శ్రీ కోటీశ్వర శతకం
శ్రీ ఈశ్వర ప్రగడ నృసింహారావు కవి తెలంగాణాలో శ్రీ గిరికి ఈశాన్యం లో నల్లగొండ జిల్లాసూర్యాపేట తాలూకా బేతవోలు గ్రామం లో శ్రీ తడకమళ్ళ సీతారామ చంద్రరావు దేశముఖ్ దేశపా౦డ్య ముఖద్దార్ ధర్మ కర్త్రుత్వంలో వర్ష పర్వతాగ్ర స్థితుడైన శ్రీ కోటీశ్వర స్వామిపై శ్రీ కోటీశ్వర శతకం రచించి ఆస్వామికి అంకితం చేశారు .మత్తేభ, శార్దూల విరాజిత పద్య శతకం .’’కొటీశ్వరా ‘’శతక మకుటం.వెల ,సంవత్సరం తెలుపలేదు .
మత్తేభం లో విఘ్నేశుని ‘’గిరిజానందన యో గజానన మహా కీర్తి ప్రతాపోన్నతా ‘’అంటూ ,చంపకమాలలో సరస్వతి ని’’మంజుల వాణివాణి సుర మాన్య శిరోమణిదేవి భారతీ ‘’అనీ . స్తుతించారు .
శతకం లో మొదటి పద్యం మత్తేభం లో –శ్రీ మత్సర్వ జగత్స్వరూప విబుధ శ్రేణీ నుతప్రాభవా –కామక్రోధ మదాద్యరి ప్రకర శిక్షా దక్ష ,సద్రక్షకా –భూమానంద మరంద సంభరిత హృత్ఫుల్లాబ్జలోకేశ్వరా –శ్రీ మద్బెతనవోలు వాస హర గౌరీనాథ కొటీశ్వరా ‘’అని ప్రారంభించి రెండవపద్యం శార్దూలం లో ‘’నీ సేవల్ స్తుతుల్ నతుల్ గృతులు నిర్నిద్ర ప్రభావంబుచే –రాసన్ వర్ణన చేయబూనుటకు నామ్నాయంబులే క్రిందు మీదై’’తే నా వలన సాధ్యమా అని ఒక బీదఅరుపు అరిచారు ‘’దోషఘ్నమౌ నీ స్తవ ప్రసృతిన్ దా,బరుసంబునన్ గలసి స్వర్ణం బైన లోహం ‘’లాగా ‘’పస గాంచున్ గటయకృతీ౦ద్రము శుచిత్వం బంది’’అని గొప్పగా చెప్పారు .జగత్తులో పద్మం పుట్టి నీ హృదయ కాసారం లో ఆ నిగమాలు నిగమా౦తాలు విరిసి తేనెల్ వార తుమ్మెదలనే భక్త బృందం ఆ మధువును తాగి ,నీనామ స్మరణతో ధన్యులౌతున్నారు .
కవుల౦దరిలాగా తనదగ్గర రూకలు,విద్యా కౌశలం ,తీర్ధయాత్రా ఫలం లేవని ,నిన్నేస్మరిస్తా మోక్షం ఇవ్వమని కోరారు .ఇక్కడో ఎక్కడో నువ్వు ఉండేది తెలీదు కానీ నీ సన్నిధిలో ఆనందం మాత్రం పుష్కలంగా దొరుకుతుంది .పాలసముద్రం త్రచ్చి విషం ఇవ్వలేను,పులి చర్మ౦ ఇచ్చే ధైర్యం లేదు ,ఆభరణాలు ఇవ్వాలంటే పాములంటేనే నాకు భయం కనుక ఒక నమస్కారం చేస్తా క్షమించు అని మస్కా కొట్టారు .అయ్యా అని ఎన్నోసార్లు పిలిచినా ‘’కుయ్యాలి౦పవు –రావయ్యా మ్రొక్కెద గదయ్యా బ్రోవరావయ్యా ‘’అంటూ అయ్యాపదంతో ఆర్తిగా అర్ధించారు .
