ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-2
‘’పద్యానికి అరణమిచ్చిన పాడియావు ‘’వ్యాసం ‘’పున్నయ్య ‘’అనబడే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గురించి .ధారణ బాగాఉన్న ఏక సంధాగ్రాహి .వారి గణపతి నవల తెలుగువారి శ్రవ్య మాధ్యమం లో మైలు రాయి ..ఇమ్మానేని హనుమంతరావు గారి ప్రోద్బలం తో కీచకవధ నాటకం 1899లో రాశారు .మంచి ప్రజాదరణ రావటంతో నాయుడుగారి ప్రోద్బలంతోసీతాకల్యాణ0 ,ద్రౌపదీ కల్యాణ౦, గయోపాఖ్యానాది నాటకాలు రాశారు .ప్రసిద్ధమైన ఆయన పద్యం ‘’భరతఖండంబు చక్కని పాడియావు ‘’’వేదికాముఖంగా పుట్టిందే .ఆయన చమత్కార సంభాషణ చణులు.చిక్కని హాస్యంతో లింగంగారు గిల్లిబాదిస్తే ,పల్చనిహాస్యంతో నరసింహంగారు గిలిగింతలు పెట్టి నవ్విస్తారు అన్న జయంతి రామయ్య మాటలు యదార్ధమన్నారు వోలేటి .’’ముదితల్ నేర్వగరాని విద్యగాలడీ ముద్దార నేర్పించినన్ ‘’అనే పద్యం అందరం ఉదాహరిస్తాం .కానీ పూర్తీ పద్యం ఏమిటో ఎవరు రాశారో ఎవరికీ తెలీదు .నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు మా మధ్య ఈ విషయం వస్తే ,’’ప్ర్రసాద్ గారూ దీన్ని మీరే సాధించాలి అని తెలుగు పండితులు నామీదనే భారం వేస్తె ఆంధ్రదేశంలో ప్రసిద్ధకవిపండిత విమర్శకులకు కార్డులు రాస్తే ఎవరూ స్పందించకపోతే చివరికి శ్రీమాన్ కోవెల సంపత్కుమారాచార్య నాకుకార్డ్ పై సమాధానం రాస్తూ అది చిలకమర్తివారి ప్రసన్న యాదవం నాటకం లోనిదని పద్యం పూర్తిగా రాసిపంపారు-‘’చదువంన్నేర్తురు పూరుషుల్ బలెనే శాస్త్రంబుల్ పతిఠింబించు చోన్ –నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్ వ్యాపారముల్ నేర్పుచో –నుదితోత్సాహముతోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్టించుచో –ముదితల్ నేర్వగ రాని విద్యగాలదేముద్దార నేర్పించినన్’’.
ఆతర్వాత ఆయనకూ నాకు మంచి స్నేహంకుదిరి తరచూ మాట్లాడుకోనేవారం .ఆయన పెదముత్తేవి పీఠాది పతి శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారిపై రాసిన పద్యాలపై చే.రా .చక్కని సమీక్ష చేస్తే ,ఆపుస్తకం పంపమంటే నాకు పంపిన సహృదయులు కోవేలవారు నిజానికి స్నేహానికి వారు కోవెల .
