ఇదం బ్రాహ్మం

ఇదం బ్రాహ్మం –
ఈ నెల 14వ తేదీ న ఆంధ్రభూమి లో పని చేసిన ,సరసభారతి సభలకు ఒకటి రెండు సార్లు వచ్చిన శ్రీమతి స్వాతి ఫోన్ చేసి ,భూమి ఎడిటర్ గా పదేళ్ళు పని చేసి దాని కి వెలుగురేఖలు తీర్చిదిద్దిన సీనియర్ ఎడిటర్ శ్రీ ఎం వి ఆర్ శాస్త్రి గారు రిటైరయ్యాక ,’’ఇదం బ్రాహ్మ౦’’అనే సంస్థను స్థాపించి కృషి చేస్తున్నారనీ ,ఆసంస్థ ఆత్మీయ సమావేశం తెనాలిదగ్గరపెదరావూరు లో 20వ తేదీ ఆదివారం ఉదయం జరుగుతుందని ,నన్నూ,శ్రీ పూర్ణ చ౦ద్ లను అతిధులుగా పిలుస్తున్నా మని తప్పక రమ్మని కోరగా సరే అన్నాను .పెదరావూరు అంటే ఒక సామెత జ్ఞాపకం వచ్చింది .’’ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చి వసూలుకాకపోతే దాన్ని పెదరావూరు ఖాతా ‘’అంటారని బాగా అనుకొనేవారు .ఈనెలలోనే మా అమ్మాయి విజ్జి అమెరికానుంచి ఒక పదిరోజులు ఉండటానికి ఉయ్యూరు వస్తే ,10,11తేదీలు మేమిద్దరం మా అమ్మాయి హైదరాబాద్ వెళ్లి అక్కడ మా అబ్బాయిల్ని మాబావగారిని ,మాఅమ్మాయి పాలిటెక్నిక్ స్నేహితురాళ్ళను చూసి వస్తుంటే మేము వచ్చిన సంగతి ఫోటోలద్వారా తెలుసుకొని మా మేనకోడలు పద్మ భర్త రామకృష్ణ ఫోన్ చేసి 20వ తేదీ తమ ఇంట్లో అభిషేకం వగైరా ఉంటాయనీ ,తప్పక రమ్మని చెబితే ,ఉండటం లేదని చెప్పాం .ఇంటికి రాగానే నాకు ఉయ్యూరు హైస్కూల్ లో సహోద్యోగి లెక్కలమాస్టారు శ్రీ పసుమర్తి ఆన్జనేయశాస్త్రిగారు ఫోన్ చేసి ,20వ తేదీ తమ స్వగ్రామం కృష్ణా జిల్లా కూడేరులోతమ టెంపుల్ కాంప్లెక్స్ లో రుద్రాభిషేకం ,వగైరాలున్నాయని మమ్మల్నందర్నీ రమ్మని ఆహ్వానిస్తే ,పెదరావూరు సంగతి చెప్పి రాలేమన్నాను .మా అమ్మాయి 15 మంగళవారం రాత్రి గన్నవరం నుంచి అమెరికా వెళ్ళింది .శుక్రవారం రాత్రి నాకు ఫేస్ బుక్ లో రావూరు సమావేశం ఆహ్వాన పత్రిక వచ్చింది .అందులో నన్ను ఆత్మీయ అతిధిగా వేశారు .అప్పటిదాకా వెళ్లి అక్కడ భోజనం చేసి రావటమే కదా అనుకొన్నాను .ఈ ‘’మేకు బిగింపు ‘’చూశాక అసలు ఇదం బ్రాహ్మం అనే సంస్థ గురించి నాకేమీ తెలీదని ఎప్పుడూ వినలేదని అనుకోని యుట్యూబ్ లో ఆరాత్రి వెతికా .