శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారి మాతామహులు ,తొలి భాషా శాస్త్ర వేత్త –తాత వెళ్ళి మిఠా దార్ ,మహామహోపాధ్యాయ -ప్రొఫెసర్ టి.ఎం.శేష గిరి శాస్త్రి

శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారి మాతామహులు ,తొలి భాషా శాస్త్ర వేత్త –తాత వెళ్ళి మిఠా దార్ ,మహామహోపాధ్యాయ -ప్రొఫెసర్ టి.ఎం.శేష గిరి శాస్త్రి
18భాషలు నేర్చి ,దక్షిణ భారతం లో అగ్రగణ్యులై ‘’వీణాగాన కళా నారద ‘’బిరుదాంకితులై ,విద్యార్ధి కామధేనువుగా ప్రసిద్ధి చెందిన,తొలి భాషాశాస్త్ర(పైలాలజి ) వేత్త ,ఆంద్ర –ద్రావిడ పైలాలజి ,ఆంధ్ర శబ్దతత్వ ,తమిళ శబ్దతత్వ ,అర్ధానునుస్వారాది వ్యాకర్త,మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి సంస్కృత మహొపాధ్యాయులు ,ప్రాచ్య భాషాప్రవచనాధ్యక్షులు, ఆచార్య శేషగిరి శాస్త్రి గారు బ్రహ్మశ్రీ వేద౦ వేంకట రాయ శాస్త్రిగారికి మాతామహులు .
జననం –భాషలపై పట్టు ,ఇంగ్లీష్ పై అభిరుచిలేకపోవటం ,మద్రాస్ చేరటం
పూర్వ సేలం జిల్లా ఉత్తర ఆర్కాటు లోని తిరువత్తూరు తాలూకా లో వేంకట రమణశాస్త్రులు అనే భూస్వాములు (మిఠా దార్లు )పుదూరు ద్రావిడ శాఖీయులు .వారికుమారులే శేషగిరి శాస్త్రి 1847 లో మార్చి 20 న జన్మించారు .మహా పండితులైన తండ్రి కుమారుని తన అంతటి వానిని చేయాలనే సంకల్పం తో ఉన్నారు. కుర్రాడుకూడా సంస్కృత మహారాష్ట్ర ఆంద్ర ద్రావిడ కర్నాటక భాషలలో అద్భుత జ్ఞానం సంపాదించుకొన్నాడు .అయితే ఇంగ్లీష్ నేర్వాలని ఉండేది కాదు .కొడుకుతో ఇంగ్లీష్ చదివించాలని తండ్రి విశ్వ ప్రయత్నం చేశారు .అది తనవల్లకాదని ప్రయత్నం మానేశారు .చిన్నప్పటి నుంచీ స్వాతంత్ర ఇచ్చ ఉన్న కుమారుడు ,తండ్రి దగ్గరే ఉంటె బలవంతంగా ఇంగ్లీష్ నేర్పిస్తారని ,ఎవరికీ చెప్పకుండా రైలెక్కి మద్రాస్ చెక్కేశాడు .కొడుక్కు ఇష్టం లేకుండా ఏపనీ చెయ్యరాదని గ్రహించి తానె కుటుంబంతో మద్రాస్ చేరారు .అప్పటికి గాని మోకాలులో బల్బు వెలగలేదు పుత్ర రత్నానికి .ఇంగ్లీష్ అధ్యయనం అవసరం అని గ్రహించి ,ఆంగ్లం నేర్చి మెట్రిక్ పాసై ఇంగ్లీష్ తోపాటు పైన చెప్పుకొన్న భాషలన్నిటినీ నేర్చారు శేషగిరి శాస్త్రి .ఆది శేషావతారం కదా .
