’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -1
మదన్ గోపాల్ రాసిన పుస్తకానికి శ్రీమతి ఎ.లక్ష్మీ రమణ చేసిన అనువాదమే ‘’ భారతే౦దు హరిశ్చంద్ర ‘’.దీన్ని కేంద్ర సాహిత్య అకాడెమి 1981లో ప్రచురించింది వెల-4రూపాయలు .
19వ శతాబ్ది మేధావి భారతే౦దు హరిశ్చంద్ర .బహుముఖ ప్రజ్ఞాశాలి ,సంఘ సంస్కర్త .ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ,తిరువనంతపురం యువరాజు కేరళ వర్మ ,కేశవ చంద్ర సేన్ ,మధుసూదన దత్ ఆయన సమకాలికులు .బెంగాల్లో వచ్చిన మార్పుల్ని హిందీలో ప్రవేశపెట్టాడు .ఆధునిక హిందీభాషకు నాంది పలికి ,వివిధ శాఖలకు అండగా నిలిఛి ‘’ఆధునిక హిందీ భాషా పితామహుడు ‘’అయ్యాడు . .హిందీ పత్రికారంగం లో అగ్రస్థానం సాధించాడు .వివిధ ఛందస్సులలో 3వేల భక్తీ గీతాలు రాశాడు .ఖడీ బోలీ మాండలీకాన్ని ప్రచారంలోకి తెచ్చాడు భారత దేశ భాషలలో ఎంతో కృషి చేసిన విదేశీ రచయిత జార్జి గ్రీసన్ ‘’ఈ నాటి భారత దేశ కవులలో సుప్రసిద్ధుడు ,దేశ భాషా వ్యాప్తి చేసినవారూ మాన వేందు కంటే ఎవరూ లేరు ‘’అన్నాడు .ముప్ఫైనాలుగు ఏళ్లకే 175రచనలు చేశాడు అని ఎఫ్. ఇ.పాయ్ అన్నాడు .
వారణాసి లో వ్యాపార కుటుంబం లో జన్మించిన హరిశ్చంద్ర ముత్తాత వ్యాపారం లో మీర్జాఫర్ చేత మోసగ౦ప బడ్డాడు.దాన్ని తట్టుకోలేక దిగులుతో చనిపోయాడు .ఆయనకొడుకు సేత్ ఫతే చ౦ద్ సోదరుదడితోకలిసి వారణాసి వచ్చి వ్యాపారంలో బాగా సంపాదించి కాశీ రాజుకే పెట్టుబడులు పెట్టగల సమర్ధుడయ్యాడు .ఈయన మనవడు గోపాల్ చంద్ర వ్యాపారంలో దిట్ట .వ్యాపారంతోపాటు కవిత్వంలోనూ పట్టుసాధించి ‘’గిరిధరదాస్ ‘’కలం పేరుతొ నలభై రచనలు చేశాడు .వైష్ణవ సంప్రదాయం వీరిది.బ్రిటిష్ వారు నిర్వహించే పుష్ప ప్రదర్శనలో ఎప్పుడూ మొదటి బహుమతి పొందేవాడు .గానం, సంగీతం అంటే మహా పిచ్చి .ప్రతి ఏడాదీ కాశీలో జరిగే బుడవా మంగళ –నౌకామహోత్సవం లో ఇతని కుటుంబ పాత్ర గొప్పగా ఉండేది .కాశీ రాజుకూడా పాల్గొనేవాడు .ఈ తెప్ప తిరునాళ్ళలో ఈ కుటుంబానికి అంత ప్రాముఖ్యం ఉండేది .కళాకారులకు రచయితలకు గోపాల చంద్ర అండగా ఉండేవాడు .ఎప్పుడూ ఎవరినోఒకర్నిపిల్చిఆతిధ్యమిచ్చేవాడు బసంతు ఉత్సవానికి పిల్చేవారు వచ్చేవారు పసుపు రంగు వస్త్రాలు ధరించేవారు .రంగురంగుల వసంతం చల్లుకొనేవారు .హోలీ అంటే కిర్రెక్కించే వారు .
