రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -6
16-సామాజిక సేవాకర్త ,పద్మశ్రీ గ్రహీత –శ్రీ జి.మునిరత్నం నాయుడు
గుత్తా మునిరత్నం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
జీవిత విశేషాలు
మునిరత్నం తమిళనాడులోని తిరుత్తణికి సమీపంలోని కనకమ్మసత్రంలో రంగయ్య నాయుడు, మంగమ్మ దంపతులకు 1936, జనవరి 6 వ తేదీన జన్మించారు.
1981లో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్‌నాయుడు, ప్రముఖ సామాజక శాస్త్రవేత్త, రైతు నాయకుదు ఆచార్య ఎన్.జి. రంగాతో కలిసి ‘రాయలసీమ సేవా సమితి’ సంస్థ ఏర్పాటు చేశారు. క్రమేణా ఆ సంస్థ రాయలసీమకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. దీంతో ఆ సంస్థ పేరును రాష్ట్రీయ సేవా సమితిగా మార్చారు. ప్రస్తుతం ఆ సంస్థ శిశువిహార్, బాల విహార్, ఛైల్డ్ స్పాన్సర్‌షిప్ ప్రోగ్రాం, అంగన్‌వాడీ కేంద్రాలు, వయో వృద్ధులకు పునరావాస కేంద్రం, వితంతు పునరావాస కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, స్వధార్ హోం, మత్తు మందు బానిసల పునరావాస కేంద్రం తదితర సేవల ద్వారా ప్రజలకు చేరువైంది.
మునిరత్నం సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అవార్డులను ప్రదానం చేసింది. 1989లో ఇందిరాగాంధీ నేషనల్ అవార్డు, 1991లో శిరోమణి, 1992లో జెమ్ ఆఫ్ ఇండియా, 1993లో బాలబంధు, 1996లో నవాబ్ మెహిదీ నవాజ్‌జంగ్ బెస్ట్ వెల్ఫేర్, 1998లో పైడి లక్ష్మయ్య మెమోరియల్, 2006లో రాజీవ్‌గాంధీ మానవసేవ, 2010లో హరిజన బంధు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.
1981 నుండి రాష్ట్రీయ సేవాసమితి స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థాపక గౌరవ కార్యదర్శిగా సేవలందిస్తున్నాడు. బడుగు వర్గాలు, స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం వివిధ సంస్థలు స్థాపించాడు. వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నాడు. వికలాంగుల జాతీయ కమిషన్‌లో అసోసియేషన్ మెంబర్, సీఏపీఏఆర్‌టీ సెంట్రల్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. బాల భారతికి చైర్‌పర్సన్‌గా ఉన్నాడు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2012లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ఈయన బ్రహ్మచారి. మరణం గుత్తా మునిరత్నం నాయుదు తన తుది శ్వాస వరకు సమాజ సేవలో గదిపి 2021,మే నెల 5వ తేదిన మరణించారు.
17-బారిస్టర్ ,శాసన సభ్యుడు ,ఆంధ్రమహా సభ అధ్యక్షుడు –శ్రీ కడప కోటిరెడ్డి
కడప కోటిరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
కోటిరెడ్డి, చిత్తూరు జిల్లా, మదనపల్లె తాలూకాలోని నారాయణ చెరువు (కోటిరెడ్డిగారి పల్లె) లో 1886లో జన్మించాడు. 1911లో ఇంగ్లాండులోని మిడిల్ టెంపుల్ నుండి బారిష్టర్ ఎట్ లా పట్టా పుచ్చుకున్న కోటిరెడ్డి న్యాయవాదిగా, రైతుగా కడపలో స్థిరపడ్డాడు. ఈయన గాడిచర్ల హరిసర్వోత్తమరావుతో కలిసి రాయలసీమలో హోమ్ రూల్ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈయన కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులతో సన్నిహితంగా పనిచేసేవాడు. వీరిద్దరూ, ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డికి రాజకీయ గురువులు.
కోటిరెడ్డి 1921లో మహాత్మాగాంధీతో పాటూ రాయలసీమంతా పర్యటించాడు. 1922లో అనగా తన 32వ యేటనే ఇతడు శాసనసభలో ప్రవేశించాడు. ఇతడు మొదట కాంగ్రెస్‌కు అనుకూలమైన ప్రెసిడెన్సీ అసోసియేషన్‌లో గుత్తి కేశవపిళ్లెతో కలిసి పనిచేశాడు.1926లో స్వరాజ్యపార్టీ ఉపనాయకుడిగా ఎన్నుకోబడినాడు. 1929లో స్వతంత్ర సభ్యుడిగా మద్రాసు శాసనసభకు ఎన్నుకోబడినాడు. 1931లో తిరిగి ఏకగ్రీవంగా మద్రాసు శాసనసభకు ఎన్నికయినాడు. కోటిరెడ్డి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించాడు. ఆంధ్ర మహాసభకు రెండు సార్లు అధ్యక్షత వహించిన ఇద్దరు వ్యక్తులలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకరైతే, కోటిరెడ్డి రెండవ వాడు. 1929, 1937లో జరిగిన సమావేశాలకు అధ్యక్షత వహించాడు. అంతేకాకుండా 1931లో మద్రాసులో జరిగిన ప్రత్యేక సమావేశం కూడా ఈయన అధ్యక్షతలోనే జరిగింది. 1940లో ఉప్పు సత్యాగ్రహంలో క్రియాశీలకంగా పాల్గొని జైలుకు వెళ్లాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని రాజాజీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా కోటిరెడ్డి మధుర, తిరునల్వేలి, శ్రీరంగం దేవాలయాలలో హరిజనులకు ప్రవేశం కల్పించాడు[1].
