రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -3
10-మహాయోగిని ఆదోని లక్ష్మమ్మ
శ్రీఃభగవాన్ శ్రీ మహా యోగి లక్ష్మమ్మవారి సంక్షిప్త జీవిత చరిత్ర
శ్రీ మహాయోగి లక్ష్మమ్మవారు ఆదోనికి 7 కి.మీ దూరంలో గల మూసానిపల్లె గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ, బండెప్ప అనే పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే అవధూతగా సంచరింస్తూ ఉండేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, నగ్నంగా సంచరించే ఆమెను పిచ్చిదని అందరూ భావించే వారు. ఆమె నిజతత్త్వాన్ని తెలుసుకోలేని సామాన్య ప్రజలు పెళ్ళిచేస్తే పిచ్చి కుదురుతుందని భావించి మారెప్ప అనే యువకునికిచ్చి పెళ్ళి జరిపించారు. కానీ పెళ్ళి రోజు రాత్రే ఆమె యథాప్రకారంగా దిగంబరంగా తిరిగివచ్చి పుట్టింటికి చేరింది. ఆమెను పిచ్చిదానినిగా భావించి ఆమెను రాళ్ళతో కొట్టి హింసించడం వంటి పనులు చేసినవారంతా ఆమెనొటినుంచి వెలువడిన వాక్కులే శాపాలుగా తగిలి నశించి పోయారు. ఆమె వాక్శుద్ధి అట్టిది. ఆదోనిలో జరిగే సంతకు వస్తున్న వారితో కలిసి తన 15వ ఏట ఆమె ఆదోని చేరింది. దిగంబరంగా తిరుగుతూ, దొరికింది తింటూ ఆమె కసువు తొట్టి పక్క స్థిరంగా ఉండిపోయింది. అప్పటినుంచీ ఆమెకు తొట్టి లక్ష్మమ్మ, తిక్క లక్ష్మమ్మ అనే పేరు స్థిర పడింది.
ఆమె చూపిన మహిమలు
లక్ష్మమ్మ తన వాక్శుద్ధితో గౌరమ్మ అనే మహిళ భర్తకు కాన్సర్ వ్యాధి నయం చేసింది. ఆమె అవ్వకు ఒక్క అణా సమర్పించుకోగా అవ్వ ఆమెను అరవై ఎకరాల భూస్వామినిగా చేసింది. మహాత్ములకు చిత్తశుద్ధితో సమర్పించుకొన్నది ఎంత స్వల్ప మొత్తమైనా అది అనేక రెట్లు ఫలాన్ని ఇస్తుందనడానికి ఇదే నిదర్శనం. అవ్వ ఇచ్చిన ఫలాలను ఆరగించిన అనేక మంది గొడ్రాళ్ళు సంతానవతులైనారు. ఊరికి రాబోయే ఉపద్రవాలను తన చర్యలద్వారా సూచించిన త్రికాలవేత్త శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ. కుండపోతగా వర్షం కురిసిన తరువాత పొంగిపొర్లుతున్న కాలువలో ఆమె మరణించి ఉంటుందని గ్రామస్థులు భావించి, చింతింస్తున్న సమయంలో, లక్ష్మమ్మవ్వవారు చెక్కుచెదరకుండా క్షేమంగా బయటికి వచ్చి తన మహిమతో అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. శరీరాన్ని ముక్కలుగా చేసి మరలా ఏమీ తెలియయనట్లు సాధారణంగా దర్శనమిచ్చే ఖండయోగాన్ని కూడా ఆమె చూపారు.
