మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -18
· 52-జైన మత మహా చార్యుడు ,పంచాస్తికాయ కర్త -,ఆచార్య కుంద కుందా చార్యుడు
· కుందకుందాచార్యుడు, తెలుగు వాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా గుంతకల్లుకు 4 మైళ్ల దూరాన కొనకొండ్ల అనే పల్లె ఉంది.ఈ కొనకొండ్ల కే ఒకప్పుడు కొండకుంద అనే పేరు ఉండేది…సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే ఆ ఊళ్లో ఎల్లయ్య (ఏలయ్య) అనే మహనీయుడు జైనమతాన్ని తీసుకుని పద్మనంది (పద్మనంది భట్టారకుడు) అనే కొత్తపేరుతో దానికి సమీపానే గల కొండపైన నివసించేవాడని అక్కడి శాసనాలుబట్టి తెలుస్తుంది.ఇతను జైనమత సాంప్రదాయంలో కుందకుందాచార్యునిగా సుప్రసిద్ధుడు..
· కొనకొండ్ల గ్రామవాసి కనుక ఆ ఊరిపేరుమీదుగనే ఇతనిని కొండకుందాచార్యుడు లేదా కుందకుందాచార్యుడు అన్నారు.ప్రాచీన జైన సంప్రదాయాల్లో కొండకుందాన్వయం ఒకటి.ఇతనికి వక్రగ్రీవుడు (ఈయనకు మెడకొంచెం వంకరగా ఉండేదట), గ్రద్ద పింఛుడు (గద్ద ఈకలపింఛాన్ని చేతపట్టుకుని ఉండేవాడు), ఏలాచార్యుడు అనే పేర్ల ఉన్నాయి.
· సామన్యశకం 40 ప్రాంతంలో పుట్టాడని, సా.శ. 44 లో కైవల్యం పొందినట్టుగా చెప్తారు. అంటే సుమారు 85 ఏండ్లు జీవించినట్టుగా తెలుస్తుంది.దేశం నలుమూలలా జైనాన్ని ప్రచారం చేశాడు.ఇతని శిష్యుల్లో ముఖ్యులు: బలాక పింఛుడు, కుందకీర్తి, సామంతభద్రులు.
రచనలు
కుందకుందాచార్యుడు మహాపండితుడు. సమయాచారం, ప్రవచనసారం, పంచాస్తికాయసారం అనే సారత్రయ గ్రంథాలను, నయమసారమనే 8 గ్రంథాల సంకలనాన్ని, రయనసారం, అష్టసాహుడు, బరసానువాకం, దశభక్తి, మూలాచారం అనే గ్రంథాలను రచించాడు. వీటిలో మూలాచారం జైన సాంప్రదాయంలో అత్యంత ప్రాచీన ప్రామాణిక గ్రంథం.
ప్రాముఖ్యత
కుందకుందాచార్యుడిని జైనులకు గురుపీఠంగా చెప్తారు.అతని శిష్యపరంపర తమది కుందకుందాన్వయమని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు.ఈనాటికీ ఈయన పేరును జైనులు స్మరిస్తారు. అన్ని జైనసభలలోనూ ప్రారంభంలో చదివే మంగళా శాసనంలో అతని పేరు వినపడుతుంది.
మంగళం భగవాన్ వీరో
మంగళం గౌతమో గణిన్
మంగళం కుందకుందార్యో
జిన ధర్మోస్తు మంగళం….
