శ్రీ భీమేశ శతకం
శ్రీ దేవరకొండ అనంతరావు శ్రీ భీమేశ కందశతకం రచించి ,శ్రీకాకుళం శ్రీ రామ కృష్ణా ప్రింటింగ్ ప్రెస్ లో 1939 లో ముద్రించారు .వెల-పావలా .’’భీమేశా ‘’అనేది మకుటం .దీనికి తొలిపలుకు శ్రీకాకుళం మునిసిపల్ హై స్కూల్ ఖగోళ శాస్తజ్ఞుడు బి.ఎ. బిఎడ్. హెచ్.ఎం. డి .శ్రీ బొమ్మిడాల ఆది వెంకట నరసింగ రావు రాశారు .తన శిష్యుడైన అనంతరావు ఈ శతకాన్ని కంద పద్యాలలో రాశాడని ,ఇది మొదటి ప్రయత్నం కనుక సాధ్యమైనంతవరకు తప్పులు సవరించాననీ ,సారం గ్రహించి ప్రోత్సహించమనీ,సరళంగా శబ్దాలంకారాలతో కవి కూర్చాడనీ మెచ్చుతూ –‘’స్మరహరుపై శతకము బుధ వర-పరమాదరమునకు బాత్రముగాని – ద్ధర నొనరిచి నెగడిన దే-వరకొండ అనంతరావు వర్ధి లు గాతన్ ‘’అని ఆశీర్వదించారు శిష్యుడిని .పీఠికలో కవి ‘’శ్రీ భీమేశు ప్రేరణతో రాశాను భాషాజ్ఞానం గ్రంథ పరిచయం లేని వాడిని .ముందుమాట రాసిన గురువుగారికి ,ముద్రణకు ద్రవ్య సాయం చేసిన శ్రీ కిల్లాన రామన్నాయడు లకు కృతజ్ఞతలు తెలిపారు .
మొదటి పద్యం –‘’శ్రీకర యో సద్భక్త వ-శీకర ,రిపుభీకర ,సుర శేఖరహర మో-క్షాకర రజనీకరధర -శ్రీ కర కంఠాతలంతు భీమేశా’’ .అందాలకందాలనే మందార సుమాలు ఏరి మాలగా అత్యానందంగా కూర్చాను ఇందు ధరా దీన్ని తాల్చు అని కోరారు రెండవపద్యంలో .ఈశా గౌరీశా విశ్వేశా,రిపునాశా ,మహేశా పోషా ,ఆశాపాశ వినాశా ,నాశ రహిత దయ చూపు అన్నారు శకార యమకం తో .ధరణి రధం ,దానికి దినకర ,శశి చక్రాలు మిన్కు గమి తురగాలు ,ధరణీధరమే ధనువు ,హరి శరం .అజుడు నీ సూతుడు అని తనకే పాండిత్యం లేదన్న కవి అద్భుతంగా కవిత అల్లారు .నందీశ భ్రున్గీశ ,బృందారక బృందం అజుడు హరి రుషివరులు ‘’నీ సుందర పదపద్మాలను అందముగా గొల్తురు ‘’అన్నారు
‘’ఒక్కడవట రక్కసులను –బెక్కుడువట,భక్త తాటికి జిక్కుడువట నీ –దిక్కును కోరిన వారి కి దక్కుడదువట ‘’అంటూ కకార ప్రాస లో కాలేకాలుడిని చమత్కారంగా భక్తసులభుడినిగా వర్ణించారు , మృత్యు నిత్యు సత్య లతో మరోఆణిముత్యం అందించారు .అకల౦కా ఉమా౦కా అంటూ కొడుకును భార్యను శివుడికి అర్పించిన భక్తుల గాథలు జ్ఞాపకం చేశారు .విల్లు కా౦చనమేగా,ఆభరణాలు చేయటానికి విశ్వకర్మ నీ సన్నిధిలోలేడు అందుకే ‘’’’పాప’’ నగల దాల్చగల రూపం ‘’మర్మం చెప్పమన్నారు .ఏ పేరుతొ పిలిస్తే పలుకుతావో తెలీదు .నీదయ లేక నేను జడుడు గా ఉన్నా .దయతో మన్నించు .’’నీపలుకులు సుధలొలుకుతాయి ‘’అని పోతన్నగారి శైలి పద్యం రాశారు .నామొరలు వినబడలేదా దీన బంధో’’అన్నారు ఆర్తిగా .కాలుని చేతికి చిక్కకముందే కాలాంతక నీలీలలు పోగుడుతున్నాను .
జడమతి నిడుముల దడబడి-కడుపడిసెడి నీ యడుగులకడ,బడ నీవీ –యెడ జేనిడ,నో మృడయే-డకేగుదు మగుడ దెల్పుమిక భీమేశా ‘’ పోతనగారికేమీ తీసిపోడు అనట్లుగా ఉందికదా పద్యం .కనికరపు గనివి .కరములు మోడ్చి వెడితే విని కరము గాచెదవని విబుధనికరము ‘’నిన్ను పొగుడుతుంది అని కరము తో కమ్మని కందం వండి వడ్డించారు .’’నిన్ను తెలుసుకోని చదువులు వ్యర్ధంకదా అని యదార్ధం చెప్పారు .పంచశర గర్వహర –పంచానన వరద భక్తవరా ‘’అంటూ హరనామాల తో భక్తికవితా ప్రవాహం పారించారు .నీఇల్లు ధవళం ,భూషలు జడ ,నెత్తిన సుధాకరుడు,నీ శరీరం కూడా ధవళం అని ధవళవర్ణుని వర్ణించారు కవి .
