర పద్యలహరి .ఇందులోనూ భేషని పించారు రాం.
6-తటిల్లతలు – రాంమనోఫలకం పైతళుక్కుమన్న భావకవితా దీపికలు.ఇవి .మనమూ కొన్ని అనుభవాలు పంచుకొందాం –
1-కాలచక్రపుదారి పరిగిది ,కఠిన మార్గపు గాడి తిరిగెడు – అనుభవమ్ములపుస్తకం నేనాలాపించే గీతం
2-హీరో వర్షిప్ –‘’అరవీసం సాధించిన వాడికి అర సున్నా భక్తులమౌదాం –ఆకాశానికి ఎత్తేద్దాం ఆ దేవుని గానే చేసేద్దాం ‘’
3-గుడిపాటి వెంకట చలం –శేష జీవితం అరుణా చలం ‘’
4-ఇరవయ్యోకటవ శతాబ్దం లోకి శరవేగంగా దూసుకుపోతున్నాడు –అయిష్టంగా నైనా అందరినీ మోసుకు పోతున్నాడు ‘’
5-సరంగు జీవితం –‘’నిత్యం నడి రేవు బ్రతుకు దరిజేరే దారిలేదు –అచంచల ఆత్మ విశ్వాసం ,ఆశల చుక్కాని తప్ప ‘’
6-బాపురే బాపు –‘’నాల్గుగీతలు గీసి –నవ్వించి కవ్వించి –హాస్య రసాయనము –నెక్కి౦చి పొక్కించి –నాలాంటి బుడుగులను –ఉర్రూతలూపావు –ముళ్ళపూడి జతను –ముత్యాల సరులు –అట్టమీది బొమ్మ –లెన్ని అల్లర్లు –కొంటె తెలుగు చూపు –లెక్కించు కైపు –వేదా౦త ముంది ఆ –చిలిపి గీతల్లో –గుండెలను కదిలించు –చింపి రాతల్లో (ఫాంట్ )-గీతాచార్యుడివే కదా –మహాబాపు
7-పెళ్లి –‘’అనురాగం ,అభిమానం పడుగుపేకల్లా –మనసు మగ్గం పై నేసిన మధుపర్కాలు –గారాల దారాలు ,నునుసిగ్గు సరిగంచు –మేనిపై జలతారు చీనా౦బరాలు ‘’అద్భుత భావగరిమ ఇది .బాపు ఉండిఉంటె ,ఈయన్ని కవిగా పెట్టుకొని పాటలు రాయి౦చేవారు.
8-కోనసీమ –గోదారిమాతకు గోమాత సేవకు –తొలికోడి కూతకు తొలిప్రొద్దు పొడుపుకు –తోలకరిజల్లుకు తెలిలి వెన్నెల సొ౦పుకు –అందాల సీమ మా కోనసీమ ‘’
7-అవ్యక్తం –తానెవరో తెలుసుకొంటానని ,తన్ని తానె ప్రశ్నించుకొంటాననీ ,తనతో తాను మాట్లాడుకొంటాననీ తనలోని అంతర్యామిని దర్శించే ప్రయత్నం చేస్తాననీ లోపలా బయటా ‘’ఆయన ‘’ ఉనికినిగుర్తిస్తాననే తపనతో రాం గారు రాసిన 50 కవితలివి .ఇందులోనూ కొన్ని తాకి చూద్దాం –
1-పదానికిపదానికి మధ్య తొంగి చూసేది –శబ్దానికి శబ్దానికి నడుమ ప్రవహించేది –భాష భావం ఏమీ అవసరం లేనిదీ –తన ఉనికేదో చెప్పకుండానే ఇద్దరినీ కలిపేది –అదే అసలు కవిత్వం –అదే అవ్యక్తం .’’