మహావీరుడు, గౌతములతో పాటు ఒక్క కుందకుందార్యుణ్ణే స్మరిస్తూ స్తుతిస్తారు.కొనకొండ్లను కొండకుందేయ తీర్థం అని కూడా అంటారు.మూలసంఘానికి అధ్యక్షత వహించిన ఆచార్యులలో భద్రబాహుని అనంతరం నాలుగవ ఆచార్యుడు కొండకుంద…52 సంవత్సరాలు ఆచార్య పదవినలంకరించినట్లు జైన సాంప్రదాయం తెలుపుతుంది.ఇతను బలాత్కార గణాన్ని, సరస్వతీగచ్ఛ (వక్రగచ్ఛ) లను స్థాపించారు..కుందకుందాచార్యుని ఇతర శిష్యులు ఆంధ్రదేశంలోని పలు చోట్లలో మూలసంఘ శాఖలు విస్తరింపజేశారు
· 53-బాలసాహిత్య,గేయ కర్త ,కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత –శ్రీ కలువకొలను సదానంద
· కలువకొలను సదానంద ప్రముఖ బాల సాహిత్య రచయిత. బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి మొట్టమొదటి బాలసాహిత్య పురస్కార్ పురస్కారం అందుకున్న వ్యక్తి.
జీవిత విశేషాలు
సదానంద చిత్తూరు జిల్లా పాకాల లో శ్రీమతి నాగమ్మ, కృష్ణయ్య దంపతులకు తేది. ఫిబ్రవరి 22 1939 న జన్మించారు. ఎస్.ఎస్. ఎల్.సి చేసి టి.ఎస్.ఎల్.సి చదివారు. వృత్తిరీత్యా 36 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1997లో పదవీ విరమణ పొంది పాకాల లోనే స్థిర పడ్డారు.
రచయితగా
సదానంద మొదటి రచన తన 18 ఏటనే ప్రచురితమైంది. చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, బాలరంజని, బొమ్మరిల్లు, బాలభారతి, బుజ్జాయిలాంటి బాలల మాస పత్రికలలో, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి వంటి వార, మాస పత్రికలలోని పిల్లల శీర్షికలలో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఈనాడు దినపత్రిక ‘హాయ్‌బుజ్జి’ పేజీలో వీరికథలు ఎక్కువగా మనం గమనించవచ్చు.
సదానంద బాలలకోసం ఇప్పటి వరకు 200కు పైగా కథలు, 2 నవలలు, 100 కి పైగా గేయాలు, కొన్ని గేయకథలు రాశారు. 8 కథా సంపుటాలు, 2 నవలలు ప్రచురించారు. తన 25 సంలో రాసిన పిల్లలనవల బాల రంజనిలో సీరియల్‌గా వచ్చింది. 1964లో మొదటి కథా సంపుటి ‘సాంబయ్య గుర్రం’ ప్రచురితమైంది. అదే సంవత్సరం ‘చల్లనితల్లి’, 1966లో నీతికథామంజరి, 1967లో విందుభోజనం, 1983లో శివానందలహరి ఇలా… మొత్తం 8 కథా సంపుటాలు ప్రచురించారు. 1965లో బాలల కోసం ‘బంగారు నడిచినబాట’ నవల ప్రచురించారు. ఈ నవలకు 1966లో ఉత్తమ బాల సాహిత్య గ్రంధంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వారి పురస్కారం లభించింది. వీరి “నవ్వే పెదవులు – ఏడ్చేకళ్ళు” కథా సంపుటానికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగు కథాసాహిత్యంలో వంద ఆణిమ్యుత్యాలు పేరుతో వెలువడిన కథా సంకలనంలో వీరి కథ “తాత దిగిపోయిన బండి”కి స్థానం లభించింది. త్వరలో వీరి “పరాగభూమి కథలు” గ్రంథం వెలువడనుంది[1].
పెన్నేటి ప్రచురణలు, కడప వారు సదానంద పిల్లల నవల ‘అడవితల్లి’ 2007లో ప్రచురించారు. మహాభారతంలోని కొన్ని పద్యాల ఆధారంగా అల్లిన నవల. మొదట ఈ నవల ‘బాలరంజని’ పిల్లల మాసపత్రికలో ప్రచురితమై బాలలను అలరించింది.
పురస్కారాలు
· ప్రతిభా పురస్కారం – తెలుగు విశ్వవిద్యాలయం, 2013[2][3]
మరణం
ఈయన ఆగస్టు 25, 2020న పాకాలలోని తన స్వగృహంలో స్వర్గస్థులైనారు.
