రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -8
21-అణుశాస్త్ర వేత్త ,వైద్య వైజ్ఞానికుడు ,రేడియో ధార్మిక శాస్త్రజ్ఞుడు ,మేరీ క్యూరీ వద్ద పరిశోధన చేసిన అణుధార్మిక పరిశిధన సంస్థ స్థాపకుడు –శ్రీ పత్తిపాటి రామయ్య నాయుడు
- పత్తిపాటి రామయ్య నాయుడు (జూన్ 1904-జూన్ 1991) ప్రఖ్యాతిగాంచిన అణుశాస్త్రవేత్త, వైద్య వైజ్ఞానికుడు, రేడియోధార్మిక శాస్త్రజ్ఞుడు. వైద్య భౌతిక శాస్త్రము ఆవిష్కరించినవారిలో ఆద్యుడు. పారిస్ లో నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరీ వద్ద పరిశోధనలు చేసిన మేధావి. 1938లో భారతదేశములో మొట్టమొదటి అణుధార్మిక పరిశోధనశాల స్థాపించిన వాడు.
బాల్యము, విద్య
నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, చిత్తూరు జిల్లా, మదనపల్లిలో జూన్ 1904న జన్మించాడు[1]. చిన్న వయసులోనే ఇల్లు వదలి పుదుచ్చేరి లోని అరవిందాశ్రమములో చేరాడు. పిదప బెంగాల్ లోని శాంతినికేతన్లో గణితశాస్త్రము బోధించాడు. కాశీ విశ్వవిద్యాలయములో 1923 లో పట్టభద్రుడయ్యాడు. పారిస్ విశ్వవిద్యాలయంలో 1929లో ఎం.ఎస్.సి. డిగ్రీని, 1933లో డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నాడు.
పరిశోధనలు
ఇతడు తన డాక్టోరల్ థీసిస్ కొరకు క్యూరీ-కార్నెగీ రీసర్చ్ ఫెలోషిప్‌లో భాగంగా పారిస్ లోని రేడియమ్ ఇన్‌స్టిట్యూట్‌లో మేడం క్యూరీతో కలిసి పనిచేశాడు. తరువాత ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పాట్రిక్ బ్లాకెట్ పర్యవేక్షణలో పరిశోధనలు చేసి 1936లో డాక్టరేట్ పట్టా సంపాదించాడు. 1936లో బొంబాయిలోని టాటా ట్రస్టు ఇతడిని కేన్సర్ వ్యాధి చికిత్స కోసం రాడాన్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడానికి భారతదేశానికి ఆహ్వానించింది. 1938లో ఇతడు రేడియం సంగ్రహణ పరికరాలతో పాటు 2 గ్రాముల రేడియంతో బొంబాయిలోని టాటా మెమొరియల్ హాస్పెటల్‌కు తీసుకురాబడ్డాడు. ఇతని పర్యవేక్షణలో దేశంలోని మొట్టమొదటి రాడాన్ ప్లాంట్ నిర్మించబడి 1941 ఫిబ్రవరి 28న టాటా మెమొరియల్ ఆసుపత్రి ప్రారంభమైంది. ఈ ఆసుపత్రి 1952లో భారత ప్రభుత్వపు అణు ఇంధనశాఖకు బదిలీ అయ్యింది.
వ్యక్తిగతము
మదనపల్లె (చిత్తూరు) నకు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె లీల హిందీ చలనచిత్ర నటి. రామయ్య పారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేయుచున్నపుడు ఫ్రెంచి వనిత మార్తాను వివాహమాడాడు. వీరికి లీల 1940 సంవత్సరములో జన్మించింది. మార్తా భారతదేశానికి సంబంధించిన విషయములలో పరిశోధకురాలు (Indologist).
22-న్యాయవాది లోక్ సభ స్పీకర్ ,,కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం అధ్యక్షుడు ,బీహార్ గవర్నర్ –శ్రీ మాడభూషి అనంత శయనం అయ్యంగార్
, మాడభూషి అనంతశయనం అయ్యంగారు స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు. ఇతడు 1891, ఫిబ్రవరి 4 తేదీన చిత్తూరు జిల్లా, తిరుచానూరులో వెంకట వరదాచారి దంపతులకు జన్మించాడు. పచ్చయప్ప కళాశాల నుండి బి.ఏ.పట్టా పొందిన పిదప మద్రాసు లా కాలేజీ నుండి 1913లో బి.ఎల్. పట్టా పొందారు. ఇతని స్వస్థలం తిరుపతిలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత న్యాయవాదిగా 1915 -1950 వరకు నిర్వహించాడు. మహాత్మా గాంధీ సందేశం మేరకు స్వాతంత్ర్య సమరంలో (వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.
1934లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుండి, రెండవ లోక్‌సభ ఎన్నికలలో చిత్తూరు నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.
1948లో మొదటి లోక్‌సభలో డిప్యూటీ స్పీకరుగా తరువాత 1956లో స్పీకరుగా ఎన్నుకోబడ్డాడు. 1962లో బీహార్ గవర్నరుగా నియమితులై 1967 వరకు ఆ పదవిలో ఉన్నాడు.
కేంద్రీయ సంస్కృత విద్యాపీఠానికి అధ్యక్షులుగా 1966లో ఎన్నుకోబడి చివరిదాకా ఆ పదవి నిర్వహించాడు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఇతడు 1978 మార్చి 19న తిరుపతిలో పరమపదించాడు. ఇతని జ్ఞాపకార్ధం 2007 సంవత్సరంలో కంచు విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో నెలకొల్పారు.[1]
ఇతని కుమార్తె పద్మా సేథ్ ఢిల్లీ బాలభవన్ అధ్యక్షురాలిగా, మహిళా కమిషన్ సభ్యురాలిగా, సుప్రీం కోర్టు న్యాయవాదిగా, యునిసెఫ్ సలహాదారుగా పనిచేసింది.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-22-ఉయ్యూరు