2-అడుగుకు మడుగు లోత్తుతూనే –నా అహంకారపు పుండును –చిదిమేశావ్ –ఆశల పర్వతాలనెక్కిస్తూనే అవసరాలలోయల లోకి త్రోసేశావ్ ‘’
3-ప్రవాసీయం –‘’నడి సంద్రం లో –ఈదడం నేర్చుకొన్నాను –ఏ తీరమైనా నాకొకటే –విశ్వమంతా నాయిల్లే అందరూ నా వాళ్ళే –సంస్కృతి నీకు వ్యాపారం కావచ్చు –నాకు సదాచారం –దేశభక్తి నీకొక ఎజెండా కావచ్చు –నేనే నాదేశపు జెండా –ఎక్కడ నాటినా రేపరెపలాడుతాను ‘’
అద్భుతభావాలకు పరమాద్భుత పద చిత్రణ
8-ఆకు చుట్టిన ప్రకృతి
సాహిత్యం లోసహజీవనం చేయాలంటే భావ సముద్రంలో మునకలు వేయటమేకాదు ,కొంతసారాన్ని అవపోసనపట్టటంమే చాలదు. అ బిందువు సుడులు అలలు ఆవిరి అందులో సమస్త జీవరాశి మనమే నని గుర్తించాలి నిత్యం మారుతున్న ఆనీటి స్వరూపం లో మమేకమై ,మనం ఆకాశానికి పర్వతాలకు పైకి అరణ్యాలలో అలవోకగా ప్రయాణం చేయాలి .అప్పుడే ప్రకృతి మనతో మాట్లాడుతుంది ‘’అని అర్ధం చేసుకొన్న రాం రాసిన 27అనుభవ గీతాలివి .దీనికి అనుబంధంగా ‘’ఐస్ ల్యాండ్ అందాలు ‘’అనే నైస్ గా చెప్పిన 13కవితలున్నాయి.మంచి బొమ్మలూ ఉన్నాయి .
1-అలా తలుపు తట్టిందెవరు ?అజ్ఞానమా .ఆత్మజ్ఞానమా –ఆపిలుపు నిచ్చిందెవరు –వీడేనా లోపలి వాడా?-అందరిలో ఆకు చుట్టిన ప్రకృతిని –అక్షరం సాక్షిగా –ఆస్వాదిస్తున్న –అడుగడుగునా ఆవిష్కరింప బడుతున్న అద్భుతాన్ని-అంతరంగం లోకి ఆహ్వానిస్తున్నాను ‘’
మిస్టిక్ పోయిట్రీ,టాగూర్ స్రవంతిలా ఉంది
2 ఒక్కటే సత్యం –ఎన్నిపరదాలను తప్పించినా –ఇప్పుడెవరికీ కాకు౦ డాపోయింది –కాళ్ళ ఎదుట ప్రత్యక్షమై ఉన్నా-ఒక్కరికీ కనపడకుండా పోయింది
3- ఐస్ లాండ్ లో వేడి నీటి బుగ్గ –లోపల ఎంత కుతలాడితే –అ౦తెత్తు ఉబికి వస్తావ్ ?అరక్షణం లో –ఆకాశాన్ని చేరుకోవాలనే తహతహ –నిన్ను నిలువెల్లా దహించి వేస్తోంది కాబోలు ‘’చక్కని కవిత్వం. ఆయన అంతరంగంనుంచి ఉబికి ఉవ్వెత్తున ఎగసి వచ్చింది.
