శ్రీ విశ్వేశ్వర శతకం
కవికోకిల విద్వాన్ శ్రీ వేమూరి వెంకటరామయ్య శర్మ రచించిన శ్రీ విశ్వేశ్వరశతకం కు పరిష్కర్త శతావధాని శ్రీ కాటూరి వెంకటేశ్వరావు గారు .దీనికి తొలిపలుకులు కైకలూరు స్థానికోన్నత పాఠశాల ప్రధాన ఆంధ్రా ధ్యాపకులు విద్వాన్ నందుల సుబ్బరాయ శర్మగారు రాశారు. అందులో –కృష్ణా ,ఉభయగోదావరి గుంటూరు నెల్లూరు మండల భక్తి ప్రచారకులు ,అభినవ ప్రహ్లాద ,భాగవతకులా౦కార ,,పరమ భాగావతాగ్రగణ్య ,భక్త కులశేఖర ,భక్తిమూర్తి ,భక్త్యుపన్యాస కేసరి మున్నగు బిరుదాంకితులు ,మధుర వాగ్విశారదులు బ్రహ్మశ్రీ ములుకుట్ల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు శ్రీ సనాతన భాగవత భక్తసమాజ స్థాపకులు .విష్ణు భక్తులే అయినా ఆయనకు శివ కేశవులు సమానులు .శ్రీరాముడు రామేశ్వరంలో శివ లింగ ప్రతిష్ట చేసినట్లు ,శాస్త్రిగారు శివ ప్రతిష్ట చేయాలను కోగానే తక్షణమే సాఫల్యం జరిగి ,సత్తెనపల్లి తాలూకా నుదురుబాడు నివాసిశ్రీపానకాలు రెడ్డి మహాశయులు ,భారమంతా పైన వేసుకొని ఆలయ నిర్మాణం చేశారు .వారణాసి నుంచి శ్రీ విశ్వేశ్వరుడు పలనాటికి విచ్చేసే సందర్భం లో ,మా శిష్యుడు కవికోకిల ఈ శతకం రాసి కృతి సమర్పణం చేయటం చరితార్ధకమైంది .మా శిష్యుని శ్రీ విశ్వేశ్వర శతకం దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకానికి తుల్యం అని నా భావన .’’అన్నారు .శతకం బందరు మినర్వా ప్రెస్ లో ముద్రితం .సంవత్సరం ,వెల తెలుపలేదు .’’లక్ష్మీ నారాయణ శాస్త్రి హృత్కమల కాశీ వాస విశ్వేశ్వరా ‘’అనేది శతకం మకుటం .శార్దూల పద్య శతకం .
మొదటిపద్యం –‘’శ్రీ నారాయణ నామ చింతన సుధా సేవారతిం దన్మయుం- డై నారాయణి కా విశేష రుచులింపై తోప ,ఝ౦కార ని-స్వానంబు బొనరించు ,శ్వేత మధుపస్వామి న్నినుం గొల్తు ల –క్ష్మీ నారాయణ శాస్త్రి హృత్కమల కాశీ వాస విశ్వేశ్వరా ‘’అని నివేదించి మనసులో శతకం రాయాలనుకోగానే శతశార్దూలాలు మదిలో మెలిగాయని ,ఆయన కటాక్ష శ్రీ ఎక్కడ వాలుతుందో తెలీదని ,లక్ష్మీ నారాయణ శాస్త్రిగారి మనోవా౦ఛితం నెరవేరి ఈ ఆలయంలో ప్రవేశించావనీ ,శివభక్తుల చరిత్రతోపాటు లీలలూ ఇందులో వర్ణిస్తాననీ చెప్పుకొన్నారుకవి .
‘’దీను౦ డైపోలలేమి బోయ శివరాత్రి న్ శ్రీ ఫలంబెక్కి తా-నే ణమ్మున్ గురిసేయ దిత్తియుదకంబింతింత నీపైబడన్-వానినిన్ముక్తుని జేయ నర్బుద గిరిన్ వ్యాథేశ్వర స్వామి ‘’గా వెలిశావు అన్నారు పాతకథ చెప్పి .సానిని సంతృప్తిచేసి మోక్షమిచ్చావు .తారకాసుర సంహారంకోసం దేవతలు ప్రార్ధిస్తే పార్వతిని చేబట్టి కుమారస్వామికి జన్మనిచ్చి సంహరి౦ప జేశావు .’’నీకల్యాణ సమయం లో ముల్లోకాలజనం రాగా భూమి కుంగితే ,’’దయా దీనత్వమునన్ కు౦భజు బనిచి ,యార్తిన్ ద్రోయగా లేదా ‘’అన్నారు .మూడోకన్ను మంటతో మన్మధ సంహారం చేసి ఆతని భార్య వేడుకొనగా పతిని దానంగా సమర్పించిన కరుణా సముద్రుడివి .శిష్యుడైన వి౦ధ్యపర్వతాన్ని తాను దక్షిణ దేశం నుంచి తిరిగివచ్చేదాకా అలాగే వంగి ఉండమన్న అగస్త్యుడుభక్తితో నిన్ను సేవించి తరించాడు .అలాగే వాతాపి ఇల్వల సంహారం నీదయతో అగస్త్యర్షి చేయగలిగాడు .మామగారు దక్షుడు శపిస్తే’’ ఏణా౦కు ని ‘’తలమీద దాల్చి గౌరవం కలిగించావు .