మాతృభాషా మమకారం –సంస్కృత పండిత ఉద్యోగం
ఇంగ్లీష్ ప్రభావంతో మాత్రు భాషలను మర్చి పోతున్న జనాలమనసు మార్చటం తన తక్షణ కర్తవ్యం గా భావించి ముందుకు దూకారు శాస్త్రి .ప్రెసిడెన్సి కాలేజిలో చేరి ఎఫ్ ఎ బిఎ లను 1871లో పాసై నారు ఈయనకున్న సంస్కృత పాండిత్యాన్ని గ్రహించి ,సంస్కృత పండితుడుగా ఉన్న ఆబర్ట్ దొర అయిదు నెలలు సెలవు పెట్టటంతో కాలేజి అధికారులు శేషగిరి శాస్త్రి గారిని ,ఆస్థానంలో సంస్కృత పండితులుగా నియమించారు .27ఏళ్ళ ఈ యువకుడు తన బోధనా పటిమచే ,విద్యార్ధుల సహోపాధ్యాయుల పై అధికారుల అభిమానం పొందారు .ప్రిన్సిపాల్ థాంప్సన్ ఈయన్ను ప్రొఫెసర్ నిచేసి జీతం పెంచాలని పై అధికారులకు రాశాడు కానీఆది ఫలించ లేదు .ఆపర్ట్ దొర శలవు పూర్తియి మళ్ళీ ఉద్యోగం లో చేరగానే శాస్త్రిగారి కొలువు ముగిసింది .
ప్రాచ్యలిఖిత పరిశోధన
శాస్త్రిగారి దృష్టి ప్రాచ్యలిఖిత గ్రంథ పరిశోధనపై పడి,1879నుంచి అలాంటి గ్రంథాలు సేకరిస్తూ ,ఆ సంవత్సరం అక్టోబర్ లో అమ్మకానికి వచ్చిన కొన్ని గ్రంథాలపై సవిమర్శకంగా ఒక లేఖను ప్రభుత్వానికి రాశారు .ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయనకు సహకారం అందించగా ,గ్రంథ సముపార్జన ధ్యేయంగా ఉన్నారు .
మొదటి సంస్కృత ఎం .ఎ ., భాషాశాస్తం –పైలాలజీ అభిరుచి ప్రాచ్యభాషా ప్రవచనా ధ్యక్షులు
పైలాలజిపై శాస్త్రి గారికి ఎపుడు అభి రుచి కలిగిందో తెలియదుకానీ ,ఆయన రాసిన ‘’ఆర్య ద్రవిడ’’పైలాలజి లో ని ఉపోద్ఘాతాన్ని చూస్తె ,విద్యార్ధి దశనుంచి ఆయనకు భాషా శాస్త్రంపై అభిమానం ఉందని అర్ధమవుతుంది .1875లో సంస్కృతంలో ఎం ఎ పరీక్ష ను ఇంగ్లీష్ లో రాశారు .మద్రాస్ ప్రెసిడెన్సి మొత్తం మీద శేషగిరి శాస్త్రి గారే మొదటి సంస్కృత ఎం ఎ .ఆతర్వాత మలయాళం ఒరియా హిందీ బెంగాలీ కొండు,లాటిన్ గ్రీకు భాషలు నేర్చి ప్రావీణ్యం సంపాదించారు .ప్రిన్సిపాల్ థాంప్సన్ చివరి రెండు భాషలు శాస్త్రిగారు నేర్వటానికి చాలా దోహదం చేశాడు .1877లో పాఠశాలల ఇన్స్పెక్టర్ గా నియమింపబడి ,మరుసటి ఏడాది ప్రెసి డెన్సికాలేజి ప్రాచ్యభాషా ప్రవచనా ధ్యక్షులయ్యారు .
ఫస్ట్ పైలాలజి ప్రవర్తకులు ,మహామహోపాధ్యాయులు ,క్యురేటర్
ఆ పదవిలో ఉండగానే అనేక భాషలు వాటి వాగ్మయం వాటి పైలాలజీ లపై గొప్ప ఉపన్యాసాలు చేసేవారు .కొద్దికాలం లోనే’’ పైలాలజి –ప్రథమ ప్రవర్తకులు ‘’గా గుర్తింపు పొందారు .1882లో ఆపర్ట్ దొర మళ్ళీ సెలవుపెట్టి స్వదేశానికి వెళ్ళగా ,ఆయన స్థానం లో శేషగిరి శాస్త్రి గారిని ‘’ప్రేసిడేన్సికాలేజి సంస్కృత మహామహోపాధ్యాయులుగా ,ప్రాచ్యలిఖిత పుస్తక భా౦డాగారానికి క్యురేటర్ గా ఒక సంవత్సర కాలం పని చేశారు .ఈకాలం లోనూ అందరి అభిమానాన్ని సంపూర్తిగా పొందారు .శాస్త్రిగారి భాషా సేవను ప్రస్తుతిస్తూ డాక్టర్ డంకన్ ప్రభుత్వానికి రాశాడు .గవర్నకు ఈయనపై గొప్ప సదభిప్రాయం ఉండేది .