4-వజ్రాల్లా మెరిసిపోతూ –వారధి ఒడ్డున మురిసిపోతూ –వచ్చి పోయేవారిని –పలకరించటం కోసం –నిత్యమంగళ స్నానాలు చేస్తూ –వాయు భక్షణలు చేస్తున్న –వింత విగ్రహాలు –ఇదీ ఐస్ లాండ్ లోదే
5-తలుపులు లేని గుమ్మమ్ములు –వాస్తు విశేషములుకావు –వాస్తవామీ కట్టడములు –క్రైస్తవ మత చిహ్నమ్ములు ‘’
9-తొమ్మిదవ చివరిపుస్తకం –పలకరించే పద్యం ‘’-అని ‘’మాస్టారూ !ఒక్ఖపద్యం ‘’అని ఊరించారు రాం .ఇందులో పద్యలహరిలో 41,అవధానాలు సాహితీ సదస్సులలో చెప్పినపద్యాలు 42,ఆచార్యులతో పద్య సంభాషణ లో -20,పొడుపుకథలు –లో 20,బొమ్మ -బొరుసు పద్యాలు -6,సమస్యాపూరణక౦దాలు -115,ఆటవెలదులు -56,తేటగీతులు 47,వృత్తపద్యాలు -15,ఉత్పలమాలలు -8,శార్దూల౦ -1మత్తేభాలు 3.ఉన్నాయి .పద్యమంటే చెవికోసుకొనే వారికి పసందైన పక్కా విందు భోజనం అందించారు రాం డొక్కా.ఇందులో వాచవికి ఒకటి రెండు .
1-మది మెచ్చెన్ మరి చందమామ గనుచున్ మా రాము డానాడితన్ –ఇది ‘’ఇస్రో ‘’జయకేతనంబు గనుడీ ఈ నాటి శాస్త్రజ్నులే –కదిలించన్ ఘన అంతరిక్ష పదమున్ ,కాలూన సిద్ధంబిటన్ –ఉదయించెన్ రవి చంద్రమండలములో నొప్పారు మేఘాకృతిన్ .
2-కోవిదమ్మ నేర్ప కొత్త వ్యాపారముల్ –పాతమాస్కులిచ్చి పాత్రలడిగే –అసలు తెలివియున్న అమెజాను లోనైన –బలుసుకూరనమ్మి బ్రతకవచ్చు
3-దాసాను దాసులేకడ –ఊసులకే ఊరి పెద్ద లుత్త కబుర్లే –వేషాలే మగవారివి –మీసాలవి స్త్రీకే సొబగు మీరేమన్నన్ ‘’
ఇలాంటి పద్యాలసోబగులు ఎన్నెన్నో ఉన్నాయి .రాం గారి కవిత్వ ధార,ఆయనపుట్టిన రాజమహేంద్ర గోదావరీ ప్రవాహంలా ,తానున్న నయాగరా జలపాతం లా సాగింది .అందులో తళుకులు బెళుకులు ఉరుకులు హోరు ,మానసిక ఆనందం మేధో పరిణతి గోచరిస్తాయి .నిజానికి ఆయన అవధానం చేయ గల సమర్దులే .ప్రాక్ తీరం నుంచి పడమటి తీరానికి చేరిన జ్ఞాన మార్తా౦డులే .ఆయన ఆప్యాయతకు ,మంచి మనసుకు ఈపద్య లహరి లేకకవితాలహరి తార్కాణం .మరిన్ని వన్నె వాసికల పుస్తకాలు వెలువరిస్తారని భావిస్తూ ,వెలువరించాలని కోర్తున్నాను .ఇప్పుడు వారి చరిత్ర తెలుసుకొందాం –
పేరు డొక్కా రామభద్రశర్మ అమ్మానాన్నలు-శ్రీమతి బాలాత్రిపురసుందరి శ్రీ సూర్యనారాయణ గార్లు .పుట్టింది-తూగోజి ధవళేశ్వరం .అక్షరాభ్యాసం –రాజమండ్రి ,విద్యాభ్యాసం –అమలాపురం హైదరాబాద్ .ఉన్నత విద్య –బెంగుళూరు, అమెరికా .మొదటిఉద్యొగ౦ –భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ –ఇస్రో .ప్రస్తుత నివాసం –ఆస్టిన్ నగరం –టెక్సస్ అమెరికా .వృత్తి –ఇంజనీరింగ్ ,కంప్యూటర్ సైన్స్ .ఐటి ప్రాజెక్ట్ మేనేజిమెంట్ .ప్రవృత్తులు –అక్షరారాధన ,సాహిత్యాధ్యయనం భాషా సాహచర్యం ,అధ్యాపకత్వం ఆధ్యాత్మిక తత్వ విచారణ .సాహిత్య ప్రక్రియలలో సేద్యం ,సాహితీ సదస్సులు నిర్వహించటం హాజరవటం అవధానాలకు సంచాలకత్వం , నిర్వహన , మాతృభాష బోధన ,పాఠ్యప్రణాళిక ,అంతర్జాతీయ తెలుగు బడి నిర్వహణ .
