శ్రీ మత్పుష్పగిరి చంద్రమౌళీశ్వర శతకం
శ్రీ మత్పుష్పగిరి చంద్ర మౌళీశ్వర శతకాన్ని కావ్య విశారద శ్రీ శంకరమంచి రామ కృష్ణ శర్మ రచించి,బ్రహ్మశ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి చూపించి పరిష్కరి౦ప జేసి ,రెంటపాళ్ళ అగ్రహారం లో మకాం చేసి ఉన్న పుష్పగిరి పీఠాధిపతులకు చూపించి వారి అనుగ్రహం పొంది ,ముద్రణకు ద్రవ్యమిచ్ఛి ప్రోత్సహించగా ,ముద్రించి .శ్రీ పుష్పగిరి పీఠాదిపతులు జగద్గురు శంకరాచార్య స్వామి వారికి అంకితమిచ్చారు –‘’శ్రీ పుష్పగిరి పీఠస్థః శంకరాచార్య వేష ధృత్ – శ్రీకరశ్చంద్ర మౌళీశో-జీయాదాచంద్ర తారార్కం ‘’అని శుభం పలికారు .శార్దూల ,మత్తేభ పద్యాల శతకం ఇది .’’చంద్ర మౌళీశ్వరా ‘’అనేది మకుటం .1939 కృష్ణపక్ష తదియనాడు శతకం పూర్తి చేశారు కవి .కవి ఆపస్తంభ సూత్రుడు .ఆత్రేయస గోత్రీకుడు .నర్సరాట్పురం నివాసి .కావ్య రసజ్ఞుడు .వెల ఇవ్వలేదు .
మొదటి శార్దూలం లో –‘’శ్రీ రాజిల్ల సమస్త చేతనలకున్ స్వీయ ప్రసన్నావనో -దారత్వమెరింగి౦చు టే విమల తత్వార్ధంబు బోధించు నా –చారంబంచు దలంచి పుష్పగిరి వాసబుండివెల్గొందునోం-కారాకార ,నమస్కరించెద శుభాంగా ‘’చంద్ర మౌళీశ్వరా ‘’ అని చెప్పి ,సద్భక్తితోరాశానని ,సాహిత్యం సున్నా ,వృద్ధజన సాంగత్యం పూజ్యం ,ధన సంపత్తి హుళక్కి ,తెల్వినహి ,శ్రద్ధాభక్తి శూన్యం ,ఉక్తి నియుక్తులు ‘’బండిగల్లు ‘’అయినా కీర్తిస్తున్నా ఆదరించు అని లౌక్యంగా చెప్పారు’’కావ్య విశారదులు .’’తనకావ్యకుమారి మోహం కలిగించే సుందరికాదు నూతన చమత్కారాలు చూపే నేర్పరీకాదుఅయినా ఎలాస్వీకరిస్తానని సందేహించక నన్ను కృతార్ధుని చేసి కన్యాదానఫలితం ఇమ్మన్నారు .ఒకావిడ నెత్తికెక్కి కూర్చుంది ఇ౦కొఆవిడ అర్ధ శరీరం ఆక్రమించింది ,మీఅమ్మాయికి ఇక నేను ఏమివ్వగలను అని అనుకోవద్దు .మాఅమ్మాయి వృధాకోరికలు కోరని కన్య అన్నారు ..’’బోళాశంకరుడ వంచు భక్తతతి సంబోధించుతాన్ జేసి ‘’నా మేలు నువ్వే చూస్తావనే ధైర్యంతో ఉన్నాను .
ధనగర్వంతో విర్రవీగే వారు నీపై దృష్టిపెట్టరు సంపదతో ఉబ్బి తబ్బిబ్బౌతారు .అలాంటి వారి తలపై తన్ని బుద్ధి చెప్పేవాడివి నువ్వే .’’ఆరాధ్యుడవు ,పుణ్య శీలుడవు ,నిత్యానంద నిష్కామ ,నిర్వైరాయత్తుడవు ,ఆదిమూర్తివి .’’గిరికన్యా హృదయాబ్జ రంజనం,సాక్షీభూత నిర్మోహ సుందరమైన రూపం నీది .జగత్స౦జీ వనౌషధమ్ ‘’నీ పంచాక్షరి ‘’.వైరం ఎందుకు అన్నా,హెచ్చుఫలముల్ వంచించను అన్నా ,నేరాలు భరించమన్నా ,ఎప్పుడూ నీవాడినే అన్నా,సత్యార్యం చూపమన్నా ,హితం చేకూర్చమన్నా ,ఆధారం నువ్వే అన్నా .’’నేర్పరివై సర్వము నామ భేదాలుఅదర్పం జూచే వాడవు మామ దక్షుడి యాగం ఆగం చేసి బుద్ది చెప్పావ్ . భూమికి ‘’ప్రాజ్ఞుడు మూలం అసలైన మూర్తి నీవే .’’శివ శంభో గిరిజాపతీ శుభద,దాక్షిణ్యైక భావాన్వితా ,భవ ,గంగాధరా ,శూలపాణి హర సౌభాగ్యప్రదా హర ధవళా౦గా ‘’అంటూహర నామాలన్నీ చెప్పారుపద్యంలో .