సంస్కృత ప్రథాన సహోపాధ్యాయులు ,బహుభాషా పరీక్షాధికారి,ఫెలో
1885లో శాస్త్రిగారిని సంస్కృతం లో రెండవ సహాయ ఉపాధ్యాయులుగా నియమించారు .ఆమరుసటిఏడు ప్రథాన సహోపాధ్యాయులయ్యారు .డాక్టర్ అపర్ట్ 1893లో రిటైర అవగానే ఆస్థానం లో శాస్త్రి గారిని నియమించారు .ఆ ఉద్యోగం లో 1901 వరకు పని చేశారు .1876లోనే సంస్కృత పరీక్షకులుగా నియమి౦ప బడి,1883వరకు ఉన్నారు .1885నుంచి 1889వరకు తమిళ పరీక్షాదికరులై ఆపదివిలో సేవలందించారు .1890లో సంస్కృత పరీక్షక సభకు అధ్యక్షులై పదేళ్ళున్నారు . 1888నుంచి 1893 వరకు బి.ఎ.పరీక్షలకు పైలాలజి పరీక్షకులుగా ఉన్నారు .దివాన్ బహదూర్ ఆర్. రఘునాథ రావు సహాయకులుగా మహారాష్ట్ర భాషకు చాలాకాలం పరీక్షకులుగా ఉన్నారు .1882లో విశ్వవిద్యాలయ ఫెలోగా ఎన్నుకో బడ్డారు .
విశ్వవిద్యాలయం లో వేద,తర్క ,వ్యాకరణ ,అలంకార శాస్త్రాల బోధనా అధ్యయనం
శాస్త్రిగారు ప్రాచ్యభాషా ప్రవచానాధ్యక్షులుగా ఉన్నకాలం లోనే ,వారి పూనిక ప్రోత్సాహంతో బీ ఎం ఎ క్లాసులకు వేద,తర్క ,వ్యాకరణ ,అలంకార శాస్త్రాలబోధన, అధ్యయనం జరిగింది .విద్యాశాఖవారికి ,ప్రభుత్వానికి తెలుగు భాషా విషయంలో విశేషంగా తోడ్పడ్డారు .సంస్కృత భాషా పరీక్ష క సభాధ్యక్షులుగా ఉంటూనే ,తమిళ ఆంద్ర కర్నాటక ,మళయాళమొదలైన భాషలకు ఉపసభల సభ్యులుగా ఉన్నారు.
. అమూల్య పైలాలజి గ్రంథ రచన ,మహాప్రస్థానం
శాస్త్రి గారి గ్రంథ రచనా సామర్ధ్యం గురించి –మానియర్ విలియమ్స్ ,ఫౌకాకౌన్ ,డా హోరన్లి,గ్రయర్సన్ ,డా బర్నేల్ ,కొలంబియాకు చెందిన డా జాక్సన్ మొదలైన దొరలూ ,ప్రాచ్యభాషా పండితులు గొప్పగా శ్లాఘించారు .శాస్త్రి గారు 1884లో ‘’నోట్స్ ఆన్ ఆర్యన్ అండ్ ద్రవిడియన్ పైలాలజి ‘’గ్రంథంమొదటిభాగం ప్రచురించారు .అందులో తన పరిశోధనా ఫలితాలను పొందు పరచారు .ఇలాంటి విషయంలో ఇంతటి పరిశోధన చేసిన వారు అప్పటికి శాస్త్రి గారు ఒక్కరే .కానీ దురదృష్టవశాత్తు శేషగిరి శాస్త్రిగారు 1901మార్చి 4న ఆదిత్య ప్రభా మండలం చేరారు .అప్పుడప్పుడు తాము గ్రహించి సేకరించిన విషయాలను ‘’తమిళ్ పైలాలజి ‘’గా ప్రచురించారు .తర్వాత ఆంధ్ర శబ్ద తత్త్వం –రెండుభాగాలు ,అర్ధానుస్వార తత్త్వం అనే వ్యాకరణ గ్రంథం రచించి ప్రచురించారు .
