ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-4(

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-4(చివరి భాగం )
‘కొవ్వలి నవలలు –పఠనాసక్తి ‘’వ్యాసంలో చదివే ఆసక్తి ఉంటేనే రచన కాలంతోపాటు చెల్లుబాటౌతు౦దనీ ,సామాన్య చదువరులచేత అనూహ్య ఆదరణపొందిన నవలారచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు అనీ ,విశ్వనాథ ఆర్ష సంప్రదాయాన్ని కాపాడుతూ ,చలం స్త్రీలకు బయటి ప్రపంచాన్ని చూపిస్తూ కొడవటిగంటి సమాజంలోని స్తబ్దతను వదిలించి చైతన్యం కలిగిస్తూ రచనలు చేస్తున్నకాలం లో కొవ్వలి ఆకర్షణ ,ఉత్సుకతలతో ఒక సంచలన రచయితగా ఆవిష్క్రుతుయ్యాడని,చదువరి పుస్తకం లోనుంచి తన మస్తాకాన్ని పక్కకు తిప్పే వీల్లేకుండా నియంత్రించే మంత్ర శక్తి కొవ్వలికి ఉందనీ ,ఇంట్లో వాళ్ళు ఏమనుకొంటారో అని పుస్తకాల చాటున ,పడగ్గదిలో దాచుకొని చదివే వారనీ ,రైల్వే స్టేషన్లలో, రైళ్ళలో కొవ్వలి నవలలు ‘’హాట్ కేకులు ‘’గా అమ్ముడుపోయేవని ,అలాంటి వాడు ఇంకోడు రావాలనుకోవటం ఎండమావి లాంటి దేమో ?’’ అన్నారు .కొవ్వలి నవలలు ‘’కాలక్షేపం బఠానీ’’లు అని అనేవారు .
ఘంటసాలను ‘’వాగ్దేవి స్వరనైవేద్యం ‘’అని ఆవిష్కరించిన వ్యాసంలో కరుణ శ్రీ పద్యం ముందు తన గొంతును అద్దంలో పెట్టి ఘంటసాల భావ ప్రతిబింబాన్ని చూపాడు అని చెప్పటం నాకు తెలిసినంతవరకూ ఎవరూ ఇంతగొప్పగా ఆవిష్కరించలేదు .కవి అస్తిత్వాన్నీ కవిత్వ స్థితిగతుల్ని గళమాధుర్యంతో ప్రకటించగల ఘనత ఘంటసాలది అన్నారు .అలిగితివా సఖీ పాటలోఅనునయం అర్ధం కోసం నిఘంటువులలో వెతకక్కరలేదు ఆయన పాడే తీరులో పుష్కలంగా లభిస్తుంది .’’ధారుణి రాజ్య సంపద ‘’పద్యంలో భీముడి ఉద్రేకం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది .రౌద్రానికిస్థాయీభావంగా కనిపించే క్రోధం యొక్క ఔద్ధత్యం శ్రవ్య చిత్రంగా నిల్పి శరీరం రోమాంచితం చేస్తారు .’’మాణిక్య వీణా ముపలాలయ౦ తీం ‘’అన్న కాళిదాసు శ్లోకానికి తన స్వరంతో ‘’అమృత తుల్యం చేశారు .ధ్వన్యనుకరణలు చేయకుండా అగ్ర నటులకు గాత్రదానం చేసిన స్వర మాంత్రికుడు .పాట ,పద్యంతో వాగ్దేవికి స్వరనైవేద్యం చేసిన పూజారి .
