ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-1
ప్రసార కళా ప్రవీణ శ్రీ ఓలేటి పార్వతీశం గారు మొన్న ఉయ్యూరుకు మా ఆహ్వాన౦పై, సరసభారతి జీవన సాఫల్య పురస్కారం అందుకొన్న శ్రీ ఉప్పలూరి సుబ్బరాయశర్మగారి తో కలిసి వచ్చినపుడు కార్తీకసాయం సమయాన మా శ్రీ సువర్చలానజేనేయస్వామి సన్నిధిలో పూజాదికాల అనంతరం తాము రచించిన ‘’వ్యాసార్ధం ‘’అనే మహత్తర పుస్తకాన్ని అందించారు .ఇవాళేకొన్ని వ్యాసాలు చదివి అందులోని విషయాలు సాహితీ బంధువులతో పంచుకొంటున్నాను కానీ ,ఆధునిక శుకులు, వైశంపాయననులు సౌతి ,అభినవ మల్లినాథ సూరి, అయిన వారి పుస్తకం సమీక్ష చేసే తాహతు ఉందనుకోను .,
వారిగురించి ఆచార్య జి.వి .సుబ్రహ్మణ్యం గారికంటే గొప్పగా చెప్పగలవారు ఉంటారని నేను అనుకోను .జి.వి .గారి మాటలు యధాతధంగా –‘’శ్రీ ఓలేటి పార్వతీశం గారితో మాట్లాడుతున్నప్పుడు నేను కార్తీక దీప ఘటం ప్రక్కన కూర్చున్న ఏదో అవ్యక్తమైన అనుభవాన్ని అంతరంగం లో అనుభవిస్తాను .వారిలోని ఏదో వెలుగు జిలుగు వన్నేలతోచుట్టూ పూలజల్లులా కురుస్తూ ఉంటుంది .మాట్లాడేవారికిఒక చెప్పలేని హాయిని కలిగిస్తుంది.అది వారి తాతగారి (ఓలేటి పార్వతీశం గారు )దివ్యభారతి ప్రకాశం కావచ్చు .తండ్రి శశాంక గారి స్నేహ కాంతి ప్రసారం కావచ్చు ,లేదా రెండూ కలిసి సాత్విక మధురంగా వెలుగొందుతున్న నవ్యకాంతి దీపకళికా సందీప్తికావచ్చు .కాల్పనిక చైతన్యం తో భక్తిభావ సుధాధారలను తాతగారు రాగమదురంగా ఆవిష్కరించేవారు .నాన్నగారు భావనా లలితమైన సుందర గీతికలను కమనీయంగా అభి వ్యక్తేకరించేవారు .తాతగారి భావతరంగం ,నాన్నగారి శబ్ద విహంగం రెండూకలిసి ఒక నవీన సృష్టిగా రూపొందిన సాహితీ చైతన్యం శ్రీ పార్వతీశం .ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా ,ఒక సంప్రదాయంతో ముచ్చట్లాడుతున్నఅనుభవాన్ని అందించే సహృదయులు శ్రీ వోలేటి పార్వతీశం’’.కనుక దటీజ్ పార్వతీశం .
అసలు వ్యాసార్ధం అంటే ఏమిటి ? జామెట్రిలో వృత్త కేంద్రాన్ని పరిధిపై ఏదో ఒక బిందువుతో కలిపేరేఖ అని అర్ధం.అది వృత్తానికి ప్రాణం .మరో అర్ధం కిరణం .కనుక ఇక్కడ ఈ పుస్తక శీర్షిక ను బట్టి అందులోని వ్యాసాలపై ప్రసరి౦ప బడిన కాంతి పుంజం అంటే, అందులోని జీవధాతువును వెతికిచూపించేది అని భావం అని నేననుకొన్నాను .మరో అర్ధం చక్రం ఇరుసులో ఉండే కీల .అది లేకపోతె బండి ముందుకు సాగదు .ఇందులోని వ్యాసాలలో కీలక భావాలున్నాయనే సంగతి తెలపటం కూడా .ఇందులో ఆలోచనాత్మకమైన ఇరవై వ్యాసాలున్నాయి .పుస్తకాన్ని తండ్రి శశాంకగారికి అంకితమిచ్చారు .దీనికి తగ్గట్టే చంద్ర రేఖ అంటే శశాంక ముఖ చిత్రంగా ఉంది .హాయిగా దానిని ఆసరాగా చేసుకొని ఊగుతున్న దేవ కన్యలాంటి చిన్నారి .
