శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం
పూనూరు బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమత్ దూపాటి నారాయణాచార్య ప్రణీత శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం బాపట్ల విజయ ముద్రాక్షరశాలలో 1926లో ప్రచురితమైంది . వెల – ఇవ్వ బడ లెదు .దీనికి చేబ్రోలు వాస్తవ్యులు శ్రీ ఇలపావులూరి శ్రీరాములు తొలిపలుకులు పలుకుతూ ‘’సీస పద్యాలలో ఈశతకం రాసిన కవి ఆచార్య నాకు నూతన పరిచితులే .నన్ను పీఠిక రాయమనటం సమంజసంగా లేదు .ఏలయన నేను అల్పజ్ఞుడిని ,కుక్షి౦భరుడిని .వారు పండితులు ,శబ్దవిదులు ..అట్టి వారి కవిత్వాన్ని నేను విమర్శించటం హాస్యాస్పదం .కానీ పద్యాలు మిగుల రసవత్తరంగా ,భావగర్భితాలుగా ,స్వాభావోక్తులుగా ,శైలి మృదు మధురంగా ,పండిత పామర రంజకంగా ఉందని చెబుతూ ఆ శ్రీ కృష్ణ పరమాత్మ ఈ కవివరునికి ఇంకా అనేక ఉద్గ్రంథ రచనకు తోడ్పడాలని,ఆశీర్వ ది౦చాలనీ అనికోరుతున్నాను ‘’అన్నారు .
తర్వాత కవిగారుచేసిన ‘’ విజ్ఞప్తి ‘’లో ’’శతకరచన మిక్కిలి కష్టమని పెద్దలంటారు నేను అల్పమతిని సంస్కృతాంధ్రాలలో భాషాపరిచయం స్వల్పం .కవిత్వ రసానుభావమూ శూన్యమే .తొలి శతకరచన కనుక ఇందులో గుణాలు తక్కువ దోషాలు ఎక్కువగా ఉంటాయి ‘’ఏకస్వాదు నమ౦భూ జీయాత్ ‘’అన్న పెద్దలమాటలను బట్టి శ్రీ కృష్ణ పరమాత్మ నా హృదయం లో చేరి నాతొ రాయించి నా ఆన౦దాన్ని లోకానికీ పంచమన్నట్లు గా అడియాస .రెండేళ్లక్రితమే రచన పూర్తి అయినా ,ఇరవై నెలలక్రితం అప్పటి బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆ. సుబ్బారావు గారిద్వారా శ్రీ ఇలపావులూరి శ్రీరాములుగారికి చేరింది(వీరు శ్రీ ఇలపావులూరి పాండురంగారావు గారి తండ్రి గారేమో ) .ముద్రించేశక్తి నాకు లేకపోవటంతో ‘’యోగక్షేమం వహామ్యహం ‘’అని చెప్పిన వాడి మీదనేపెట్టి ఊరుకున్నాను .
ఇంతలో వేదాంత గ్రంథ విచార ప్రచారకులైన శ్రీ శ్రీరాములుగారి అమోఘ ఆశీర్ బలముతో ,సహృదయులు శ్రీ సుబ్బారాగారి భక్తిభావ గరిమతో ,ప్రియశిష్యులు శ్రీ పూనూరు భక్త సమాజం వారి ఆదరాతిశయాలతో ,వేణుగోపాలుని నైసర్గిక వత్సలత్వ విలసనంతో ,శతకము ముద్రణ పొందింది .స్థల పురాణం కూడా రాయమని మిత్రులు కోరినా అందులో నిజానిజాలేమిటో తెలుసుకోవటం కష్టం కనుక దాని జోలికి పోలేదు .’’ప్రార్ధయే స్సర్వ విదు షో,క్షంతు మంతు శతానిచ –యద్యాత్ర కుత్రచిద్దోషో,నిర్మలం కురుతాదరాత్ ‘’అని బుధజన విధేయుడైన కవి కోరారు .’’వరద పూనూరు వేణుగోపాల కృష్ణ ‘’అనేది ఈ సీసపద్య శతకానికి మకుటం .
