హాస్యానందం
43- నిరుత్సాహోక్తి
కొందరికిఏదీగొప్ప అనిపించదు .వారిని ఏదీ చలింప చేయలేదు .పెద్దనగారి మహోత్కృష్ట పద్యం ‘’అటజనికాంచె భూమి సురుడు ‘’చదివి వినిపిస్తే –స్వారస్యం తెలియనివాడు ‘’ఆ ఏముందయ్యా అందులో .ప్రవరుడు హిమాలయం వెళ్ళాడు .అక్కడ ఏం చూశాడో అంతా సంస్కృతంలో ఓజో భూయిష్టంగా చెప్పాడు .భాష నీ చేతుల్లో ఉంటె అంతకంటే దానబ్బలాంటి పద్యం నువ్వూ రాస్తావు .అక్కడ కొండల్ని చూట్టమూ గొప్పేనా ?మా అమ్మాయి కొండపల్లి కొండలు చూసింది .పర్వత సానువుల్లో ఏనుగుల్ని చూశాట్ట .ఓరి వీడిల్లు బంగారంకానూ !మహారణ్యంలో ఏనుగుల్ని కాక పీనుగుల్ని చూస్తాడా ?’’అన్నాడు .ఇదే నిరుత్సాహోక్తి అన్నారుమునిమానిక్యం మాస్టారు
టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడని అందరూ గర్వంగా చెప్పుకొంటూ ఉంటె ఒక నీరసంగాడు ‘’పర్వతం ఎక్కాడా ?ఆ జాతి వాళ్ళ పనే అది రోజూ ..అలవాటుంటే మనం గోడలూ చెట్లూ ఎక్కటం లేదా ?మనిషి అన్నాక ఏదో ఒకటి ఎక్కుతూ ఉంటాడు ,పడుతూ ఉంటాడు. ఇంతోటిదానికి తాషా మర్బా మోత ఎందుకంట ‘’అన్నాడు .అంతటితో ఆగకుండా ‘’మళ్ళీ దిగాడా లేదా ?అయినా ఎక్కినవాడు దిగకేం చేస్తాడు .అక్కడ బువ్వ ఎవరు పెడతాడు?.అయినా దిగేవాడు అసలు ఎక్కటం ఎందు కంటా.దీనికి మనం అర్రులు చాచి చంకలు కొట్టుకోనక్కర్లేదు ‘’అన్నాడు .
అలాంటి వాడితోనే మునిమానిక్యంగారు ఒకసారి ‘’చూశారా బాబుగారూ!మనవాడు వర్తకం మొదలెట్టి ఏడాది తిరక్కుండానే లకారాధిపతి అయ్యాడు .’’అన్నారు మహోత్సాహంగా అభినందిస్తూ వాళ్ళబ్బాయిని .ఆ మేళానికిఇదేమీ కిక్ ఇవ్వలేదు .చప్పరించి ఇదోన్యూసా అనుకోని ‘’వాడి జాతకం అలా౦టిదయ్యా శుక్రమహర్దశ నడుస్తోంది. లగ్నాన్ని బుధుడు చూస్తున్నాడు శుభగ్రహాలన్నీ బాగా నిక్కినిక్కి చూస్తుంటే అంతే.,శని ఉచ్చ దశలో వుండి ముడ్డిమీద తంతుంటే వాడు సంపాదిస్తాడా వాడి తలలో జేజమ్మ సంపాదిస్తుందా ?గ్రహబలమయ్యా అంతాగ్రహబలం ‘’అన్నాడు .
ఇలా ఏ విషయాన్నైనా లైట్ తీసుకొని ,చెప్పేవాడికి నీరసం పుట్టిస్తారు . ఇవే నిరసోక్తులు అంటే అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు గురూజీ .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-22-ఉయ్యూరు