మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -19

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -19

· 55-జీవితానుభవాలను రచనలలో పొందుపరచిన దార్శనిక రచయిత,బాలసాహిత్య నిర్మాత ,శారదా పీఠ స్థాపకుడు,రైతాంగ సాహిత్య వైతాళికుడు –శ్రీ కె.సభా

కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు

జీవిత విశేషాలు
సభా చిత్తూరు జిల్లా కొట్రకోన గ్రామంలో 1923 జూలై 1 న సభా జన్మించారు. ఈయన తల్లి దండ్రులు పార్వతమ్మ, చెంగల్వరాయుడు. తండ్రి వీధిబడి ఉపాధ్యాయుడు. సభా ఎనిమదవ తరగతి పూర్తి చేసి తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశారు. సభా ఏనాడూ కష్టాలకు చలించలేదు. పదహారేళ్ళ వయస్సులో ఉపాధ్యాయు వృత్తి లోనికి చేరారు. వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే బి.ఏను పూర్తిచేశారు.

సమాజ సేవకునిగా
సభా శ్రీ రమణ పబ్లికేషన్స్‌ స్థాపించి ఔత్సాహిత రచయితల్ని, శారదాపీఠాన్ని స్థాపించి కళాకారుల్ని సభా ప్రోత్సహించారు. తనచుట్టూ ఉన్న రైతు కూలీలు, రైతులు, వివిధ గ్రామీణ వృత్తులవారు, దళితులు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేక అప్పటి సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూనే మరోవైపు ఉద్యమశీలత్వంతో కూడిన అనేక రచనలు చేశారు.1947లో శివగిరిలో రైతాంగ విద్యాలయం నిర్వహించిన సభాకు రైతులలో ముడిపడిన వివిధ వృత్తి జీవిత సమస్యలు బాగా తెలుసు. తమకున్న కొద్దిపాటి పొలంలోనే స్వయంగా పంటలు పండించిన సభా అనుభవంలో రైతు కష్టాల్ని రంగరించుకున్నారు. మద్యనిషేధం ఎత్తివేతతో ఛిన్నాభిన్నమైన దళితుల జీవితం, దళిత స్త్రీలయాతనను ఆయన తట్టుకోలేకపోయారు. అంతరించిపోతున్న భూగర్భజలాలు, ప్రకృతి విధ్వంసంతో కూలిపోయిన వ్యవసాయం, అతీగతీ లేని వృత్తులు, జీవనకల్లోలాలు వంటి ఎన్నెన్నో పరిణామాలు స్వాతంత్య్రానికి కొంచెం అటూయిటూగా సభా రచనల్లో వ్యక్తమయ్యాయి.

సభా చిత్తూరు -జిల్లా రచయితల సంఘం, రచయితల సహకార ప్రచురణ సంఘం, కళాపరిషత్తు వంటి సంస్థలను స్థాపించి ఆ జిల్లాలో సాంస్కృతిక, సాహిత్య వాతావరణాన్ని సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీలో సభ్యులుగా నియమితులయ్యారు. 1975లో మొదటి ప్రపంచ తెలుగు సభల్లో ప్రభుత్వం ఆయనను సత్కరించింది. 1940లో రచనా జీవితాన్ని ప్రారంభించిన సభా 300 కథానికలు, 7 నవలలు, పిల్లలు -పెద్దల కోసం అనేక కథలు, రచనలు చేశారు. కథా సంకలనాల్లో బంగారు, పాతాళగంగ, నీటిదీపాలు, నవలల్లో భిక్షుకి, మొగిలి, దేవాంతకులు ముఖ్యమైనవి. పిల్లలకోసం వచ్చిన కథా సంకలనాల్లో అరగొండ కథలు, సీసాచరిత్ర, ఐకమత్యం, చిలకమ్మ, బొంగరం, ప్రాచీన భారతి, విప్లవగాథలు చెప్పుకోదగ్గవి. పిల్లల నవలల్లో మత్స్యకన్యలు, సూర్యం, కవిగాయకుడు, చంద్రం, పసిహృదయాలు, బుజ్జి జిజ్జి, పావురాలు, బాలల నాటకాల్లో పరీక్షా ఫలితాలు, చిట్టిమరదలు, స్వతంత్రోదయం, పురవదినాయక, ఏటిగట్టున, చావుబేరం, బుర్రకథల్లో రైతురాజ్యం, పాంచజన్యం పేరొందాయి. దయానిధి, వేదభూమి, విశ్వరూప సందర్శనం అనేవి వీరి ప్రచురిత కావ్యాలు. 500 పైగా వివిధ పత్రికల్లో కవితలు ప్రచురితమయ్యాయి. రాయలసీమ జానపద గీతాల్ని సేకరించి ప్రచురించిన సభా లెక్కకుమించిన రేడియో ప్రసంగాలు చేశారు.ఆంధ్రప్రభ, జమీన్‌ రైతు, నాగేలు మొదలైన పత్రికల సంపాదకవర్గంలో పనిచేశారు. దేవదత్తం అనే పేరుతో ఒక వారపత్రికను సంపాదకత్వం వహించి నడిపారు. ఆంగ్లంలో పాంచజన్యం అనే పత్రికను నడిపారు.

