అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు-1
మనకు వ్యాపార దిగ్గజాలుగా టాటాలు,బిర్లాలు మోడీలు ,రాక్ ఫెల్లర్ లు మొదలైన వారు మాత్రే తెలుసు .కాని వీరికి ముందు చాలాకాలం క్రిందట వాణిజ్యం లో గణన కెక్కి ,పెద్దగా ప్రపంచానికి తెలియని వారి గురించి ఇప్పుడు తెలుసుకొందాం .వీరిజీవితలు, సాధించిన విజయాలు యువతకు మార్గదర్శకాలు .
1-సైమన్ పాటినో
స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అని మాత్రమె మనకు తెలుసు .కాని తన భార్య మాట విని ,తన ఆర్దికాభివృద్ధికి చక్కని రాచబాట వేసుకొన్నవాడు సైమన్ పాటినో.దక్షిణ అమెరికా బొలీవియా దేశం లో ,సముద్రమట్టానికి 12వేల అడుగుల ఎత్తు లో ఉన్న యాండీస్ పర్వత శ్రేణిలో ఓరూర్ అనే పట్టణం లో ఒకజర్మనీ దేశస్తుడు ఒక చిన్న స్టోర్స్ పెట్టి ,అనేకరకాల సరుకులు అమ్ముతున్నాడు .చుట్టుప్రక్కల చాలా చోట్ల నుంచి ప్రజలు వచ్చి ఈ దుకాణం లోనే సరుకులు కొనేవారు .ఈఖాతాదారుల్లో ఎక్కువ మంది తగరపు గనులు,కాఫీ తోటలు ఉన్న యజమానులు .ఆదుకాణ౦ లో మన డాన్ సైమన్ పాటినో కేవలం గుమాస్తా మాత్రమె .అతడిపని కొట్టులో సరుకులుకొన్న వారినుంచి పాతబాకీలు వసూలు చేసి యజమానికి అప్పగించటమే .ఈ వలస దేశం లో బాకీలు వసూలు చేయటం చాలా కష్టమైన పనే.బాకీల వసూళ్ళకు రోజూ ఎక్కడికో అక్కడికి ప్రయాణం చేయాల్సి వచ్చేది .
ఓరూర్ గ్రామానికి చాలా మైళ్ళ దూరం లో తగరపు (టిన్ )గనులున్న యున్వియా అనే కుగ్రామం ఉంది .ఆగ్రామస్తుడు హిలేరియన్ ఆర్కి జర్మన్ స్టోర్స్ కు చాలాకాలం గా 17పౌన్లు బాకీ ఉన్నాడు .బాకీ తీర్చలేని పరిస్థితి ఏర్పడింది .ఈబాకీ వసూలుకు సైమన్ వచ్చాడు .ఇతడిని పంపుతూ జర్మన్ స్టోర్ కీపర్ ‘’బాకీవసూలు చేయకుండా తిరిగి వచ్చావో నీ ఉద్యోగం హుళక్కి ‘’అని గట్టిగా చెప్పి పంపాడు .బాకీదారు హిలేరియన్ దగ్గర ఒక్క పైసాకూడా లేదు ఆర్ధికంగా అప్పటికే కుంగిపోయి ఉన్నాడు .సైమన్ కు తన దయనీయ గాధ, అంతా వివరించి చెప్పాడు .సైమన్ కూడా తానూ బాకీ వసూలు చేసి తీసుకు వెళ్ళకపోతే తన ఉద్యోగం ఊడినట్లే అని బాకీ దారుకు చెప్పగా ,అతడూ ఎలాగో అలా ఈ గుమాస్తాను గట్టేక్కించి పంపాలని ఉన్నా, చేతిలో చిల్లిగావ్వకూడా లేదాయే .కిం కర్తవ్యమ్ ?చివరికి తన తగరపు గనిని జర్మన్ స్టోర్ యజమానికి హక్కుభుక్తాలతో దస్తావేజు రాయించి ,ఇంతకంటే తనదగ్గర ఏమీ లేదని బ్రతిమాలి ,దస్తావేజు ను సైమన్ చేతిలో పెట్టాడు .