‘’అతడొక త్రివర్ణమాల ‘’అంటూ శ్రీరంగం నారాయణ బాబు ‘ను పరిచయం చేశారు వోలేటి .ఆనాటి ఆంధ్రపత్రికలో ‘’మనకు సహకారి యగుచు మన్మధుడు వెదకి-వాడి యడుగుల గాడి త్రవ్వంగ కొత్త –చెలమలేర్పడి తేటలౌ జలములూరే ‘’అని రాసి భావకవిగా అస్తిత్వాన్ని చాటుకొని ,చీకటిలో మిణుగురు లను వెతికాడు.’’మువ్వపు వలపుతారల మువ్వ మ్రోత’’ఆయన మాత్రమె అనగలడు .’’దంతపు వీణైతేనేమి వొళ్ళు –తెగిపోయిన తీగ బతుకు –మేళన చేయని హృదయం –నీ వ్రేళ్ళకు బాధ మిగులు-నను ముట్టకు ‘’అంటూ వేశ్యను వర్ణించిన తీరు అనితరసాధ్యం –వెలకట్టబడిన తనువుతో వేదనా మయిగా జీవించే వెలది కరుణా౦తరంగాన్ని ,మానవీయకోణ౦తో ఎత్తిన పతాక .’’నా నివాసంము తొలుత గాంధర్వ లోక –మధుర సుషమా సుధాగాన మంజువాటి-ఏనొక వియోగ గీతిక ‘’అని కృష్ణశాస్త్రిని ,’’లోకాలు నాకేలనే –కోకిలా బాలకృష్ణుడు చాలునే ‘’అంటూ తురగా వెంకటరామయ్యను బాబు పాడుతుంటే ‘’ఇంతకంటే కవిత్వానికి పరమావధి ఏముంది ‘’అని శ్రీశ్రీ కూడా అంటే ఇంకేం కావాలని మనకు తెలీని విషయం ఆవిష్కరించారు పార్వతీశం .తనకాలంనాటి యువకవులకవితలను ఆయన గానం చేస్తుంటే ‘’విజీనగరంరసప్లావితం ‘’అయీదట .నారాయణ బాబు భావకవిత్వ ఆదర్శ వాద కవితా శాఖనుంచి వాస్తవిక శాఖకు ,అక్కడినుంచి వాస్తవిక అధివాస్తవికత కు ప్రయాణించాడు అతనికి పౌరాణిక కథలపైనా ,శాస్త్రీయ సంగీతం పైనా సమస్కంధమైన అవగాహన ఉందన్నారు .’’మంటల్లోపుట్టి మంటల్లోపెరిగి మంటల్లోనే మడిశాడు ‘’అని భగత్ సింగ్ ను ఒక అగ్ని శిఖగా చేసి రాశాడు .రాగ,తాళ లక్ష్యాలు సాకల్యంగా తెలిసి ‘’చెప్పవా –కష్టమైనా –సంకీర్ణపు –నరజాతికి –ఆకలి –ద్రువతాళ౦ –ఆకలితో –నా కడుపు –అగ్ని వీణ వాయిస్తే –దీపకరాగం-దిక్కు లెగబాకి-ఆకాశం అంటుకుంది –ఆర్పండి –ఆర్పండి ‘’రాత్రిని జీవితాన్నీ పడుగు పేకల్లా వర్ణించి ‘తెలుగు ధాత్రి ‘’రాశాడు .సర్రియలిజాన్ని శ్రీశ్రీ అతి వాస్తవికత అంటే నారాయణబాబు అది వాస్తవికత అని మౌన శంఖం పూరించి విలక్షణప్రయోగం చేశాడు –‘’మౌనము శంఖమై చెరగు మాయగా నేత్ర పాతనగ బింబ వి-ధ్వానము కొంగ నెత్తురులు త్రాగెను నల్లతురాయిపూవుగా —‘’
మారుషులు మార్క్స్ ,ఫ్రాయిడ్ లు అన్నాడు .ప్రయోజనాన్ని వినియోగించుకొని ,అనర్ధాన్ని విసర్జించడం కొమ్ములు తిరిగిన కవి చేయగలపని అన్నాడు .బాబు వ్యాసాలూ కతలూ రాశాడు .వీటిలో సినిమాలు నాటకాలూ ఉన్నాయి .కొమ్మూరి వెంకట్రామయ్య పత్రిక ‘’తెలుగు సినిమా ‘’లో వ్యాసాలురాశాడు .అబ్బూరివారి ‘’నటాలి’’లోనూ పనిచేశాడు .భావకవి అధివాస్తవిగా ,చివరికి అభ్యుదయకవిగా రూప విక్రియ చెంది తెలుగు వాళ్ళ కవనాకాశం లో త్రివ ర్ణమాలగా ఆవిష్క్రుతుడు అయ్యాడు నారాయణ బాబు అంటూ ఎస్టిమేట్ చేశారు పార్వతీశం .
