పదహారు కోట్లతో పదహారు రెట్ల ఫలితం సాధించిన ‘’కాంతార (అడవి )పుత్రుల కథ ‘’కాంతార’’
అడవి బిడ్డల హక్కులు ,నమ్మకాలు ,పూనకాలు ,వారికిచ్చిన భూమి లాక్కుంటే జరిగే ప్రమాదాలు ,వారి జాతరలు అత్యంత సహజంగా నిర్మించి నేటివిటి కి పట్టం కట్టిన చిత్రం కాంతార .ఎవరి నోట విన్నా బ్లాక్ బస్టర్ మూవీ గా చెప్పబడుతోంది . కథ,కథన౦ , నటన, చిత్రీకరణ ,సన్నివేశాలకు తగిన పాటలు ,వీటిని మించిన ఫోటోగ్రఫీ ,ఎన్నెన్నో కష్టాలకోర్చి అరణ్యం లో సెట్ లు వేసి ,విజువల్ ఎఫెక్ట్ కోసం రాత్రి వేళ షూట్ చేసి తెరకెక్కించిన వైనం తెలిసి ,చూసి ప్రేక్షకజనం నీరాజనాలు పట్టిన సినిమా .దక్షిణ కర్నాటకు చెందిననట దర్శకుడు రిషబ్ శెట్టి బహు ముఖ ప్రజ్ఞకు నిలువెత్తు దర్పణంగా నిలిచింది .అన్నటా అతడు అద్వితీయుడని పించాడు .సినిమా విజువల్ రిచ్ నెస్ మనసుకు హృదయానికి హత్తు కొంటుంది .ఒక్క క్షణం కూడా కన్ను మరో వైపుకు తిప్పాలనిపించదు. అంతగా అటేన్షన్ ను సూదంటురాయిలా లాగేస్తుంది .
దక్షిణ కర్ణాటకలో తుళుప్రాంత కథ.ఒక అడవిలోని ఊరుకు రాజు చాలా అండగా ఉంటాడు .అడవిబిడ్డల ఆలనా పాలనాచూసే కన్నతండ్రిలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు అతడంటే వారికీ దైవ సమానమైన భక్తీ గౌరవాలున్నాయి .ఊరి పెద్దాయన ఒకాయన కూడా ప్రజల మనిషిగా ఉంటాడు ..పరస్పరం ఒకరినొకరు నమ్ముకొని ఉంటారు .అడవి పుత్రుడు శివ ఆయనకు గొప్ప సహాయ కారి .ఊరికి ఉపకారి .స్నేహితులతోకలిసి అప్పుడప్పుడు వేటకు వెడతాడు .ఒకసారి ఫారెస్ట్ ఆఫీసర్ మురళి వచ్చి శివ ను స్మగ్లర్ అని అనుకొంటాడు .చట్టం ముందు అందరూ సమానమే అన్నభావం మురళిది.ప్రజలకు దూరంగా ఉంటాడు .అక్కడిజనం అటవీ భూములు ఆక్రమి౦చు కున్నారని, కనుక సరిహద్దు కంచే వేయాలని అనుకొంటాడు ఆఫీసర్ .శివ ను ప్రేమించేలీల ఫారెస్ట్ గార్డ్ గా చేరి ,సర్వె చేయటం లో సాయం చేస్తుంది .
అనుకోని సంఘటన జరిగి శివ జైలుకు వెడతాడు .అతని స్నేహితుడు హత్యకు గురౌతాడు .జైల్లో ఉన్న శివ ఈ విషయం ఊరి పెద్దమనిషిద్వారా విని తట్టుకోలేకపోతాడు .ఈపని మురళిదే అంటాడు పెద్దాయన .జైలునుంచి వచ్చిన శివ అటవీ భూమిని కాపాడతాడు .ప్రజలకు భూమిని అప్పగిస్తాడు ఫారెస్ట్ ఆఫీసర్ తప్పు తెలుసు కొంటాడు .శివ, లీల దంపతులకు కొడుకు పుడతాడు .శివ తండ్రి తనకాలం లోఅడవి బిడ్డలకు రక్షణగా ,ఉంటె ఆతని తర్వాత శివ అతడితర్వాత కొడుకు రక్షకులౌతారు .
