’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -5
హరిశ్చంద్ర ఏడవఏటనే కవిత్వం రాశాడు .అందులో వైష్ణవ భక్తీ ఎక్కువ.కొన్ని ఇతరవిశషయాలూ ఉన్నాయి .బ్రజ్ భాషపై మక్కువ తో రాదా కృష్ణులపై భక్తికీర్తనలురాశాడు . వెన్నెముక లేనిది అని బ్రజభాషను కొందరు అన్నా ,అందులో ఆభాష ఆయన కవిత్వంలో మృదు మధురరూపం దాల్చింది .ప్రేమకు భక్తికి సమన్వయము తెచ్చాడు .శృంగారానికి ఆధ్యాత్మికత జోడించాడు .మొత్తం మీద 3వేల భక్తీ కీర్తనలు ,ప్రణయ గీతాలు రచించాడు .హిందోళ ,పూర్వి ,ఖయాల్ కల్యాణి వంటి వందరాగాలలో ఇవి రాశాడు .ఇవన్నీ 20సంపుటాలుగా వచ్చాయి .భక్తీ సర్వస్వం అనే దానిలో భగవంతుని లక్షణాలు వివరించాడు .ప్రేమమాలికలో బాల కృష్ణ లీలలు వర్ణించాడు .కృష్ణుడు వ్రేపల్లె వదిలి వెళ్ళే టప్పుడు గోపికలు పడేఆరాటం ఆవేదన మనోహరంగా చూపాడు .ప్రేమ పవిత్రతకు చిహ్నం అన్నాడు .ప్రేమ ప్రతాప్ లో నిష్ఫలప్రేమలో నిరాశ వివరించాడు .ప్రేమ అశ్రు వర్ణాలో ఋతు శోభ వర్ణించాడు .పరిపక్వంకాని ప్రేమ శూన్యం అన్నాడు .
బ్రజ్ పై ఎంత వ్యామోహమున్నా ఖడ్ బోలీ లోనూ పద్యాలు రాశాడు .ఆతర్వాత ఈ రెండిటి రూపు రేఖలూ లేకుండా తుడిచేశాడు .హిందీలో గొప్ప రచనలు చేసిన ఈయన ఉర్దూ లోనూ బాగా కృషి చేశాడు .1872లో’’క్వాసిడ్ ‘’అనే ఉర్దూ పత్రిక ప్రారంభించటానికి ప్రకటనలు కూడా ఇచ్చాడు .ప్రోత్సాహం లభించకమానేశాడు ఉర్దూ లో పద్యాలు ,వచన రచనలు మిమర్శ అచ్చులో వంద పేజీలదాకా రాశాడు .అనిల్ ,వాజిస్ అనే ఉర్దూ కవులకు మిత్రుడుగా ,పోషకుడుగా ఉంటూ ‘’రస ‘’కలం పేరుతొ ఉర్దూలో రాసేవాడు .అతని గులిస్తాన్ ఇపుర్ బాహర్ ,చమాని స్తాన్ ఇ పుర్ బాహర్ అనే పద్య సంపుటాలు విజ్ఞాన ఖనులు అన్నారు. గజల్స్ కూడా రాశాడు .సమకాలీన ఉర్దూకవుల రచయిత్రుల వివరాలు తెలుసుకోనేవాడు .రూప్ రతన్ కలం పేరుతొ భోపాల్ బీగం రాసిన రచనలను ఆసక్తిగా చదివేవాడు .వాటినితన పత్రికలో ప్రచురిస్తూ ,కలకత్తా నుంచి వెలువడే భారత మిత్ర కు తన ప్రసంశలు జోడించి ముద్రణకు పంపి ప్రోత్సహించేవాడు .పంచ వన్ పైఘామ్బార్ ,కుషీ అనే వచన వ్యాసాలూ ఉర్దూలో రాశాడు .హిందూస్తానే అక్బర్ పత్రిక ఇతని ఉర్దూ రచనలను శ్లాఘించేది .ఆయన ఉర్దూలో నాటికలు రాయకపోవటం పెద్ద వెలితి అని సాహిత్యకారులు అంటారు .