‘’చివరకు మగిలిన సగం ‘’లో శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గారి గురించి రాస్తూ భర్తబుచ్చిబాబు అనే వెంకట సుబ్బారావు గారి కీర్తిలో అర్ధభాగం దక్కించుకొన్న విదుషీమణి అనీ ,ఆయనకోసం వచ్చే కవులు కళాకారులు రచయితలకోసం’’ వండ నలయదు వేవురు వచ్చి రేని ‘’అన్నట్లు ప్రవరునిభార్యలాగా అన్నపూర్ణకు ఉద్ది అయిన ఉత్తమా ఇల్లాలు .ఆమెగాయని, చిత్రకారిణి రచయిత్రి కనుక ఆ అర్ధ గౌరవం సంపాది౦చు కొన్నారని ,నిరంతర సౌన్దర్యాన్వేషి అయిన భర్త కు తగ్గట్లు ఇల్లు ఆహ్లాదంగా తీర్చిదిద్దేవారని ,ఇదంతా ఆయన వలన కలిగిన కీర్తి .మహిళాచైతన్యానికి ప్రేరణ గా నిలిచి కావ్య సుందరివంటి కథా సంపుటాలు,తీర్పు వంటి నవలలు రాసి’’భర్తకంటే ఉత్తమకథలు రాయాలని ‘’. పింగళివారి ఆశీర్వాదం పొందిన భాగ్యశాలి .’’రేపటి విరాణ్మూర్తిగా వెలగానున్న ‘’బాపు ‘’కు గురువన్న సంగతి వేదగిరి రాంబాబు తెలియజేశారనీ ,మంచి ప్రాజెక్ట్ ప్రారంభించేముందు సీతారాముల బొమ్మలు గీసుకొని పని ప్రారంభించే బాపు ,ఒకానొక సమయంలో బుచ్చిబాబు శివలక్ష్మి దంపతుల బొమ్మలు వేసి పని ప్రారంభించే వారన్న విషయంకూడావేదగిరి ఉవాచ .మిసిమి పత్రికకు ఆమెతో చేసిన ఇంటర్వ్యు సారాంశం –పాశ్చాత్య దేశాలసాహిత్యం బాగా చదివి అక్కడి కొత్తదనాన్ని తెలుగులో ప్రవేశ పెట్టాలని ఆయన అబిరుచి .మద్రాస్ రేడియో లొనే ఈ ప్రయోగాలు మొదలుపెట్టారు ‘’రాయల కరుణ నృత్యం ‘’చేసినపుడు బిఎన్ రెడ్డిగారితో ముందుమాటలు చెప్పించారు .ఇదే మల్లీశ్వరి సినీకథ .అడ్డదిడ్డంగా విమర్శిస్తే కోపం వచ్చేది ఆయనకు .పరోక్షంలో తక్కువ చేసిమాట్లాడటం సహి౦చె వారుకాదు .చివరకు మిగిలేది నవలలో తన ఊహలన్నీ అందులో పెట్టేశారు అందుకే ఎప్పుడు చదివినా కొత్తగా ఉంటుంది .సహృదయులతో శేషే౦ద్ర లాంటి వారితో ఎంతసేపైనా మాట్లాడేవారు .రామాయణం లోతులు బహు చక్కగా చెబుతుంటే ఆసక్తిగా తానూ వినే దాన్ని అన్నారు .వర్ణనలు చేయాలంటే మావారే .అందుకే నాకథలలో వర్ణనలు లేకు౦డారాశాను .తనకథల్లో అందరూ సామాన్య స్త్రీలే ఇద్దరం చిత్రాలు చాలానే వేశాం.ఒరిజినల్ దాట్స్ బాగుంతాయనేవారు .చిత్రకళలో తనకు గురువులేరని ఆసక్తిగా స్వయంగా నేర్చినదే అని అన్నారు .ఆయన లాండ్ స్కేప్స్ ఎక్కువ వేశారు తాను వ్యక్తుల బొమ్మలు వేశారు .గాంధీ గారి బొమ్మ గీశారు. గాంధీ మద్రాస్ లో ఉన్న నెలనాళ్లు ఆమె రోజూ బస్సెక్కి వెళ్లి ఆయన ఎక్కడ ఉంటె అక్కడ చూసే వారు. అతి సన్నిహితంగా బాపును చూడటం తన అదృష్టం .సంస్కృతం ఇష్టం అ౦దులొ కావ్యాలు చదివారు .ఆయనకు హార్మోనియం ఇష్టం .పద్యాలు మహా ఇష్టం . .ఈలపాట రఘురామయ్య తరచూ ఇంటికి వచ్చి పద్యాలుపాదడి ఆయనకు సంతృప్తికలిగించేవారు .బుచ్చిబాబు శతజయ౦తి వరకు ఆమె ప్రతి ఏడూ ఆయన పుట్టిన రోజు జరిపేవారు .ఆయనకు పుట్టిన రోజు అంటే భలే ఇష్టం నాకు నువ్వు చెయ్యి నీకు నేను చేస్తాను అనేవారు .ఆఖరి సంవత్సరం ‘’షేక్స్పియర్ సాహితీ ప్రస్థానంను ‘’స్థానం నరసింహారావు గారికి హైదరాబాద్ లో అంకితమిచ్చారు దేవులపల్లివారి అధ్యక్షతన తమ ఇంట్లోనే జరిపి అందరికీ భోజనాలు పెట్టటం మరుపుకురాని సంఘటన అన్నారు .ఆయన చిత్రాలలో ముఖ్యమైనవి ఒక సంపుటిగా తెచ్చారు ఈమె ‘’.