అందులో సద్గురు శివానందమూర్తి గారి ‘’మాని ఫెస్తేషన్ గురించి ఏమ్విఆర్ శాస్త్రిగారు శ్రీరమణ్ అనే ఆయన డిస్కషన్ చూశా .అందులో ఏమీ సంస్థ గురించి నాకు తెలీలేదు .తర్వాత ఇంకోదానిలో ఒకావిడ కొంచెం లావుగా ఉండీఆవిడ తాను చేసిన కార్యక్రమాలు ఏవో తెలియేసింది. చాలాకాష్టపడుతున్నట్లు అర్ధమయింది .అప్పటికే రాత్రి 11దాటటం తో పడుకొన్నాను .శనివారం ‘’మహాభారత తత్వకథనం ‘’లైవ్ పూర్తి చేశాక, ఉదయం 11కు మళ్ళీ వెతకటం మొదలెడితే కొంత సమాచారం దొరికింది .కొంత నేను రాసిన ‘’దైవ చిత్తం ‘’నుంచి నోట్స్ రాసుకొని మాట్లాడమంటే కనీసం అయిదారు నిమిషాలైనా మాట్లాడటానికి సిద్ధమయ్యా .ఆదివారం ఉదయం 4.30కే లేచి స్నానం సంధ్య పూజ కార్తీక అభిషేకం పూర్తి చేసి 6-30కి సిద్ధంగా ఉన్నా .మా అన్నయ్యగారబ్బాయి రాంబాబు వచ్చాడు .అంతకుముందు మా శ్రీమతి ,మా మూడు ,నాలుగు కోడళ్ళు వస్తామని అన్నవారు ,ఇంతపొద్దున్నే వెళ్లి సాయంత్రందాకా ఉండలేమని రాలేమన్నారు .మేమిద్దరమే కారులో బయల్దేరి 9కి పెదరావూరు ‘’అభయహస్త శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ‘’కు చేరాం శ్రీమతి స్వాతి మాకు స్వాగతం చెప్పింది .ఉయ్యూరునుంచి నేనురాసిన, సరసభారతి ప్రచురించిన ‘’ దైవ చిత్తం ,వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి ‘’పుస్తకాలు 25సెట్లు తీసుకొని వెళ్లాను. ఒక సెట్ స్వాతికి ఇచ్చాను .శాస్త్రిగారువచ్చారు .నన్ను చూడగానే ‘’స్వాతి మిమ్మల్ని గురించి చాలాచేప్పింది సంతోషం ‘’అన్నారు అప్పటికి మేమిద్దరమే వచ్చాము.ఉప్మా టిఫిన్ కాఫీ తాగాం ఇంకెవరూ కనపడలేదు శరవణ దర్శనం ,శంకరాచార్య దర్శనాలు పూర్తి చేశాక శ్రీ పూర్ణ చ౦ద్ దంపతులు ,శ్రీమతి అన్నపూర్ణ కనిపించారు.ఆలయం చక్కని పంటపొలాలమధ్య కంచిపీఠం అధ్వర్యంలో బాగాకట్టారు .స్వామి పళనిలో ఉన్నట్లు ఆకర్షణీయంగా ఉన్నాడు .సమావేశమందిరం ‘’పరమాచార్య వేదిక ‘’గా పేరుపెట్టారు .