‘’విస్మృతిబాటలో ఒక స్మృతి పధం ‘’ఆచంట జానకిరాం పైన .ఆస్కార్ వైల్డ్ కవితను రాం ‘’నేను నిదురించు శయ్యాగ్రుహ పుటాకాశ –గవాక్ష మందుండి యొక్క తారకామణి’’కవితగా తెనిగించాడని ,’’అపురూపమైన ఒక్క నక్షత్రానికి ఉన్న విలువ అవలీలగా కనబడే నక్షత్రాలకు ఉండదు ‘’అన్న అద్భుత వాక్యం రాసినవాడు జానకిరాం అనీ ,రచనలలో మానవ సంబంధాలు ప్రతిబింబించేట్లు చేయటం ఆయన ప్రత్యేకత అనీ ,తాను ‘’ఆచంట లక్ష్మీ పతిగారబ్బాయిని ‘’అని చెప్పుకొని గర్వపడతారనీ ,,జీవితాంతం దాన్ని కొనసాగించారనీ ,నూలువడికి గాంధీ ముందు పెడితే ఆయన ‘’నువ్వు వడి కిందేనా ?అన్న ఆకంఠ స్వరాన్ని ఆజన్మాంతం మరచిపోలేదని ,వారం రోజులు సాధన చేసి మూడు నిమిషాలు మహాత్మని సమక్షంలో మాట్లాడి ‘’చంద్రునికో నూలుపోగులా విద్యార్ధుల తరఫున ఈచిన్న కానుక సమర్పిస్తున్నాను ‘’అని ఖద్దరు సంచీలోని నూటపదార్లు గాంధీ చేతిలో ఉంచగా ‘’ఆర్ యూ సాటిస్ఫైడ్ ?’’అని అయన అంటే పాతాళంలోకి కుంగిపోయిన ఆయన తలవంచుకొన్నాడట జానకిరాం .నా స్మృతితిపధం ను ముగిస్తూ ‘’ఎన్ని మెలికలు తిరిగినా నది చివరికి సంద్రం చేరకుండా ఉంటుందా ??’’అనేవాక్యం తనకు గొప్పనమ్మకం ధైర్యం ఇచ్చాయని ముగిస్తాడు అని చెప్పారు .ఆపుస్తకం ‘’ఏది చదివితే ఏమీ చదవకపోయినా ,అన్నీ చదివినట్లో-ఏది చదవకపోతే ,అన్నీ చదివికనా ఏమి చదవనట్లో ‘’అనే ఆర్యోక్తి ఉపనిషత్ వాక్యం కు అర్ధం అద్దం జానకిరాం పుస్తకం అనటం అత్యద్భుతం అనిపిస్తుంది .నిజంగా ఆపుస్తకం చదువుతుంటే ఆయనతో వెన్నెల విహారం చేస్తున్నట్లే ఉంటుంది .మనుషుల౦దరిలో మంచి తనం చూసిన మహనీయుడు .
పిఠాపురం ప్రవక్త ,కవి ఉమర్ ఆలీషా గురించి రాసిన ‘’శతవసంత సుందరి-మణిమాల ‘’లో ఓలేటి ‘’బాల్యదశ వదిలి యవ్వన ప్రారంభం లోఒక పద్య బహుళ నాటకానికి ఊపిరిపోయటం దానికి శతవసంతాలు ఆయుర్దాయం కలగటం ఒక అసాధారణ విషయమన్నారు .
‘’భావ చిత్ర చయనిక ఏకాంత సేవ ‘’లో వేంకటపార్వతీశకవుల ప్రతిభా విశేషాలు ఉగ్గడించారు .కృష్ణశాస్త్రిగారన్నట్లు ‘’వంగ భాష కు రవీంద్రుని గీతాంజలి ఎట్టిదో మనయా౦ధ్రమున మహాకవుల –భక్తులఏకాంత సేవ అట్టిది ‘’ఇంతకంటే ఎక్కువగా చెప్పక్కర్లేదు దాని వైశిష్ట్యం గూర్చి .
మంగళం పల్లి పై రాసిన ‘’ఆబాలగోపాలం ‘’లో దైవదత్తమైన అపూర్వ సంగీత విద్యా గరిమ చేత ,అపురూపమైన సాధనా బలం చేత సంగీత కళాకారునిగా తన అస్తిత్వం చాటుకొన్న బాలమురళి ,తంత్రీ ,తాళ వాద్యాలను వశం చేసుకాగా అవి ఆయనకర స్పర్శకు పరవశం చెందాయి .తానె వయోలిన్ వాయించుకొంటూ గానం చేసి ,మళ్ళీ ఆకీర్తనపాడుతూ మృదంగం వాయిస్తూ రెండు ట్రాక్ లు ఏకం చేసి తనపాట తాను పాడుకొంటూ ,సహకార వాయిద్యాలుగా వయోలిన్ ,మృదంగం తానె పలికి౦చు కొంటూ ఒక అరుదైన రికార్డ్ సృష్టించినవారు బాలమురళి .కృతుల గ్రంథాలేకాదు రాగ గంధాలూ సృష్టించారు .ఆయన సృజన రాగం లతాంగి విశిష్టమైనది .తిల్లానా గానం, రచనలతో అనితరసాధ్య వైదుష్యం చూపారు ,ఈల పాటను ‘’గళమురళి’’గా నామకరణం చేసి ,’’విజిల్ విజార్డ్ ‘’కొమరవోలు శివప్రసాద్ గారితో జుగల్ బందీ నిర్వహించటం ప్రతిభకు పట్టం కట్టటం .ఆబాలగోపాలమూ ఆరాధించే స్వరసమ్మోహన మూర్తి మంగళం పల్లి ‘’అని గొప్పగా విశ్లేషించారు పార్వతీశంగారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-22-ఉయ్యూరు