సంగీత నాట్య కోవిదులు
శ్రీ శేషగిరి శాస్త్రి గారు సంగీతం లో అపార పాండిత్యం ఉన్నవారు .కర్నాటక ,హిందూస్తానీ ,యూరోపియన్ సంగీతాలు మూడూ కరతలామలకాలే .అప్పటికే ఒక ఒక సంగీత సమాజం ఐరోపా పండితుల చేత స్థాపింపబడింది .అందులో ఈయన ఒక్కరే హిందూ సభ్యులు .పై మూడు సంగీతాల తారతమ్యం శాస్త్రిగారికి బాగా తెలుసు .ప్రభుత్వం తరఫున డైరెక్టర్ యూని వర్సిటిలో సంగీత బోధనకు అవకాశం కల్పించేట్లు చేయమనగా శాస్త్రిగారు ఒక ప్రపోజల్ రాసి పంపారు .కానీ శాస్త్రిగారి మరణం అప్పుడే జరిగిపోయింది .వీరి తర్వాత వచ్చిన డా బోరాన్ శ్రద్ధ వహించ లేదు .శాస్త్రి గారే ఉండిఉంటె విశ్వవిద్యాలయం లో సంగీత బోధన తప్పక ప్రారంభమై ఉండేది .
శాస్త్రి గారింట్లో నిత్యం విద్యా ,వినోదాలు జరిగేవి .అయన అన్న శ్రీ కృష్ణయ్య ,తమ్ముళ్ళు రామచంద్రయ్య ,వెంకటేశ్వర శాస్త్రి గార్లు గొప్ప సంగీత విద్వాంసులు ,శాస్త్రిగారి పాండిత్యంతో సమానులుకూడా .సంగీతస్వబోధిని వంటి అనేక సంగీత గ్రంథాలు రాసి ప్రచురించిన వారు .అందరూ విద్వత్ సభలలో సమ్మానితులే .శాస్త్రి గారు సంగీత పరీక్ష చేయగల సమర్ధులు .భరత నాట్యం కూడా శాస్త్రిగారికి అరచేతిలో ఆమలకమే .ఆఇంట లక్ష్మీ సరస్వతులు ఆనంద నాట్యమాడేవారు .ఆసక్తిగల బీద విద్యార్ధులను ఇంట్లోనే వసతి భోజనాలు కల్పించి నేర్పించేవారు .
వేదం వెంకట రాయశాస్త్రిగారు తాము రాసిన ‘’ఉషా నాటకం ‘’ను మాతామహులు శేషాద్రి శాస్త్రి గారికి అంకితమిచ్చారు .ఆసందర్భంగా ‘’ఈ ఉషా నాటకమును వీణా గాన కళానారదులు ,సాంగ వేదం లో అధీదితులు, సర్వ దర్శనాలలో అధీష్ణులు ,సంస్కృత ప్రాకృత ఆంధ్రద్రావిడ కర్నాటక మహారాష్ట్ర ఆంగ్లేయ గ్రీకు ,లాటిన్ మొదలైన అష్టాదశ భాషా లక్ష్య లక్షణా భిజ్ఞ సార్వ భౌములు ,ద్రావిడ భాషా పైలాలజి దర్శన ప్రథమ ప్రవర్తకులు ,మదరాసు ప్రెసిడెన్సి కాలేజి పైలాజి ప్రాక్తన భాషా మహోపాధ్యాయులు ,బోధిసత్వ సంపన్నులు,అస్మన్మిత్ర రత్నము ,తాతవెళ్ళి మిఠా దారు శ్రీ శేషగిరి శాస్త్రి ఎం .ఎ. గారి కీర్తి మూర్తికి సమర్పించినవాడను ‘’అని రాశారు .వీరిని గురించి తనకు తెలియజేసిన తన మాతుల మహాశయులు శ్రీ టి .ఎం. సుందరయ్యరు గారిని ఈ సందర్భంగా స్మరిస్తున్నాను ‘’అని వేదం వారు 25-4-1948 న మద్రాసు లో రాశారు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.