ఉదయం 10గంటలకు సమావేశం శ్రీ శాస్త్రిగారి అధ్యక్షత న ప్రారంభమైంది .న్యాయమూర్తి శ్రీ బులుసు శివ శంకరరావు గారు పంచెకట్టు చొక్కా ఉత్తరీయంతో బ్రాహ్మీమూర్తిగా విచ్చేశారు .ఆధ్యాత్మిక వేత్తలు శ్రీ చిలకలపాటి వీరరాఘవాచార్యులు ,శ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ ,శ్రీ గోవింద వజ్ఝల కామేశ్వరశర్మ ,శ్రీ మేళ్ళ చెర్వు చంద్రమౌళి శర్మ ,అఖిలభారత బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షులు శ్రీ ద్రోణం రాజు రవికుమార్ , ట్రాన్స్పోర్ట్ అడిషనల్ కమిషనర్ శ్రీ ఎస్ వి ప్రసాదరావు ,నేనూ శ్రీపూర్ణ చ౦ద్ లతోసభ ప్రారంభమైంది .పూర్ణచంద్ ఆహారం ఆరోగ్యం పై మాట్లాడారు .తర్వాత నన్ను మాట్లాడమంటే ఇదం బ్రాహ్మం గురించి ఏడెనిమిది నిమిషాలు మాట్లాడాను .తర్వాత అందర్నీ మాట్లడించటానికి జస్టిస్ గారు ప్రయత్నించారు. స్పందన తక్కువ .మా రాంబాబు నాలుగు ముక్కలు మాట్లాడాడు .11గం లకు పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం పీఠాధిపతి శ్రీ ముత్తేవి సీతారాం గురుదేవులు 45నిమిషాలు అనుగ్రహ భాషణం చేశారు .ఆయన ఏమి చెప్పారో ఎవరికీ తెలియలేదు .ఆయన మైక్ ను అందుకోలేకపోయారు అదేకారణం .బెజవాడ నుంచి ఇతర చోట్లనుంచి వేద విద్యార్ధులను తీసుకొని వచ్చి వారిని వస్త్రాలు వగైరా లతో సత్కరించి వేదం పఠనం చేయించారు .తర్వాత వారి గురువుల సమక్షం లో అందరూ వేదికపై ఆహ్వాని౦ప బడి వేదాశీస్సులు పలికారు.గురు సత్కారమూ జరిగింది .ఇంతలో గజల్ శ్రీనివాస్ రాగా ఆయననూ వేదిక ఎక్కించి ఆయన ఇటీవల కూర్చిన గజల్ గానం చేయించారు .మధ్యమధ్యలో ఎవరేవర్నో పిలవటం వారు వచ్చి మాట్లాడటం జరిగింది .పాపం శాస్త్రి గారి చేతిలోనుంచి సభానిర్వహణ జారిపోయింది .అన్యాయ౦ పై నిప్పులుకక్కే శాస్త్రిగారు నిరుత్తరులయ్యారు .ఒకరకంగా వేదిక కబ్జా అయింది .మళ్ళీ శాస్త్రిగార్ని వేదికపై పిలిచి అతిధులకు ఆయనతోశాలువా ఉత్తరీయం జ్ఞాపిక లతో సన్మానం చేయించారు .అంతా అయ్యేసరికి ఒంటిగంట దాటింది .ఈలోగా ఫుడ్ కోర్ట్ తెరిచారు .మొదట్లో సభలో పల్చగా ఉన్నజనం భోజన సమయానికి నిండిపోయారు .రెండవ బాచ్ లో మాకు భోజనాలు పెట్టారు వేదం విద్యార్ధులకు గురువులకు లోపల విడిగా భోజనాలు ఏర్పాటు చేశారు .టమేటా పప్పు నేను కాశీలో వదిలేసిన దొండకాయకూర ,క౦దా బచ్చలికూర, గుంటూరు గోంగూరపచ్చడి,నేతి బీరకాయ పచ్చడి నాకిష్టమైన మైసూర్ పాక్ ,పులిహోర ,పులుసు సంగం గడ్డ పెరుగు ,స్వామి ప్రసాదంగా మైసూర్ పాక్ లతో విందు .పెద్దగా రుచికరంగా ఏవీ లేవనిపించాయి నా మైసూర్ పాక్ నాకు మూడు సార్లు దక్కింది .నేను తెచ్చిన పుస్తకాలు శాస్త్రిగారికీ ,జస్టిస్ గారికి ,మిగిలిన పెద్దలందరికీ ఇచ్చేసి సంతృప్తి చెందాను .భోజనానికి ముందు స్వాతి నా దగ్గరకు వచ్చి ‘’ఎలాసంస్థను నడపాలి ‘’అనేది చర్చిద్దామనుకొన్న ఈ సమావేశం వనభోజనాలతో సరిపోయింది .ఆశయం నెరవేరలేదు మాస్టారు ‘’అని బాధ పడింది .నేను ఫీల్ అయిందే ఆవిడా చెప్పింది .సభానిర్వహణకు భోజనాలకు స్థానికి స్త్రీలు పురుషులు గొప్పగా సహకరించారు అందరూ అభినందనీయులే .నాకు ఈకార్యక్రమం లో పాల్గొనటానికి అవకాశమిచ్చినశ్రీమతి స్వాతి, శ్రీ శాస్త్రి గార్లకు ధన్యవాదాలు .
