సినీ శత (సతత ?)రేపిస్ట్ చలపాయ్ అరుదైన గుణాలతో అయ్యాడు అందరికీ బాబాయ్
తెలుగు చిత్ర సీమలో ఏ ఒకరిద్దరు హీరోయిన్లు తప్ప అందర్నీ రేప్ చేసే సంఘటనలతో శత రేపిస్ట్ గా కొండొకచో సతత రేపిస్ట్ గా తన దైన ముద్ర వేసుకొన్న చలపాయ్ అనే తమ్మారెడ్డి చలపతి రావు ఈ ఆదివారం అకస్మాత్తుగా మరణించాడు .సినిమా వాళ్లకు స్వర్గం ఉంటె అక్కడ రంభ ,తిలోత్తమాదులు ,తమపని పట్టుతాడన్న భయం తో భయపడి పారిపోతారేమో?ఒకసారి ఒక పల్లె టూరిలో ఒక సినిమాలో రౌడీ వేషం వేసి ఒక రోజు రోడ్డుమీద కత్తి నూరుతుంటే ,షూటింగ్ జరిగిన 15 రోజులు ఆవూరిలోని ఏ స్త్రీ కూడా బయటికి రాలేదట అలాగే షూటింగ్ కోసం నిర్మాత ఏర్పాటు చేసిన రూమ్ లో ఉంటె ,ఆదగ్గర రూమ్స్ లో ఏ హీరోయిన్ కానీ లేడీ ఆర్టిస్ట్ కానీ ఉండటానికి భయపడేవారట .సినిమాల్లోలాగా ఎక్కడపడితే అక్కడ రేప్ చేస్తాడేమో నన్న భయం అన్నమాట .ఒడ్డూ ,పొడుగు కోటేరు తీసిన ముక్కు మంచి రంగు తో నీలికనుల అందగాడు గా,హీరో అనిపించేట్లు చలామణి అయ్యాడు .పంచ చొక్కా ఉత్తరీయం వేస్తె అసలైన ఆంధ్రత్వం ఉట్టిపడుతుంది .లాయర్ పోలీస్ ఇన్స్పెక్టర్ , వేషాలు వేస్తె ఆ డ్రెస్ కే అందాన్ని తెస్తాడు . గళ్ళలుంగి తెల్ల లేక చారల చొక్కా వేస్తె రౌడీ రంగడే అనిపిస్తాడు .హావభావాలు కొద్దిగా తక్కువేమోకాని ఉచ్చారణ నిర్దుస్టం .మొదట్లో కష్టపడి వేషాలు ఒకటి అరా దక్కించుకొన్నా ,ఆతర్వాత’’ అన్న ఎన్టీ ఆర్’’చలువతో పుష్కలంగా వేషాలు లభించాయి .తన పరిధికి మేర ఆ వేషాలన్నిటికీ న్యాయం చేశాడు .దానవీర శూరకర్ణ లో రామారావు మూడు పాత్రలు ధరిస్తే అందులో చలపాయ్ చేత అయిదు పాత్రలు వేయించాడు అన్న .’’అన్న గారూ !మరీ అయిదు వేషాలంటే జనం నవ్విపోతారేమో ?మీకయితే ఫర్లేదు కాని ,నాకు ఎబ్బెట్టుగా ఉంది ‘’అంటే ‘’బ్రదర్ !కంగారు పడకు .కొన్ని కొన్ని ఊళ్లలో నన్నే గుర్తు పట్టలేరు ప్రేక్షక జనం .నిన్నెవరు గుర్తిస్తారు చేసేయ్’’అని ప్రోత్సహించాడు అన్న .
