ఏక ప్రాస శ్రీ కృష్ణ శతకం
వెల-కేవలం’’ భక్తి ‘’ గా ఏక ప్రాస శ్రీ కృష్ణ శతకాన్ని,అంతకు ముందే శ్రీరామ శతకం రాసిన అనుభవంతో తూగోజి లోని ‘’కాజాలకు,పూతరేకులకు ‘’ ప్రసిద్ధి చెందిన ‘’తాపేశ్వర౦’’ నివాసి శ్రీ ఏనుగు తమ్మిరాజు కవి రచించి ,రాజమండ్రి శ్రీ రామముద్రాక్షర శాలలో 1924న ప్రచురించారు .ఇది కంద పద్య శతకం ‘’.కృష్ణా’’అనేది శతక మకుటం .’’ ర ‘’కార ప్రాస తో రాసిన శతకం .
‘’శ్రీరామనామ తారక –మేరీతి నుతించె మున్ను నిష్టాప్తికి ,నా –గౌరీ మనోజ్ఞా భాస్కరు –నారాధించెద ద్రిశుద్ధి ననిశము గృష్ణా ‘’అని శతక ప్రారంభం చేశారుకవి .గౌరీశుని కొలిచి తర్వాత భారత వంశాన్ని ప్రస్తుతిస్తానని చెప్పారుకవి .భారతావనిలో పుడితే పాపాలుపోయి విష్ణు సేవా పరతంత్రులౌతారు,నానా ధర్మోద్ధరణతో వన్నె ,వాసికెక్కుతారు ,’’సత్యం వద ధర్మం చర’’నుబోదిస్తూ ఆచరిస్తారని ,భారతపుత్రులు సద్గుణ రాసులు ,సకల కార్య సాహసులు ,యశోదీరులు ,శూరులు ,విమలాకారులు ,కరుణాస్వరూప కలితులు అని హామీ యిచ్చారు .తర్వాత ‘’భారతము చదువ కుండగ- నేరిచిన కవిత్వ మెల్ల నీరస మగుటన్ –భారతము జదివి పిమ్మట –ధీరులు చెప్పెదరు కవిత ధీ ధృతి కృష్ణా’’అని భారత ప్రాశస్త్యాన్నిప్రస్తుతించారు .భారతం లోక పూజ్యమని కీర్తించి ,భారత కవిత్రయానికి ప్రమాణాలు సమర్పించారు . జీవకోటికి రాజేతల్లీ తండ్రీ ,రాజుమాట అందరికి ఆచరణీయం .నరపతి ధర్మం తప్పితే ,నరులు అక్రమ భూషణులైతే ,కరువుకాటకాలు తప్పక వస్తాయి .
శరణు అన్నవాడిని రక్షించకపోతే ఆపాపానికి రాజు మరణం పాలౌతాడు .భూరమణుడు క్రూర అమాత్యుల మాటలకు అధిక ప్రాధాన్యమిస్తే ‘’కొంప కొల్లేరు ‘’అవుతుందని రాజులకు హెచ్చరిక చేశారు .రాజు పాలించే రాజ్యం పాప భూయిష్టం అయితే అందులోని ‘’శూరులు జీవచ్చవాలు ,క్రూరులు మృతజీవులు అవుతారని చెప్పారుకవి .’’రాజ్యాంతే నరకం ధృవం ‘’అని పరమపావనులు వాక్రుచ్చారన్నారు .’’నరజన్మ మెత్తినందుకు –కరుణారస మొండుహృదయకమలము నందున్ –గురితించి ,జీవకోటిని బరికి౦చుట భావ్యమండ్రు ప్రాజ్ఞులుకృష్ణా ‘’.మరణ భయంతో నరులు దారీతెన్నూ కానక పరితపిస్తున్నారు –‘’మరణించటం జన్మించటం పరమాద్భుత ప్రకృతి చర్య ‘’అని చక్కగా చెప్పారు .’’మరణార్తి దీర్చి బ్రోవగ సరగున ప్రత్యక్ష మవటం నిజం నిజం .
