శ్రీ శూన్య లింగ శతకం

శ్రీ శూన్య లింగ శతకం
కాకినాడ ఎల్ ఎఫ్ .సబ్ డివిజన్ ఆఫీస్ హెడ్ క్లార్క్ శ్రీ వోలేటి సుబ్బారావు గారు శ్రీ సీతారామా౦జనేయ సంవాద సార సంగ్రహ రూప ‘’శ్రీ శూన్య లింగ శతకం ‘’ ను రచించి ,అమలాపురం శ్రీ మారుతి ముద్రానిలయం లో ముద్రించారు .వెల-ఒక అణామాత్రమె .సంవత్సరం తెలుపలేదు .ప్రార్ధన సీస పద్యం లో –‘’ననునేల భయమేల నయశీల రావేల –చీటికిమాటికి మూల గ్రాలనేల ‘’అంటూ నెపం తో మొదలెట్టి ,గీతపద్యం లో –‘’పలుకవేల శ్రీలోల నన్ దలపవేల –సహజ యోగానంద జలధి లోల ‘’అని, రెండవ సీసం లో –‘’శ్రీరామ యని నిన్ను బ్రేమగా బిల్చెదనన్న –నామ రూపములు నాస్తి కన్న-వైకుంఠ నిను గాంచి వర్ధిల్లెద నటన్న –లోకాళితో బొత్తునీకు సున్న’’అని వ్యాజంతో అంటూ కానుకలిచ్చి ఘనత చెందుదామంటే కామాది వాసనలు కల్ల – భక్తితో ప్రణమిల్లుదామంటే ఒక్క చోటా నీకు కాలునిలువదాయే,పాహిమాం అందామంటే తలపులు కలలోని మాటలే –‘’సీతమ్మతో జెప్పి చెంత చేరెదనన్న –తలపదు నా మాట కలియనిన్ను ‘’అని గీతం లో –‘’నీవు నన్నెట్లు గాచేదో నిర్వికార –నయన పథచార రాగాది భయవిదూర –త్రిపుర సంహార యో వీర ధీర ధీర –భౌమ శబ్దార్ధ సువిచార స్వా విహార ‘’అని తన వేదాంత పరిజ్ఞానమంతా వలకబోసి, చెప్ప బోయేదానికి నాందీ ప్రస్తావనగా చేశారు .అసలు శతకమంతా గీత పద్యాలలో కూర్చి ‘’సుభగ పుష్ప భ్రు౦గ శూన్యలింగ ‘’అని మకుట కిరీటం పెట్టారు .
శతకాన్ని తారక యోగంతో ప్రారంభించి ‘’భక్తికలుగు పూజ పరమపదమునిచ్చు ‘’అంటూ ,కర్మ చేస్తే ముక్తి రాదు జ్ఞానమార్గంతో సద్గురునివలన చిత్తశుద్ధికలుగుతుంది .మూర్తి ఆరాధనతో శివుడిని కొలిస్తే ‘’మూర్తి విడిచి మూల మూర్తి తానౌను ‘’అన్న ఎరుక చెప్పారు .అణోరణీయాన్ మహతో మహీయాన్ ‘’అనే భావన చక్కని పద్యంలో కూర్చి ‘’శ్రుతులు కూడా నిన్ను నుతియి౦ప జాలవు ‘’అన్నారు .చిత్త శుద్ధి లేనిది ఏదీ సాధ్యం కాదు అని మరీ మరీ చెప్పారు .చిత్ర చిత్ర కళలు చిత్ర విభ్రమాలు –‘’పండు వెన్నెల తుది నిండి యున్న రూపులేనికళను రూపించి చూడు ‘’అన్నారు .ధీయోగి నాద సూత్రం తెలుసుకొని నాదలయం లో మోదించి నిలుస్తాడు’’.అవ్యక్త స్థితినే బిందు అంటారు .బుద్ధిని దాటితే అంతా పూర్ణమే.యోని లింగైక్యం శివుని చేరుస్తుంది .స్త్రీపురుషులు ఒక్కరవటమే ‘’పరగ నద్వైతము ‘’’’మరుని క్రతువుకన్నా మారులేదు ‘’.’’సతిని గూడ ముక్తి –సతిని వీడితెబంధం ‘’ హఠంలో అష్ట సిద్ధులు కల్గుతాయి .యోగం అభ్యసించి భోగం వదిలితే మనసు చిక్క బట్టితే అంతా ఆనుకూల్యమే .