రాయలసీమ రైతాంగ సహిత్య వైతాళికుడు
రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళికునిగా కె.సభా కృషి అనన్యసామాన్యం. పల్లెపట్టుల బాధల పాటల పల్లవుల మీద సజన దృష్టిని నిలిపిన సభా అభివృద్ధి పేర వంచనాపరులైన పాలనా యంత్రాంగంలోని క్షుద్రులమీద, రాజకీయ యంత్రాంగంలోని కొత్తతరం స్వార్థ రాజకీయ వాదులమీద, నిరసన గళం గట్టిగా విన్పించారు. గాంధేయ జాతీయ వాద స్ఫూర్తినిండిన భావాలు సభారచనల్లో కోకొల్లలుగా కన్పిస్తాయి. ఇతివృత్త స్వీకరణలం, కథనంలో పాత్రల చిత్రీకరణలో, కంఠస్వరంలో, వాతావరణ చిత్రణంలో, మానవ సంబంధాల నిరూపణలో అద్వితీయమైన శైలిని, నిబద్ధతను సభా రచనల్లో పాటించారు. రైతుల కథల్లో ఆదర్శవాస్తవికతా వాదం, కఠిన విమర్శనా వాస్తవికత, ప్రజాస్వామ్యంలోని కొన్ని లొసుగులు కన్పిస్తాయి. కథన శిల్పంలో చెక్కు చెదరని దేశీయతను సభా పాటించారు. ‘పిచ్చిదంపతులు’ అనే ఆయన కథ చదివినప్పుడు సమాజ ప్రేమకు మనస్సున్న మనుషులు కావాలనే ఒక సామాజిక వేదన గుండెను తాకుతుంది. ‘అంబా’ కథ సీమకరవు నేపథ్యంతో రాసింది. చదివిన ప్రతి పాఠకుణ్ణి అది ఒక విషాదాంతసంఘటనగా వెంటాడుతుంది. ‘అంతరంగం’ కథ గ్రామీణ జీవితం, రైతుల కడగండ్లు, కడుపునిండని కవుల కృతక కావ్యరచనను వెక్కిరిస్తుంది. ‘చుక్కలవరాలు’ కథ అచ్చమైన దేశీయతను చెబుతుంది.

రచనలు
కథా సంపుటాలు బంగారు (5 కథలు, పాతాళ గంగ (పది కథలు), నీటి దీపాలు (15 కథలు) యిలా మూడొందల కథలు, పిల్లలకథలు వందల సంఖ్యలో ఉండగా తొమ్మిది సంపుటాలు వెలువడ్డాయి. భిక్షుకి, మొగలి, దేవాంతకుడు వంటి నవలలు, పిల్లల కోసం మరో ఏడు నవలను వ్రాసారు. వేయికి పైగా బాలగేయాలు వ్రాసారు. విశ్వరూప సందర్శనం అనే గేయ కావ్యం రాసారు.దయానిధి వేదభూమి వంటి పద్యకావ్యాలను వ్రాసారు.రైతురాజ్యం, పాంచజన్యం అనే బుర్రకథలు వ్రాసారు.

ఈయన 1980 నవంబరు 4 న మరణించారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.