క్షీరసాగర మధనంలో విషం పుడితే సంకోచించకుండా తాగి లోకరక్షణ చేశావ్ .దేవతలు ప్రార్ధిస్తే ‘’మేష శీర్ష౦బుగంఠాన౦ జిత్రముగా ఘటించి అసుదానం ‘’ఇచ్చావు నీ మామ దక్షుడికి .’’శ్వానంబుంగపి పెంచి ,వేశ్య మెడలం బంధింప నక్షంబు ల-ద్దానన్ వారి కమాత్యరాజ తనయత్వం ‘’ఇచ్చి మోక్షం ఇచ్చావు .తర్వాత రుద్రాక్షమహిమ చెప్పిఎలా ఎవరెవరి ప్రాణాలు కాపాడాడో వర్ణించారు కవి ‘’మౌని శ్రేష్టుడు వ్యాసుడచ్యుత డబ్రహ్మం బంచు జేయెత్తిని౦-బొనాడన్’’ఆ చేతులు అలాగే నిల్చిపోగా ,గోవిందుడు కాపాడమని వేడితే కరుణతో కాపాడావు .పాలకోసం ఏడ్చే బీద పిల్లాడి ఆకలి తీర్చమని ఆతల్లి ప్రార్ధిస్తే ‘’దుగ్ధాబ్ది ‘’నే ఇచ్చిన కరుణామయుడివి .మృకండ సూతిని కాపాడి యముని కాలితోతన్ని పంపావ్ .నీభక్తుడైన వైశ్యుడు అడవిలో తిరుగుతూ లింగం దొరక్క కుంచమే లింగంగా భావించి అర్చిస్తే ‘’కు౦చేశ్వరుడి గా వెలిశావు .చోళరాజు భక్తికి పరవశి౦చావు .రాజుకోర్కేపై కావేరీనదికి ఆనకట్ట కట్టావ్ .భైరవుడికి మామిడిఫలాలు ఇచ్చావు .వెయ్యికి ఒక్కపువ్వు తగ్గితే తలనరికి నీకుసమర్పించిన వాడికి ముక్తిప్రసాది౦చావు .
‘’ఈ నా ఈప్సితమిమ్ము నీవు బసవా యిప్డన్న సంతుష్టిగా –డా నీజాలినవాడ టంచసమ నేత్ర౦ బీవు యాచింప న –ద్దానన్నీకను నీకే చూపడె యదార్ధం బేర్పడన్నాడు ‘’అని మరొకథా ప్రసంగం చేశారు ..పాలుత్రాగకపోతే నామీద ఒట్టు అని ఒక బుడుతడు మారాం చేస్తే ‘’ఆ కూనం గాచి కుంచెడు పయస్సు గ్రోలి ‘’వాడికి సంతృప్తి కల్గించిన దయారాశివి .’’నీ చిత్తము దారువో శిలయో లోహమ్మో ‘’మాకు అర్ధంకాదు .కిరాతవేషంలో అర్జునుని పౌరుషాన్ని పరీక్షించి పాశుపతాస్త్రం ప్రసాది౦చావ్ .జంగమ దేవరలకు అభయప్రదాతవు .’’నీచ బౌద్ధ జైనాలను త్రుంచమని నిన్నుకోరుతూ రాళ్ళతో నీలి౦గాన్నికోట్టిన వాడికి వరాలిచ్చి ముక్తినిచ్చావ్ .సౌరాష్ట్రం వెడుతూ కుష్టు వ్యాధితో బాధ భరించలేక ‘’గౌరీనాథా ‘’అని ఆర్తిగా పిలిస్తే ఆర్తిబాపిన దయాసింధువు నువ్వు .అప్పుడెప్పుడో గరళం మెక్కావు .ఇప్పుడు ఈ విషముష్టి పండు తిను చూద్దాం నీ దమ్ము ఏమిటో ‘’అని భక్తుడు సవాలు విసిరి పెట్టిన దాన్ని తినేసిన కాల కంఠుడవు .
చివరి పద్యం –‘’నేనీ దివ్య కథామహత్వముల వర్ణింప నెట్టోర్తున-జ్ఞానిన్ వేమురి వాని చాపలయుతున్ సాక౦గదే భక్త బం-ధూ,నన్ వేంకట రాము ‘’విశ్వ పతయే తుభ్యం నమోస్త౦ టి ‘’ల-కక్ష్మీ నారాయణశాస్త్రి హృత్కమల కాశీవాస విశ్వేశ్వరా ‘’
నిజంగా నే భక్తదూర్జటి మహాకవి కవిత్వం స్ఫురణకు తెస్తుంది ఈ శతకం .కవిగారు విద్వాన్ అవటంతో పండితలక్షణాలు పుష్కలంగా ఉన్నాయి శతకం లో కవికోకిల కావటంతో హాయిగా పాడుకోటానికి వీలుగా ఉన్నాయి ఇంపైన పద్యాలు .విశ్వేశ్వరునికి నిజమైన నీరాజనం ,ఇంపైన ఇష్టనైవేద్యం ఈశతకం .తమాషాగా పద్యం మొదలుపెట్టి ఆసక్తికరంగా ముగించటం ఈ కవి ప్రత్యేకత .ఈకవిగారినీ ఈశతకాన్ని పరిచయం చేసి నేను ధన్యుడనయ్యాను .నిత్య పఠనీయ శతకం ఇది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-18-11-22-ఉయ్యూరు .