మధ్యాహ్నం రెండున్నరకు అందరికీ వీడ్కోలు చెప్పి ,మేము బయల్దేరి అమృతలూరు అని అందరూ పిలిచే’’ అమర్తలూరు’’ కు వెళ్లి ,మా అమ్మాయి కి గుంటూరు పాలిటెక్నిక్ లో క్లాస్ మేట్ అయియన్ శ్రీమతి శుభాషిణి ఇంటికి వెళ్లాం .ఆమె, కొడుకుతో 14వ తేదీఉదయ౦ మా అమ్మాయిని చూడటానికి ఉయ్యూరు వచ్చింది .అందుకే ఇంతదూరం వచ్చి ఆమెను చూడకుండా వెళ్ళటానికి మనసొప్పక వెళ్లాం .ఆమె సుగంధిపాల అందరికీ ఇచ్చి ఒక బాటిల్ మా శ్రీమతికి ఇవ్వటమేకాక తమ పొలం లో పండిన పెసలు నాలుగుగైదు సేర్లు మూటకట్టి ఇచ్చింది . అక్కడి పల్లె రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి .అక్కడ ఎవర్ని కదిలించినా గతమూడేళ్ళుగా గంపెడు మట్టి కూడా వేయలేదని ఆవేదనతో చెప్పారు .నాకు ఒక కుళ్ళు జోకు మనస్సులో మెదిలింది –‘’ఆడవాళ్ళకు ఈజీ డెలివరి రోడ్లు ‘’అనచ్చు నెమో శాంతం పాపం .మంచిరోజులెప్పుడు వస్తాయో అని ఎదురు చూడటమే మిగిలి౦ది అందరికీ .అక్కడి నుంచి తాడేపల్లి వెళ్లి మా శిష్యుడు రెండేళ్ళ క్రితం అకస్మాత్తుగా మరణించిన కాళీప్రసాద్ ఇంటికి వెళ్లి భార్యను ,ఇద్దరబ్బాయిలను పలకరించి ,ఉయ్యూరుకు సాయంత్రం 6-15కు చేరి 6-30కి ‘’మత్యపురాణ౦ ‘’లైవ్ చేశాను .ఈలోపు ఎప్పటిఫోటోలు అప్పుడే వాట్సాప్ లో తోసేశాను .ఇప్పుడు నేను సభలో మాట్లాడాలనుకొన్న విషయాలు మీకోసం అందిస్తున్నాను .
‘’అగ్రతః చతురో వేదః –పృష్టతః సశరం ధనుః-ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం –శాపాదపి శరాదపి ‘’అనేది అసలు శ్లోకం .ఇది భాసనాటకం లో పరశురాముని వాక్యం .అందుకే బ్రాహ్మణులకు పరశురాముడే ఆదర్శం .బ్రాహ్మీ మూర్తి అవసరమైనప్పుడు ధర్మహాని జరిగినప్పుడు క్షాత్ర శీలం చూపించాలి అని భావం . బ్రాహ్మీ శక్తి ,క్షాత్ర శక్తి అనే రెండు శక్తులున్నాయి .ఈరెండు ఆత్మకు అన్న౦అ వుతున్నాయి .అంటే ఈరెండిటిని ఆత్మ తినేస్తుంది .ఏది చేయాలో చెప్పేది బ్రాహ్మీ శక్తి .దాన్ని విధాయక శక్తి అంటారు .దీనివలన స్థిత ప్రజ్ఞత కలుగుతుంది .అ౦ టేధర్మాన్ని అనుసరించి మోక్షం పొందటం .శరీర బలంతో వ్యావహారిక శక్తితో ,అర్ధకామ బలం తో పురుషార్ధాలను ధర్మ బద్ధంగా ,పాలనా బలం తో చేయటం క్షాత్ర తేజం .దీన్ని దారకం అంటారు .దీని వలన సంక్షోభ సమయం లో పోరాట పటిమ పెరుగుతుంది. అన్యాయాన్ని ఎదిరిస్తాడు .ఈ రెండూ కలిసి పని చేస్తే సాధించ లేనిది ఉండదు .
