కంచివరద రాజ శతకం
అల్లూరి రాజేశ్వర కవి ప్రణీతమైన కంచి వరద రాజ శతకం స్టేషన్ కొండపల్లి వాస్తవ్యులు కపిలవాయి పున్నయ్య గుప్తాగారి ద్రవ్య సహాయం చేత బెజవాడ చిత్తరంజన్ ప్రెస్ లో 1933లో ముద్రింపబడింది .వెల.రెండు అణాలు .పీఠికలో కవిగారు ఇదివరకు తాను రచించిన ‘’గీతా గేయం ‘ను త్రిపురనేని వీరరాఘవయ్య చౌదరిగారి ద్రవ్యసహాయం చేత ప్రచురించానని ,ఇంకా చాలాపుస్తకాలు తాను రాసినవి ముద్రణ భాగ్యం పొందాల్సి ఉన్నాయని పరిటాల నుంచి తెలిపారు .
ఈ శతకమకుటం –‘’భాను కోటితేజ వరద రాజ ‘’
‘’శ్రీశు గొలిచి కావ్య సిద్ధికి పలుకుల –వెలదిదలచి పొగడి విఘ్నరాజు
నమల చరిత శతక మారంభ మొనరింతు-భానుకోటి తేజ వరద రాజ ‘’అంటూ మొదటిపద్యంలో ముగ్గురు దేవతల్ని సూటిగా సుత్తి లేకు౦డా స్తుతించి కవి శతకం ప్రారంభించాడు .లేతది అని దేన్నీ లెక్క చేయకపోతే లేతముదిరి ప్రాణఘాతమౌతుందని ,నిమిషమైనా మనసు కుదురు లేకపోతె బ్రహ్మవిద్య సాధ్యంకాదనీ ,.సుకృతం చేయకుండా మడి మైల అంటూ ప్రాకులాడితే ముక్తిరాదన్నాడు .గుడిసె ,భవనం ఉంటాయికాని ‘’పాప పుణ్యములకు బట్టన మున్నె?’’మనసులోనే సకలం ఉంది అన్నాడు .కొత్తదేదీ లేదు అన్నీ జీవుడు అనుభవించి వదిలేసిందే .’’జన్మమేసకలార్తులకు కొంప-కష్టమైనా సుఖమైనా –‘’పారుడైన నేమి శ్వపచు డుగానేమి ‘’?అని తత్వరహస్యం చెప్పాడు .వేదాలు వల్లించినా జ్ఞానికాకపోతే ముక్తిరాదుకనుక వేదపఠనం మాలమాదుగులకు ఎందుకు ?అని ప్రశ్నించాడు .ధర్మం వల్లనే ఉన్నతస్థితి కలుగుతుంది .పారులు స్వకులధర్మ౦విసర్జిస్తుంటే బ్రాహ్మణవిధులపై మిగిలినవారికి ఆశ ఎందుకు ?’’బొమ్మ యగునే మూల పురుషుడు –బొమ్మగూర్చి వెలికి బొమ్మటంచు’’మాలను బాపడు తరమటం దేనికి అని భక్తనందనార్ లాంటి చరిత్ర గుర్తు చేశాడు –‘’సాగకపోతే సాధువై నంతమాత్రాన కుటిలబుద్ధిపోతుందా ‘’అన్నాడు .నాబట్టే లోకం అనుకోరాదు .తానూ పరుల క్షేమం కోరేవాడే అయినా ‘’తనను జంపు దొంగ ధనము కోరి ‘’అనిలోక రీతి చెప్పాడు ..దరిద్ర దేవత తలపై నర్తిస్తుంటే ,చెడుమనసుతో ఇంకోర్ని దోచుకుంటే ‘’వ్రాత పోనే ?గోచిపాతయే గతిగాక’’ ?అని జీవితరహస్యం చెప్పాడు .