· 54-నవల కధలలో మానవ అంతరంగ కల్లోలాల ఆవిష్కర్త –శ్రీ కాశీభట్ల వేణు గోపాల్
· కాశీభట్ల వేణుగోపాల్ ఒక ప్రముఖ కవి, రచయిత. ఆయనకు సంగీతంతో కూడా పరిచయం ఉంది. ఆయన స్వస్థలం కర్నూలు.
జీవిత విశేషాలు
కాశీభట్ల వేణుగోపాల్ జనవరి 2, 1954 కర్నూలులో కాశీభట్ల యల్లప్ప శాస్త్రి, హనుమాంబ దంపతులకు పుత్రిడిగా జన్మించారు. వీరిది శుద్ధ శ్రోత్రియ కుటుంబం. వీరికి ఇద్దరు అన్నలు. ఆరుగురు అక్కలూ. అందరికన్నా ఆఖర్న ఈయన జన్మించారు. తొమ్మిది నెలల బిడ్డగా వున్నప్పుడే నేను స్పష్టంగా మాట్లాడుతుంటే ముచ్చటపడి నాకు కాళిదాసు, రఘువంశ కావ్యంలోని శ్లోకాల్ని నేర్పించింది అమ్మ అని, అన్నలూ, అక్కలూ అంతా వెళుతుంటే వాళ్ళ వెంటపడి గ్రంథాలయానికి వెళ్తూ చదవడాన్ని అలవాటు చేసుకున్నాను అని, అమ్మకూ అక్కలకూ సాహిత్యం యిష్టం కాబట్టి నాకుకూడా వెళ్ళి కవి కావాలనుకున్నారు అని చెబుతారు. [1]
వేణుగోపాల్ మొదటి గురువు హనుమాంబ అని చెప్పుకుంటారు. కాలీజీల చదువు అబద్ధం అని నమ్మి కాసింత చదువులు చదివి వచ్చిన ధృవ పత్రాలు అన్ని చించి వేసి సాహిత్య ప్రస్థానం కొనసాగించాడు. ఏవో నాలుగు అక్షరాలు పట్టుబడింది పాతికేళ్ళ తర్వాతే అని, డెబ్బైల నుండీ అతని అసలు సాహితీ ప్రస్థానం మొదలైంది. శ్రోత్రియ నియమాలను వ్యతిరేకించినట్టే అన్ని మానవ నిర్మితాలైన విలువల్నీ ఒప్పుకోలేను అందుకేనేమో మనసుకు దగ్గరగా వచ్చిన స్నేహితులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు అని చెప్పుకుంటారు. ఎవ్వరితోనీ పోల్చదగ్గ వాడిని కాను అని, ఈ చిన్న జీవిత ప్రస్థానంలో బాగా తెలుసుకున్నదొకటే నాకేమీ తెలియదు అంటారు. ఈయనకి వేణువు ప్రియమైన వాయిద్యం.
మల్లాది, బుచ్చిబాబు, ల ప్రభావం ఈయన మీద బాగా ఉంది.కానీ శ్రీశ్రీ ప్రభావం అంతగా లేదు చెబుతారు. గుంటూరు శేషేంద్ర శర్మకి వీరు అభిమాని. మొదట్లో అభ్యుదయ, విప్లవ సాహిత్యాలుకు ఆకర్షించినా, విశ్వసాహిత్యాన్ని చదివే క్రమంలో వాటి నుండి బయటపడ్డాను అని చెబుతారు. వీరు బ్రహ్మచారి అని, మంచి పద్యం, మద్యం రెండూ నాకు ప్రీతి అని చెబుతారు. కీర్తిశేషులు అమ్మ చిన్నప్పుడే వల్లె వేయించిన అమరకోశం, చదివించిన రఘువంశం ఈ రోజుకీ నాకు ఉపయోగపడుతాయి అంటారు. ఫ్రాంజ్ కాఫ్కా, గోగే, హరిప్రసాద్ చౌరాసియా వీరికి ఇష్టులు.