గోపాల్ చంద్ర గిరిధర్ దాస్ పెద్దకుమారుడే మన హరిశ్చంద్ర 1950లో జన్మించగా తమ్ముడు గోకుల్ చంద్ర 15నెలల తర్వాత పుట్టాడు .హరిశ్చంద్ర సాహిత్య వృత్తికీ గోకుల్ వ్యాపార వృత్తికీ అంకితమయ్యారు .రాజారామ మోహన్ రాయ్ బ్రహ్మ సమాజోద్యమం తో ఎన్నో సంస్కరణలు తెచ్చిన కాలం అది .1848లో లార్డ్ డల్హౌసీ రాకతో ఒక శకం ముగిసింది .ఈస్ట్ ఇండియాకంపెనీ పంజాబ్ నుకూడాస్వాధీనం చీసుకొని ఆక్రమణలో అగ్రస్థానం పొందింది .కలకత్తానుంచి ఆగ్రాకు వైర్లెస్ వచ్చింది .కలకత్తా నుంచి ఢిల్లీ కి రైల్ మార్గమేర్పడింది .నదులపై ఓడలు నడిచాయి. బాంబే మద్రాస్ కలకత్తాలలోయూని వర్సిటీలు ఏర్పడ్డాయి .హిందూ విధవా వివాహ చట్టం అమలైంది .పాశ్చాత్య పద్ధతుల ప్రభావం నెమ్మది నెమ్మదిగా పడుతోంది .
పాశ్చాత్య నాగరకత వైపు గోపాల్ చంద్ర కూడా ఆకర్షితుడయ్యాడు .తనతండ్రి ఇంగ్లీష్ నేర్చుకోకపోయినా,అభ్యుదయభావాలు పొందాడని మతాచారం ఉన్నా ఆధునికతవైపు మొగ్గు చూపాడని ,ధాంప్సన్ గవర్నర్ గా ఉన్నప్పుడు కాశీలో పెట్టిన బాలికా పాఠశాలలో తన సోదరిని చేర్చాడని ,ఆకాలం లో అది గొప్ప సాహస చర్య అనీ ,తమందరికి ఇంగ్లీష్ నేర్పించాడని చెప్పాడు .
1857లో బ్రిటిష్ వారు ఎంతోఆపదలో ఉంటె ,వారిఅమూల్య వస్తువుల్ని గోపాల్ చంద్ర ఇంట్లో భద్రపరచారు .వీరికుటు౦బీకులకు బ్రిటిష్ వారు 48తుపాకీలు పిస్టల్స్ ఇచ్చారు .వీటితో బ్రిటిష్ వారికి రక్షణ కల్పించారు .ప్రథమ స్వాతంత్ర్య సమరానికి ఏడేళ్ళు ము౦దేపుట్టిన హరిశ్చంద్ర బాల్యంలో మహాతెలివి తేటలతో చిలిపితనం తో అందర్నీ ఆకర్షించేవాడు .చీకటిలో మెరిసే భాస్వరం తో గోడలపై బొమ్మలేసి రాత్రిళ్ళు తోటి వారిని భయపెట్టేవాడు .ఉర్దూ పార్శీ ఇంగ్లీష్ నేర్పే బడిలోనే చేరిచదివాడు .అతని జ్ఞాపక శక్తి అమోఘం .తండ్రి సాహితీ వాసనయీయనకూ అబ్బి ఆనాటి బ్రిజ్ భాషలో పద్యాలు రాయటం అందులోని కవిత్వాన్ని వివరించటం చేసేవాడు .పద్యాల్లో నవరసాలు ఒలకబోసి పండితులను మెప్పించేవాడు .భార్య చనిపోతే తండ్రి ద్వితీయం చేసుకొన్నాడు .ఇద్దరుకొడుకులకు ఉపనయనాలు చేశాడు .27ఏళ్ళు మాత్రమె ఉన్న గోపాల్ చంద్ర భ౦గ్ పానానికి బానిసయై మితిమీరి, వడుగు జరుగుండగానే అకస్మాత్తుగా చనిపోయాడు .దర్జాగా కుర్చీలో కూచున్నతండ్రికి ఏ అనారోగ్యలక్షణాలు కనపడలేదని అయితేహఠాత్తుగా ‘’శీతలాని బాగ్ మోడ్ దీహై –అచ్చా అబ్ లేజావ్ ‘’అంటూ చనిపోయాడని హరిశ్చంద్ర చెప్పాడు .
తండ్రి చనిపోయేనాటికి కొడుకులు చాలా చిన్నవాళ్ళే .సవతి తల్లీ చిన్నదే .ఇంటి పెత్తనం ఒక బంధువు చేతిలో పడింది .క్వీన్స్ కాలేజీలోచదువుతున్న హరి స్థిమితం లేకుండా ,క్రమశిక్షణ లేకుండా ఉండేవాడు .తండ్రి మరణం తో బంధనాలు తెగాయనుకొన్నాడు .డబ్బు దుబారా చేసేవాడు. అందుకని ఇంట్లో అందరికీ దూరమయ్యాడు .సవతితల్లి పిసినిగొట్టుగా ఉండేది .నౌకామహోత్సవాలకు కూడా డబ్బు ఇచ్చేదికాదు .అప్పులే శరణ్యం అయ్యాయి హరిశ్చంద్రకు .గోరంత అప్పు కొండ౦తై భారమైంది .దిగాలుగాఉండేవాడు .పెళ్ళికూడా చేసేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-22-ఉయ్యూరు