28వ పద్యం లో ‘’వెంకటాద్రి మీకు కై౦కర్యమును జేసి –నట్టి భక్తుడతని యన్వయుండ’’నేనుకొత్తకాదు దాసకోటిలోని వాడినే అని చిరునామా చెప్పుకొన్నాడు వరదయ్యకు .’’తండ్రివైతి వీవు తల్లి పేరుందేవి –తల్లిదండ్రి బాల్యదశ గతింప-నున్న దంతియే స్థితి విన్నవి౦చిన దంతె’’అని తేల్చేశాడు .వెంకటాద్రి పాద పంకేరుహమే నౌకగా పాపసాగరం దాటి-అద్వయ కనుగొందు నీ ద్వీపమున నిన్ను ‘’అని తన అన్వేషణ చెప్పాడు .’’నాకు దొడ్డ కలిమికావాలి .మనుష్యుడు ఇవ్వగలడా “”అని ప్రశ్నిస్తాడు .’’విలవిల యన బట్టి పీకుకదిను –ప్రాణి బ్రాణి –సృజన పరచితేల –జీవ హి౦సయే విశేషమా ?’’అని హింసా విధానం పై బాధపడ్డాడు .
‘’భాగవతుల చెలిమి లేకుండా ఈశ్వర జ్ఞానం కలుగదన్నాడు కవి .మగాళ్ళను అన్నదమ్ముల్లా ,ఆడువారిని అక్క చెల్లెళ్ళు చూసే మంచి బుద్ధి ఇవ్వు. అదే పది వేలన్నాడు .స్థిర౦ కాని సృష్టి వైచిత్రికి భ్రమపడి చి౦తల్లోముంచి వినోదం చూస్తావు .’’ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తాడో ,ఇక్కడ పుట్టి ఎక్కడికి వెడతాడో జీవుడు ?అన్ని ప్రాణులకు అసలు ఆట పట్టేది ?’’’’కరువు చేత డబ్బు కటువైన ,బోగము –ముండలకడ ,కల్లు కుండలకడ – నాటపట్టు దప్పదు అక్షయ లక్ష్మికి ‘’అని నిష్టూరం వేశాడు .మందులు అనేకం అయ్యాయి కాని రోగం కుదిర్చే వాడు దొరకటం లేదు. కనుక ‘’నీవుపూనుకొనుము నెమ్మది౦చును రుజ ‘’అని భక్తవరదుని పైనే భిషగ్వర భారం వేశాడు వ్యంగ్యంగా కవి .నీకరుణ ఉంటె చాలు ‘’దేవతల ఐరావతంకూడా ఎక్కను.నా వైద్యులు ఆశ్వినీదేవతలే ‘’.అనంత బాహుడివి ‘’నాతలపై పెట్టటానికి నాలుగు చేతులైనా లేవా సామీ ?పోనీ కనీసం ఒక్కచెయ్యి కూడా లేదా భగవాన్ అని చమత్కరించాడు.
‘’నన్ను గావురమ్మునా వినకు౦దువు – కరిని గావ నైతె పరగినావు?దాని సేవ నీ కృతార్ధత కాబోలు ‘’అని మేలమాడాడు .జ్ఞానికి చావుపుట్టుకలు నిద్రపోయి లేచినట్లే ఉంటాయి .మరణభీతి లేశ మాత్రం ఉండదు .
చివర్లో ఆంగీరసనామ సంవత్సరం విజయదశమినాడు వరద రాజస్వామికి అ౦కిత మిచ్చానని ‘’అందుకొని నిలువుమా కల్పము౦దాక ‘’అని సభక్తికంగా అంజలి ఘటించాడు .
106వ చివరిపద్యం లో –‘’అప్పగింప శతకమల్లి –యల్లూరిరా-జేశ్వరకవి ,దీని శాశ్వతముగ-నిలుపు మంకితంబు నీకిడు గడు బ్రీతి –భాను సమాన తేజ వరద రాజ ‘’అని శతకం ముగించాడు భక్తకవి .శతకం లో తనగురించి ఏమీ చెప్పుకోలేదు .ఆ ఒక్కటితప్ప మిగిలినవి ఏమేమి రాశాడో కూడాలేదు .వరదరాజస్వామి గురించీ లేదు .ఆస్వామికే ఎందుకు అ౦కిత మిచ్చాడో కూడా లేదు .ఈ శతకం గురించి ఈకవి గురించి మనవారెవరూ ఎక్కడా పేర్కొన్నట్లు లేదు .కవిని శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు దక్కింది .లలితపదజాలం సూటి కవిత్వం ఆత్మవిశ్వాసం ,వరద రాజ పద భక్తీ ప్రతిపద్యంలో కనిపిస్తుంది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-22-ఉయ్యూరు