దేశాటన చేయడం వీరికి ఎంతో ఇష్టంగా ఉండేది. అందుకే మూడుసార్లు దేశాటన చేశారు. చదివే అలవాటుతో పాటు, అలా దేశాటన చేయడం వల్ల కూడా నాలోని రచయిత గాఢమైన అనుభూతుల్ని వొడిసి పట్టుకోగలిగాడనుకుంటారు. నేను రచయిత కావడానికి అదే కారణమైందని అంటారు. యవ్వన ప్రాయంలో ఉండగా సైకిల్ మీదా, స్కూటర్ మీదా మూడుసార్లు దేశాటన చేశారు. జీవితాన్వేషణలో వారణాసిలోనూ, లక్నోలోనూ కొంత కాలం ఉన్నారు. ఆ సమయంలోనే సంగీత సాధన చేశారు.
రచన శైలి
గందరగోళమైపోయిన సమకాలీన జీవితంలోని అస్థిరత్వాన్ని అంతే గందరగోళంగా ఆవిష్కరించి, సాదా సీదా క్లియర్ కట్ ఆలోచనలను ధ్వంసం చేసే రచనలు కాశీభట్ల వేణుగోపాల్ రచనలు. ఆయన భాష చాలా పదునైంది. ఆయన ఒక్కోసారి ప్రశ్నిస్తాడు, ఒక్కోసారి సమాధానపరుస్తాడు. ఆయన వాక్యాలు ఒక ఇమేజే మీద మరొక ఇమేజ్ ఏర్పడి form అయ్యే మాంటేజ్ లు. ఇంగ్లీషూ, తెలుగు కలగలిసిపోయి ఒక కొత్త భాషగా morph అవుతుంది. కథ ముందుకు సాగుతూండగా పాఠకుడు ఏర్పరుచుకునే అభిప్రాయాల్ని ఉద్దేశపూర్వకంగానే నాశనం చేస్తుంటాడు. [2]
అతని అనేక పాత్రలు ఆధునిక మానవుని అంతరంగ కల్లోలాలను కదిలిస్తాయి. అంతగా ఎవరూ స్రృశించడానికి సాహసించని స్త్రీ పురుష సంబంధాల్నీ, పురుషుని చీకటి ఆలోచనల్నీ, నిషేధిత సంబంధాల్నీ (ఇన్‌సిస్ట్) తెలుగు సాహిత్యంలోకి తెచ్చి తనకంటూ ఒక ప్రత్యేకత (సిగ్నేచర్ ట్యూన్)ను ఏర్పాటు చేసుకున్న రచయిత.[3]
రచనలు
1974 లో ఆంధ్ర పత్రికలో రంగనాయకి లేచిపోయిందీ అనే కథతో వీరి సాహితీ ప్రయాణం ప్రారంభమైంది. ఒక పడుచు వితంతువు. ఆమె కష్టాల్లో వుంది. అకస్మాత్తుగా కనిపించకుండా పోతే లోకం ఆమె గురించి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో అన్నది ఈ కథలో కథావిశేషం. తర్వాత వీరు విస్తృతంగా కవిత్వం రాసినా, వైయుక్తికం అనుకుని అచ్చేసుకోలేకపోయారు. ‘నేను-చీకటి’ నవల చిత్తు ప్రతిగా వున్నప్పుడు దాన్ని చదివి, ఎత్తి రాసిన కథా రచయిత వెంకట కృష్ణ. అది అచ్చయ్యేంతదాకా వెంటపడటమే యిప్పటి నా సాహితీస్థితికి కారణం అని చెబుతారు. [4]
· ఘోష – కథల సంపుటి
· నేనూ – చీకటి నవల [5]
· దిగంతం – నవల
· నేనూ- చీకటి – నవల
· తపన – నవల
· రంగుల – నవలిక
· మంచు -పూవు – నవల
· తెరవని తలుపులు – నవల
· నికషం – నవల
· అసత్యానికి ఆవల – నవల
· అసంగత (త్వరలో) – నవల
· నాలుగు కథా సంకలనాలు
· మూడు కవిత్వం పుస్తకాలు
· నాలుగు సినిమాలకు రచయితగా పనిచేశారు
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-22-ఉయ్యూరు