దక్షిణ కన్నడ దేశం లోని స్థానిక విషయాన్ని సబ్జెక్ట్ గా తీసుకొని ,చక్కని ట్రీట్ మెంట్ తో అందరిని అలరించాడు దర్శకుడు .ఆప్రాంతం లోని భూత కోలా ,కంబళ,కోళ్ళ పందాలను కళ్ళకు కట్టించాడు .ధనస్వామ్యం ,అడవీ రక్షణ ,అడవిపుత్రులహక్కులు ,పర్యావరణ పరిరక్షణలను దైవారాధన ,జానపద సాహిత్యాలతో మేళవించి కంబళ వంటి స్థానిక సంస్కృతిని ప్రేక్షకులకు తెలిసేట్లు చిత్రీకరించాడు .
పల్లెటూరి కథ.భావోద్వేగా ప్రధానం .మనుషులలో ఉన్న ప్రేమ అమాయకత్వం ,నమ్మిన దానికై ప్రాణాలను కూడా పణంగా పెట్టె నైజం గుండెను పట్టేస్తాయి ఊపిరి సలుపనివ్వవు .
మొదట్లో సినిమాలో రాజు మహా సంపన్నుడైనా ,మనశ్శాంతి లేక తిరుగుతూ ,ఈ అడవిలోకి వచ్చి ‘’పంజుర్లి ‘’అనే రాయి ని చూస్తాడు .అనుకోని మనశ్శాంతి లభించి తన ఖడ్గం అక్కడ పడేయగా అక్కడి ప్రజలు ఆరాయిని ఆరాధించటానికి వస్తారు .రాజు వాళ్ళను వారి దేవుడిని తనకిమ్మంటాడు .అందులో పంజర్లీ దేవుడికి సేవ చేసే కుటుంబంలోని వ్యక్తికి ఆదేవుడు ఆవహించి తాను రాజుతో వచ్చి మనశ్శాంతి నిస్తానుకానీ ఇక్కడి ప్రజలకు ఏమిస్తావని అడిగితె ,ఎడైనైస్తానని రాజు అంటే ,అప్పుడు అతడు పెద్దగా అరిచి తన అరుపు వినబడినంత మేర స్థానికులకు ఇచ్చేయ్యమంటే అలానే ఇస్తానన్నాడు రాజు .ఒక షరతు పెట్టాడు పంజర్లీ .రాజు తరఫున భవిష్యత్తులో ఎవరైనా వారసుడు మళ్ళీ ఈ భూమిని కావాలని రాద్ధాంతం చేస్తే ‘’గుళిగ’’దేవుడు ఉపేక్షించడు .అతనిని శిక్షిస్తాడు అంటాడు .అతడే క్షేత్ర పాలకుడు .మొదట్లో ఈ ఇద్దరు దేవుళ్ళకు పెద్ద యుద్ధాలు జరిగుతాయి .తర్వాత కొందరు దేవుళ్ళు వీరిద్దరిమధ్య సంధి చేసి అన్నదమ్ముల్లా మేలిగేట్లు ఒప్పందం కుదురుస్తారు .ఈ ఇద్దరు దేవుళ్ళు అక్కడి ప్రజలను నిరంతరం కాపాడుతూ ఉంటారు .ఇలా దేవుడికీ భూమికి మధ్య చక్కని సంబంధం కలిగించారు .