మత్స్య పురాణం లోయయాతి కథ నీతి దాయకం . నహుషుడి కొడుకు యయాతి తన రాజ్యాన్ని కొడుకు ‘’పూరుడు ‘’కు ఇచ్చేసి ,వానప్రస్థాశ్రమం లో ధర్మాలు పాటిస్తూ స్వర్గం చేరాడు .కొంతకాలం తర్వాత ఇంద్రుడు కిందికి తోసేశాడు .భూమి మీదపడకుండా అంతరిక్షంలో ఉండిపోయాడు .అక్కడ వసుమంతుడు ,అనేరాజు ,అష్టకుడు ,ప్రతర్దనుడు ,శిబి కనిపిస్తారు .కొంతకాలం వారితో గడిపి మళ్ళీ స్వర్గం చేరాడు యయాతి .ఎందుకు ఇలా జరిగింది అని శతానీకుడు అడిగితె శౌనకుడు ‘’ఒకరోజు ఇంద్రుడు ‘’నీ కొడుక్కి రాజ్యం అప్పగించి నీ ముసలితనం తీసుకోమన్నప్పుడు ఏమి చెప్పావు అనిఅడిగితే యయాతి ‘’కోపం పనికిరాదు ,ఇతరుల్ని బాధపెట్ట రాదు.మైత్రి, దానం ,మధురభాషణం లకు మించిన ఉత్తమ గుణం లేదు .పూజ్యులను పూజించాలి ‘’అని చెప్పాను అన్నాడు .ఇంద్రుడు ‘’నువ్వు గొప్ప తపస్సంపన్నుడవు కదా .నీతో సమానులు ఎవరు ‘’అని అడిగితె యయాతి ‘’నాతోసమాన తపస్సు చేసినవాడు ఎవడూ లేడు ‘’ అన్నాడు .ఇంద్రుడికికోపం వచ్చి ‘’తరతమ భేదం ఎంచకుండా మాట్లాడావు కనుక స్వర్గలోక౦ లో ఉండతగవు ‘’అని తోసేస్తే ‘’అయితే నన్ను సత్పురుషులమధ్య పడెయ్యి చాలు ‘’అనగా అలానే చేశాడు .అష్టకాదులను కలిసినప్పుడు వాళ్ళు అడిగిన అనేక ధార్మిక విషయాలు వివరించి చెప్పాడు యయాతి .అందులో –విద్య తపస్సు పుట్టుక చేత ద్విజుడు వృద్ధుడు అవుతాడు అని చెప్పాడు. అష్టక వసుమంతశిబి లు తమ పుణ్య గతులు ఇస్తాం నువ్వు క్షేత్రజ్నుడివి స్వర్గం చేరమన్నారు .వద్దన్నాడు. అందరి పుణ్యం కలిపి ఇస్తామన్నా వద్దన్నాడు ‘’నేను సత్యవ్రతిని ధర్మావలంబిని .భూ మండలం అంతాజయించి ,బ్రాహ్మణులకు దానం చేశాను. నేను స్వయంగా సాధించిన పుణ్యం తోనే మళ్ళీ స్వర్గం చేరతాను .మీ పుణ్య ఫలాలు నాకు వద్దు ఇచ్చేవాడినేకాని తీసుకొనే వాడిని కాదు ‘’అన్నాడు .ఉత్తములైన పై వారి మధ్య ఉండటం చేత పుణ్యం కలిగి వాళ్లకు తాను మాతామహుడను అని తెలియ జేసి యయాతి మళ్ళీ స్వర్గం చేరాడు .ఇందులో మన౦ నేర్వాల్సిన విషయాలెన్నో ఉన్నాయి .అవి తెలుసుకొంటే చాలు మనకూ ఉత్తమ గతులు లభిస్తాయి .