శ్రీరామ తారకమంత్ర ప్రాశస్త్యం వర్ణిస్తూ –‘’శ్రీరామనామ తారక –సారామృతపానమత్త స్వా౦తుడు ‘’ జననమరణ క్రూర రుజా ఘోరభీతి చెందడు అని అభయమిచ్చారు కవి .వీరులలో వీరుడివిగా,రాజులలో రారాజువుగా ,శూరులలో శూరుడివి గా ‘’పౌరుష కీర్తులు గడించి ప్రబలినావుకృష్ణా ‘’ అన్నారు .సద్గుణాలు ఎన్ని ఉన్నా ,లోభం ఉంటె ‘’చిరజీవి రీతి బ్రతికెడు –చరజీవి ‘’అంటారు .నీకొడుకు మారుడు ,పాంధలోక మారకుడు ,దుర్వారుడు ఇలాంటి విచిత్రం ఎక్కడైనా ఉందా ?అని చిత్రంగా కడిగిపారేశారు .’’నీకుమారుడు మారుడు క్రూరుడు ,శుకపిక వారమైన సేనతో దుర్వార౦గా ఉంటాడు ‘’వాసంతిక భారము తాళజాలునే –నారీమణి రాధ జీవనమ్ములకృష్ణా ‘’అని ప్రశ్నించారు .
క్రూరత్వంతో దుష్ట చతుష్టయం అభిమన్యకుమారుని చంపినా ,’’మారణము జేయ నెరిగియు –గారణ మెరిగింపని ఘనుదవునువ్వు ‘’అని నర్మోక్తితో పలికారు .తర్వాత కృష్ణావతార గాధను కమ్మని పద్యాలలో పలికించారు .దేవకీ కొడుకు యశోదానంద వర్ధనుడవటం ‘’ఏరికి గల్గని భాగ్య౦ –బీరీతి లభించే గొల్ల కేమందు భళీ !వారెట్టి పుణ్యమూర్తులో ,వారెట్టి తపః ప్రభావ భవ్యులో ‘’ , అని యశోదానందుల అదృష్టాన్ని కొనియాడారు .వీరికి పుట్టిన బిడ్డగానే భావించి వ్రేపల్లె పల్లెపడుచులు ప్రొద్దున్నే వచ్చి మంగళహారతి పట్టారు శిశు బలరామ ,కృష్ణమూర్తిలకు .
‘’హారతి గైకొనవేమొకో- మారా సుకుమార మారమా హృచ్చోరా –మారాకారా యని వె-మారాసుకుమారులు గూర్చి మగువలు కృష్ణా’’ అని సుకుమార పద్యరాజాన్ని అత్యంత సుందరంగా భావ గర్భితంగా రాశారుకవి తానూ మురిసిపోయి ,మనలనూ మురిపించారు .’’ఆరేళ్ళ ప్రాయంలోనే మేనమామ కంస రాజును మారణం చేశావు ‘’మాయురే కృష్ణా అని ఆశ్చర్యపోయారు .గోపవనితల విరహాలు తీర్చాడు .కేళి కారతిలో కరగించి ,వలపు తెనేలలోవంశీ నాదంలో ఆన౦ద సాగరంలో ముంచి తేల్చావని పొగిడారు .భయం వద్దు ‘’మై హూనా ‘’అంటూ ‘’మీరెలా చింత పొందెద-రీరేల నిరతంబు నిట విహరి౦పన్ –మీరతి సౌఖ్యము బొందగ-గోరికలీడేరు ననెదుకొ౦టెవు కృష్ణా ‘’అని ద్వంద్వార్ధ ప్రయోగంతో అతిసౌఖ్యం, రతి సౌఖ్యం కలిగించి తృప్తి చెందిస్తానని కొంటె కృష్ణయ్య అన్నాడని బలే రంజుగా చెప్పరుకవి .’’ఏరీ భూతములైదును ,-నుదారతసృష్టించు నట్టి దైవము మాకీ –తీరున బొడసూపుట మా –భూరి ప్రాభవము గాదె పుణ్యా కృష్ణా ‘’అని తమ అదృష్టానికి గొల్లెతలు పొంగిపోయారట.