అనేక సాహిత్యప్రక్రియలపై తనదైన ముద్ర వేసిన హరిశ్చంద్ర హిందీ నాటకాలకు చేసిన సేవ అపూర్వం .స్వంతవీ బెంగాలీసంస్కృత ఇంగ్లీష్ అనువాదాలు కలిపి 18నాటికలు హిందీలో రాశాడు .మొదటినుంచి బెంగాలీ స్నేహితులు ఆయనకు ఎక్కువగా ఉండేవారు .ఆధునిక హిందీనాటికలలో సీతల్ ప్రసాద్ త్రిపాఠి1867లో రాసిన ‘’జానకీమన్ డళ్’’మొదటిది .కాశీ రాజు ఎదుట ప్రదర్శించాలి అనుకొన్న దీనిలోని లక్ష్మణ పాత్రధారి అనారోగ్యం తో రాలేకపోతే ,17ఏళ్ళ హరిశ్చంద్ర కొద్ది సమయం తనకిస్తే ఆపాత్ర ధరిస్తానని చెప్పాడు .ఇంత తక్కువ సమయంలో వేరొకరు నటించటం అసాధ్యమన్నాడు రాజు .అరగంట యిస్తే చాలన్నాడు ఈయన ,గంట సమయమిచ్చారు .ఆసమయంలో నాటకం బాగా చదివాడు .అందులోని ప్రతివాక్యం గడగడా వప్పచేప్పేసరికి అంతా ఆశ్చర్యపోయారు .లక్ష్మణ వేషం వేసి రక్తికట్టించి సమర్ధత చాటి చూపాడు .
అప్పుడే నాటక రచనకు శ్రీకారం చుట్టాడు .ప్రవాస్ అనే మొదటి నాటకం రాశాడు ఇప్పుడది అలభ్యం.రెండోది రత్నావళికి అనువాదం .జతెన్ద్రమోహన్ ఠాకూర్ బెంగాలీ నాటకానువాదంగా విద్యాసుందర్ రాశాడు .అప్పుడే 1870లో ప్రెస్టన్ జీ ఫ్రాంజీ అనే మొదటి నాటక సంస్థ వెలిసింది .7ఏళ్ళ తర్వాత ఢిల్లీ కి చెందిన కుర్ పద్ జీ బాలీవాలా ‘’విక్టోరియా ధియేట్రికల్ కంపెని ‘’ప్రారంభించాడు .కోవాల్ ఖాతూవ్ పెట్టిన ‘’ఆల్ఫ్రెడ్ ధియేట్రి కల్ కంపెనీ కూడా ప్రసిద్ధికెక్కింది .నాటకం నవరస భరితంగా ,పంచ కళా స్వరూపంగా ఉండాలని హరిశ్చంద్ర భావించాడు .అందుకే తన భావ వ్యక్తీకరణ ధ్యేయంగా నాటకాలు రాశాడు .పార్శీ నాటకరంగం వేగం గా దూసుకుపోవటానికి కారణాలు గ్రహించాడు .అందులోని మంచినీ సనాతన రంగస్థల వాంచలను ప్రవేశ పెట్టాడు .నాటకపద్యాలు సున్నితంగా బ్రజభాషలోనే రాసినా ఖడ్ బోలీకి ప్రాదాన్యమిచ్చాడు .బ్రాహ్మణ పాత్రలకుసంస్క్రుతం సామాన్యులకు వాడుకభాష వాడి,సహజత్వం తెచ్చాడు .కాలానికి అనుగుణంగా నూతన విధానాలు జోడించాడు .అనారోగ్యంగా ఉండి,అవసాన దశలో రాసినవిశిష్టరచన ‘’నాటక్’’.ఇందులో ఆనాటి నాటకాల పురోగమనానికి కారణమైన ఇంగ్లీష్,బెంగాలీ నాటకాలను చక్కగా విశ్లేషించాడు .సాహిత్యంలో నాటకం ముఖ్యభాగం అన్నాడు .