ఉత్త చేతులతో వెళ్ళటం కంటే ,ఇది కొంతనయం అనిపించి యజమాని సంతోషిస్తాడని తీసుకుని ఓరూర్ చేరి యజమాని చేతిలో పెట్టి అన్నీ వివరంగా చెప్పాడు .డబ్బు సంచులు వస్తాయని ఆశపడిన యజమాని,మెచ్చకుండా విపరీతంగా కోపం తెచ్చుకొని ‘’ఈ తగరపు కాగితం నాకెందుకు అక్కడ ఏముంది దిబ్బ తప్ప .కనుక నిన్ను శిక్షిస్తూ ఆ తగరపు దిబ్బ దాస్తా వేజు నీమొహం మీదే కొడతా దాన్ని నువ్వే అనుభవించు .ఇక నీ సేవలు చాలు దయచేయి ‘’అని మండిపడ్డాడు .చేసేది లేక తనపేర యజమాని రాయించిన దస్తావేజు తీసుకొని ,మళ్ళీ ఆ తగరపు గ్రామానికి బయల్దేరాడు సైమన్.అదృష్టం అంటే ఇలా తన్నుకొంటూ వస్తుంది .గుమాస్తా సైమన్ ఇప్పుడు తగరం గని యజమాని అయ్యాడు .
సైమన్ పాటినో భార్య భర్తకు ధైర్యం చెప్పి ఆ కొండ కొంపలోనే కాపురం పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకొందామని చెప్పింది .కావాల్సిన త్రవ్వే పరికరాలు కొన్నాడు ఉన్నగోతులతో పాటు మరికొన్ని గోతులు తవ్వాడు .ఎంత తవ్వినా తగరపు పొర కనిపించక పోయే సరికి కు౦గి పోయాడు .అయినా పట్టు వదలక టిన్ రేకు తగిలే వరకు తవ్వగా తళతళమెరిసే గడ్డలు కనిపించి హమ్మయ్య అనుకొన్నాడు .వాటిని పరీక్ష చేయించటానికి లాపెజ్ నగరానికి తీసుకు వెళ్ళాడు .అక్కడి అమెరికన్ ఇంజనీర్ పరీక్షించి ‘’ఇవి తగరపు గడ్డలు తగరం పాలు బాగా ఎక్కువగా 60శాతం ఉంది .రప్రపంచంలో ఎక్కడా ఇంత అత్యధిక శాతం లో తగరం ఉన్న గనులు లేవు నువ్వు అదృష్టవంతుడివి ‘’అని బుజం తట్టాడు .
గనులుత్రవ్వి తగరం తీయాలంటే పెట్టుబడి కావాలి .భార్య పినతండ్రి 60 పౌన్లు అప్పు ఇచ్చి ప్రోత్సహించాడు .రెండేళ్ళు ఆగని దగ్గరే అజ్ఞాత వాసం చేస్తూ పాటినో దంపతులు ఉండిపోయారు . కూలీలలను పెట్టి వాళ్ళతోపాటు వీరిద్దరూ కూడా పని చేస్తూ పగలనక రాత్రనక విపరీతంగా కష్టపడ్డారు .గనిలో నుంచి ఒక వాగన్ తగరం తీయించి ,దాన్ని అమ్మి ,ఆ డబ్బుతో ,గనికి ప్రక్కల ఉన్న భూముల్ని కొనటం మొదలు పెట్టారు . రెండేళ్ళు ఆయెసరికి పనివాళ్ళు కొన్ని వందలమంది అయ్యారు .వారం వారం తగరం లోడు లాపెజ్ నగరానికి పంపిస్తూ ,అమ్మగా వచ్చిన డబ్బు జాగ్రత్త చేస్తున్నాడు .భార్య సాయంతో.కొత్తభూములు కొంటూనే ఉన్నాడు .పెద్ద భూస్వామికూడా అయ్యాడు .
