సుబుద్ధి శతకం
గుంటూరు తాలూకా గారపాడు వాసి ఖాసీం ఆలీషా కవి సుబుద్ధి శతకాన్ని రచించి గుంటూరు కన్యకా ముద్రాక్షరశాలలో 1924న ప్రచురించారు .ఈకవి మణిమంజరి నాటకం ,కొండవీటి చరిత్ర మొదలైన రచనలు చేశారు.వేద విద్యాపరుడు ,ప్రదిత సత్కీర్తి ,సూనృత వ్రత గరిష్టుడు,అమలగుణ శాలి అయిన తన తండ్రి మౌలాలీ గారికి అంకితమిచ్చారు . ఈ కంద పద్య శతక మకుటం ‘’సుబుద్ధీ ‘’.
మొదటిపద్యంలో లక్ష్మీదేవిని –శ్రీ మహిలా మణిత్రిజ –ద్దామోదర ప్రధిత మణియునై-దైవ గణ పురం –ద్రీమణిదుగ్దాబ్దికుమా –రీమణిరామనిన్ను గనికరించును సుబుద్ధీ’’అని ధైర్యం చెప్పారు .భువి దివి సర్వగ్రహాలను ,సూర్య మాతరిశ్వాదులను సృజించిన ఆ భూధవుని పరాత్పరుని ,పరుని తలచారు .అక్షరుని సర్వ లోకాధ్యక్షుని దక్షుని స్తుతించమని చెప్పారు .తర్వాత గణనాధుని ,సద్రస పేశల మాధురీ నిరంకుశ భాషా రసికత్వం లో కుశలత ఇవ్వటానికి భారతిని కొల్చారు అంటే కొలవమని చెప్పారని భావం.
‘’క౦ద౦బులు సుకవీశుల-కందంబు లమంద సుందరాబ్జాస్యలకున్ –గుందంబులు బుధ –కర్ణానందంబులు ‘’కనుక కందంలో కదను తొక్కానని అందంగా చిందులేస్తూ చెప్పారు .తెలుగు కవిత్వం అల్లన కుమ్మరిమొల్లకు జోహార్లు చెప్పారు .పూర్వకవులకు కైమోడ్పులు పలికారు .
తర్వాత నీతులు బోధించటం ప్రారంభించి అత్తనుకులదేవతగా ,మామను ఉర్వీన్ద్రునిగా ,భక్తితో సేవించే సతిని సత్తరుణి అంటారని ,భర్తను సేవి౦చె భార్య సౌభాగ్యవతి అనీ ,జనకజ కుముదవతి అనసూయ అరు౦ధతులమార్గం లో స్త్రీలు నడిస్తే ఉత్తమగతులు కలుగుతాయని చెప్పారు .తగిన మగడు ఇంట్లో ఉంటె ,వాడిని దిగ ద్రొక్కి విటాళికోసం తెగతిరిగే వగలాడిని ,చెడు బోటిని తెగనరికినా తప్పులేదన్నారు .మొగుడితో గుద్దులాడేది ఆడదికాడు గాడిద అన్నారు .కడుపెకైలాసంగా జీవించటం నీచం .రచ్చలకుఎక్కకు రచ్చలకుకాలుదువ్వకు ,మెచ్చులకోసం అదరకు .యాత్రలకోసం గాత్రాన్ని ఇబ్బంది పెట్టక కించిత్ స్తోత్రం చేస్తేముక్తివస్తుంది .నడవడి చెడితే నీచునిగా లోకంచూస్తుంది .భిక్షం (బికిరం )ఎత్తేవారిని ,వికలాంగుల్ని పరిహాసం చేయకు అది భగవత్ ప్రయత్నం వాళ్ళ తప్పుకాదని గ్రహించు .
లక్షణం లేనికవిత్వం శిక్షణ లేని స్త్రీ శీలం భిక్షాటన జీవితం అక్షయమైన నింద.లయ లేని సంగీతం ప్రియం తెలియని తిండి ,వ్యయం తెలీని డంబం నియమం లేని నెలత రాణించవు .నీతి స్థిరురులైన పెద్దలమాటలు వేదవాక్యాలే .’’చెడి బ్రతుకుట కంటే లేదు చెరుపు ‘’.శిలకు ,శైలానికి ,దోమకు ఏనుగుకు ,ఎంత తేడానో కులకాంతకు వెలకా౦తకు అంత తేడాఉంది .దేనినైనా తనవారికంటే ముందు తింటే –‘’ఎనుబోతని ,మనుబోతని ,తినుబోతని లోకం ఈసడిస్తుంది .పరువంలో బుద్ధి త్వరత్వరగా పరిగెత్తుతుంది .దానితో పరిగెత్తగలమా ?’’కరువలి (గాలి )కైనా ,మురహరి గరుడునికైనా ‘’ఇది తప్పదు.చీటికీ మాటికీ అత్తింట్లో అలిగి ‘’బుట్టింటి కేగకెప్పుడు –మెట్టిన నట్టింట ఉండటం మేలు .’’చచ్చినమీదట పుచ్చిన వక్కైన నీతో రాదు .కోపం ఘోర విపద్ధూపం దుర్భర దురంత దుష్కృత కూపం .శాంతం ‘’విలసత్కార్యాశాంతం –చిరసౌఖ్యసద్యశః ప్రాంతం వేదాన్తోదంతం శాంతమే భోషాణం సారీ భూషణం .కవిగాయకులకు సతికి భోగినికి కళలే .’’తొడవులు ‘’.తన శుభ్రత గృహశుభ్రత ఘనం .
‘’బాలికలకు బాలురకును-దేలికగా దెలియ దేట తెనుగుపడంబుల్ –గ్రాలెడు పద్యంబులనే -జాలగ వ్రాసితిని దీని జదువుసుబుద్దీ ‘’అని 102వ పద్యం రాసి చివరి 103వ కందంలో –‘’మతిమంతుల హృద్గతమై –క్షితి సాధ్వీతిలకములకు శ్రీకరమైశా –శ్వతమై మత్క్రుతమగు నీ –శతకము వర్ధి లును గాక సతతము సుబుద్ధీ ‘’అని ఆశావహంగా ముగించారు ఆలీషా కవి .ధారాశుద్ధికల కవిత్వం అందరికి కావాల్సిన నీతులు పుష్కలంగా ఉన్నాయి .చిన్నాపెద్దాముసలీ ముతకా అందరూచదివి తీరాల్సిన శతకం .బుద్ధికి పదును పెట్టి సుబుద్ధిని చేసే శతకం .ఎక్కడాతడబాటులేదు .ధార కుంటూ పడటం లేదు .పరుగోపరుగు అన్నట్లు క౦దాలను హృదయంగమంగా రాసిన కవి ఖాసీం ఆలీషా మరో వేమన అనిస్తారు మరో సుమతీశతకం కుమారీశతకం మనము౦దున్నట్లు భావన కలుగుతుంది .
ఈకవినీ ,ఈశతకాన్నీ పరిచయం చేసి నేను ధన్యుడను అయ్యాను .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-22-ఉయ్యూరు