మొదటి పద్యం –‘’శ్రీ యాదవాన్వాయ క్షీర నీరధిపూర్ణ –చంద్ర చంచాత్క్రుపా సాంద్ర హృదయ -శౌర్య ధైర్య స్థైర్య చాతుర్యసద్గుణ –ధామ ,నిర్జిత దుష్ట దైత్య సీమ
శిశుపాల చాణూర జీవ సమీర భు –జ౦గాయమాన,విహంగ యాన –కంసాది రాక్షస గర్వపర్వత పాక-శాసన ధర్మ సంస్థాపనాద్య
తే.గీ.-నీరజేక్షణ భక్త చకోర చంద్ర –గాత్రజితమేఘ బుధజనస్తోత్ర పాత్ర – భుక్తిముక్తిఫలప్రద –వరద పూనూరు వేణుగోపాల కృష్ణ ‘’
అని ప్రారంభించారుకవి.నాల్గవ పద్యం లో పూర్వ సంస్కృత, తెలుగుకవులను స్తుతించి ,తర్వాత తనగురువు మంగళగిరి దూపాటి వంశానికి చెందిన విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవరులు ,మంత్రోపదేశి ,వే౦కటగురు వర్యుని స్తోత్రం చేసి ,తర్వాత పోతన్నలాగా ‘’అవిరలానంద సౌఖ్యములగూర్చు నీదు నామంబు స్మరియించు నాలుకనాలుక ‘’అంటూ కరచరణాదులు మనసు ఆయనకు అర్పిస్తేనే అవిధన్యం అన్నాడు .శంతన సుతుడిలాగా మంతనం చేసే మనసులో బంధించలేను ,విదురునిలాగా నీతి వాక్యాలు చెప్పలేను ,పార్ధుడిలాగా చెట్టపట్టాలేసుకొని బందుత్వంతో తిరగలేను ,గోపాలురులాగా నిన్ను పొందే భాగ్యం పొందలేదు ,చంద్రునికి నూలుపోగుగా నా శక్తికొద్దీ నీ పరిచర్య చేస్తా .ప్రాపుగా ఉంటూ రక్షించు అన్నారు .భువనాలను బ్రోవజాలిన నీబలానికి ,బ్రహ్మా౦డాల్ని రమణీయంగా చేసే నీ కౌశలానికి ,బ్రహ్మమొదలు స్తంభ పర్యంతం జీవులలో సంచరించే నీఘనత ,కోటి సూర్య ప్రకాశం మించే నీ తేజస్సు లకు ఎల్లలు లేవు అన్నారు
అంతర బాహ్య ఇంన్ద్రియాలను అణచి నిశ్చలభక్తితో నీపూజ చేయని జీవితం వ్యర్ధం .పుణ్యనదులకు పాపాలను పోగొట్టే శక్తి ,చంద్ర సూర్యాగ్నులకు దివ్యదీప్తి ,సౌందర్య సౌరభ్య సౌకుమార్యాలను ప్రసవజాతికి ,చెరుకులో తియ్యదనం ,కవులవాక్కులకు అమృతం కూర్చిన ‘’నీ వినోదంబులు అమితాద్భుతములు ‘’అన్నారు .తర్వాత ముచుకు౦దు డు మొదలైన భక్తులకు మోక్షమిచ్చిన గాధలు ప్రస్తుతించారు .’’దురితాటవులకు విస్ఫురదగ్నిహోత్రం,ఆపదద్రులకు వజ్రాయుధం ,వివిధ మనో రోగ బిస తంతువులకు గంధ బంధుర మత్తగజం ,అజ్ఞానరూప గాఢాంధకారానికి గొప్ప ప్రభాకర మండలోదయం ,తీరని దారిద్ర్య వారివాహకులకు భూరిజవోపేత మారుతం ,సకలపురుషార్ధ ఫలజయ సాధనం ,భావ మహార్ణవ తరణం కృష్ణనామం పావనం అని మహా గొప్పగా పద్యం రాశారు
నారదుడు నీ భక్తిబీజాన్ని భువిలో నాటితే ,ధ్రువుడు నిశ్చలభక్తితో పాదు చేస్తే ,ప్రహ్లాదుడు నీరుపోస్తే ,రుక్మా౦గదుడు అంకురిం పిస్తే ,భీష్ముడుచివురి౦ప జేస్తే ,ద్రౌపది పర్ణాళిప్రబలజేస్తే ‘’విరుల నలరార జేససెనుకరి ,శుకుండు –పక్వ ఫలములగాయించచె భక్తులీ-ఫలముల గడుమెక్కి ‘’నీ పదాంబుజాలను చేరుకొంటున్నారని మరో అద్భుతపద్యం సెలవిచ్చారు ఆచార్యవర్యకవి .నీపాదాలు నిర్మలగంగాభవానీ సముద్భవ స్థానాలు .నీ అమ్ఘ్రులు నిగమాంత పుష్ప సంచార పారీణ పుష్పంధయాలు ,నీపద్మాలు నిత్యపద్మాలయా ప్రియంభావుకాలు ,నీ అడుగులు నిర్వాణసౌధాగ్ర సీమలకు అలంకారాలు ,నీచరణపద్మాలు ‘’నీరజాసనాది సుర సంచయమునకవ్యాజసౌఖ్య –సంపదల నెల్ల సమకూర్చు ‘’అని మరో చిరస్మరణీయ పద్యం శాయించారు ఆచార్యశ్రీ .తనకేమీ రాదంటూనే వేదాన్తరహస్యాలన్నీ కరతలామలకం చేశారు భక్తిలో మునిగి,ముంచి తేల్చారు