ఒకరోజు పాటినో దగ్గరకు న్యూయార్క్ నగర ‘’గుగెన్ హీం బ్యాంక్ ‘’ప్రతినిధి వచ్చి ,అమెరికాలోని లోహవర్తకులు ఆ గనులనన్నిటిని కొనటానికి సిద్ధంగా ఉన్నారు అనే శుభ వార్త చెప్పాడు .ఎంత ఇస్తారు అని సైమన్ అడిగితె, ఒక లక్ష పౌన్లు ఇస్తారని చెప్పగా ,నమ్మలేకపోయాడు .మూడేళ్ళలో లక్ష పౌన్ల సంపాదన .ఆనందం ఉద్వేగం లతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు .తయారు చేసిన కాగితాలపై సంతకాలు పెట్టటానికి సైమన్ చేతిలో కలం పట్టుకోగా తెలివైనది కనుక భార్య ‘’వాళ్ళంతట వాళ్ళే లక్ష ఇస్తామన్నారంటే దీనివిలువ కనీసం పది లక్షల పౌండ్లు ఉంటుంది .కనుక సంతకం పెట్టవద్దు కొద్దికాలం లో నువ్వు అమెరికాలో అందరికంటే అత్యధిక ధనవంతుడవు అవుతావు ‘’అని చెప్పింది .మూడేళ్ళ తర్వాత అమెరికన్ బ్యాంక్ మళ్ళీ కబురు చేసింది .భార్యకు చెప్పి విమానం మీద న్యూయార్క్ వెళ్లగా ఆగనులకంపెనీలో సగంపైగా వాటాలు అతనికే చెందేట్లు చేసి ,గనులు ఇచ్చినందుకు 10లక్షల పౌండ్లను సైమన్ కు ముట్ట జెప్పారు .
అప్పటినుంచి సైమన్ గనుల్లో పని చేయలేదు .వ్యాపార నిర్వహణలో దేశ దేశాలు తిరిగాడు .ప్రపంచ తగర పరిశ్రమకుఅధ్యక్షు డయ్యాడు .అదులో సభ్యులు అందరూ ధనవంతులే .అందులో సైమన్ గొప్ప ధనవంతుడు అపర కుబేరుడు .60ఏళ్ళ వయసులోకూడా మాంచి చలాకీగా ఉండేవాడు .ప్రపంచ ధనవంతులలో ఒకడై, ప్రపంచ సుఖ వంతులలో కూడా సైమన్ పాటినోఒకడయ్యాడు .
ఒక్కసారి 17పౌండ్లు నష్టపోయిన ఆ అదృష్టవంతుడు సైమన్ ,,తర్వాత ప్రతి అయిదు నిముషాలకు 17పౌన్లు లాభం గడిస్తున్నాడు .మొదటి ప్రపంచయుద్ధకాలం లో తగరం తగరపు రేకుల అవసరం యుద్ధ పరికరాల తయారు చేయటానికి చాలా అవసరమైంది .దీనితో సైమన్ పాటినో ధన సంపద ఎన్నో రెట్లు పెరిగింది .అమెరికాలో ఫోర్డ్ ‘’మోటారు కింగ్ ‘’అయినట్లే, పాటినో ‘’టిన్ కింగ్ ‘’అయ్యాడు ..స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో బొలీవియా మంత్రిగా కూడా సైమన్ పని చేశాడు .
టిన్ పరమాణు సంఖ్య50.సింబల్ –Sn.వెండి రంగులోహం మెత్తగా ఉంటుంది .పోస్ట్ ట్రాన్సిషన్ లోహం అంటారు .10స్థిర ఐసోటోప్స్ ఉంటాయి .దీనికి మాజిక్ సంఖ్యలో ప్రోటాన్లు ఉంటాయి .ఆహార పాకింగ్ కోసం టిన్ డబ్బాలు తయారు చేస్తారు .
సైమన్ 1-6-1860లో పుట్టి ,20-4-1947న 88 ఏళ్ల వయసులో చనిపోయాడు
ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-12-22-ఉయ్యూరు