అమే నిజమహిమ తెలుసుకొన్నస్వర్గీయులు రాచోటి వీరన్నగారు, తుంబళంగుత్తిలక్ష్మయ్య గారు, బల్లేకల్లు నరసప్పగారు, మన్నే రాంసింగ్ గారు మొదలైన వారెందరో ఆమె సేవలో తరించి సౌభాగ్యము, సంపదలు పొందినారు. స్వర్గీయ రాచోటి రామయ్య గారు ఆమె సజీవురాలుగా ఉండగానే ఆమెకు రథోత్సవం జరిపించి ధన్యులైనారు. లెక్కకు మిక్కిలిగా మహిమలను ప్రదర్శించిన శ్రీ మహాయొగి లక్ష్మమ్మవారు 16-05-1933 శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు సమాధిలో ప్రవేశించారు. అప్పటినుంచీ అవ్వ సమాధి చెందిన రోజున ప్రతి సంవత్సరం రథోత్సవం వైభవంగా జరుపబడుతున్నది.ఆదోని మాజీ శాసన సభ్యులు శ్రీ రాచోటి రామయ్యగారి ధర్మకర్తృత్వంలో అవ్వకు వెండిరథము, దేవాలయానికి వెండిరేకుల తాపడము, అవ్వ విగ్రహానికి బంగారు కవచము, అనేక బంగారు ఆభరణాలు మొదలైన దివ్యమైన మొదలైన నూతన శోభలు చేకూర్చబడి అవ్వమందిరము దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోని అనేక ప్రాంతాలనుంచీ భక్తులను అశేషంగా ఆకర్షిస్తున్నది.
శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ సమాధి చెందిన ఆదోని పట్టణంలోనే కాకుండా ఆమె జన్మస్థలమైన మూసానిపల్లె, అనేక ప్రాంతాలలో ఆమె మందిరాలు నిర్మించబడి నిత్యపూజలు జరుపబడుతున్నాయి కొలిచిన వారికి కొంగుబంగారము, నమ్మినవారికి నమ్మినంత వరాలనిచ్చే అమృతస్వరూపిణి భగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారు.
11- ‘’రాయలసీమ చిన్నోణ్ణి రాళ్ళమద్దె బతికేవాణ్ణి – రాగాలే ఎరుగకపోయ్‌నా అనురాగానికి అందేవోణ్ణి’’అంటూ వేదికలేక్కిన బుర్రకధ నాయకుడు,నటుడు ,నాటక కధారచయిత డాక్టరేట్ ,కామధేను పత్రిక పులికంటి సత్కృతి స్థాపకుడు –శ్రీ పులికంటి కృష్ణా రెడ్డి
పులికంటి కృష్ణారెడ్డి (జూలై 30, 1931 – నవంబర్ 19, 2007) కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా “రాయలసీమ చిన్నోణ్ణి రాళ్ళమద్దె బతికేవాణ్ణి – రాగాలే ఎరుగకపోయ్‌నా అనురాగానికి అందేవాణ్ణి” అంటూ గొంతెత్తి పాడి అందరి మన్ననలను అందుకున్న ప్రతిభామూర్తి పులికంటి కృష్ణారెడ్డి[1].
జీవిత విశేషాలు
1931, జూలై 30 న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కిదోన గ్రామంలో రైతు కుంటుంబంలో జన్మించాడు. పులికంటి గోవిందరెడ్డి, పాపమ్మ దంపతులు ఇతని తల్లిదండ్రులు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం జక్కిదోనలోనే సాగింది. ఉన్నతపాఠశాల విద్యకోసం తిరుపతిలోని తిరుపతి దేవస్థానం హిందూ ఉన్నత పాఠశాల (నేటి ఎస్వీ ఉన్నత పాఠశాల) లో చేరాడు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రైల్వే ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 13 సంవత్సరాలపాటు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసిన ఆయన నాటకాల మీద మక్కువతో దాన్ని వదులుకున్నాడు. నాటకాలు వ్రాయడంలో, వేయడంలో ఇతని గురువు నాగేశం కాగా కవిత్వంలో ఓనమాలు నేర్పింది చేబ్రోలు సుబ్రహ్మణ్యశర్మ.