‘’మాధరా ఉధృత భూధరా పి౦ఛదా-మాధరా విష్టప నాద రార’’అనిమరోరసగుళిక వదిలారు .’’కుమ్మరపుర్వులాగున సంసరణమందు- దిరుగుచు నిన్ను నేమరసివాడు –భక్తి నిష్టాగరిష్టుడై వరలువాడు –సర్వమర్పించి నీసేవ సలుపువాడు-నీకు ప్రియతమ భక్తీ నిర్మలాత్మ ‘’అని భక్తితత్పరుని దివ్యలక్షణాలు ఆవిష్కరించారు .’’అవురయేమందు నీయంద మందు –విందు వి౦దది వలపుల మందు ‘’అని మహామహాకవులకేమీ తీసిపోనట్లు పద్యాలు అమృతరసప్రవాహంగా చిమ్మేశారు .’’చిత్తమా భక్తితో శ్రీ వేణుగోపాలు –భక్తితో భజియించి ముక్తి బడయుమంటి ‘’వక్త్రమా వ్రజసున్దరీ నాధుని కీర్తనలుపాడి సుఖంపొందు ,ఘ్రాణమా కృష్ణ అంఘ్రి రాజీవ పరిమళతులసి గంధాలలో మెలుగు ,పాణి యుగ్మమా కృష్ణ పాదారవి౦ద౦బు బు లర్చించి సంతోషించు అక్షియుగ్మమా శ్రీకృష్ణుని చూడు శ్రోత్రయుగామా హరికధల్ విను ,మూర్ధమా ప్రీతితో కన్నయ్యకు మొక్కుఅని శరీరభాగాలన్నిటినిస్వామి సేవలో తరించమని హితవుచెప్పారు ఇలాంటిపద్యం అరుదు అనిపించింది .
106వ పద్యంలో ప్రజలు సౌహార్దభావంతో మెలిగేట్లు చేయమని ,ధర్మమే జయం అన్నదాన్ని సార్ధకం చేయమని ,భూమి ముక్కారుపంటలతో విలసిల్లెట్లుగా సామాజికధర్మ౦గా కోరి ‘’ఆరనిభక్తితో ఆ గోపాలబాలుని అందరూ అర్చించే భక్తిభావన కల్పించమని ,ప్రతికుటుంబం ,పాడి పంటలతో తామరతంపరగా వెలయు నట్లు చేయమని ,అందరికి తోడూ నీడగా ఉంటూ కాచి రక్షించమని వేణుగోపాలకృష్ణుని ప్రార్ది౦చారుకవి విశ్వ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ .ఇలా రాసినవారరెవరైనా ఇంతకుము౦దున్నారా అని నాకు అనుమానం .తర్వాత సీసం లో మంగళం పాడారు .చివరి 108పద్యంలో –తండ్రి వెంకటాచార్యులు తల్లి పేరిందేవి ,శ్రీనివాసాచార్య సోదరుడు ,వంశం దూపాటివంశం.తనను నారాయణా అనిపిలుస్తారు ,తన ఊరు చిన్ని యనమదల ..’’కేవలజ్ఞుడ యుష్మతగ్రుపా వశమున –త్వద్గుణార్ణవమున గొన్ని పద్య రత్న-ములను దేవితి గొని ,నన్ను బ్రోవుమయ్య –వరద పూనూరు వేణుగోపాల కృష్ణ ‘’ అంటూ’’ ఆడియేన్ దాసోహం’’గా కవి తన భక్తిని మనస్పూర్తిగా చాటుకున్నారు .రసప్రవాహ పద్యాలివి .జ్ఞానవైరాగ్య తత్వ ప్రధానాలు ,ప్రదానాలుకూడా .దూపాటి వారి వంశం అంటే నే గోప్పకవిపండితులకు నిలయం .మనకవి అందులో ఎవరికీతక్కువకాదు అన్నిరకాల భావాలతో పద్యాలుపరిగెత్తాయి .అద్భుతం అనిపించింది .ఈ శతకాన్నీ ,ఈ కవిగారిని పరిచయం చేసి నేను ధన్యుడిని అయ్యాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-10-22-ఉయ్యూరు