తండ్రి ని గురించి రాసిన శశాంక యశశ్చంద్రిక ‘’లో శుక్లపక్షం అదృష్టం ,కృష్ణపక్షం దురదృష్ట౦ .ఈ రెండూ కాలగతిలో పక్కపక్కనే పీఠం వేసి కూచున్న నేపధ్యం చంద్రవంకది.సాహిత్యం అలాంటి వారే నాలుగు దశాబ్దాలముండు మరుగైన సుప్రసిద్ధకవి శశాంక .’’ఎన్నినాళ్ళున్ననేమి ?క్షణము క్షణమొక సాహితీ ప్రణయ నేమి ‘’అని ఆయనే రాసుకొన్నాడు .కవీ అని సోమసుందర్ చేత పిలువబడినవాడు .అసలు సుబ్బారావు పేరును శశా౦కగా మార్చి౦దిఆయనె .కవిత్వంలో కమ్యూనిజమే ప్రవహించింది ‘’ఇజం నుంచి నిజం అనే ప్రిజం లోకి ప్రస్థానించటం ఆయన జీవితంలో అతి పెద్దమలుపు ..కొత్త ప్రపంచం –నయా జమానా కు ప్రేరణ పీడిత జన సంవేదన .అభ్యుదయ కవిత్వానికి మైలురాళ్ళు గురజాడ ,శ్రీ శ్రీ నారాయణబాబు పఠాభి.ఆదారుల్లో చైతన్యపు కాగడాలతో నడిచిన వారు సోమసుందర్ ,ఆరుద్ర ,దాశరదధి,కాళోజి కుందుర్తి .ఆ వెలుగు వేడి పిండుకొని తమగొంతుల్లో పలికి౦చినవారు గంగినేని, అనిసెట్టి ,గజ్జెల ,రమణారెడ్డి .ఆవరుసలో నే ఉన్నాడు శశాంక అన్నాడు డా ఎండ్లూరి సుధాకర్ ..
కవితలో ఒక అంతరలయ నిక్షేపి౦చటం శశాంక ప్రత్యేకత –‘’ధనస్వామ్య ఆకాశ జలదమూ –జనులకివ్వ దేనాడూ వర్షము ‘’అన్నాడు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మబలిదానంతో ఆంధ్రరాష్ట్రం రావటం చారిత్రకఘటనే కాని దాన్ని అభి వృద్ధిమార్గం లో నడిపించటం మనకర్తవ్యం అని –‘’తెలుగు తల్లి రక్తము తల్లి నొసట కు౦కుముగా –తెలుగుత్యాగము తల్లి మెడలోని నగలుగా –తెలుగుబిడ్డలనవ్వు సిగలోని పువ్వుగా –తెలుగులో విజిగీష జిల్గు దళుకొత్తగా –లేవోయి ,లే యింక తెలుగుబిడ్డా –నిలుపుకో మెలకువగా నీ తెలుగు గడ్డ ‘’అని ప్రబోధ గీతం పాడారు ‘’ఏమో –నువ్వు చనిపోయావేమో –లేకపోతె ఏమిటి ఈ చీకటి ?దుఖాశ్రుమాల –ఏమిటీ వట వృక్షం –శాఖా౦త రాలలో నిట్టూర్పులగాడ్పులు –ఆ౦క్ష మనో ఫలకం మీద –జగచ్చిత్ర శిల్పీ చిత్రిస్తున్నావా ?మానవ జాతి చరిత్రం –ఉదయాద్రిని మళ్ళీ కుంచె పుచ్చుకొన్నావా మళ్ళీ ‘’అంటూ శశాంక భావనామయప్రపంచాన్ని బాపిబావ యెంత అందంగా దర్శించాడో అని పార్వతీశం సంబర పడ్డారు