‘’వర గాంభీర్యమగడ్తయై ధృతియే వప్రవ్రాతమై సద్గుణో త్కరముల్ సైన్యములై –నిజెంద్రియములే ద్వారములై తావక స్మరణ జ్ఞానమే ద్రవ్యమై యలరు యస్మత్స్వాంత దుర్గంబునన్-గరుణం గాపుర ముండుము ‘’అని మంచి పద్యం శ౦కరుల శివానందలహరి శ్లోకం తీరులో రాశారు .తన విశుద్ధ హృదయ క్షేత్రంలో దురితారణ్యంబాగా పెరిగి ,భయంకరంగా ఉందని ,దాన్నిఫాలనేత్రాగ్నితో భస్మీటలం చేసి కాపాడమన్నారు .సృష్టికి ప్రతి సృష్టి చేసే ఎంతటిమొనగాడైనా నిను కొల్వకపోతే ‘’కడు దుర్గతి పాలౌతాడు ‘’ .
తనువు డస్సింది నాడులు సడిలాయి.బలం తగ్గింది ,దంతాలు దిగజారాయి,జరా ,మాంద్యం ఆక్రమింఛి క్రుంగ దీశాయి .ఇక నిన్ను సేవి౦చ లేను .ఒక్కనమస్కారం చేస్తా మోక్షం ఇవ్వు అన్నారు .’’నీ విశుద్ధ భజనలే మాకు అండా,దండా ‘’.నీకోటి సూర్య ప్రభా రూపంతో నా అవివేక అంధకారానికి వెలుగు ప్రసాదించు .ఒకసారి నుదిటిపై ఏదో రాస్తే దానికే కట్టుపడాలా .అదిమార్చి నాకు సద్గతికల్గించు సర్వేశా అన్నారు చమత్కారంగా .నిన్ను అర్చించక స్మరించక నుతించక ఉన్నవాడు పుట్ట గానే చావటం మంచిది .
‘’భూమీచక్రము స్యన్దనంబుగ,నభంబు న్నీకపర్ధంబు-స్వామీ దిక్కులు కట్టు పుట్టములుగా వర్ధిల్లు నీ ఉన్నతా-వేమూలం గలదంచు నెంతునిక ‘’నాకు ఈభావం చెప్పి ప్రేమతో దయచూడుకోటీశ్వరా ‘’ అన్నారు .ఆద్యం లేని సర్వాత్మ స్వరూపం చిద్యాగం చేసేవారికి స్వస్తి ,మోక్షమిచ్చే సామర్ధ్యం నీదే .
చివరి నూరవ మత్తేభ పద్యం –‘’బలు పెక్కన్,సమరప్రధాన విజయ ప్రస్ఫూర్తి లేదింక,నా – సాలు దృగ్జాలము చిక్క జేసే నను దీక్ష్ణ౦బౌ తపో వృత్తి గే-వల మాసింపక ,తల్లిదండ్రి గురు నాప్త శ్రేణినీవంచు మా-యలచే ద్రెళ్ళగ ముక్తి మార్గమిడి డాయం జేర్పు కోటీశ్వరా ‘’అని శతకం ముగించారు .
కవి తనగురించి తన కుటుంబం గురించి ఏమీ చెప్పలేదు .మత్తేభ,శార్దూలాల పై సులభంగా భక్తి స్వారీ చేశారుకవి .కవిత్వం లో కుంటులేదు .గెంతులు లేవు . హృది నిండా కోటీశ్వర ధ్యానమగ్నత తో ఇంపుగా కూర్చిన శతకం .శతకం లో భావాలు సాధారణంగా అందరు భక్తకవులు రాసేవే .నాకే ఈశతకాన్ని ఇదివరకు ఒకసారి పరిచయం చేశానేమో అనే భ్రమ కలిగింది .కోటీశ్వర శతకాన్ని ,శతకకర్త ఈశ్వర ప్రగడ నృసింహా రావు గారిని పరిచయం చేసి పరమేశ్వర దర్శన భాగ్యం పొందాను .కవి గారి ఇంటి పేరు లోనే ఈశ్వర శబ్దం ఉంది అందులో ప్రగ్గడ శబ్దం వారి కవితా ప్రతిభకూ నిదర్శనమే .కవి నృసింహుడు అంటే కవితలో నృసింహుడు .కానీ ఇందులో ఉగ్ర నరసింహుడు కాడు,ప్రహ్లాదవరదుడైన వాత్సల్య నారసింహుడు అనిపించారు.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-22-ఉయ్యూరు