పార్ధునిపై శశాంశాకు నిపై ,భళ్లాణుపై ,సిరియాలునిపై ఉషాజనకునిపై శ్రీ గౌరిపై గంగపై పరమానందం,ఆదరం చూపించావు ..’’నేను నీమొర ఆలించను ‘’అంటావేమో .నీగుట్టు మట్టులన్నీ నాకు తెలుసు .బి౦కాలుపోకు .కాలుస్తావా సై.లేక నేనే నిన్ను గెలుస్తానో కాచుకో అన్న భక్తశిఖామణి కవి .ఆతర్వాత శివ భక్తిమహాత్మ్య కథలన్నీ వరసబెట్టి చెప్పారు .తన మొరను అరణ్య రోదనం చేయద్దని వేడుకొన్నారు .నీ వాహనం ఎద్దు మీ ఆవిడ వాహనం వ్యాఘ్రం .వీటిమధ్య ఉన్న క్రూరత్వాన్ని బాపటానికే సమయం చాలదంటావా ,లేక నన్ను మర్చేపోయావా .?ఘోరపాతకాలలో కూరుకుపోయి నేను నిన్ను ‘’శివ శంభో గిరిజాపతీ హర శ్రీ పుష్పశైలేశ్వరా ,భవ బంధా ‘’అని పిలుస్తూనే ఉంటా .అన్నారు ఈపద్యం భీమఖండంలో శ్రీనాథుని ‘’శంభున్ శివుణ్ శ్రీ కంఠు నిన్ ‘’అనే పద్యాన్ని స్ఫురింపజేస్తుంది .తన్మయభక్తికి గొప్ప ఉదాహరణ ,నరకం అనేది ఉందని ఇప్పుడే తెలిసి జ౦కు తున్నాను .చేసినపాపాల చిట్టా విప్పుతున్నాను –నీ పాదద్వయమే నాకుఏడుగడ రక్షా .
బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు మాయ చుట్టాలు .అవి పట్టుకొంటే నీ ధ్యానం చేయటం ఎవరి తరమూకాదు .’’నిను బూజి౦ప గా ,నిన్ను జూడగను ,నీ నిత్యప్రభావంబు వర్ణన చేయగను కేశవాదులకైనా అసాధ్యం ‘’నాకు అనువౌనే కుజనుడను ఘోర దురితాహ౦కారుడిని .కాదనకయ్యా గిరీశా .నన్ను భరించటం నీకు తప్పదు.ఎందుకు ?నేను నీవాడిని కనుక .నాకవితా కుమారిని నీ చేతిలో పెడుతున్నా .ఇవ్వటానికి చేతిలో కానీ లేదు .రాద్ధాంతం చేయకుండా ‘’వేయార్లట్టుల’’ ఎంచి ,తృప్తి చెంది ఆదరించు అని కన్యాశుల్కం లో రామప్పపంతులు లౌక్యం చూపారు కవి .నీ చేతిలో ఉంచా .అంటూ అగ్నిహోత్రావధాన్లు ‘’తామ్బూలాలిచ్చా తన్నుకు చావండి ‘’అన్నట్లుగా భారమంతా అల్లుడు చంద్రమౌళి పైనే పెట్టారు మామ కవీశ్వరుడు భక్తిగా .చివరి రెండుపద్యాలో భావం ముందే చెప్పేశాను .ఖచ్చితంగా 100పద్యాల శతకం ఇది .
భక్తీ ఆర్తి శరణాగతి ,లౌక్యం లోకజ్ఞత ,కథా సంవిధానం ,పుష్కలంగా ఉన్న శతకం శైలి ద్రాక్షాపాకం .కవితాప్రవాహం పుష్పగిరి ప్రక్కన ప్రవహించే పెన్నా నదీ ప్రవాహమే .పుష్ప గిరిలోని పుష్ప సౌందర్యం ,మాధుర్యం ,పరిమళం ప్రతిపద్యం లోనూ దర్శన మిస్తుంది .ఈ శతకం ,ఈకవి గురించి మనవారికెవరికీ పట్టినట్లు లేదు .నాకు ఈకవిగారినీ శతకాన్నీ పరిచయం చేసే మహద్భాగ్యం ఆ చంద్ర మౌళీశ్వరుని కృపాకటాక్షం వలన లభించింది .2019లో ఒంటిమిట్ట తోపాటు పుష్పగిరి సందర్శనం మాకు లభించింది .అదిఇలా సార్ధకమయింది . శ్రీ చంద్ర మౌళీశ్వర లింగం ఆదిశంకరాచార్య ప్రతిష్టితం .విద్యారణ్యస్వామి శ్రీ చక్రం ప్రతిష్టించారు .శివ ,కేశవ ఆలయాలు ఇక్కడ ఉండటం మరో విశేషం .దక్షిణ కాశిగా ,రెండవ హంపిగా భావిస్తారు శైవులు మధ్య కైలాసంగా వైష్ణవులు మధ్య అహోబిలం గా పిలుస్తారు .గ్రామానికీ ,క్షేత్రానికి మధ్య పెన్నానది ఉంది .దీనిలో పాపాఘ్ని కుముద్వతి,వల్కల ,మాండవి నదులు కలుస్తాయి .ఆంద్ర దేశం లో ఉన్న ఏకైక శంకరాచార్య పీఠం పుష్పగిరిలో నే ఉంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-11-22-ఉయ్యూరు