కృష్ణా జిల్లా పామర్రుదగ్గర బల్లిపర్రు కు చెందిన చలపతి రావు కు రెండు ఎకరాల పొలం స్వంత ఇల్లు ఉన్నాయి ..విశాలమైన అన్ని హంగులు ఉన్న ఆయన ఇంట్లో 50 సిసి కేమేరాలున్నాయని ఈమధ్య ఎవరో చెప్పారు .తరచూ బల్లిపర్రు వచ్చి పొలాలు చూసుకొంటూ ఊరివారిని ఆప్యాయంగా పలకరిస్తూ అవసరమైతే సాయం చేస్తాడట . అందుకే బాబాయ్ మరణం వాళ్లకు తీవ్ర దుఖం కలిగించి,ప్రతి ఇల్లూ రోదిన్చించింది .ప్రతి ఏడాదీ మే నెలలో బల్లిపర్రుకు కుటుంబం తో వచ్చి కొన్ని రోజులు గడిపేవాడు. అక్కడి రక్షిత మంచి నీటి సరఫరా కు సాయం చేశాడు .స్థానిక గంగానమ్మ ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు అందించాడు .గ్రామం లోని మర్రి చెట్టుకింద ఊరి పెద్దలతో కాలక్షేపం చేయటం మహా ఇష్టం .గ్రామస్తులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించేవాడు .తన ఇంటి ఆడపడుచు సర్పంచ్ అయిందని గర్వంగా చెప్పుకోనేవాడు .పెరుగన్నం లో ఆవకాయ కలిపి పెడితే మహా ఇష్టంగా తినేవాడని ఆ సర్పంచ్ శ్రీమతి బొప్పన స్వర్నలతః అన్నది .గ్రామాభి వృద్ధి గురించి అడిగి తెలుసుకొని ,ఏ రకమైన సాయం కావాలన్నా వెంటనే అందించే వాడని చెప్పింది .తన చిన్ననాటి ఎలిమెంటరి స్కూలు మిత్రుడు శ్రీ వేదాంతం శేష భట్టా చార్యులు ‘’చలపాయ్ ఎప్పుడు వచ్చినా ,మా ఇంటికి వచ్చి నన్ను పలకరించే దేవాలయం దర్శించి వెళ్ళేవాడు ‘’అని మహా దుఖంతో చెప్పారు
నేను మొదటి సారిగా చలపతి రావు ని మద్రాస్ లో 1996-97లో ధౌజండ్ లైట్స్ వద్ద ఉన్న అమెరికన్ ఎంబసీ దగ్గర చూసి పలకరించాను .బాగా మాట్లాడాడు .ఏపని మీద వచ్చారని అడిగితె వాళ్ళ అమ్మాయి వీసా కోసం అన్నాడు .నన్ను కూడా ఆడిగితే మా అమ్మాయి మొదటిసారి అమెరికా వెళ్ళ టానికి వీసా కోసం వచ్చాం అన్నాను .అంతే.ఆ రోజుల్లో వీసా అంటే ఎంబసీ దగ్గర విపరీతమైన పడిగాపులు ,రోడ్లపై పేపర్లు పరిచి అర్ధరాత్రినుంచి సీట్ రిజర్వేషన్లు ,విపరీతమైన రద్దీ .మా అమ్మాయికి వీసా వచ్చింది వాళ్ళమ్మాయి కీ వచ్చే ఉంటుంది .
విలన్ కేరక్టర్ కు తనదైన శైలి లో ప్రాణం పోశాడు చలపాయ్ .దాదాపు 1300సినిమాలలో నటించటం అంటే మాటలుకాదు .అతని దగ్గర సరుకు ఉండబట్టే చేయించారు .ప్రాధమిక విద్య బల్లిపర్రులో ,తర్వాత అమ్మమ్మ ఊరు భట్లపెనుమర్రు లో చదివి ,ఆతర్వాత బెజవాడ ఐటిఐ లో చదివాడు .ఆర్టిసి లో ఉద్యోగం చేస్తుండగా ,కాలేజి క్లాస్ మేట్ ,జమీ గొల్వేపల్లి అమ్మాయి ఇందుమతిని ప్రేమించి ఇద్దరూ పెద్దల అనుమతితో పెళ్లి చేసుకొన్నారు .వీరికి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు రవిబాబు సంతానం .రవికి ఏడేళ్ళ వయసులోనే చలపతిరావు భార్య స్టవ్ ప్రమాదం లో ఆయన చూస్తుండగానే కాలి చనిపోయింది .అది అతనిపై తీవ్ర ప్రభావం చూపింది. తట్టుకోలేక పోయాడు. భార్య చనిపోతూ ,పిల్లలకోసం మళ్ళీ పెళ్లి చేసుకోమని అడిగి చేతిలో చెయ్యి వేయిన్చుకొన్నా ఆమె ప్రశాన్తమరణం కోసం అలాగే అన్నాడు కానీ మళ్ళీ పెళ్లి ఆడలేదు . ఆటర్వాతపిల్లలు పెద్ద వాళ్ళు అయి పెళ్లి చేస్తామన్నా ఒప్పుకోలేదు .పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడాడు .మంచి చదువులు చదివించి గొప్ప భవిష్యత్తు కల్పించాడు .వాళ్ళపై తన పెత్తనం ఏనాడూ చూపలేదు .రవి పెళ్లి చేసి ,పెళ్లి పీటలమీద నుంచే ఆకోత్తదంపతులను కొత్త ఇంట్లో కాపురం పెట్టించి వారి సౌఖ్యానికి తాను అడ్డు ఉండకూడదని భావించాడు ‘’ఇదేమిటి నాన్నా ?అంటే అది అంతే .నీకు తెలీదు మనం రోజూ కలుసుకొందాం లేక వారానికిఒకసారి కలుద్దాం అప్పుడే నా పెద్దరికం నిలుస్తుంది అని నచ్చ చెప్పినవాడు .
