సంగమేశ్వర శతకం
కృష్ణా –తుంగభద్రా సంగమం లో చామర్ల పూడి(సంగం జాగర్లమూడి ) గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామిపై శ్రీ పరిమి వేంకటాచలకవి శతకం రాయగా ,గుంటూరు వాసి శ్రీ పరిమి కృష్ణయ్య గారిచే బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షర శాలలో శ్రీ క.కోదండరామయ్య చే 1931లో ప్రచురింపబడింది. వెల.రెండు అణాలు .
విజ్ఞప్తిలో’’ ఈకవి ఆది శాఖీయబ్రాహ్మణుడుఅని,పేరు పరిమి వేంకటాచల౦ అని ,హరితస గోత్రం ,తండ్రి రఘునాయకుడు ,తల్లి సూరమాంబ .ఈకవి నూట ఇరవై ఏళ్ళ క్రిందటివాడు అంటే సుమారు 1811 నాటివాడు .వీరి సంతానం గుంటూరు మండలం లో వ్యాపించి ఉంది .గుంటూరు పుర పారిశుధ్య సంఘ కార్యాలయ ఉద్యోగి పరిమి సూర్యనారాయణ ,విజయవాడ ప్రభుత్వ ఔషధాలయ ఉద్యోగి పరిమి సీతారామయ్య ఈ కవి సంతతి లోని వారే ..సూర్యనారాయణ ఈకవికి అయిదవ తరం వాడు .సంస్కృత ఆంధ్రాలలో కవికి అసామాన్య పాండిత్యం ఉంది .శతకం సంస్కృత పద భూయిష్టం అయినా,మూలపదాలుకాని కటువైన పదాలుకానీ లేకుండా నిరర్గళ ధారాశుద్ధి ,తో ద్రాక్షాపాకం తో,భక్తిరసం వెల్లి విరిసేట్లు ,ఇప్పటిశతకాలకు ఏ మాత్రం తీసిపోకుండా సలక్షణంగా ఉంది ‘’ అని కర్లేపాలెం కోదండ రామయ్యగారు శ్లాఘించారు .ఉత్పలమాలా శతకం ఇది .’’కూడలి సంగమేశ్వరా ‘’అనేది శతకం మకుటం .
మొదటి పద్యం –‘’శ్రీ గిరిజా పయోధర పరిస్ఫుట చర్చిత సారగంధ గం –దధాగరు కుంకుమాంకిత ,సమంచి దురస్కజగత్ప్రపాలనో –ద్యోగ మనస్క ,శారద పయోద సమాన యశస్క ,సంతతా –భోగ వయస్క ,సర్వమునిపూజిత ‘’కూడలి సంగమేశ్వరా ‘’..రెండవ పద్యం లో’’వృషాధి రాజ కంఖాణ,మురారిబాణ’’అని విచిత్ర పద ప్రయోగం చేశారు కవి .తర్వాత ‘’భాసిత మందహాస ,పరిపాలిత దాస ,వ్రతోగ్ర కల్మష త్రాస ,పరాక్రమానల విదగ్ధ నిశాచర ఘాస ,సంతతోల్లాస ,శివా మనోహర విలాస ,సురాద్రి శరాస ,దివ్య కైలాస నివాస ‘’అ౦టూ సకార ప్రయోగంతో కవితాప్రాకారం కట్టి కదను తొక్కించారు .తర్వాత టకార ప్రయోగంతో వృషాద్రిప ఘోట , హిమాద్రి మనోబ్జాట లసత్కిరీట ,సుజనౌఘ భవాబ్ది కృపీట,జాహ్నవీ జూట ,కరాగ్ర శోభిమృగ శూల విధాత్రుక కోట,వాజ్నిరాఘాట విపత్కవాట ‘’అంటూ టకటక లాడించారు పద్యాన్ని.భాషపై ఎంతటి పట్టు ఉందొ ప్రకటించారు .ఆతర్వాత డకార ,దంభ రంభ డింభ స్తంభ లతో మరి రెండు పద్యాలు ఢంకా మోగించి చెప్పారు .ఈశ వినాశ ,దినేశ పాశ ,కేశాలతో పద్యం జడ అల్లారు .ఇలా ప్రతిపద్యంలో సంగమేశుని కీర్తించి కవితా కృష్ణా తుంగ లను సంగమింప జేసి ఉత్పల మాలికలల్లి అర్చించారు .