సుబ్బలక్ష్మి గారు మహిళాలోకపు మూర్ధన్య ‘’అని ముగించారు ఓలేటి .
స్వవిషయం -1970-80లలో ద్విప్లేట్స్ అనీ ప్రాసక్రీడలని చాపల్యంతో కొన్నిగిలికాను .అప్పడు బుచ్చిబాబుపై –‘’చివరకు మిగిలిందేమిటి బుచ్చిబాబూ –‘’కోమలి ‘’నమైనా ,’’అమృత’’మైనా ఒక్కటే కదా ప్రేమ పిచ్చిబాబు ‘’అని రాసింది గుర్తుకొచ్చింది .
‘’అమృతాశ్రువులు ‘’ ఆధునిక కవులగురించి నివాళి .భావకవితా ప్రతిష్టాపకుడు రాయప్రోలు తనగురువు రవీంద్రుని అస్తమయం పై –‘’ఆరిపోయినదిదివ్యస్నేహ శృంగార దీపంబు –నివాళితీసినట్లు ‘’అని ఆత్మీయత ప్రదర్శించారని ,తనకుమారుని మరణాన్ని కూడా కరుణార్ద్రంగా చెప్పారనీ ,వ్యక్తులు పోయినప్పుడేకాక అనేక విషయాలపైనా ఎలిజీ రాస్తారని ఎలిజాయిక్అనే ఛందస్సు ఉందని అందులో రాసిన ఏవిషయమైనా ఎలిజీ గా భావిస్తారని తెలియజేశారు .అబ్బూరి చేజారిన బాల్యాన్ని జ్ఞాపకాలలో భద్రపరచి –‘’పెంచితి నీరుపోసి ,మొలిపించిన స్వాదు పరార్ధ్ర సాహితీ –కాంచన రాగ వల్లికల గాఢ తమో మలినమము బాపి ‘’అని పద్యం చెక్కారని ,బసవరాజు అప్పారాగారికిఎంతో శోకంకుమారుని మరణం వల్ల కలిగితే ‘’వేదాద్రి శిఖరాన వెలిగిన్న జ్యోతి-మినుకు మినుకుమని –కాసేపు కునికి పోయిందని ‘’పద్యంలో తాత్వికాన్ని భావ స్ఫోరకంగా ప్రకటించారని ,ఆంధ్ర రత్న ఈయనతో యమునాకల్యాణి రాగం పాడించుకొని వినేవారనీ ,ఆయన మరణం ఈయనకు ఆశనిపాతమై ‘’ఎలాపాడెద నింక యమునా కల్యాణి నే-లీల మానవుడు గోపాలుడు లేడాయే-ఎంత చి౦చు కొన్నా గొంతు పెగలదాయే –కన్నీళ్లు గారవకే కడుపు చెరువయ్యే ‘’అని విలవిల లాడి వలవల కన్నీరు కార్చారట .విశ్వనాథ ,దువ్వూరి కూడా అద్భుత స్మృతి గీతాలురాశారని ,బాపి బావ కొడుకుమరణాన్ని –‘’మబ్బుల౦దు బుట్టి మాయమౌ నింద్ర చాపంరీతి –స్వల్పకాలమే వాసనలజిమ్మి వడలు పుష్పంబు బోలి ‘’తమను బాసి వెళ్లిపోయాడని బావురుమన్నారు .