హాస్యానందం(చివరిభాగం )
55- నవ్య సాహిత్యం లో హాస్యం -3
శ్రీశ్రీ హాస్యం
మహా కవి శ్రీ శ్రీ కొన్ని హాస్య గేయాలు రాశాడు .మూడు యాభైలు అనే గేయ సంపుటిలో చాలా హాస్యం పండించాడు ప్రాస క్రీడలు లో ‘’–రాస క్రీడా శృంగారానికీ రమ్యమైన ప్రాణం –ప్రాస క్రీడహాస్యానికి పసందైన బాణం ‘’నవ్యత్వాన్నికోరాడు ‘’సౌభద్రుని ప్రణయయాత్ర చదవాలని తొందర –ఎంకిపాటలు వన్స్ మోర్ ,కవికోకిల గబ్బిలం విశ్వ సత్య నాథాయణ అగ్గిమీద గుగ్గిలం ‘’మొదలైన వాక్యాలు హాస్య స్ఫోరకాలన్నారు మునిమాణిక్యం.అల్లాటప్పా రాతలు రాస్తే చెవి మేలేస్తాడు శ్రీశ్రీ –‘’అల్లాటప్పా రాతలు రాయటమే గొప్పా –ఒప్పుకోదగ్గ మెప్పా ?అలాంటి కవుల చెవులు మెలితిప్పానంటే అది నాతప్పా ?’’అన్నాడు .శ్రీశ్రీ కలం నుంచి జలువారిందిఏడైనా గోప్పెఅని కితాబిచ్చారు మాష్టారు .
భానుమతిగారి హాస్యం సంసార పక్షం .ఆవిడ అత్తగారు అమాయకురాలు.జపాను ఎక్కడ ఉందొ తెలీనిది .ఆగ్రా దగ్గరే ఉంది అంటే నమ్ముతుంది. తన్ను తీసుకు వెళ్లి చూపించమని కొడుకును అడుగుతుంది .మదడి బట్టలు మడి ఆవకాయ జాడీలతో జపాన్ కు ప్రయాణమౌతుంది .కోడలూ మనుమడూ ఆమెను ఆడిస్తారు .ఆమె అమాయకత్వమే ఇక్కడ హాస్యానికి హేతువు అన్నారు గురూజీ .ఆమె అభిప్రాయాలుఅజ్ఞానం పరిహాసం సృష్టిస్తాయి .అయితే ఆమె ప్రేమ మూర్తి .ఆమెకు జపాన్ బట్టలు కట్టి తైతక్కలాడుతున్నట్లుగా ముఖ చిత్రం గీయటం ఆమెను అపహాస్యం చేయటమే అన్నారు బాధతో,ఉగ్రరూపం తో నరసి౦హారావు గారు .
ముళ్ళపూడి వెంకట రమణ ఉత్సాహ వంతుడైన యువకుడు .పరమ రమణీయమైన శాబ్దిక హాస్యం సృష్టించాడు .మల్లాది విశ్వనాథ కవిరాజు ,మల్లాది వెంకట కృష్ణ శర్మ మంచి హాస్య ఏకాంకికలు రాశారు. నేటి రాజకీయాలు ,అంతర్ రాష్ట్ర సమస్యలు ,కవి సమాజాలు ,నాటక సభలుమోదలైనవాటిపై వ్యంగ్య రచనలు చేశారు.మన హాస్య గ్రంథాలలో ముందు చెప్పదగినది మొక్కపాటివారి బారిస్టర్ పార్వతీశం,.’’క్షితిలో బారిస్టరు పార్వతీశమును చెప్పి –పిదప పలుకవలే గదా –కితకితల కితరులను –భాసిత సుశ్లోకు డతడు’’అన్నమాట నిజమన్నారు మాణిక్యం మాస్టారు .రావూరు వారి హాస్యం మృదువైంది . విడిగా హాస్య గ్రంథాలు రాయలేదుకానీ వీరి వడగండ్లు ,ఆషామాషీ చదవని వారులేరన్నారు .మాటల్లోనూ హాస్యం చిలికిస్తారు .ఆయన ఛలోక్తి ఒకటి మాస్టారు చెప్పారు –సిగరెట్లు మానెయ్యటం మంచిది ‘’అన్నాను నేను .ఆయన ‘’నిజమే .అందుకే నేను ఎప్పుడూ మానేస్తూ ఉంటాను .ఇప్పటికి కనీసం పాతిక సార్లు మానేసి ఉంటాను ‘’అన్నారట రావూరు వెంకట సత్యనారాయణగారు .