‘’శారద చంద్ర జ్యోత్స్నల -సారెకు సారెకు బిల్చి సారసముఖులన్ –గూరిమి రాసక్రీడలు ‘’కోరతావట ఇది న్యాయంగా ఉందా కృష్ణా ‘’అని నిలేశారు కవి .ఒక్కపెళ్ళాం తోనే వేగలేక మేము బెంబేలెత్తి పోతుంటే ‘’ఎలా పెళ్ళాడావయ్యా పదియారువేల దండ్రీ కృష్ణా ‘’అని బోల్డు ఆశ్చర్యపోయారు .నరనారాయణులు పరమ తపోధనులు ధర్మమార్గాన్వితులు భారతావనిలో జన్మించటం మన అదృష్టం అని పొంగిపోయారుకవి .కురుపాండవ యుద్ధం లోధర్మ మూర్తులైన పాండవులపక్షం లో ఉంటూ ‘’పార్ధునికి సారధి వైతివి భళీ !నీ సారధ్యము చిత్రమే కాదు లోకపావనం గీతా మకరంద సారజన్యం ‘’అంటారు .ఆయుక్షీణం,స్థిర చిత్త వినాశకం ,ధీ మాంద్యం ,మరణ ఆసన్నం ‘’పరకాంతా విహరణం ‘’అని గొప్ప సూక్తి పలికారు .
ఏమీ తెలియకపోయినా ,విద్యలేవీ నేర్వకపోయినా అంతులేని నీ కృపారసం నాపై ప్రవహించగా –‘’శ్రీరమ కృష్ణ శతకము –లీరీతి రచించి నాడ నేక ప్రాసన్ మీరరసి వీని దోషము -లారూఢి,క్షమి౦పవలయు ననిశము కృష్ణా ‘’అని అపరాధ శతం గా 123 వ పద్యం చెప్పారు కవి .
124చివరి కందం లో ‘’ఏనుగు బుచ్చిరాజు కుమారుడు-‘’కవితా స్వారస్యామృత పాన వి-చార సదాచారనయుడు సాకుము కృష్ణా ‘’అని తండ్రిపేరు చెప్పి సాకుము అని విన్నపాలు విన్నవించారు కవి .అత్యద్భుతకవితాదార ప్రతి కందంలో అందంగా కనిపిస్తుంది .కంద పిలకలు లాగా పద్యాలకుదురు మహదానందాన్ని కలిగిస్తుంది .ఒకరకంగా కందంలో కవితామరందాన్ని నింపి, ఆనంద అమృతాన్ని మనకు పంచిపెట్టారురుకవి .తాపేశ్వరం కాజాల ,పూతరేకుల తీపితనం ప్రతిపద్యంలో నింపారు .పూతరేకులు తయారు చేయటం గొప్ప విద్య .అందులో నాణ్యత ప్రధానం. ఆ నాణ్యతా ఆ తీయందనం ప్రతిపద్యంలో గోచరించింది .కాజా సౌందర్యం ,ఊరే రసం పద్యాలలో తొణికిసలాడాయి .
ఊరిపేరుకు ఈరకంగా శతకంతో గౌరవం చేకూర్చారు తాపేశ్వర కవీశ్వరులు తమ్మిరాజుకవిరాజు .ఆయన ధన్యులై ,మనల్నీ ధన్యులని చేసి తరి౦ప జేశారు .మహా భక్తకవి శ్రేణిలో నిలిచారు ఈ కవి వరెణ్యులు .కవిగారినీ శతకాన్ని పరిచయం చేసి, నేను ధన్యత చెందాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-12-22-ఉయ్యూరు