కృష్ణ శాస్త్రి భార్య మరణం తట్టుకోలేక ‘’హృదయ నాళము తెగియె ,నా హృదయ ధనము –తొలగిపోయెను జీవిత ఫలము స్రుక్కి ‘’అని జీవితంపై ఇచ్చ నశించి నంతగా సతీ వియోగం కలవరపెట్టి౦దన్నారు .నాయనితల్లిమరణాన్ని ‘’నీవు మడిగట్టుకొని పోయినావు పండ్లు –పుష్పములు తీసుకొని దేవ పూజ కెటకో-నేనునీ కొంగు పట్టుక నీదు వెంట –పోవుటకు లేక కన్నీటి బొట్లు రాల్తు ‘’అని బాధపడ్డారు .గురువు వెంకటశాస్త్రి గారి మరణం జీర్ణించుకోలేని శిష్యులు పింగళి, కాటూరి –‘’ఎనుబదేండ్లు దైన్య మెరిగిక జీవించచె –బెంచె శిష్యకోటి –యరిగె పూర్ణకాముడగుచు గురుడు ‘అనిగు స్మృతికిసాక్షి సంతకం చేశారట .మానాప్రగడ ,కూడా రాశారు రావూరిభరద్వాజ భార్య మరణం పై ‘’కాంతం నీవు నానుంచి వెళ్ళిపోయాకా-నేను అర్ధం లేని శబ్దాన్ని భాష లేని భావాన్ని శక్తిలేని ద్రవ్యాన్ని వేగంలేని ప్రవాహాన్ని శిల్పిలేని శిలను అయ్యాను నాకిప్పుడే విలువాలేదు –భగవంతుడుకూడా ఇప్పుడు నీరూపం లో కనిపిస్తే తప్ప నేను గుర్తించలేను కాంతం ‘’అని అక్షరలక్షలు విలువ చేసే ఎలిజీ రాశారు .
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధర రావు గార్ని ‘’అక్షరాల బాట సారి ‘’గా పరిచయం చేశారు పార్వతీశం .1500గ్రామనామాలు అధ్యయనం చేసి పిహెచ్ డి పొంది ,దానికి నామవిజ్ఞానం పెరేట్టి,దాన్ని తనకు అంకితం చేసి యూనివర్సిటిపాఠ్యప్రణాళికలో దాన్ని చేర్పించి బోధి౦ప జేసి బోధించి తన సిద్ధాంత వ్యాసానికి సోపానపంక్తి నిర్మించినవారు యార్లగడ్డ .విశ్వ విద్యాలయ బోధనా శాఖకు విజిటింగ్ ప్రొఫెసర్. పన్లు అయ్యాక బెజవాడలో మకాం పెట్టి భారతాన్ని విశేష వ్యాఖ్యతో రచించి ఎన్నెన్నో రెడియోప్రసంగాలు చేసి ,ఆయన చేసిన ప్రతిపాదనలు సంచలనాలకు కారణమై ‘నిజం వెలికి తీసే ప్రయత్నానికి తానొక కారణమౌతానని చెప్పుకొనేవారు .జీవితంలో సింహభాగం అక్షరాల మధ్య గడిపారని అక్షరయజ్ఞం చేసిన సోమయాజి అని ఆకాశానికి ఎత్తేశారు .
