ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -7(చివరిభాగం )
హిందీ భాషాభి వృద్ధి మరచి గుడ్డిగా ఆంగ్లేయులను అనుసరించే వారిని హరిశ్చంద్ర గట్టిగా విమర్శించాడు హిందీ పత్రికాప్రచారానికి ఆయన మార్గదర్శి .సాహిత్యంలో హాస్యాన్ని పోషించాడు .హరిశ్చంద్రతర్వాత అదే దారిలో నడిచినవారు కాన్పూరు కు చెందిన ప్రతాప్ నారాయణ మిశ్రా ,బాలకృష్ణ భట్ లు .నాటక రచనకూ భారతే౦దు మార్గదర్శనం చేశాడు. హరిశ్చంద్ర అసంపూర్తి నాటికలను బాబూ రాదా కృష్ణ దాస్ పూర్తి చేయటమేకాక దుఖినీబాలా ,రాణాప్రతాప్ నాటకాలు కూడా రాశాడు
హరిశ్చంద్ర స్త్రీ విద్య ,విధవావిహాం ,సముద్రప్రయాణ౦ వంటి సంస్కరణ లపైనా రాశాడు .పూరీ జగన్నాథ దర్శనానికి వెడుతూ బర్ద్వాన్ కు చేసిన ప్రయాణమే అతని మొదటి రైలు ప్రయాణం ఆ తర్వాత అనేక చోట్లకు రైలులో వెళ్ళాడు .దీనివలన విశాలభావాలుకలిగాయి .ఖందేప్ లో గుజరాత్ వరద బాధితులకు సహాయం తన పత్రికలద్వారానూ , స్వయంగా చేశాడు .అతని విస్తృత యాత్రా ఫలితంగా రాసినవే యాత్రా చరిత్రలు .అవసాన దశలో అస్వస్థతకు కారణమైనది ఉదయపూర్ ప్రయాణం .
సంపన్న యువరాజులకు ,జమీందార్ పిల్లలకోసం స్థాపించబడిన ఒక విద్యా సంస్థలో పురాతన వృత్తాంతాల సంగ్రహణ కర్తగా ఉన్న రాజెంద్రలాల్ మిత్ర ఈయన ఇంటికి దగ్గరలో ఉండేవాడు .ఇద్దరూ విష్ణు భక్తులే సన్నిహితులయ్యారు .దానితో ప్రాచీన వస్తువులపై ఇతనికి ఆసక్తికలిగి,ప్రాచీన వస్తు చరిత్రను మొట్టమొదటి సారిగా హిందీలో రాశాడు .వారణాశి అంతా విస్తృతంగా తిరిగి రాగి శాసనాలు చదివి విపులంగా రాశాడు .కలకత్తా వెడితే ఆసియా సంఘాన్ని తప్పక చూసేవాడు .ఎన్నో వ్రాతప్రతులు దానికి సమర్పించాడు .వివిధకాలాల భారతచరిత్రను వ్యాసాలుగా రాశాడు .ఇలా రాసేటప్పుడు అందులోని సాహిత్యమంతా కాచి వడపోసేవాడు .బ్రిటిష్, ఫ్రెంచ్ చరిత్రకారుల రచనలలోని విషయాలుకూడా పొందు పరచేవాడు .ఉదయపూర్ రాజభవనం ,రాజస్థాన్ కోట చరిత్ర గురించి అతడు రాసినవి పరమ ప్రామాణికాలు .ఇవి రాయటానికి ముందు ‘’టాడ్’’రాసిన ‘’అనల్స్ ఆఫ్ రాజస్థాన్ ‘’క్షుణ్ణంగా చదివాడు .అనేక భారతీయ సంస్థానాధీశులు హరిశ్చంద్రను ఆహ్వానించి గౌరవించి సత్కరించారు .