పురాతన చారిత్రిక సాంఘిక నాటకాలు రాసినా భారతే౦దు సమకాలీన సమాజ చిత్రణలో కొత్త వరవడి ప్రవేశపెట్టి మార్గదర్శి అయ్యాడు .విధవా వివాహం మాంసాహారనిషేధం ,సంస్థానాలలో అరాచకాలు , ,భారత్ ఉత్పత్తిని బ్రిటన్ దేశాభి వృద్ధికి వాడుకోవటం మొదలైన విషయాలు నాటకాలలో చర్చించాడు .సమాజ దురాచారాలను అవినీతిని చీల్చి చెండాడాడు .అతని ఆదర్శాలకు అండగా ప్రతాప నారాయణ మిశ్రా ,బద్రీ నారాయణ చౌదరి ,బాలకృష్ణ భట్ట వంటి సాహితీ ప్రముఖులున్నారు .
హిందీ నాటకానికి ఆధునికత తెచ్చినవాడు హరిశ్చంద్ర .మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకాన్ని ‘’ ,దుర్లాభ్ బంధు ‘’గా స్వేచ్చానువాదం చేశాడు .పాత్రలు పోర్షియాకు పుర్ శ్రీ ,,షైలాక్ కు శౌలాక్షు అని బసానియోకి బసంతు అనీ ,హిందూ పెర్లుపెట్టాడు .బెంగాలీనుంచి విద్యాసుందర్ ,భారత్ జనని అనుకరణలుగా రాశాడు .సంస్క్రుతనాటకాలకు అనువాదాలు అనుసరణలూ చేశాడు .సత్యానికి అసత్యానికి జరిగే నిరంతర పోరాటం గా ‘’సత్యహరిశ్చంద్ర ‘’,మానవాతీత సత్యనిరతికి హరిశ్చంద్రుడు ,దాన్ని విచ్చిన్నం చేసే దుష్టశక్తి విశ్వామిత్రుడు గా చూపాడు .చంద్రావలి నాటకం లో సర్వ ప్రపంచాన్నే రక్షించే ప్రేమస్వరూపుడుగా కృష్ణుడిని ఆవిష్కరిస్తాడు .శోకాన్ని అధిగమించి ధర్మ సిద్ధికోసం నిరంతర అన్వేషిగా చంద్రావలి ని తీర్చి దిద్దాడు .’’ప్రేమ జోగిని ‘’లో ఆనాటి కాశీ పరిస్థితులు ప్రతిబింబింప జేశాడు .కళావంతులనుసమర్ధించాడు .మంచి చెడ్డ లేక నిష్పక్షపాతం ఇందులో సమర్ధించాడు .అనారోగ్యం పేదరికం ,అవివేకం తాగుడు లను పాత్రలు చేయటం కొత్త పధ్ధతి .ఇలాగే అంధేర్ నగరి కూడా రాశాడు .నీల్ దేవి లోనూ సమాజ దుర్దశ చూపాడు .బ్రిటన్ లో స్త్రీలు పురుషులతో సమానంగా ముందుకు వెడుతుంటే మనదేశం లో స్త్రీలు ఇంటికి అంటుకు పోయారని బాధపడుతూ ,వాళ్ళు పిల్లాపాపలనుచక్కగాసాకుకొంటూ నమ్రత తో ఉంటూ కూడా ఇంటి బయట నిర్మాణాత్మకమైన కార్యాలలో ముందుకు రావాలని కోరాడు .భారత నారీమణులు ఉన్నత స్థానం లో ఉన్నారు ఆవిషయాలు ఇప్పటి స్త్రీలు గుర్తించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నాడు .’’విపస్య విష మౌషధం’’నాటకం బరోడా రాజు పతనంపై రాసింది .ఇంగ్లీష్ లో కొద్ది పరిజ్ఞానంసంపాది౦చినంతమాత్రాన ,అభ్యుదయవాడదులమనీ పునరుద్ధరణకు కంకణం కట్టుకొన్నామని విర్ర వీగేవారిని విమర్శించాడు .ఈ విమర్శ ఆయన ప్రత్యర్ధులు రాజా శివరామప్రసాద్ ఆయన అనుచరులను ఉద్దేశించి అన్నమాటలే .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-17-10-22-ఉయ్యూరు