ఇక్కడ స్వవిషయం –నేను 1963లో మోపిదేవి హైస్కూల్ లో మొదటిసారిగా సైన్స్ మాస్టారు గా చేరినప్పుడు పెదప్రోలు లో కాపురం ఉండేవాడిని .అక్కడే బాలగంగాధరరావు ఉండేవారు. అప్పటికి సేకండరీగ్రేడ్ ట్రెయినింగ్ పాసై ఉద్యోగం లేక ఎదురు చూస్తూ ఉ౦ డేవారు.సాయ౦త్రాలలో మాతోపాటు ఒక వంతెనపై కూర్చుని కబుర్లు సాహిత్య విషయాలు మాట్లాడేవారు,రాగాలు తీసేవారు .తర్వాత నేను ఉయ్యూరు వచ్చేశాను .ఆతర్వాత చాలాకాలానికి నాగార్జున యూని వర్సిటిలో లెక్చరర్ గా చేరటం రీడర్ అవటం దోణప్ప గారి శిష్యరికం ,పత్రికలలో వ్యాసాలవలన ఆయన్ను గుర్తుపట్టాను .తర్వాత ఆయనతో మళ్ళీ ప్రత్యక్ష పరిచయం కలిగతం బెజవాడ సాహిత్య సభలలో తరచూ కలుసుకోవటం నేనంటే విపరీతమైనఅభిమానం కలగటం ,పరస్పరం ఫోన్ సంభాషణలు జరగటం ఆంధ్రా యూనివర్సిటిలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండటం అప్పుడూ తరచూ మాట్లాడుకోవటం జరిగింది .ఒక సారినేను విజయనగరంజిల్లా గరివిడిలో మా అన్నయ్యగారమ్మాయి వాళ్ళ ఇంటికి వెడుతున్నప్పుడు కొన్ని ఊళ్లపేళ్ళు తమాషాగా ఉంటె ఇంటికి వచ్చాక ఆయనకు ఉత్తరం రాస్తే ఆయన గ్రామనామాలపై రాసిన పుస్తకాలు పంపారు .మాపుస్తకాలుకూడా పంపేవాడిని ఒకసారి ఉయ్యూరుకు ఆహ్వానించాం కూడా .ఆయన తానె ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేవారు .తన వద్ద చాలాపుస్తకాలున్నాయని వచ్చి తీసుకు వెళ్ళమనేవారు.కాని ఆభాగ్యం నాకు దక్కకుండానే ఆయన పోయారు .
‘’ప్రణయద్వయం నుంచి శరణు త్రయానికి ప్రస్థానం సౌందరనందం ‘’ పింగళి కాటూరి వారి సౌ౦దర నంద కావ్యం .వ్యక్తిగత ప్రేమ విశ్వ మానవ ప్రేమగా మారటమే కథ .వినగవినగ బుద్ధునిఉపదెశ౦ మనసుకుపట్టి ప్రణయజీవనం సాధు జీవనమైంది .భార్యమాత్రం ఎందుకు కాకూడదు అని భావించి శాక్యమునినే నందుడు అడిగితె అభ్యంతరం లేదంటే ధర్మాచరణకు అనువైన మనస్థితి ఉండాలికాని స్త్రీపురుష భేదం చూపక్కరలేదని అనుజ్ఞ ఇద్దరూ భిక్షుకులౌతారు సుందరీనందులు .’’భావమొక్కడుగాగ భావన యోక్కడై –రసభావ పరిణతి యొసగ జేసి –మిత్రభావము లిమ్మెయి మేళవించి –సృష్టి చేసితిమీ కావ్య శిల్పమూర్తి ‘’అని ఈ జంటకవులు చెప్పుకొన్నారు .
ఇక్కడా స్వవిషయం –సుమారు 1953-54లో కాటూరి, దేవులపల్లి ఉయ్యూరులో మా పెంకుటింటికి వచ్చి హాలులో తూర్పు వైపు గోడకు అ అనుకుని కుర్చీలలో రెండు గంటలు కూర్చోటం ఇంకా నా స్మృతితి పధం లో నిలిచిఉంది .కృష్ణ శాస్త్రిగారు మా పెద్దక్కయ్య గాడే పల్లి సూర్యనారాయణ గారనే పండిట్ రావు గారి పెద్దకోడలు .మాబావ కృపానిధిగారు .ఈయనతండ్రిగారి తమ్ముడే కృష్ణ శాస్త్రి గారి మామగారు రెడియోబావగారైన చిన్న సూర్యనారాయణ గారు. అదీ బంధుత్వం .మా అక్కయ్యగారింటికి మద్రాస్ వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని మా అక్కయ్య కృష్ణ శాస్త్రి గారింటికి తీసుకు వెళ్ళేది .ఆయన చనిపోవటానికిసుమారు పదిహేను రోజులక్రితం నేను మద్రాస్ లో వారింటికి మావాళ్ళతో వెళ్లాను. స్క్రిబ్లింగ్ పాడ్ పై చాలాసంగతులు ముచ్చటి౦చు కొన్నాం . .నన్ను మామేనకోడలు కళను కారులో ఎక్కించుకొని చాలాచోట్లకు తిప్పారు .అదీ మరువలేనిఅనుభవమే .