నవమానవ స్మిత సౌందర్యం –కవి శశాంక జీవనగానం –ఇదిరా నయాజమానా –హృదిలో నయా తరానా ‘’అని నినదించిన మానవతావాది శశాంక .కృష్ణశాస్త్రి వరవడిలో దేశభక్తి గీతాలురాసి పవిత్రతకు అద్దంపట్టాడు ‘’రావమ్మ స్వాతంత్ర్య భారత సావిత్రీ –రమ్మహో శాంత సంగీత శుభగాత్రి ‘’అనే గీతం ఆకాశ వాణి లో గణుతికెక్కిన గీతం .రజతోత్సవ సమయంలో –భారత స్వాతంత్ర్య రజతోత్సవం –వీరపూజకై ప్రజలెత్తు నీరాజనం ‘’వసంతానికి ఆయన అందజేసిన వినతిపత్రం అంతర్లయతో కుసుమ పెశలంగా ఉంటుంది-‘’చిలుకల వజీరూలు ,గొరవంక సరదార్లు –చివురాకు బాకులతో తీర్చిరి బరాబరులు ‘’బంగ్లా దేశ ఆవిర్భావానికి ‘’తూర్పు దెస చీకటుల చీల్చుక -.వెలసింది బంగాళాదేశం .ప్రతిరాత్రి 7-05వార్తాప్రసారాలముందు,7గం లకు చిన్నపిల్లలకోసం శశా౦కరాస్తే శారదా శ్రీనివాసన్ లాంటి సుగాత్రి చదివి వినిపించేవారని అందులో పెద్దమామయ్య- ,పనసపండు బదరీ మామయ్యా –అమలాపురం ,రాజుమామయ్య –వినాయక చవితి కథలు ధారావాహికంగా చిన్నపిల్లల మనస్తత్వానికి నిలువెత్తు నిదర్శనాలు లుగా ఉండేవని ఓలేటి గుర్తు చేసుకున్నారు ,గుర్తు చేశారుమనకు ,
రెండో వ్యాసం చూదడికొడుత్తు నాచియార్, ఆండాళ్ అయిన గోదా దేవి దివ్య చరితాన్ని కృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద లో వర్ణించిన తీరు సౌరు ‘’ఆమె చిత్తరువు లకొలువు ‘’.విష్ణుచిత్తునికి ఆమె తులసివనంలో లభించిన రాయలపద్యం –వింగడమై యొక్క వనవీదిగను౦గొనెనే నీడ సున్నపున్ –రంగు తరంగు పచ్చల యరంగాయిపో వెలిదమ్మి బావికిం-జెంగట నుల్లసిల్ల తులసీ వనసీమ శుభాంగి నొక్క బా-ల౦ గురువింద కందళ దళ ప్రతిమా౦ఘ్రి కరోదరా ధరన్’’అంటూ ఆమె దేవతాస్వరూపాన్ని దేవతానుకూల వతావరణ౦ లోనే చిత్రించాడని ,రాబోయే కథకు తులసీ మాల కంకర్యానికి ఇది సంబంధాన్ని సూచిస్తు౦ది అన్నారు వోలేటి .చెలులు ఆమెను అలంకరించిన వైనాన్నీ స్తవనీయ పద్యంగా చెప్పాడని ,పూర్వ జన్మలో భూదేవి అయిన ఆమెకు చెలులుగా ఉన్న నాగకన్యలు ఈ జన్మలో కూడా ఎడబాయక ,ఇరుగుపొరుగు వైష్ణవ కుటుంబాలలో మరాళిక, ఏకావళి ,హరిణి మొదలైన పేర్లతో ఆడ పిల్లలుగా పుట్టారట .గోదాదేవి రంగనాథుని శిరస్సున తల౦బ్రాలు పోస్తుంటే చివుళ్ళ వంటి ఆమె చేతి ముని వ్రేళ్ళు స్వామి శరీరానికి తాకి ఆయన మేను చమర్చగా అవి తలపైనుండి ముత్యాలబొట్లుగా ,వాన కురిసినప్పుడు చినుకులు ,వడగళ్ళు కలిసి కురిసినట్లు మనోజ్ఞంగా ఒక చిత్రం గీశాడు రాయలు అన్నారు .