మన పురాణాలను శాస్త్రీయంగా విశ్లేషించి ఇవాల్టి వారికి అందించాలి .అప్పుడే వాటిపై గౌరవం పెరుగుతంది .హైదరాబాద్ కు చెందిన శ్రీ ఎసిసి శాస్త్రి గారు ‘’దిమైండ్ ఆఫ్ గాడ్ ‘’అనే ఇంగ్లీష్ పుస్తకం ప్రఖ్యాత భౌతిక ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ రాసిన ‘’బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’ఆధారంగా ఆయన అభిప్రాయాలను మన పురాణాలతో అంతకు ముందే చెప్పబడిన విషయాలను విశ్లేషిస్తూ రాస్తే ,దాన్ని నేను ‘’దైవ చిత్తం ‘’గా అనువదించి సరసభారతి తరఫున ప్రచురించాను .అందులోని విషయాలు అందరూ తెలుసుకొని మన పురాణ,ఉపనిషత్తుల వైశిష్ట్యాలను అర్ధంచేసుకోవాలి .అందులో ముఖ్యవిషయాలు మాత్రమె మీ ముందు ఉంచుతున్నాను .
వ్యక్తీ చిత్తాన్ని ,దైవ చిత్తాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తే ,నిర్జీవ శక్తి అంటే మాటర్,సజీవ శక్తి అంటే లైఫ్ ,.ఈ రెండిటి సామర్ధ్యతతో శిలాపదార్ధం రాక్ అంటే నిగూఢ శక్తి ఏర్పడింది .దీన్ని శాస్త్రవేత్తలు అరవిందుడు ఆవిష్కరించారు .రెండు వేల ఏళ్ళ క్రితమే ఆది శంకరులు ‘’శివ శ్శక్త్యాయుక్తో యది భవతి శక్తిః ప్రభవితం ‘’అని చెప్పారు .
విష్ణుమూర్తి మొదటి అవతారం మత్శ్యావతారం . చేపను ‘’ధీ ‘’అంటారు అంటే బుద్ధి .వివేకానికి ప్రతీక .సృష్టికర్తకు శత్రువు సోమకాసురుడు. వేదాలను అపహరించి ధ్వంసం చేయబోతే వాడిని చంపి వేదోద్ధరణ చేశాడు .అంటే బుద్ధి ,వివేకం నశించకుండా కాపాడాడు అన్నమాట .రెండవది కూర్మావతారం .ఇది ప్రతీకాత్మకం గా అంతరిక్ష కథ.ఇందులో సృష్టి పరిణామ సంఘటన ఉంది .పాలసముద్రం అంటే మిల్కీ వె .వాసుకి సర్పం గమనానికి సహకరించే దీర్ఘ వృత్తం అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ .మంధర పర్వతం అయస్కాంత ధృవం.మధనానికి సహకరించేది మిల్కీ వె సెంటర్ .మధనం లో వచ్చిన గరళం ఓజోన్.తర్వాత వచ్చింది అమృతం అంటే ఆక్సిజన్ ,నీరు .
టైం,స్పేస్ లు సరళ రేఖా మర్గాలుకావు .చక్రీయాలు అంటే సైక్లిక్ .అదే అది కూర్మం వీపు .ఒకప్పుడు ప్రఖ్యాత సైంటిస్ట్, తత్వ వేత్త బెర్ట్రాండ్ రసెల్ ఒక చోట ఉపన్యాసం ఇస్తూ భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుందో ,ఎలా సూర్యుడు అనేక నక్షత్ర సముదాయాలతో ఉన్న మన గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరుగుతాడోవివరిస్తుంటే ఒక ముసలావిడ ‘’నువ్వు చెప్పింది అంతా చెత్తగా ఉంది .ప్రపంచం నిజంగా సమతలం గా ఉంది.ఒక బలమైన తాబేలు వీపు మీద ఆధార పడి ఉంది ‘’అన్నది ఆశ్చర్యపోయి రసెల్ ‘’ఆతాబేలు దేని మీద ఆధార పడి ఉండమ్మా ‘’అని అడిగితె ‘’నువ్వు తెలివైన వాడివే .అదెప్పుడూ కిందనే ఉంటుంది ‘’అని చిరునవ్వుతో సమాధానం చెప్పింది .దిమ్మతిరిగి బొమ్మకనిపించింది సైంటిస్ట్ కు .ఇది జరిగిందియూరప్ దేశం లో .మన ఆది కూర్మ విషయం ఆమెకెలాగ తెలిసిందో అని అ౦దరూ ఆశ్చర్యపోయారట .