తర్వాత సాంఖ్యయోగం వివరించారు –‘’సృష్టిజాడ సృష్టికర్తకేతెలుసు –శ్రుతులు భిన్నరూపంగా చెప్పాయి .’’లేనిదాని నెట్లు లెక్కింప భయం ‘’దేనికి ?జగత్తు స్థూలం .తత్త్వం సూక్ష్మం.ఉన్నదానిను౦చేఉత్పత్తికాని, శూన్యంలో సృష్టి జరుగుతుందా ?తలిదండ్రిలేక సంతానం ఉంటుందా ?’’.కార్యజగము కాదు కారణాత్మ కాదు .చిత్రం ఏమిటో చెప్పలేము –‘’తెచ్చుకొన్న ముండ తిప్పలు పెట్టదా?’’అని నీతి చెప్పారు .’’దేహ సాక్షి అంటే దేహం తానూ అవటమే ‘’దృక్కు బ్రహ్మమౌను –దృశ్యంబు జగమౌను …సత్తు చిత్తూ సకలం తానె ‘’ ‘’
తర్వత ‘’అమనస్క యోగం ‘’వివరించారు –‘’మానసంబు చేత గానవచ్చు జగము –మనసు గలియకున్న గనుట లేదు –మనసే చూడటానికి దృశ్యజాలం అవుతుంది .మనసును తెలుసుకొన్న వారెవరూ లేరు .అన్నిటికీ మనస్సాక్షి ముఖ్యం .దినదినం లో సుషుప్తి తేజరిల్లుతుంది .జన్మజన్మాల మధ్యా చావు ఉంటుంది ..సహజ రాజయోగ సారమే మనిషి ..జగం వేరే కాదు జగమంతా బ్రహ్మమే .జగత్తు బ్రహ్మంలో పుట్టి బ్రహ్మ లో కలిసిపోతుంది .దేహంలోనే ముక్తి దేహాంతంలో కూడా ముక్తి –కనుక నేలవిడిచి సాము వద్దు ..తనను తానటంచు దగగాంచ ముక్తుడౌ.’’సార మెద్ది జ్ఞాన రూపం బెద్ది –యాదికాది కెద్ది యఖిల మెద్ది –యెద్దిబుద్ధి నడపునద్దియే బ్రహ్మంబు ‘’అని అసలు సూక్షం ఆవిష్కరించారు ‘’’తలప నీశు డౌను తత్పద వాచ్యంబు –తత్పరు౦డజుడు తత్పద లక్ష్యంబు ‘’బ్రహ్మాన్ని తెలిసినవాడు బ్రహ్మమే అవుతాడు –నువ్వు నేను లేని నిలకడ బ్రహ్మం ‘’అని ఉపనిషత్ ఉపదేశం అందించారు
99వ పద్యంలో –‘’సకల నిగమ రూప సారసంగ్రహ మూర్తి –యంగలింగ రూప లింగమూర్తి –సకల హృదయ గమ్య చైతన్య సత్కీర్తి –సుభగ పుష్పభ్రు౦గ శూన్యలింగ ‘’100వ చివరి పద్యం –‘’ఆశ్రిత జన రక్షణానంద సుముఖా౦గ -నిజ సులభ సుఖ జలనిధితరంగ –ద్వయ రహితసుభాంగ భావ వర్జిత సంగ –సుభగపుష్ప భ్రుంగశూన్య లింగ ‘’అని పూర్తిచేశారు ‘.
చివరలో గద్యం రాసి ‘’ఇది శ్రీ పరమేశ్వరీ పరమేశ్వరైక్య స్వరూప భూత ,విద్వాదనుభవ సిద్ధ సహజామనస్క –రాజయోగ సారామృత నిరంతర పానానంద విరాజిత ,నిముస కవి వంశ పారావార రాకాసుధాకర శ్రీ మల్లప రాజామాత్య శేఖర శ్రీ మత్సద్గురు చరణారవింద ,కరుణా కటాక్ష లబ్ధజ్ఞాన ,ఓలేటివంశ పవిత్ర శ్రీసూర్య నారాయణ మంత్రిపుత్ర శేషమాంబా శుక్తి ముక్తాఫల సుబ్బారాయ విరచిత శ్రీ సీతారామ సంవాద సార సంగ్రహ రూప శ్రీ శూన్యలింగ శతక రాజంబు సర్వంబు శ్రీ పరదేవతార్పణమస్తు –శ్రీ శ్రీశ్రీ .
అని తన ప్రవర తెలియ జేశారు కవి .హెడ్ క్లార్క్ ఇంతటి ఘనమైన తత్వాన్ని అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు ,ఆరుచిని తేనే మాధుర్య శైలిలో రంగరించి మనకు అందించారు .మనముందు అసలు ‘’సీతారామాంజనేయ సంవాద౦’’దాన్ని ప్రతిపద్య మాధుర్య ఫలభరిత౦గారచించిన శ్రీ పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి దర్శన మిస్తారు .ఆగ్రంథాన్నీ ఆకర్తను మన ముందుంచారు ఈశతకం ద్వారా మనకవి శ్రీ ఓలేటి సుబ్బారావు గారు .ఓలేటి వారు అంటే సాహిత్య ,కవనాలను ‘’ఏలేటి వారు ‘’ అని వీరూ రుజువు చేసుకొన్నారు .
ఈ శతకం మన వాళ్ళ దృష్టిలో పడిన దాఖలా నాకు కనిపించలేదు .ఈ శతకకర్తనూ, శతకాన్నీ పరిచయం చేసి నేను అదృష్ట వంతుడినయ్యాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-22-ఉయ్యూరు ‘’..

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.