అసలు హాస్యానికి పుట్టినిల్లు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా .ఇతర దేశాలసంగతి తనకు తెలీదన్నారు. ఆ దేశాల్లో హాస్యం సాహిత్యం లో ఉజ్జ్వలమణిలాగా ప్రకాశించింది .ఇంగ్లీష్ తో పరిచయం అయ్యాకే హాస్య సమగ్రస్వరూపం ,విశిష్ట త మనకు తెలిశాయి అన్నారు గురూజీ .మోలియర్ ,మార్క్ ట్వేన్ ,లీకాక్ వంటి హాస్యవేత్తలు తెలుగులో లేరనే చెప్పచ్చు అన్నారు .ఒకరిద్దరున్న అదేమీ విశేషం కాదు అని పెదవి విరిచారు .పాలగుమ్మిపద్మరాజుగారి ‘’బతికిన కాలేజి నవల లో చక్కని,మృదువైన హాస్యం ఉందన్నారు ముని జీ .
చివరగా మనం చమత్కారం హాస్యం అనే మాటలను పర్యాయ పదాలుగా వాడుతాం ..ఈ రెంటికీ ఏదో కొత్తదనం విశిష్టఃత ఉండాలి .ఈ రెంటికీ భేదం ఏమిటి అంటే చెప్పటం కష్టం .స్థూలంగా కావ్యగుణం కలది చమత్కారం అనచ్చు. కావ్య గుణం కాక మరొక రకమైన రామణీయకత్వం కలదాన్ని హాస్యం అనచ్చు అన్నారు .చమత్కారంలో కావ్యగునం పెరిగితే ఉత్తమకవిత్వం అవుతుంది .చమత్కారం దిగజారి వికృతిపొందితే హాస్యం అవుతుంది అని మాస్టారు నిర్వచించారు .చిత్ర ,బంధకవిత్వాలు చమత్కార సంబంధమున్నవే .అల౦కారాలుకూడా చమత్కారాన్ని సాధించాటానికే ఉపయోగపడతాయి .వికృతి తో సంబంధంలేని ఏ అందమైనా చమత్కారమే .అయితే ఒక్కోసారి చమత్కారం హాస్యం కలిసే ఉంటాయి .అని చెప్పి –
‘’హమ్మయ్య ‘’అయిపొయింది కానీ హాస్యం గురించి చెప్పాల్సినవి కొన్ని చెప్పనే లేదు ‘’నవ్వు ఎందుకు వస్తుంది “’అనేదానిపై సమగ్రంగా చర్చించలేదు .బర్గ్ సన్,ఈస్ట్ మన్ ల సిద్ధాంతాలు సూచించి వదిలేశానేకాని ,తృప్తికరంగా పరామర్శించలేకపోయాను అని బాధపడ్డారు .శక్తిమూల హాస్యం ఉక్తిమూల హాస్యం లలోచేర్చాల్సినవి ఇంకాచాలా ఉన్నాయి .హాస్య ప్రయోజనం గురించి రాయలేకపోయాను ఈపుస్తకానికి ఆదరణలభిస్తే ,రెండో ఎడిషన్ లోఆవిషయాలురాస్తాను .లేకపోతె తర్వాత వాళ్ళు ఆసంగతిచూసుకొంటారు .ఈ పుస్తకం లో దోషాలను సద్భావంతో తెలియజేస్తే,సంతోషిస్తాను .కానీ మీ అభిప్రాయాలుమాత్రం నాకు తెలియ జేయండి అని ప్రార్ధిస్తున్నాను ‘’అని శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు 1968లో333పేజీలలో రాసిన ‘’మన హాస్యము ‘’ను ముగించారు దీన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ –హైదరాబాద్ ప్రచురించింది .ఇదే నేను24-10-2021న మొదలుపెట్టి ఈరోజు 27-10-22న పూర్తీ చేసిన 55ఎపిసోడ్ల ‘’హాస్యానందం ‘’కు ఆధారం .మరొక్క మారు- మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో-
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-22