ఇంతటి ప్రతిభా వంతుని అక్కడి సంస్థలు గుర్తించి సన్మానించాయి .మనదేశామూ,మన రాష్ట్రమూ ఆహ్వానించి సత్కరించి మనం ధన్యులమవాలి .ఆ రోజు త్వరగా రావాలని ఆశిద్దాం .
.మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-22-ఉయ్యూరు
మీ ఆత్మీయ స్పందనకు, ఆశీరక్షతలకు ధన్యవాదాంజలులండి.
యాదేవీ సర్వభూతేషు వాగ్రూపేణ సంస్థితా,
యాదేవీ సర్వభూతేషు అర్థరూపేణ సంస్థితా,
యాదేవీ సర్వభూతేషు భావరూపేణ సంస్థితా,
యాదేవీ సర్వభూతేషు భాషారూపేణ సంస్థితా,
యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా,
యాదేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా..
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః..
అమ్మ అపార కరుణాకటాక్షవీక్షణలు,
అనంతభావధారలై, పద్య, వచన కవితా
సంకలనాలుగా రూపొంది,
అమ్మ-నాన్న చేతులమీదుగా,
జూలై 31వ తేదీ, 2022 నాడు,
ఎందరో పెద్దలు, ఆచార్యులు,
పండితులు, సాహితీవేత్తలను
సమాదరిస్తూ “అక్షరతాంబూలాలు”గా
ఆవిష్కరింపబడ్డాయి.
1. మా ఆఫ్రికా యాత్ర (పద్య సఫారీ, పలుకు కచేరీ)
2. చిత్రపది (శతాధిక చిత్రపద్యలహరి)
3. పాటవెలది (పలుకునర్తనకు పద్య పరివర్తన)
4. అమెరిక వాసి శతకం
5. ప్రవాసి (ఆధునిక జీవన పద్యకావ్యం)
6. పలకరించే పద్యం
7. తటిల్లతలు
8. అవ్యక్తం
9. ఆకుచుట్టిన ప్రకృతి
10. ఆత్మారామం (ద్వితీయ ముద్రణ)
11. ఆత్మానందం (అద్వైత జీవన కవితా మకరందం, 2017)
12. శ్రీ సాయి సురభి పద్యకావ్యం (తమ్ముడు చి. ఫణి డొక్కా రచన)
వీటిని, అందరికీ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొని, చదువుకొనేందుకు వీలుగా క్రింది లంకెలో పొందుపరచాము.
https://acchamga-telugu-ebooks.blogspot.com/2022/09/?m=1
పుస్తకాలకు ముందుమాటలనందించిన పుంభావసరస్వతులకు, అందమైన ముఖచిత్రాలను అందించిన కుంచె సోదరుడు శ్రీ కూచి సాయిశంకర్ కు, లోపలిచిత్రాలను అపురూపంగా చెక్కిన శ్రీ ఉలి గారికి, పుస్తకాలను అనతికాలంలో, అతి చక్కగా ముద్రించి, ఆన్ లైన్ లో కూడా పొందుపరచిన “అచ్చంగా తెలుగు” ప్రచురణల అధినేత్రి, సోదరి శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శిని గార్లకు అనేకానేక ధన్యవాదములు.
పుస్తకములను చదివి మీ మీ అక్షరాశీస్సులు, ఆత్మీయస్పందనలు అందజేస్తారని ఆశిస్తున్నాను.
ఈ జన్మలో ఇంతటి అపురూపమైన సాహితీబంధుత్వాన్ని అద్భుతమైన వరంగా ప్రసాదించిన సరస్వతీమాతకు సహస్రకోటి ప్రణామములు.
– రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్