ఆతర్వాత మాదిరాజు ,పండితార్య బసవయ్య ,కాటకోటయ్య ,కేశిరాజు శిరియాళు,చోళ మహేశు ,సిద్ధరామయ్య బాచి రాజు వరదయ్య లనే శివ భక్తులను కీర్తించారు .’’తల్లికి ఉండే దయ బిడ్డపై దాసికి ఉంటుందా ‘’అంటూ నువ్వే దిక్కు అన్నారు .రారా చలమేరరా ,వినరాఏలుకోరా ,పలకరా మది నమ్మితిరా పదభక్తినియ్యరా ‘’అని వేడుకున్నారు చనువు మీరా .నీమిత్రుడు ధనదుడు ఇల్లు వెండికొండ ,కాంచన గిరి చాపం ,సర్వ విభూతులు కలిగికూడా ‘’ తనయుని పెండ్లి చేయని ఉదార గుణుడవు .అలాంటి నిన్ను వెంబడించే నన్ను అనాలికాని నిన్నని ప్రయోజనం ఏమిటి అని నర్మగర్భంగా పలికారుకవి .
రోకలి తోకోట్టినా ,రాళ్ళు రువ్వినా ,నంజుడు తి౦డిపెట్టినా ,సహిఛి మోక్షం ఇచ్చావు నన్నుమాత్రం వదిలేశావ్ అన్నారు .గళసీమలో మాణిక్యం ఉన్నా ,గాజుపూస కోసం అర్రులు చాస్తారుమానవులు అతి దగ్గరలో నువ్వున్నా నిన్ను పట్టించుకోరు వెర్రిజనం .ఉదరం లో ‘’పయోజ భవాండ శతాలు ఉంటె ,’’నీకడుపు ని౦డేట్లు భోజనం పెట్టటం మాకుసాధ్యమా ? ‘’ఎవ్వనిచే జగమ్ము జనియించు వసించు ,నశించు అవ్యయుడు,ఎవ్వడు ,కార్యకారణములలెవ్వడు ,భూత సమాశ్రయుడు ,చిత్కలా సహితుడు ఎవ్వరు ‘’అలాంటి నీవే మాకు దిక్కు అంటూ పోతనగారి పద్యాన్ని అనుకరిస్తూ శివ పరంగా అల్లారు .
‘’మూడిటి రెండిటిన్ గెలిచి మూటిని మూటిని రూపుమాపి ,మున్మూడిటిమూసి ,అయిదిటిని పొందుగా నేకము చేసి ,మూడిటన్ మూడిటి దాటి ,రెంటి నడుమన్ శివయోగి మూడిటన్ గూడిన చోటు మీరి నిను చేరతాడు ‘’అని వేదాంతపరంగా అద్భుత పద్యం రాశారు కవి. ఆపద కలిగిన వేళ,భయారతునిగా మొరబెట్ట నా సంతాపం మాన్పకున్నావు ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టకపోవటం న్యాయమా ఆది భిక్షూ అన్నారు , తు౦గ భద్రవద్ద అమరావతీనగరాన్నిపోలిన చామర్లపూడి లో సర్వ మంగళతో కొలువైన స్వామీ భక్తజనానికి అభయ ప్రదాతవు .
చివరిపద్యం –‘’మంగళమంబికా సహిత ,మంగళ మార్య శుభ ప్రదాయకా –మంగళమాహవ ప్రకట ,మంగళ మ౦బుజ నేత్ర,సాయకా –మంగళమిందుఖండ ధర ,మంగళ ముగ్ర మహాఘ శోషణా-మంగళ మభ్ర కేశ గుణ మండన కూడలి సంగమేశ్వరా ‘’అని శతకం ముగించారు .
చక్కని సంప్రదాయ బద్ధంగా శతకం సాగింది .భక్తి ఆర్తి ప్రపన్నత శరణాగతం తో భక్త చింతామణి గా శతకం రాశారు కవి.ధారాశుద్ధి అద్భుతం .భక్తి శతకాలలో తల మాణిక్యం గా ఉంది .ఈశతకం గురించి మనకవులు ఎవ్వరూ పేర్కొన్న దాఖలా కనిపించలేదు .ఈ కవినీ, ఈశతకాన్నీ పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-22-ఉయ్యూరు