తరవాతది ‘’ దృశ్య శ్రవ్య మాధ్యమాలలో తెలుగు భాషా సాహిత్యం ‘’మల్లవరపు విశ్వేశ్వరరావు గారి రూపకాలన్నీ సంగీతరూపకాలలో పతాక చిహ్నాలన్నారు –ఓలేటి .ఇక్కడా స్వవిషయం -2017లో మేము అమెరికాలో షార్లెట్ కు మా అమ్మాయి గారింటికి వెళ్ళినప్పుడు మల్లవరపు గారికుమారుడు పరిచయమయ్యారు వారిన్తికిఆహ్వానిన్చి దసరా బొమ్మలకొలువు చూపించి డిన్నర్ ఇచ్చారు .పాటకు దీర్ఘాయువిచ్చింది ప్రసార మాధ్యమమే పక్షిలాంటిది పాటఅన్నారట కృష్ణ శాస్త్రిగారు .పాటలోని చైతన్యాన్ని ఊపిరులుగా ఊదింది ఆకాశవాణి అన్నారు పార్వతీశం.జయజయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి ‘’రావోయి నవమానవా రసరాజ్య రమాధవా ,అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ ‘’లాంటి అమృత గుళికలు రెడియోవలననే దక్కాయి .’’సుమదళాలు ఎన్నైనా సురభిళ౦ ఒక్కటే ‘’అన్నట్లు ప్రసార మాధ్యమం గొప్ప సాహిత్య సంస్కృతిని ప్రజలమధ్య నెలకొల్పింది అని నీరాజనం పట్టారు .
చివరిది –‘’తల్లీ నిన్ను దలంచి ‘’లో తల్లిగారు వోలేటి హైమవతి గారి గురించి స్తవనీయ వ్యాసం .కస్టాలువచ్చేటప్పుడు అమెలోదైన్యం ఉండేదికాదు ధైర్యం తప్ప అన్నారు. తనకు జన్మతో పాటు ధన్యతనూ ప్రసాదించిన మాతృమూర్తికి నమస్సులర్పించారు పార్వతీశం . సాధారణంగా కవులు ‘’తల్లీ నిన్ను దలంచి ‘’అని సరస్వతిని స్తుతించి కావ్య౦ మొదలుపెడితే , ఈయన తల్లీ నిన్ను తలంచి ‘’తో మాతృ వందనంచేసి వ్యాసార్ధం ముగించి విలక్షణత చూపారు .ఇంతవరకు నేను రాసింది అంతా దాదాపు వోలేటి గారికలం నుంచి వచ్చిందే .
ఇప్పుడు నా భావం చెబుతున్నా .ఈ పుస్తకం ‘’స్వర్ణఖని.’’లోతుకు వెళ్లి వెతికే సాహసం చేయకుండా ఒడ్డున కూచుని నెరుసులు పోగేశా .అదే ఇంత సు’’వర్ణ ‘’రాసిఅయింది ,.లోతులు తరిస్తే పట్టిందంతా బంగారమే .ఇదొక రస ధుని .త్రాగేవారికి కావలసినంత అమృతం .ఆయన పుస్తకం చదువుతుంటే పూల సెజ్జలపై నడుస్తున్నట్లు నందనవనం లో విహరిస్తూ పారిజాత పరిమళాలుఆఘ్రాణిస్తున్నట్లు ఉంది .మరోలోకపు అంచులమీద తేలియాడుతున్నట్లని పిస్తుంది .అచ్చరల్లాంటి అక్షరాలూ ,కిన్నెర గానం లాంటి పదాలు ,కింపురుష నృత్యంలాంటి వాక్యాలు మనకు గొప్ప అనుభూతినిస్తాయి .ముఖ చిత్రం, మిసిమి వెన్నెలలాంటి పేజీలు .ప్రతి వ్యాసానికి ముందు కలర్ ఫోటో లో అందులోని ప్రముఖుల చిత్రాలు మనోజ్ఞం గా ఉన్నాయి .చదివి ఆన౦దించి అనుభూతి పొందాల్సిన రసరేఖలు వ్యాసార్ధంలోని వ్యాస మంజీరాలు .పార్వతీశంగారిని మనసారా అభినందిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-11-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.