పెదరావూరు కీర్తిపతాకలు
గుంటూరు జిల్లా తెనాలి దగ్గర పెదరావూరు గ్రామం లోని కొందరు ప్రముఖులను ‘’పెదరావూరు కీర్తి పతాకలు’’ గా పరి చయం చేస్తున్నాను .
1-శ్రీ రావూరి రంగారావు
శ్రీ రావూరి రంగారావు పెదరావూరు గ్రామం లో 1895లో రైతు కుటుంబం లో జన్మించారు .తండ్రి నారాయణ.1917లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1921లో జాతీయ ఉద్యమం లో దూకారు .తిలక్ స్వరాజ్యనిధికి బాగా కృషి చేశారు .1921-22లో పెద నందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం లో పాల్గొని ఒక ఏడాది కఠిన శిక్ష అనుభవించారు .సైమన్ కమీషన్ బహిష్కరణ ఉద్యమం లోనూ తీవ్రంగా పాల్గొన్నారు .శాసనోల్లంఘన ఉద్యమం లో పాల్గొని 1930లో ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను రాజమండ్రి ,ఆలీపూర్ జైళ్ళలో అనుభవించారు .రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆడిటింగ్ ఇన్స్పెక్టర్ గా రెండున్నర ఏళ్ళు పని చేశారు .1941వ్యక్తీ సత్యాగ్రహం లో పాల్గొని ఆరునెలలు రాజమండ్రి ,ఆలీపూర్ కారాగారాలలో కఠిన శిక్ష అనుభవించారు .1942లో క్విట్ ఇండియా ఉద్యమం లో చేతిబామ్బులు తన అధీనం లో ఉంచుకొన్నందుకు , ,రహస్య బులెటిన్ లు తెనిగించి నందుకు,డిటిన్యు గా నిర్బందింప బడ్డారు .తెనాలిపట్టణ ,తాలూకా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులుగా ,గుంటూరుజిల్లా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా సేవ లందించారు
2-శ్రీ కొడాలి గోపాలరావు గారు
పెదరావూరు కు చెందిన కొడాలి గోపాలరావు గారు గొప్ప నాటక రచయిత. అనేక ఎమేచ్యూర్ నాటక సమాజాలు ఆయన నాటకాలను భారీగా ప్రదర్శించాయి .శివాలయం ప్రక్కనే ఉన్న ప్రభుత్వ పాథశాలలో మూడవ తరగతి వరకు చదువుకొన్నారు .ముఖ్యంగా రైతు కూలీ సమస్యలపై ,భూస్వాముల ,అధికారుల పెత్తనాలపై అనేక నాటక ,నాటికలు రాశారు .పేద రైతు ,,తిరుగుబాటు ,కూలీ ,,లంకెల బిందెలు ,దొంగ వీరడు , నిరుద్యోగి ,చైర్మన్ నాటకాలను రసవత్తరంగా ,ప్రయోగాత్మకం గా రచించారు .అవి ఆంధ్రదేశం లో విస్తృతంగా ప్రజానీకాలకు నచ్చాయి .స్వతహాగా రైతు బిడ్డ అవటం వలన వీరి నాటకాలు సజీవంగా దర్శన మిస్తాయి .వందకు పైగా నాటకాలు రాసి ‘’శత నాటక కర్త ‘’అనే పేరు పొందారు .గ్రామీణ ప్రజలు జమీందార్లు ,రాజకీయ నాయకులు ,వడ్డీ వ్యాపరస్తులు ,,కూలీలు పేదలు వీరినాటకాలలో ప్రముఖ పాత్రలు వారి మధ్య సంఘర్షణ లను అత్యద్భుతంగా చిత్రించారు .అనేక నాటక పరిషత్తులలో 170కి పైగా బహుమతులు పొందారు .తెనాలిలో ‘’జనతా ఆర్ట్ థియేటర్ ‘’స౦స్థాపకులు .వీరి చైర్మన్ ,లంకె బిందెలు దొంగ వీరడు నాటకాలు ఆంధ్ర దేశం లో సంచలనమే సృష్టించాయి అడిగిన వారికల్లా నాటకాలు రచించిన ఉదారుడాయన ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన ‘’కల చెదిరింది ‘’సినిమాకు కొడాలి గోపాలరావు గారు దర్శకత్వం వహించారు. ఈ సంగతి చాలామందికి తెలియదు .
ఈ నెల 15వ తేదీ అమర్తలూరు వెళ్లి నప్పుడు మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి శుభాషిణి ఇంటికి ఎదురుగా ,ఒక చెట్టు కింద ఒక విగ్రహం ఉంటె ఎవరిదీ అని అడిగితె కొడాలి గోపాలరావు గారిది అని చెప్పింది .కానీ నాకు అప్పుడు బల్బు వెలగలేదు .ఇవాళ తెలిసింది ఆమహనుభావుడి విగ్రహం అని .దాదాపుఆవూరి జనం కూడా ఆయన్ను మార్చే పోయి ఉంటారేమో .
3-శ్రీ రంగా వజ్ఝల వెంకట సుబ్బయ్యగారు
ప్రముఖ హరిభక్త శిఖామణి శ్రీ రంగా వజ్ఝల వెంకట సుబ్బయ్యగారు పెదరావూరు లో జన్మించారు .వీరు కృష్ణా జిల్లా దివి తాలూకా కోడూరు గ్రామం లో ‘’శ్రీ రామ దాసు ‘’హరికథా గానం చేస్తూ ప్రజోత్పత్తి నామ సంవత్సరం శ్రావణ శుద్ధ ఏకాదశి సోమవారం నాడు సప్తాహమండపం లో ‘’శ్రీరామ ప్రభో ‘’అని ఆలపించి ఒక్క సారిగా కుప్పకూలి అసువులు బాసి శ్రీ రామసాన్నిధ్యం చేరిన హరికథా శిఖామణి . ఈ ముగ్గురు మూడు రంగాలలో ప్రముఖులు .శ్రీరావూరి రంగారావు గారు భారత స్వాతంత్రోద్యమ నాయకులు .శ్రీ కొడాలి గోపాలరావు గారు శతాధిక నాటక నవలాకర్తలు అయిన సాహిత్యోపజీవి .శ్రీ రంగా వజ్ఝల వెంకట సుబ్బయ్యగారు హరికథకులైన భక్త శిఖా మణులు .ఆధ్యాత్మిక ప్రముఖులు .పెదరావూరు గ్రామ కీర్తి పతాకలు .వీరి గురించి ఇంతకంటే వివరాలు దొరకలేదు .
ఈ వివరాలు నాకు ముందే తెలిసి ఉంటె మొన్న ఆదివారం పెదరావూరు సదస్సులో వారిని గుర్తు చేసి ఉండేవాడిని .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-11-22-ఉయ్యూరు