కొన్నేళ్ళ తర్వాత రాజు వారసుడు ఒకడు వచ్చి తమ రాజు ఇచ్చిన భూమి తిరిగి తనకు ఇచ్చెయమని అడుగుతాడు .శివతండ్రి అప్పుడు భూత కోలా ఆడుతుంటే అతనిలోకి దేవుడు పూని ‘’ఈ స్థలం మాట మర్చిపో .ఇది ప్రజల ఉమ్మడి ఆస్తి .దీనికోసం కోర్టుకు వెడితే ,కోర్టు మెట్లమీదే తేలుస్తాను ‘’అంటాడు .వెంటనే అడవిలోనుంచి తనను పిలుస్తున్న కేక విని అప్పటికప్పుడు అదే వేషంతో అడవిలోకి పరిగెత్తుకోనిపోయి తన చుట్టూ అగ్ని వలయం ఏర్పాటు చేసుకొని అదృశ్యమైపోతాడు .పంజర్లీ దేవుడు చెప్పినట్లే రాజుగారి వారసుడు కోర్టు మెట్లమీద అకస్మాత్తుగా చచ్చిపోతాడు .ఇలా హీరో మాయమయ్యే సీన్ మళ్ళీ క్లైమాక్స్ లో వస్తుంది .
జైలు నుంచి ఇంటికి వస్తున్న శివకు దారిలో ఒక అడవిపంది –వరాహం కనపడుతుంది .దాన్ని చూసిన ప్రతిసారి భయపడి అడవిలోకి పారిపోయేవాడు . ఈ సారి భయపడకుండా దాని వెంట వెళ్లగా,శివ తండ్రి మాయమైన వలయంలోకి అతడిని ప్రవేశించేట్లు చేస్తుంది .అందులోకి చేరిన శివకు తండ్రి రూపు ఒక కాంతిలా కనిపించి ‘’నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉందని ‘’అంటాడు పంజర్లీ దేవుడు అతడికి ఊరి లోని జరిగిన జరగబోయే విషయాలన్నీ తెలియజేస్తాడు .ఊరి వారంతా ఏం జరుగుతుందో అని కంగారు పడుతుంటే శివమాత్రం తాపీగా నిశ్చలమనసుతో ఉంటాడు .అందర్నీ అక్కడే ఉండమని చెప్పి ,ఇంతలో దొర వస్తే తన ఊరి వారందర్నీ జాగ్రత్తగా చూసుకొంటూ కాపాడమని అప్పగించి వెడతాడు .అంటే ఇక తిరిగి రాడు అని మనం గ్రహించాలి .కాని దొర,అక్కడి మనుషులతోపాటు శివను కూడా కాల్చి చంపేస్తాడు .కాని శివ చనిపోడు.అతనిలోకి వెళ్ళగా గులిగ దేవుడు ఆవహిస్తాడు .గులిగ దేవుడు చేసే పనులను అత్యద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు .ఈ దేవుడికి ఆకలి ఎక్కువ .ఒకసారి మహా విష్ణువే వచ్చినా ఆకలి తీరకపోతే ఆయన చిటికెన వ్రేలును తినటానికిస్తే గుళిగ ఆకలి శాంతించింది .శివలోని గుళిగదేవుడు ‘’ఆకలి ఆకలి ‘’అని అరిస్తే ఊరిజనం ఆయనకిష్టమైన మరమరాలు తెచ్చి సమర్పిస్తారు .అవితింటూ గుళిగ అరిచే అరుపులకు ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుడుతుంది. అంత భయంకరంగా ఉంటుంది అఆరుపు .రాతి విగ్రహం దగ్గర మట్టిలో ఉన్న కత్తిని తీసి దొర తల నరికేస్తాడు గుళిగ .ఈకత్తి సినిమా మొదట్లో రాజు అక్కడి రాతి దేవుడిని చూసి మనశ్శాంతి పొందినప్పుడు విసిరేసిన కత్తి.కొన్ని నెలల తర్వాత శివ మాయమైపోతాడు .అతనికి అప్పటికే ఒక కొడుకు పుట్టాడు .మాయమయ్యే ముందు శివ కోలా కడతాడు .అతనిలోకి పంజర్లీ దేవుడు ఆవహిస్తాడు .