స్వాతంత్ర్యం తర్వాత 1952లో కడప నియోజకవర్గం నుండి, [2]1955లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో పనిచేశాడు. 1957లో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు, 1964లో శాసనమండలికి ఎన్నికయ్యాడు. రాయలసీమ కరువు ఉపసంశన సంఘానికి అధ్యక్షుడిగా శ్రీబాగ్ ఒడంబడిక రూపుదాల్చుకోవటంలో కీలక పాత్ర పోషించాడు.[3]
ఈయన సతీమణి రామసుబ్బమ్మ కూడా స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నది.
18-హైదరాబాద్ బుక్ ట్రస్ట్ స్థాపకుడు ,,శాసన సభ్యుడు-పీలేరు గాంధి –శ్రీ చల్లా కృష్ణ నారాయణ రెడ్డి
సి. కె. నారాయణ రెడ్డి (ఆగష్టు 1, 1925 – సెప్టెంబరు 5, 2013) హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు, పీలేరు గాంధీగా సుప్రసిద్ధులు. సికెగా వ్యవహరించబడే ఆయన పూర్తి పేరు చల్లా కృష్ణ నారాయణరెడ్డి.[1]
జీవిత విశేషాలు
చల్లా కృష్ణనారాయణరెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని రొంపిచర్ల మండలం చల్లావారిపల్లె(చిత్తూరు జిల్లా) లో ఆగస్టు 1 1925 న జన్మించారు. మదనపల్లెలో బీసెంట్ థియొసాఫికల్ స్కూల్/కాలేజీలో బి.ఎ వరకు చదువుకున్నారు. బిఎ రెండో సంవత్సరంలో ఉండగానే పేద విద్యార్థుల కోసం ఆయన ఒక వసతి గృహాన్ని నిర్వహించారు. కాలేజిలో మంచి హాకీ క్రీడాకారుడిగా రాణిస్తూనే సామాజిక సమస్యల పట్ల స్పందించేవారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఎప్పుడూ ఖద్దరు వస్త్రాలనే ధరించారు. సోషలిస్టు పార్టీలో క్రియాశీల సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. కరవు రోజుల్లో గంజి కేంద్రాలను నిర్వహించారు.అనేక వసతిగృహాలను నెలకొల్పారు. దళిత పిల్లల చదువు కోసం విశేషంగా కృషి చేశారు.బాకారావు పేట, వాయలపాడు, యెర్రవారిపాలెం, నేలబైలు, పీలేరు, మదనపల్లెలో బడుగు వర్గాలకోసం వసతి గృహాలను నిర్వహించారు. అక్కడ చదువుకున్న మునివెంకటప్ప, అబ్బన్న ఐఎఎస్ అధికారులు అయ్యారు. సికె 1962లో కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు.[2]
రొంపిచెర్లలో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1967 లో చారుమంజుందార్ గ్రూపులో చేరారు. 1970 లో ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. అత్యయిక పరిస్థితి సందర్భంగా 1975 లో జైల్లో నిర్భంధించింది. జనతా ప్రచురణలు, అనుపమ ప్రచురణలు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ను నెలకొల్పి అనేక మంచి పుస్తకాలను తెలుగులో వెలువరించారు. అనుపమ ప్రచురణలు నెలకొల్పి – ది స్కాల్‌పెల్, ది స్వోర్డ్ -రిచర్డ్ అ లెన్, టెడ్ గోర్డన్, ఫాన్‌షెన్-విలియమ్ హింటన్, మై ఇయర్స్ ఇన్ ఎన్ ఇండియన్ ప్రిజన్-మేరీ టైలర్ రెడ్‌స్టార్ ఓవర్‌చైనా-ఎడ్గార్ స్నో తదితర పుస్తకాలను తెలుగులోకి ప్రచురించారు. ప్రజల మనసుల్ని గెలిచేందుకు చిన్న పుస్తకాలు విశేషంగా తోడ్పడతాయని భావించేవారు.1980లో హైదరాబాద్ బుక్‌ట్రస్టును నెలకొల్పి అప్పటినుంచి 1990 ల చివర తన ఆరోగ్యం క్షీణించేవరకూ నిర్విరామంగా కృషిచేస్తూ అనేక పుస్తకాలను తెలుగులో వెలువరించారు. జంటనగరాల్లో కుక్కల సంతతి ఎక్కువైనా సరే కుక్కలను చంపకూడదని ఉద్యమం నిర్వహించారు. ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటాలు చేశారు. శాసన సభ్యులకు అనేక సౌకర్యాలు అక్కరలేదన్నారు. ఆయన సతీమణి జయప్రద మదనపల్లె ఉన్నత పాఠశాలలో సామాన్యశాస్త్ర ఉపాధ్యాయురాలిగా, అనంతరం ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 1972 లో ఉస్మానియా యూనివర్సిటీలో హత్యకు గురైన జార్జి రెడ్డి వీరి అన్న కుమారుడు. సికె గారికి భార్య జయప్రద, ఇద్దరు కూతుళ్లు డా. అరుణ, సి. శైలజ ఉన్నారు. ఈయన 2013 సెప్టెంబరు 5 న హైదరాబాద్‌లో చనిపోయారు.[2] నారాయణ రెడ్డిగారి కోరిక మేరకు, ఆయన కుటుంబసభ్యులు ఆయన మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి కి అందజేశారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-22-ఉయ్యూరు