ఆదినారాయణ శతకం
ఆదినారాయణ శతకం శ్రీ మదాంధ్ర మాఘపురాణనిర్మాణధురీణ శ్రీ మన్నారాయణ చరణారవింద పారాయణ పారీణఅబ్బరాజు శేషాచలామాత్య మణి ప్రణీతం .తత్పుత్ర హనుమంతరాయ శర్మ పాకయాజి పరిశోదితం .శ్రీ దోనేపూడి పార్ధ సారధి సహాయంతో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయంముద్రాలయం లో క.కోదండరామ శర్మగారిచే1934లో ముద్రితం. వెల-ఒక అణా.
విజ్ఞప్తిలో కుమారుడు –తనతండ్రిగారు 28ఏళ్ళకు పూర్వం ఈ శతకం రాశారని ,భక్తిశతకాలలో దేనికీ తీసిపోదని తాను ముద్రించటానికి అనేక సార్లు ప్రయత్నించినా ,ద్రవ్యాభావ ,ఇతరకారణాల చేత చేయలేకపోయాననీ ,దోనేపూడి వారు ఈ వ్రాతప్రతి చూసి వెంటనే ముద్రిద్దామని పూర్తిగా ద్రవ్య సాయం చేశారని చెప్పారు .శార్దూల ,మత్తేభాలశతకమిది .’’ఆదినారాయణా ‘’మకుటం .
మొదటిశార్దూల పద్యం –‘’శ్రీ వాణీశ భవాదిసన్నుత ,రమా చిత్తేశ,మౌనీంద్ర స౦ –సేవా౦ఘ్రిద్వయ ,భాస్కరేందు నయనా చిద్రూప,భక్తప్రియా – భావాతీత సురేంద్ర వందిత ,మహా బ్రహ్మాండ భాండోదరా –వేవేగం గరుణింప నా దెసకు రావే యాది నారాయణా ‘’అని రాసి తర్వాత గణేశ త్రిమూర్తులను,వారి సతులను వ్యాసాది మౌనులను స్తుతించి కాకుత్స్థ అన్వయ పూర్ణశశి శ్రీరామ చంద్రునికి ఒకనూలుపోగేసి ,తర్వాత తనబాధలు చెప్పుకోవటం ప్రారంభించారు కవి .
సప్తజలధులు ఏకార్ణవం అయిన వేళ,బ్రహ్మాండాన్ని గర్భంలో దాచి రక్షించావనీ ,కరిరాజును బ్రోచావనీ ,ఇల్లు ,సంసారం జంజాటంలో మునిగి మనుషులు నిన్ను మర్చి ,కాలుని చేత దండన పొందుతున్నారనీ , నీ మంత్రాక్షర జపం ముక్తిమార్గమనీ ,’’సిరియుం, బంట వెలందియు గెలకులన్ సేవింప ,దిక్పాలకుల్-పరి వేష్టింప సనందనాది మునులున్ బ్రార్ధింప ,నీ మూర్తిని ‘’ ,కుజన క్షోభం ,సత్యాత్మక స్థిర తోషం ‘’కలిగిస్తావు .అరవి౦దాలకంటే అందంగా స్వామి చరణాలుంటాయి.నారాయణ మంత్రరాజ మహాత్మ్యం తెలిసినవారికి కొంగుబంగారమే చివరకు మోక్షమే .కలి దోషం అనే బాధకు స్వామి కళ్యాణ చరిత్ర దివ్యౌషధం .అమరాదీశ్వరుడు ఒకసారి ప్రమదా వినోదంలో మునిగితేలుతూ ‘’వాచస్పతి ‘’ని గౌరవి౦చక పోతె,స్వర్గంతో సహా అన్నీ నష్టపోయి ‘’నీ నామ మార్గము దాల్పన్ సుర సేవ్యుడైనాడు .
తర్వాత సోమకాసురవధ పాలసముద్రమధనం,’’త్రివి ‘’రూపంలో హిరణ్యాక్ష నిధనం , హేమకశిపుని నృసింహావతారం లో వధించి భక్త ప్రహ్లాదుని కాపాడి లోకాలకు హ్లాదం కలిగించటం ,ముల్లోకాలఏలిక బలిని ‘’బాకారి బంనంబులన్ దొలగం ద్రోసి ,రమాఢ్యు చేయుటకునై ,భూతాఘుడైనట్టి తద్బలిచే గొన్న పదత్రయావనిని –సర్వ వ్యాపివై నాకమున్ బలిమిన్వజ్రికి’’ఇచ్చావు .ఇలా దశావతార వర్ణన చేశారు.
పురుహూతుడు అసురెంద్రునితో పోరాడితే ఆఇన్ద్రునికరిమ్రి౦గితె,వృత్రు గర్భంలో పుట్టి వేగంగాచించి ‘’నారాయణ మంత్రం ‘’తో బయటికి వచ్చాడని మంత్రమహిమను కీర్తించారు .బాలకృష్ణుని లీలలు మేనమామ కంస వధ ,తృణావర్త వృత్తాంతం ,తల్లియశోదకు ‘’బ్రహ్మాండంబు నోర జూపగటం’’కాళింగు బిగబట్టి ,వానిపడగల్ కాళ్ళన్జెడన్, మట్టి-యా కాలిందీనది బాపి తజ్జలము ‘’చక్కగా ప్రాణులకు ఉపయోగ పడేట్లు చేశావ్..మురళీగానంతో గోపసతులకు మొహమ్ కల్గించి ,ఒక్కొక్కరికి ఒక్కొక్కడి వై రాసక్రీడ జగన్మోహనంగా ఆడావు .నరకుని తల్లి సత్యభామచేతనే నరికి౦చావ్ యుద్ధంలో .ధర్మరాజు రాజసూయంలో అగ్రతాంబూలం అందుకున్నావ్ .కురుక్షేత్ర యుద్ధంలో ‘’పార్దునకు చేదోడుగా ఉంటూధరాభారం తగ్గించావ్ .ఆపత్కాలం లోఎవరు నిన్ను ఆశ్రయిస్తారో వారికి ‘’దాపై గాచెదవు ‘’.
నహుష గర్వభంగం వర్ణించారు ‘’ఒకదీపం లోఉన్న తేజం వేరొక్కొక్క దీపంబు నన్ బ్రకటంబై నట్లు బ్రహ్మాండం లో ‘నీ ఒక్క రూపమే అనేక రూపాలుగా ఉత్పత్తి సంస్థితి వికలానికి కారణమవుతుంది .చివరగా –‘’శ్రీ కౌండిన్య మునీంద్ర గోత్రభవు డర్దిన్ దేవ భాషామాంధ్రభా-షాకావ్యామృతపానలాలసుడిలన్,శార్దూల ,మత్తేభ వృ-త్తాకారోజ్వల సూనమాలికను నమ్మక్కా౦బికా,నారసిం-హాకా౦క్షోద్భవ శేషయాహ్వయుడు ,కొమ్మీ యాదినారాయణా ‘’అని చెప్పి
పరాభవ నామ సంవత్సరంలో ద్రోణపురంలో ఆర్యులు ప్రమోదం పలుకగఈ శతకమ్ రాశానని ,ఆదినారాయణుడికి అన్కితమిచ్చాననీ ప్రకటించారు కవి .అన్ని విధాలా భక్తీ చిప్పిలింది .ముఖ్యంగా నారాయణ మంత్రం రాజ శ్రేష్టను గొప్పగా వర్ణించారు.మంచి భక్తిశతకమే వారబ్బాయి గారన్నట్లు .ఈ శతకాన్నీ, కవి గారిని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-3-11-22-ఉయ్యూరు