అన్ని- అంటే లెక్కప్రకారం 94 సినీ రేపులు చేసిన రౌడీ,ఆ ‘’రుచి ‘’మరిగి విశ్రు౦ ఖలం గా వీర విహారం చేస్తాడు .కానీ చలపాయ్ అలా కాలేదు .మనసు ను నిగ్రహించుకొన్నాడు .మకారద్వయం –మగువ, మద్యం ,సిగరెట్ లకు అసలు అలవాటు పడలేదు .జీవితాంతం వాటి జోలికే పోలేదు వ్యామోహ సినీ రంగం లో ఇలా నిగ్రహం గా బతకటం దుర్లభం .అయినా జితేంద్రియుడు అనిపించాడు .అలా ఋష్య శృంగుడు గా ఆ సినీ రంగం లో ఉండటం ఎవరికీ సాధ్యం ?అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చలపాయ్ .అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ,కొంచెం పల్లెటూరి ముతక జోకులు పేలుస్తూ ,వాతావరణాన్ని చల్లబరుస్తూ ఆడా, మగా అందరికి సన్నిహితుడై ,తన సద్గుణాలచేత అందరికి బాబాయ్ అయ్యాడు చలపాయ్ .చపల చిత్తం ప్రదర్శించని స్థిర చిత్తుడు చలపాయ్ బాబాయ్ .
గూఢ చారి 116లో కృష్ణతో సినీ అరంగేట్రం చేశాడు .తర్వాత రామారావు కుటుంబం తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని సినీ నటుడుగా అప్రతిహతంగా కొనసాగాడు .జూనియర్ ఏంటి ఆర్ సినిమా ‘’ఆది ‘’లో అతని బాబాయ్ వేషం లో మంచి గుర్తింపు వచ్చి అప్పటినుంచి ‘’బాబాయ్ పాత్ర ‘’లకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు .నిన్నే పెళ్ళాడుతా సినిమాలో హాస్యం పండించాడు చలపతిరావు చేత దర్శకుడు కృష్ణ వంశీ .అప్పటినుంచీ హాస్యం లోనూ రాణించాడు .నటిస్తూనే కలియుగ కృష్ణుడు ,కడప రెడ్దేమ్మ ,జగన్నాటకం ,ప్రెసిడెంట్ గారి అల్లుడు చిత్రాలు నిర్మించాడు .దర్శకుడు బోయపాటి శ్రీను బాబాయ్ కి మంచి పాత్రలిచ్చి నటిమ్పజేసి అతనిలోని నటన ను ఆవిష్కరింప జేశాడు . చనిపోవటానికి నాలుగు రోజులు ముందు కొడుకు రవి బాబు నిర్మంచి దర్శకత్వం చేస్తున్న సినిమాలో వీల్ చైర్ లో నే కూర్చుని నటించాడు .ఇదే ఆఖరి సినిమా .సినీ రంగం లో ఎవరికీ ఏరకమైన కష్టం వచ్చినా ఫోన్ చేస్తే వెంటనే స్పందించే సహృదయ౦ బాబాయ్ ది.