పిలిచినా రావు నా నేరమా గ్రహచారమా గజచర్మధరా హరా ‘’అంటూ పల్లవి౦చారు.హరి హరులు ఒక్కటే .భేద బుద్ధి పాటించినవాడు ‘’కరుణా మయ ,కాలుని కడ కరుగుట తధ్యం .బలి ఇంటికి హరి కావలి కాస్తే ,’’నువ్వు బాణుని ఇలు గాచితివి ‘’కనుక మీ ఇద్దరికీ భేదమే లేదు .ఇద్దరూ భక్తులకు కింకరులు వశంకరులే .నరు సఖుడా శ్రీహరి .అలాంటి నరునికి పాశుపతం ఇచ్చావు నువ్వు .మీ ఇద్దరికీ భేదమేమిటి ఉమామహేశా ,రమేశా అన్నారు .నువ్వు ఎలాగూ నిత్య యాచకుడివే .ఆయనేమైనా పొడిచేశాడా ? బలిని మూడడుగులు యాచించాడు .యాచనలోనూ తేడాలేదు అని చమత్కారం .పన్నగాలు నీ భూషలు ,పన్నగ శయనుడు ఆయన .ఇద్దరూ పాపవినాశులే .
‘’మురహరుడాతడు నీవో –పురహరుడవు సర్వ లోక పూజ్యా ,భువిపై –హరియన ,హరుడన భేదంబు లేదయా ‘’అని అద్వైతం ఆవిష్కరించారు కవి .నువ్వు శ్రీ(విషం ) గళుడవు.ఆయన శ్రీ(లక్ష్మి ) గలవాడు .మీకు భేదం ఏమిటి మా అజ్ఞానం కాక అన్నారు .ఆయనకు తిరుపతి నీకు రజతగిరి ఉనికి పట్టు .ఇద్దరూ కొండల దేవుళ్లే.మాకోసం దిగొస్తారు .గట్టులరాయని (హిమవంతుడు )ముద్దులపట్టిని చేపట్టినట్టి పరమేశుడిని,పుట్టుట గిట్టుట లేని జెట్టిని భీమేశుని మోక్షంకోసం ప్రార్ధిస్తా .శివుడు ‘’దినకర ,శశి, శిఖి త్రినేత్రుడు .ఒకరాజు కలంకుడు వేరొకరాజుకు వేయికన్నులు ,ఇంకోరాజు గ్రహబాధితుడు .కనుక రాజు అంటే నువ్వే అని చక్కని ఎనేక్డోట్స్ తో మంచి పద్యం రాశారు .’’నా చిత్తం అనే అశ్వం ఇచ్చవచ్చిన చిత్తంతో పరిగెత్తుతోంది చిత్త హరా ‘’ నువ్వే వచ్చి ఆగుర్రాన్ని దారికి తేవాలి అంటూ ఆదిశంకరుల శివానందలహరి శ్లోకాన్ని జ్ఞాపకం చేశారు .
‘’శ్రీకరములు సుగుణాలికి-భీకరములు దైత్యతతికి వీనుల విన మో-క్షాకరములు భక్తులకు వశీకరములు నీ చరితలు ‘’.శూలివి ,గిరిజాసతికి అనుకూలివి ,అసుర కుంజర తతినిర్మూలివి ,కడు బలశాలివి –పాలితలోకాళివరయ ప్రభు భీమేశా’’.తోలు ధరించి జలంధరు నేలకూల్చి ,కాలుని గెల్చి ,శిరియాళుని దయతో కాపాడావు ..
99వ పద్యం లో ‘’శ్రీ విశ్వ కర్మ కులజుడ –దేవర కొండాన్వయుడను,ధీనుత చరితా – శ్రీ విశ్వభద్ర గోత్రుడ –బ్రోవుమనంతాఖ్యు నన్ను భువి భీమేశా ‘’అని తన విషయాలు చెప్పుకొన్నారు .నూరవ పద్యంలో మంగళం పాడుతూ –‘’మంగళమిదె గొనుమా –మంగళకర యో శుభాంగ ,మాధవహిత ,నా –మంగళమిదె గైకొనుమో –యంగజ హర భ్రు౦గి వినుత హర భీమేశా “’అంటూ శతకం సమాప్తం చేశారు కవి .
కవి విశ్వకర్మ కులజుడు కనుక బంగారాన్ని ఎంత సున్నితంగా ఆభరణాలుగా మలుస్తారో ,అంతే సున్నితంగా ప్రతిపద్యాన్నీ శిల్పీకరించి ఆపరమశివుడే పరమాశ్చర్యం పొందేట్లు ‘’శతకనక ‘’శోభాయ మానంగా తయారు చేశారు .ప్రతిపద్యం ఒక ఉదాహరణమే .భక్తి శతకాలలో తలమానికమైన శతకం అని నేను భావిస్తాను .ప్రతి పద్య చమత్కృతి తో శతకం సహస్రగుణ శోభిత౦ గా ఉంది .శతకకర్తకు కమోడ్పులు ఘటిస్తున్నాను .నిత్య పారాయణకు అద్భుతంగా పనికి వచ్చే శతకం ఇది .రసభరిత శతకం .కవితాధార నాగావళీ, వంశధారా సదృశ వేగంగా సాగింది .ప్రతిపద్య రమణీయం శతకం .బహుశా శ్రీ కాకుళం లోని ముఖ లింగేశ్వర స్వామిపై రాసి ఉండచ్చు .అక్కడ భీమేశ్వర దేవాలయం ఉన్నట్లు లేదు .గొప్ప భక్తిశతకాన్ని, తద్రచయితను పరిచయం చేసిన మహద్భాగ్యం నాకు దక్కింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-22-ఉయ్యూరు .