ఊరి వారి నందర్నీ కలిసికట్టుగా ఉండమని ప్రజల రక్షణ పోలీసు ఆఫీసర్ ను చూసుకోమని చెప్పి ,ఎవరోపిలుస్తున్నట్లుగా అకస్మాత్తుగా అడవిలోకి వెళ్లి వాళ్ళనాన్న మాయమైన వలయం నుంచే శివ మాయమై పోతాడు .మాయమవటానికి ముందు శివకు తండ్రి కనిపిస్తాడు .ఎందుకు ఈమయమవటాలు అనేది థౌజండ్ డాలర్ క్వశ్చిన్ .కారణం శివ కుటుంబం దైవ సేవ చేసే కుటుంబం .ప్రతిమనిషి ఏదో ఒక ప్రయోజనం కోసమే పుడతాడు. ప్రయోజనం నెరవేరగానే మళ్ళీ దేవుని చేరతారు .శివ నాన్నరాజవంశీకుడిని అలానే చేశాడు .ఇప్పుడు శివకూడాదొరవలన ప్రజలకు కలిగిన ఇక్కట్లనుంది దొరను చంపి తనవారిని కాపాడాడు . తన జన్మకారణాన్ని తండ్రిలాగానే సార్ధకం చేసుకొన్నాడు.శివకు పుట్టిన బిడ్డ కూడా దైవకార్యం నిర్వర్తి౦చటానికే .వాడుకూడా తనపని పూర్తికాగానే తాత తండ్రీ ల్లాగా దైవాన్ని చేరుకొంటారు .ఇలా దేవుడే దిగివచ్చి తనమనుషులను కాపాడుకొంటూ ఉంటాడు అని ‘’పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం –ధర్మ సంస్థాపనార్ధాయ సంభ వామి యుగే యుగే ‘’అనే గీతాకారుని మాటను మరో విధంగా ఈ కాంతార కథా రూపంగా రుజువు చేశాడు దర్శకుడు ,దార్శనికుడు రిషభ్.
ఈ సినిమాకు సంగీతం లోకేషన్లు ముఖ్య బలంగా నిలిచాయి .ప్రతి సెంటి మీటర్ కలర్ఫుల్ గా ఉంది .అజనీష్ లోక నాథ సంగీతం నేపధ్య సంగీతం మరోలోకం లోకి తీసుకు వెడతాయి. కొన్ని చోట్ల రోమాలు నిక్కబొడుచుకొంటాయి .అరవింద కాశ్యప్ సినిమాటోగ్రఫీ కెవ్వు కేక .హీరో రిషబ్ శెట్టి కనిపించడుఎక్కడా. శివ పాత్రమాత్రమే కనిపిస్తుంది .దర్శకుడుగా రిషభ్ విశ్వ రూపం చూపించాడు .వృషభం ధర్మానికి ప్రతీక .రిషభ్ అలా దివ్యమైన ధర్మబద్ధమైన సినిమాకు ప్రతీకగా నిలిచాడు .సినిమాలోని పాత్రలన్నీ జీవించాయి .లీలగా సప్తమీ గౌడ పాత్రలో లీనమై నటించింది .ఫారెస్ట్ ఆఫీసర్ మురళి గా కిషోర్ కుమార్ ప్రతిభ చాటాడు .భూస్వామి గా అచ్యుతకుమార్ ఆకట్టుకొన్నాడు .
పాటలు –‘’వరాహ రూపం దైవ వరిష్టం –వరస్మిత వదనం –వజ్రదంత ధార-రక్షా కవచం –శివ సంభూత ,భువి సంజాత నంబిడగి౦బు కొడు వవనీత సావిర మన సంప్రీత -బెడుత నిందేవు ఆరాధి సుత ‘’గీతాన్ని శ్రీలత ,రిషభ్ మహా శ్రావ్యంగా భావ స్ఫోరకంగా పాడారు.
కన్నడ తారలు ‘’కనకతారలు’’ గా మెరిశారు .మురిపించారు , మైమరపించారు నటనలో .అన్ని విభాగాలు అత్యున్నత ప్రమాణంగా ఉన్న చిత్రరాజం కాంతార .ట్రెండ్ సెట్టర్ గా నిలిచి మార్గదర్శనం చేసింది .రిషభ్ ‘’అభినందగళు’’.’’ఒళ్ళ యదాగలి (బెస్ట్ ఆఫ్ లక్ )
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-11-22-ఉయ్యూరు