గోదారి తూర్పు దారిలో –నవకవితా ఝరి ‘’అనే మూడవ వ్యాసంలో వీరేశలింగం గారినారద సరస్వతీ సంవాదం ‘’లో వర్తమానకవులు చౌకబారు అలంకరణచేస్తున్నారని రాసిన ‘’దయమాలి తుదముట్ట తలకట్ల నిగిడించి –ధీరుడై నన్ను బాధించునొకడు ‘’అన్నపద్యం సారస్వత లోకాన్ని కొత్తదారికి మళ్ళించిందనీ ,రామలింగారెడ్డిగారి ‘’ముసలమ్మ మరణం ‘’వేదం వారి ఆశీసులు అందుకొన్నదనీ ,,ఇతివృత్తం బ్రౌన్ ప్రచురించిన అనంతపుర చరిత్రలోది కావటం వలన కాల్పనిక కవిత్వంలో ప్రచలితంగా వినబడ లేదనీ ,విషాదా౦తమే అయినా శ్రీకారంతో మొదలుపెట్టి భరత వాక్యంతో ముగించటం తో ఇబ్బందికలిగిందనీ ,కవిత్వానికి కావలసింది మానసిక ఆలోచనే అయినా ,దాన్ని మించి భావనా శక్తి ఉండాలని కాల్పనిక కవులు కోరారానీ ,అది opens to an eternal world ‘’కాల్పనిక కవిత్వం అంటే ఏమీ లేదు మన భావకవిత్వమే ‘’అని కృష్ణశాస్త్రిగారు భరోసా ఇచ్చారని ,పిఠాపురం రాజా వెంకట మహీపతి గంగాధర రామారావు గారు ‘’సువిశాలమిదం విశ్వం ‘’,తరంగములు ,చినుకులు –చిందులు అనే గ్రంథాలు రాసి ,రాధామాధవం ఖండికలో మాధవుని పొందులేక వగపుతో ఉన్న రాధ ,ఆమె లేకపోవటంతో చింతలో ఉన్న మాధవుడు గా ఉన్నసన్నివేశంలో విరహాగ్ని కణాలు వెదజల్లి గొప్ప చిత్రం గీసినట్లు ‘’పదముల్ తొట్రిలవచ్చి ‘’పద్యం రాశాడనీ ,వెంకట పార్వతీశ జంటకవులు శతాధిక గ్రంథాలు రాశారని, గాలిపటం కవితలో ‘’పిల్లవానికి నైన నీవు ,విధికి నేను—సూత్రమున నీవు,నే గర్మ సూత్రమునకు –ననిలమునకీవు ,నే విషయానిలమున –కొదిగి ,లోగి భ్రమించు చుంటిమహహా ‘’లో అపరమాత్మతో జీవాత్మ సంబంధాన్ని సూత్రబంధం చేయటం అపూర్వమనీ ,గౌతమీకోకిల వేడదులవారు భావకవితా ప్రపంచంలో ద్వితీయులనీ ,ఆయన మాతల్లికావ్యం లో అనల్ప కల్పనా చతురత ఉందనీ ,ప్రకృతి పారవశ్యానికి కృష్ణ శాస్త్రి కేరాఫ్ అడ్రస్ అనీ ‘’ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల –బడిపోవు విరికన్నె వలపు వోలె ‘’పద్యం ఆయన కవితా శక్తికిదివిటీ అని ,ఆంధ్రా వర్డ్స్ వర్త్ కవికొండల వెంకటరావుగారు ఆంధ్ర,ఆంగ్లాలలో సమాన కవన వైదుష్యం చూపారనీ ,మరోభావకవి పిలకావారి రత్నోపహారం ,విభ్రాంతామరుకం భావనాపతటిమకు సంకేతాలనీ ,’’తలపు అర్చనకు అగరుపొగ మాలకావటం ‘’అపురూప కల్పనా చాతుర్యానికి నిండు దర్పణం అనీ ,కందుకూరి రామభద్రరావు బతుకు దారులగతుకుల్లో గడియకొక తీరుగా సాగే జీవన పయనం లో ఊహించిన వైవిధ్యం అపూర్వమనీ ,గోదావరిని పుణ్యోపేతగా మాతగా, సంభావించి చింతా దీక్షితులుగారు రాసిన –ప్రణయ వర్షం బామే వర్షి౦చు నమ్మ –మన కిలవేల్పామె ,మన పట్టుగొమ్మ –మనకలప భూజంబు మన వేల్పుతావు –మము గాంచి మము బెంచి మన్ని౦చు మాత ‘’అన్న పద్యంలో భావాలు కమనీయ కల్పనా లతికలు అన్నారు పార్వతీశంగారు .భావకవిత్వానికి అ౦కురారోపణ చేసింది రాయప్రోలు అయినా ,నవ్యకవిత్వ ధోరణికిబీజం వేసినవాడు మాత్రం కందుకూరి .ఆకవిత్వవనానికి పరివ్యాప్తం చేసి విరాణ్మూర్తి ని చేసింది కృష్ణశాస్త్రి .సజీవమైన గోదావరినది ఈ తీరానికి ఆకుపచ్చని చేలను అరణం ఇచ్చినట్లు ,తెలుగు సాహితీ గౌతమి తూర్పు తీరం కల్పనా భావన అన్న ద్వైతానికి నవ్య కవనమనే అద్వైతాన్ని బహుమానంగా ఇచ్చింది .ఫలితంగా గోదావరి తూర్పు దారిలో నవ కవితా ఝరి అమృత తుల్యప్రవాహమై రసానంద మందాకినీ సోయగాలతో సాగిపోయింది అన్నారు వోలేటి .ప్రత్యక్షర మాధుర్యంగాఅక్షర లక్షలు చేసే విలువైన వ్యాసంగా సాగిన రచన ఈ వ్యాసం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-31-10-22-ఉయ్యూరు