రచనలు
ఆయన దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్యనాటికలు, 6 శ్రవ్యనాటికలు, పది బుర్రకథలు, 4 సంగీత రూపకాలు, జానపద శైలిలో 43 అమ్మిపదాలు, 60 లలిత గేయాలు రాసాడు. రాయలసీమ జీవన వ్యథల్ని దాదాపు 200 కథలుగా వెలువరించిన ఈయన గూడుకోసం గువ్వలు, పులికంటి కథలు, పులికంటి దళిత కథలు, పులికంటి కథావాహిని సంపుటాలను తెచ్చాడు. ఇతని కథలు ఇంగ్లీషు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. తిరుపతి పరిసర ప్రాంత జనజీవనాన్ని ప్రతిబింబించే నాలుగ్గాళ్ళ మండపం ఈయనకు ఎక్కువ పేరు తెచ్చింది. ఈయన రాసిన అమ్మిపాటలు ఎంకిపాటలకు దీటుగా నిలిచాయి. ఇతడు ఎన్నో జాతీయ కవిసమ్మేళనాలలో పాల్గొని తన కవితాగానంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసేవాడు.
నాటకరంగం, బుర్రకథలు
ఇతడు మంచి రంగస్థల నటుడిగా పేరు సంపాదించాడు. నాటకరచయితగా రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మెప్పును పొందాడు. తిరుపతి లలిత కళా సమితి నాటికల పోటీలలో ఎన్నోసార్లు పాల్గొని బహుమతులు పొందాడు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఇతడిని నటనాగ్రేసరుడు అని కొనియాడాడు. ఇతడు బుర్రకథ గాయకుడు కూడా. కమ్మని గానంతో, చమత్కారవ్యాఖ్యానంతో సాగే ఇతని బుర్రకథలను విని మధురాంతకం రాజారాం వంటి ప్రసిద్ధులు పరవశించి ఇతడిని పొగడ్తలతో ముంచెత్తినారు. ఇతడు మంచి వక్త కూడా. జానపద వాజ్మయం మీద, నాటకరంగం మీద ఈయనకు మంచి పట్టు ఉంది.
కామధేను
ఇతడు తిరుపతి కేంద్రంగా కామధేను అనే సాహిత్యపత్రికను కొన్ని సంవత్సరాలు సంపాదకత్వం వహించి నడిపాడు. ఈ పత్రిక నిర్వహణ కోసం ఒక ముద్రణాలయాన్ని స్థాపించాడు. ఈ పత్రిక ద్వారా కవులకు, ఇతర రచయితలకు ప్రోత్సాహం కలిగించాడు. ఈ పత్రక చేసిన సాహిత్యసేవ గణనీయమైనది.
పురస్కారాలు
అగ్గిపుల్ల’ నవలకు చక్రపాణి అవార్డు లభించింది. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఆడిషన్ కమిటీ సభ్యుడిగా, సలహాదారునిగా కొంతకాలం వ్యవహరించాడు. నటుడిగా, రచయితగా కవిగా పలుబిరుదులు, సన్మానాలు అందుకున్నాడు. ఈయన రచనలపై పరిశోధనలు చేసి నలుగురు పీహెచ్‌డీ, ముగ్గురు ఎంఫిల్ పట్టాపొందారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 2005లో ఈయనను గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. తన సాహితీ, కళారంగాల కృషికిగాను ఎన్నో ఆవార్డులు, రివార్డులు పొందిన ఈయన పులికంటి సాహితీ సత్కృతి సంస్థను స్థాపించి ఏటా సాహిత్య, కళా రంగాలలో విశేష కృషి చేసిన వారిని సత్కరించాడు. ప్రముఖులపై వివిధ సందర్భాలలో పులికంటి రాసిన వ్యాసాలను పులికంటి హృదయ చిత్రాలు పేరుతో పుస్తకంగా తెచ్చాడు.
మరణం
తిరుపతిలో 2007 నవంబరులో జరగనున్న తెలుగు భాషా బ్రహ్మోత్సవాల సందర్భంగా సన్మాన గ్రహీతల్లో కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. అయితే ఈ లోపే, 2007, నవంబర్ 19 న పులికంటి కన్నుమూశాడు.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-22-ఉయ్యూరు