స్పేస్ ,టైం ల కర్వ్ చాలాపెద్దది అనంతం .అప్పుడు సరళ రేఖలా కనిపిస్తుంది .అంటే లీనియర్ గా .పాలసముద్రం మన విశ్వమే .పాలపుంత నక్షత్రసముదాయానికి చిహ్నం .శేషుడు కాలానికి ప్రతీక .శేషం అంటే మిగిలి ఉండేది .సృష్టి లయం అయితే మిగిలి ఉండేది కాలమే .మనం ఒక గెలాక్సీ లో ఉన్నాం.అది ఒక లక్ష కాంతి సంవత్సరాల దూరం లో ఉండి,నెమ్మదిగా భ్రమిస్తోంది .స్పైరల్ బాహువులలోని నక్షత్రాలు కేంద్రం చుట్టూ అనేక వందల మిలియన్ల కాలం లో ఒకే ఒక చుట్టూ తిరుగుతాయి అని స్టీఫెన్ హాకింగ్ చెప్పాడు .ఈ స్థిర నక్షత్రాన్నే మన వాళ్ళు ధ్రువ నక్షత్రమన్నారు కొత్తగా పెళ్ళైన దంపతులకు శాశ్వతంగా శృంగార బాంధవ్యం ఉండాలని ఆ ధ్రువ నక్షత్రాన్ని అర్థిస్తారు .
ఈ విశ్వానికి పదార్ధం ఎక్కడి నుంచి వచ్చింది ?అని హాకింగ్ సైంటిస్ట్ బుర్ర బద్దలు కొట్టుకొన్నా సమాధానం పొందలేక పోయాడు .దీనికి మన ఉపనిషత్తులు సమాధానం చెప్పాయి భేషుగ్గా .విశ్వానికి ఆధారం ఆత్మ.,వనరు అంటే సోర్స్ ,రూపకర్తా అంటే డిజైనర్ కూడా . దీన్ని ఉపాదాన కారణం అన్నారు .స్టీఫెన్ హాకింగ్ సృష్టికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలు పరిశీలించాడు ‘’మైండ్ ఆఫ్ గాడ్ ‘’ను తెలుసుకొనే ఆఖరి ప్రయత్నం చేశాడు .మన అద్వైతం ఎప్పుడో సమాధానం చెప్పింది సృష్టికి కారణం ఆత్మ.ఆత్మ సృష్టించటం లేదు అది అలాగే ఉంది –‘’ఇట్ఈజ్ జస్ట్ ఈజ్ ‘’సృష్టికి ఆద్యంతాలు లేవు. దేవుడు ఈ విశ్వ రూపం లో కనిపించటమే దైవ చిత్తం అంటే దిమైండ్ ఆఫ్ గాడ్ .
ఇలాంటి విషయాలు ఆధునికకాలం లో యువతకు నేర్పాలి .అప్పుడే వాళ్లకు మన సంస్కృతీ సంప్రదాయాలపట్ల గౌరవ మర్యాదలుకలుగుతాయి .పరిరక్షించటానికి నడుం కడతారు .
ఎమ్వీ ఆర్ శాస్త్రి గారు తలపెట్టిన ‘’ఇదం బ్రాహ్మం ‘’పూర్తి జవసత్వాలతో దేహమంతటా శాఖలతో ఉత్సాహవంతులైన కార్యకర్తలతో పరిపుష్టమై, ఆయనకు వెన్ను దన్నుగా నిలిచి అభీష్టసిద్ధి కలిగించాలని ఆశిస్తున్నాను .భగవంతుని ప్రార్ధిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.