రామారావు గారితో చాలా సన్నిహిత్వం ఉన్నవాడుకనుక ఆయనే అతని ఆరాధ్యదైవం .ఆయనకు తప్ప వేరే నటుడికీ నమస్కారం చేయలేదని చెప్పాడు .తర్వాత తర్వాత కొంత లోకజ్ఞానం పెరిగి అందర్నీ గౌరవిన్చానని చెప్పుకొన్నాడు .రామారావు మీద ఉన్న అనేక అభాండాలు –అంటే సెట్ లోని నాప్కిన్స్ ,గదలు కిరీటాలు ఇంటికి పట్టుకు పోవటం వంటి వాటిని ఆయన్నే అడిగితె ‘’బ్రదర్ !నా వేషం కోసం ఆ నాప్ కిన్స్ ఇచ్చారు .అవి పవిత్రమైనవిగా నేను భావిస్తాను వాటిని అక్కడే వదిలేస్తే ఎవరెవరో తీసుకు వెళ్లి మూతికీ ముడ్డికీ తుడుచుకోవటానికి ఉపయోగిస్తే వాటి sanctity పోతుందని ఇంటికి తెస్తాను .గదలు కిరీటాలు సినిమా అయ్యాక గోడౌన్స్ లో పారేస్తారు .అవి ఎవరికీ ఉపయోగపడవు .ఎప్పటికప్పుడు కొత్తవే వాడతారు వాటిని తెచ్చి మ్యూజియం లో పెడతాను .అయినా ఎవరో ఎదో అన్నారని మన ధర్మం మనం మానకూడదు ‘’అన్నారని చలపాయ్ చెప్పారు .అన్నగారు పార్టీ పెడితే ‘’నేను కూడా చేరతాను ‘’అంటే ‘’వద్దు నేనిప్పుడే రాజకీయ రొంపిలో పీకల్లోతు మునిగాను .మీరంతా హాయిగా నటిస్తూ జీవితాలు బాగు చేసుకోండి ఇది నామాట గా అందరికీ చెప్పు బ్రదర్ ‘’అన్నారట .
విజయా వారి విజయవంతమైన చిత్రదర్శకుడు కెవి రెడ్డి ‘’ఉమా చండీ గౌరీ సంవాదం ‘’తీసి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతే విజయా సంస్థ ఆయనకు ఇస్తున్న కారు సౌకర్యం కూడా రద్దు చేస్తే రామారావు ఆదుకోన్నారని ,వాళ్ళ అమ్మాయిని చదువుకోసం అమెరికా పంపటానికి ఆయన అడగటానికి మొహమాట పడితే వెంటనే 50 వేలు ఇచ్చిపంపారానీ ,తాను తీస్తున్న ఒక పౌరాణికి చిత్రానికి ఆయనే దర్శకుడు అని చెప్పి రోజూ సెట్ కు వచ్చి కూచోమని గౌరవంగా ఆహ్వానించి ,సినిమా రిలీజ్ కాగానే మరో లక్ష రూపాయలు ఇచ్చిన ఉదారుడు ఎన్టిఆర్ అని పొంగిపోతూ చెప్పాడు చలపాయ్ బాబాయ్ .ఆయన చేసిన గుప్తదానాలు లెక్కలేనన్ని అని ,వాటిని బయటకు చెప్పుకోవటం ఆయనకు ఇష్టం లేదని ఎందఱో పేద విద్యార్ధులకు ఆర్ధికసాయం చేశారని మనకు తెలియని విషయాలు ఎన్నో ఆన్తరంగికులుగా తనకు తెలిసినవి చెప్పాడు .
నీలి కనుల చిన్నది అందానికి ప్రతిరూపం .ఈ నీలికనుల చినవాడు చలపతి రావు ,బల్లిపర్రు బుల్లోడు స్ఫురద్రూపంతో అందర్నీ యిట్టె ఆకర్షిస్తాడు .ఆయనతో ఉంటె టైం యిట్టె గడిచిపోతుందని అంటారు .అందర్నీ నవ్విస్తూ నవ్వుతూ సరదాగా గడిపే చలపాయ్ బాబాయ్ అలాగే చిరునవ్వుతో,అనాయాస మరణం తో 78 వ ఏట మనకు దూరం అయ్యాడు .ఆయన ఆత్మకు శాంతికలగాలని, ఆకుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-12-22-ఉయ్యూరు