‘’కాల చక్ర ‘’రచనలో ప్రపంచ చరిత్రను కొన్ని భాగాలుగా చెప్పే ప్రయత్నం చేశాడు .భక్తుడే కాని మూఢ భక్తిలేదు .జైనం లో నిరసి౦చటానికి ఏమీ లేదన్నాడు . 1870లో ఆర్యసమాజం వారు వారణాశి మతబోధకులను విమర్శించే సమయంలో స్వామి దయానంద సరస్వతికి వ్యతిరేకంగా నిలిచాడు .తర్వాత కాలం లో ఆయన్ను తనపత్రికలో చేర్చుకొన్నాడు .చివరికాలం లో మతసమన్వయతకోసం అర్రులు చాచాడు .వచనంలో ఖడీబోలీ ప్రవేశపెట్టిన మార్గదర్శి అయ్యాడు .హిందీలో నవలలు రాలేదని ఆవేదన చెందాడు .రాధా చరణ్ గోస్వామి ,బాబూకాశీ నాథ లను హిందీ నవలలు రాయమని ప్రోత్సహించాడు .తన రెండవ భార్య బెంగాలీ అయిన మల్లిక ను బెంగాలీ నవలలను అనువదించమని కోరగా రాధారాణి ,చంద్రప్రభపూర్ణ ప్రకాష్ ,సౌందర్యమయి నవలలను హిందీలోకి అనువదించి రాధారాణి ని ఆయనకే అంకితమిచ్చినది .బంకిం చంద్ర నవల ‘’రాజ సిన్హా ‘’ను స్వయంగా అనువాదం మొదలు పెట్టిరాయగా అసంపూర్ణంగా మిగిలిపోతే బంధువు రాధా కృష్ణ దాస్ పూర్తి చేశాడు .ఇతడే స్వయంగా స్వర్ణలత ,పండిత రాం శంకర నవల ‘’మధుమాలతి’’కూడా అనువదించాడు .
డబ్బు దుబారాతో మనశ్శాంతి భోగ విలాసాలతో ఆరోగ్యం కోల్పోయిన హరిశ్చంద్ర ,దూర ప్రయాణాలు మానలేదు .చిరకాల మిత్రుడు మోహన్ లాల్ పాండ్య ఉదయపూర్ లో ఉంటె వెళ్లి చూసి అటునుంచి నత్వారాకు వెళ్ళాడు .దీనితో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది .కలరా సోకి ఊపిరి పీల్చుకోవటం కష్టమైంది .ఎన్నో ఇబ్బందులు తట్టుకొని కాశీచేరాడు .తన ప్రాణప్రదమైన రచనలు పూర్తి చేయలనుకొన్నాడు .భారతీయ రంగ౦ తీరు తెన్నులపై ఒక గ్రంథం రాశాడు. బ్రిటిష్ వారి కోరికపై వారి జాతీయ గీతాన్ని హిందీలోకింవాదం చేశాడు .కొన్ని నాటికలు మరికొన్ని రచనలూ చేశాడు .బల్లియాలో అతడురాసిన సత్య హరిశ్చంద్ర ,నీల్ దేవ్ ప్రదర్శిస్తున్నారని తెలిసి ,అక్కడికి వెళ్ళగా అందరూ హరిశ్చంద్రద్రను షేక్స్పియర్ అంతటి వాడు అని మెచ్చుకొన్నారు ‘
తిరిగి కాశీ వచ్చాక అనారోగ్యం తిరగబెట్టింది .డాక్టర్లు వారించినా రచన చేస్తూనే ఉన్నాడు .9-9-1850లో జన్మించిన హరిశ్చంద్ర 5-1-1885 న 35వ ఏట అతి తక్కువవయసులోనే తనువు చాలించాడు .తులసీదాస్ తర్వాత అంతటి ప్రతిభామూర్తి హరిశ్చంద్ర . అయితేనేమి హిందీ సాహిత్యానికి మార్గదర్శి అయి ఆధునిక హిందీ భాషా పితామహుడు అనిపించుకొన్నాడు .అతని మనసులో 1-హిందీ బోధనాభాషగా యూని వర్సిటి నెలకొల్పటం 2-తన ఉద్యానవనం లో ఠాకూర్ జీ విగ్రహం నెలకొల్పటం 3-దేశం వాయవ్యమూలలో లలితకళా నిలయంగా ఒక కళాశాల స్థాపించటం 4-అమెరికా ,బ్రిటన్ దేశాలు సందర్శించటం అనే కోరికలున్నట్లు మిత్రులకు చెప్పేవాడు .అవి చేయలేక పోయానని బాధపడ్డాడు .
ఆధారం –మదన గోపాల్ రచనకు శ్రీమతి ఎ.లక్ష్మీరమణ చేసిన తెలుగు అనువాదపుస్తకం –భారతే౦దు హరిశ్చంద్ర .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-22-ఉయ్యూరు , . ,